లోకాభిరామం
తుమ్మెద పాట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణిః అని ఒక మాట. చిన్న పిల్లలకు కూడా పాట రుచి తెలుస్తుంది. పశువులు పాట వింటాయి. పాములు పాట వింటాయి అంటుంది ఈ సూక్తి. కొంతమంది పండితులు శిశువు అంటే కుమారస్వామి, పశువు అంటే నందీశ్వరుడు, పాము అంటే ఆదిశేషుడు అని వ్యాఖ్యానాలు చెప్పారు. నేను అటువైపు వెళ్లడం లేదు. చిన్నపిల్లలకు పాట అంటే ఒక కమ్మని చప్పుడు. పశువులు పాట వింటాయో లేదో నాకు తెలియదు. పాములకు చెవులు ఉండవు. మనిషి మాత్రం పాడటం, వినడం రెండు చేతనైన జీవి. పాట ఎందుకు అంత ఆనందంగా ఉందో అర్థం కాలేదు కానీ పాటలోని ఆనందం మాత్రం తలకు ఎక్కింది.
నాన్న అన్న ఒక్క మాటతో సినిమా పాటలు వదిలి శాస్ర్తియ సంగీతం వైపు తిరిగాను. అప్పటికి క్యాసెట్ చేతకాలేదు కాని రేడియోలో మాత్రం సంగీతం బాగా వింటూ వుండేవాడిని. చదువు పేరు మీద హైదరాబాద్ వచ్చాను.
అప్పటి వరకు అరగంట గంట రేడియో కచేరీలు వినడం మాత్రమే అలవాటు. మద్రాస్ మ్యూజిక్ ఫెస్టివల్, త్యాగరాజ ఆరాధన అయినా సరే ప్రసారాలు గంట కంటే ఎక్కువ ఉండేవి కాదు. ఇక హైదరాబాద్ వచ్చిన తరువాత మొదటిసారి ఒక కచేరీకి వెళ్లి వినే అవకాశం దొరికింది. అది బహుశా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కచ్చేరీ. రవీంద్రభారతిలో టికెట్ కొన్న జ్ఞాపకం కూడా లేదు. అభిమాన గాయకుడు బాలమురళి గారు పాడుతున్నారు. ఇక కావాల్సిందేమిటి? ఎగిరి గంతేసి వెళ్లి కూర్చున్నాను.
మూడు గంటలసేపు ఒకే గాయకుడు పాడుతుండగా వినడం సరికొత్త అనుభవం. అందులో ఒక పాట లయ వాయిద్యం మీద వివరణతో పాటు గంటకు పైగా సాగడం అంతకంటే కొత్త అనుభవం. అప్పటికి నాకు రాగాలు గుర్తించటం చేతకాదు. అప్పుడప్పుడే వాటిలో తేడాలు తెలుస్తున్నాయి. మురళిగారు విస్తారంగా పంతువరాళి పాడారు. అప్ప రామభక్తి ఎంతో గొప్పరా అనే కీర్తనను ఎంత మధురంగా పాడారు. ఆలాపన, నెరవు, స్వర ప్రస్తారం అత్యంత ఆనందకరంగా వినిపించాయి. మృదంగం మీద అంతసేపు తాళం వాయించి వినిపించడం అద్భుతంగా అనిపించింది. ఆ విద్వాంసులు ఎవరో జ్ఞాపకం లేదు. మృగంతోపాటు మరొక లైవ్ వైద్యం కూడా ఉందేమో. అది కూడా జ్ఞాపకం లేదు. మొత్తానికి సంగీత సాగరంలో మునకలు వేసి మైమరచి ఏదో రకంగా ఇల్లు చేరుకున్నాను. అప్పుడు హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నాను కూడా జ్ఞాపకం లేదు. మొత్తానికి ఒకటి, రెండు రోజులలో పండుగ ఉంది. పల్లెకు వెళ్లాలి. కనుక వెళ్లాను. పండుగనాడు పొద్దున చాలా పెద్ద ఆశ్చర్యం ఎదురైంది. ఆకాశవాణి వారు రవీంద్రభారతిలో నేను విన్న కచేరీని రికార్డు చేశారు. అందులో నుంచి పంతువరాళి పాటను మాత్రం ప్రత్యేకంగా ఒక గంట పాటు వినిపించారు. ఒకసారి వింటేనే సముద్రంలో మునిగిన భావన కలిగిన నాకు రెండవసారి విన్న తరువాత ఆ సముద్రంలోని అందాలు అన్నీ కళ్లకు కట్టినట్లు ఎదురుగా నిలబడ్డాయి. ముందు పాటలోని మాటలు. లక్ష్మణుండు కొలుచునా, లక్ష్మీదేవి వలచునా, సూక్ష్మబుద్ధి గల భరతుడు.. ఈ మాటలు మెదడులో ఎన్ని లక్షల సార్లు తిరిగినయో చెప్పలేను. పాటలు స్వయంప్రభ అనే ఒక మాట వస్తుంది. ఆ వృత్తాంతం చాలాకాలం వరకూ తెలియదు. ఇప్పుడు కూడా నిజానికి తెలియదు. ఎవరీ స్వయంప్రభ? వివరం తెలిసిన వారెవరైనా వినిపిస్తే బాగుంటుంది.
సంగీతంలో రుచి పెరిగింది. ఎన్నో కచేరీలు విన్నాను. చాలా రికార్డింగులు సేకరించాను. పది మందితో పంచుకున్నాను. విధి విరామం లేకుండా సంగీతం వింటూనే ఉన్నాను. పంతువరాళి, పూర్వీ కల్యాణి ఒకే లాగ ఉంటాయని తెలిసింది. వాటిలో తేడా తెలియడం కూడా తెలిసింది. రవీంద్రభారతిలో ఒక గాయకుడు పాడుతూ ఉంటే నడవలో చేరిన మిత్ర బృందంలో ఇంతకు