లోకాభిరామం

ఓటు-చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటు నిజంగానే చేటు తెచ్చింది. హాయిగా బతుకుతున్న అన్నదమ్ముల మధ్యన కూడా చిచ్చు మొదలయింది. ఈ పరిస్థితి ఒక మా ఊరిలోనే కాదు అని నేను ఊహించగలను. పోటీ
మనస్తత్వం ఒక రకంగా ఉన్నంతవరకే బాగుంటుంది. ఆ పోటీలో శత్రుత్వ భావం మొదలయిన మరుక్షణం
పరిస్థితి మారుతుంది.

‘ఓటు పుట్టిందోయ్, బావా, ఓటు పుట్టింది. ఓటు పుట్టి మనకంతా చేటు తెచ్చిందోయ్’ నాన్న పాడిన పాట నాకింకా గుర్తుంది. పాటలో తరువాతి మాటలు కూడా గుర్తున్నాయి. మంగలి మల్లిగాడు మంత్రి అవుతాడంట, లాంటి మాటలేవో ఆ తరువాత ఉండేవి. ధయిర్యంగా ఇక్కడ నేను ఈ మాట రాశాను గానీ, అది తప్పని నాకు తెలుసు. ప్రజాస్వామ్యం అంటూ ఎన్నికలను మన తలల మీద రుద్దారు. అప్పటికింకా నేను పిల్లవాడినే గానీ, ఎన్నికలు లేని కాలం నాకు గుర్తుంది. పోలీస్ పటేల్ అనే పెద్దమనిషి ఊరిలోని శాంతిభద్రతల బాధ్యత వహించేవాడు. మాలీ పటేల్ అనే మరొక అధికారి ఆస్తులు, పన్నులు మొదలయిన సంగతులు చూచేవాడు. పట్వారీ అనే మరొక అధికారి పొలాల రికార్డులు, పన్నుల వసూళ్లు మొదలయినవి చూచేవాడు. వీళ్లంతా ప్రజల మీద జులుం చేసి అన్యాయాలు చేశారని కథలు కథలుగా చెప్పుకునేవారు కానీ, వారిలో మంచివారు లేకపోలేదు. కనీసం మా ఊళ్లో నాకు తెలిసి అధికారులంతా మంచివాళ్లే అనిపించేది. కాలం బాగానే గడిచినట్టు గుర్తు. ఉన్నట్టుండి ఎన్నికలు అన్నారు.
‘ఏనుగొండ ఎంకమ్మ ఏమన్నదమ్మో లచ్చుమమ్మ, ఫలాని గుర్తుకు ఓటు ఎయ్యమన్నదమ్మో లచ్చుమమ్మ’ అని జీపులోనుంచి వినిపించిన పాట మాకు సరదాగా మాత్రమే ఉందిగానీ, ఎన్నికలు వచ్చి ఊరిని నిట్టనిలువుగ చీలుస్తాయని మాత్రం అప్పట్లో తోచలేదు. నిజంగనే మా ఊరిలో ఎంకమ్మ అనే పెద్దమనిషి ఉండేది. ఆమె నాయకురాలు కూడా. ఆమె చెప్పినట్టే ఆ వర్గం వారంతా ఎవరో ఒకరికి ఓటు వేసి ఉంటారు. ఎన్నికలు అన్న తరువాత ఎవరో ఒకరే నిలబడరు కదా! పోటీ కూడా ఉంటుంది కదా! అవతలి మనిషికి మరొక గుర్తు. మరి ఆ పార్టీకి ఓటు వేయమని కూడా ప్రచారం. ఎమ్మెల్యేలు, ఎంపిల ఎన్నికలు జరిగితే కొంత మునిగిన ప్రభావం ఏదీ ఊళ్లో కనిపించలేదు. సరదాగా నేను ఎన్నికలు జరుగుతున్న మా బడికి వెళ్లి చూచాను. అప్పట్లో అది సీక్రెట్ బ్యాలెట్ కాదు అనిపించింది. ఓ బెంచి మీద ఇనుప కుండలు పెట్టారు. ఓటు గలవాళ్లు ఒక చీటి తీసుకువెళ్లి తమకు నచ్చిన బొమ్మగల ఒక కుండలో పడేసి వస్తున్నారు. ఏ కుండలో ఎక్కువ కాగితాలు ఉన్నాయనేది తెలిసిపోతున్నది. ఎవరు గెలిస్తేనేమి? పల్లె పరిస్థితి మారుతుందా? మారినట్టు నాకు మాత్రం అనిపించలేదు.
తిమ్మారెడ్డిగారు అని ఒకాయన మంత్రి అయ్యారట. ఆయన మా ఊరికి వచ్చి గుడి ముందు రావిచెట్టు కింద సమావేశం పెట్టాడు. లేక పల్లెవాళ్లు సమావేశం పెట్టి ఆయనను పిలిచారు. ఆయన వచ్చాడు. అందరు పోగయి చెప్పిన మాటలు విన్నారు. కానీ జరిగింది ఏమిటో నాకు మాత్రం అర్థం కాలేదు. రానురాను పరిస్థితి మారింది. ఊరిలో సర్పంచ్ పదవికి ఎన్నికలు అన్నారు. వార్డు మెంబర్‌ల ఎన్నికలు జరగాలి, వాళ్లలో నుంచి ఒకరు సర్పంచ్ అవుతారు. ఇక తగాదా మొదలయింది.
నాన్న ఊళ్లో పెద్దమనిషి. అందరు ఆయనను గౌరవిస్తారు. సలహాలు అడుగుతారు. కబుర్లు చెప్పడానికయినా ఆయనతో కలిసి కాలం గడుపుతారు. అట్లా క్రమం తప్పకుండా వచ్చే ఒక పెద్ద మనిషి ఊరికి సర్పంచ్ అయ్యాడు. ఆ తరువాత కూడా వీలయినప్పుడల్లా రాత్రి భోజనం తరువాత నాన్న దగ్గరకు వచ్చి చాలాసేపు మాట్లాడేవాడు. సాధారణంగానే ఊరి వ్యవహారాలు కూడా చర్చకు వచ్చేవి. చేయవలసిన మంచి పనులను గురించి నాన్న సలహాలు ఇచ్చినట్టు నాకు కొంత గుర్తున్నది. మొదటి ఎన్నికలలో పెద్ద తగాదాలు కనిపించలేదు గానీ, రెండవసారి చాలా గొడవే జరిగింది.
ఈసారి ఎన్నికలో అప్పటివరకు పట్వారీగా పనిచేస్తుండిన పెద్దమనిషి తానూ ఒక అభ్యర్థిగా నిలబడ్డాడు. అతను సాయంత్రాలు నాన్న దగ్గరకు వచ్చి కబుర్లు చెప్పే రకం కాదు. మా కుటుంబానికి మరింత సన్నిహితుడు అనవలసిన మనిషి. నిజానికి పల్లెలో ఉండేవాడు కాదు. వ్యవసాయం మాత్రం పల్లెలోనే ఉండేది. అందుకొరకు అతను తరచుగా ఊరిలోకి వచ్చేవాడు. అట్లా వచ్చినప్పుడంతా భోజనం మా ఇంట్లోనే. ఇక ఎన్నికలు వచ్చిన తరువాత మాత్రం ఆయన ఊళ్లో ఇల్లు కట్టుకున్నాడు. అక్కడే బతకడం మొదలుపెట్టాడు. మా ఇంటికి రావడం మానేశాడు. మొదటి సర్పంచ్ నాన్నకు సన్నిహితుడుగా సాగుతున్నాడు. ఒకనికి మరొకడు శత్రువు. ఆ ఒకనికి మిత్రుడయినవాడు కూడా అతనికి శత్రువే అవుతాడు. గణితంలో చెప్పిన పద్ధతిలో ఈ వ్యవహారం గురించి ఒక ఉదాహరణ కూడా ఉంది.
ఎన్నికలు ఏమయినప్పటికీ వాటితో ఏ మాత్రం సంబంధం లేకుండా బతుకుతున్న నాలాంటి వాడికి కూడా వాటి ప్రభావం తగులుతుందన్నది నాకు అనుభవంలోకి వచ్చింది. నేను బుద్ధిగా చదువుకుంటున్నాను. మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను. నేను అప్లయి చేయకుండానే మెరిట్ స్కాలర్‌షిప్ వచ్చిందట. బడిలో వాళ్లు పిలిచి చెప్పారు. వరుసగా మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు స్కాలర్‌షిప్ వచ్చింది. అది అందుకోవాలంటే నేను ఒక ఆదాయం సర్ట్ఫికెట్ ఇవ్వాలి. దాన్ని గ్రామాధికారి ఇవ్వాలి. ఈ ఎన్నికల సమీకరణం కారణంగా నేను ఎన్నిసార్లు అడిగినా మామా అని నేను పిలిచిన ఆ అధికారి నాకు సర్ట్ఫికెట్ ఇవ్వడానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. చివరికి స్కాలర్‌షిప్ వద్దు అని నేను రాసి ఇవ్వవలసి వచ్చింది. ఆ స్కాలర్‌షిప్ అందుకుని ఉంటే అది నేను పై చదువులలోకి వెళ్లినా కొనసాగేది అని తెలిసిన నాడు నిజంగా బాధ కలిగింది.
నా సంగతి పక్కన పెట్టండి. ఊళ్లో వాతావరణం సర్వనాశనం అయ్యింది. హింస ప్రవేశించింది. తెలంగాణ ఉద్యమం కాలంలో మాకంతా చదువులేదు, మరొక పని కూడా లేదు. అప్పట్లో కొంతమందిమి కలిసి వ్యాయామం చేయడం నేర్చుకున్నాము. ఏమి చేతగాని నేను కూడా ఆపకుండా రెండు వందల దండాలు కొట్టానంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. మొత్తానికి ఊళ్లో కండరాల కల్చర్ మొదలయింది. ఒళ్లు పెరిగితే మెదడు తగ్గుతుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెపుతున్నాను. ఎన్నికల కారణంగా ఊల్లో వర్గాలు మొదలయ్యాయి. శత్రుత్వాలు మొదలయ్యాయి. నాకు అప్పటి వ్యవహారాన్నంతా గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు. కానీ, ఒకానొక నాడు ఎదురు వర్గం వారు మా వర్గంలోని ఒక మిత్రుడిని చితకబాదారు. అతడిని గుడి దగ్గర అరుగు పక్కన పడుకోబెట్టి పోలీసుల కోసం వేచి చూస్తున్నారు. ఇక మా వర్గం కుర్రకారు ఒకచోట చేరారు. వీళ్లంతా అక్కడికి వెళితే పెద్ద పోరాటమే జరుగుతుంది. అందుకు ముందు అసలు పరిస్థితి తెలుసుకురావాలి. నాకు ఇవాళ ఆశ్చర్యం కలుగుతుంది. ఆ పని చేయడానికి ధయిర్యంగా ముందుకు సాగి నేను వెళ్లాను. మా మిత్రుని పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆ సంగతి నేను వచ్చి చెప్పాను. నిజానికి అన్ని రకాల మా వర్గమే బలం గలది అని నాకు అనిపించింది. మాకొక నాయకుడు ఉండేవాడు. అతను నాయకుడు అని ఎప్పుడు అనలేదు. అంతులేని మంచితనంగల మనిషి. కానీ శరీరం మాత్రం చాలా దృఢంగా పెంచాడు. అతను వెళ్లి ప్రత్యర్థి వర్గంలోని మరొక కుర్రవాడిని కుళ్లబొడిచాడు. ఆ అబ్బాయిని పైకెత్తాడు. రోడ్డు మీద పడేస్తే వాడి తల పగులుతుంది. అప్పుడు నేను అడ్డు వెళ్లినట్టు నాకు బాగా జ్ఞాపకం. చిత్రంగా ఆ ఇద్దరు నాకు సన్నిహిత మిత్రులు. ఎన్నికల కారణంగా ఇద్దరు కొట్టుకుంటున్నారు. అడ్డు వెళ్లడానికి నేను తప్ప మరెవరికి ధయిర్యం లేదు. అంతా చిత్రమయిన పరిస్థితి. ఇప్పుడంతా పెద్దవాళ్లం అయిపోయాము. కనుకనే నేను ఈ మాటలు రాయగలుగుతున్నాను. వాళ్లలో ఎవరయినా ఈ వ్యాసం చదివితే గతాన్ని గుర్తు చేసుకుంటారని నా నమ్మకం.
ఓటు నిజంగానే చేటు తెచ్చింది. హాయిగా బతుకుతున్న అన్నదమ్ముల మధ్యన కూడా చిచ్చు మొదలయింది. ఈ పరిస్థితి ఒక మా ఊరిలోనే కాదు అని నేను ఊహించగలను. పోటీ మనస్తత్వం ఒక రకంగా ఉన్నంతవరకే బాగుంటుంది. ఆ పోటీలో శత్రుత్వ భావం మొదలయిన మరుక్షణం పరిస్థితి మారుతుంది. నాకు ప్రస్తుతం మా ఊరి రాజకీయాల గురించి ముక్క కూడా తెలియదు. తెలుసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు కూడా. కానీ రాజకీయాల ప్రభావం దూరంగా ఉంటున్న నా మీద కూడా పడే అవకాశం ఉందని అప్పుడప్పుడు తెలుస్తుంది. ఊళ్లో పెద్ద ఆస్తులు లేవు గానీ, చిన్న ఇల్లు ఒకటి మిగిలి ఉన్నది. దాని విషయంగా ఏవో చికాకులు వచ్చిన సంగతి నాకు ఆలస్యంగా తెలిసింది. అయినా నేను పట్టించుకోలేదు.
ఒక్కొక్కసారి వింత ఆలోచన వస్తుంది. నేను తిరిగి ఊరికి వెళ్లి అక్కడే ఉంటే ఎలాగుంటుందని. నిజానికి ఊళ్లో వారికి చాలా మందికి నేను తెలియకపోవచ్చు. కొంతమందికి నేను వెళ్లి చెప్పుకుంటే తెలియవచ్చు. ఊరు మారిపోయింది. ఇప్పుడది పంచాయతీ కాదు. పట్టణంలో ఒక వార్డు. కనుక ఎన్నికలకు అంత ప్రాముఖ్యం లేకపోవచ్చు. ఓటు చేటు ప్రభావం పల్లెలో తగ్గిందా? ఏమో? నాకు పట్టదు.

-కె. బి. గోపాలం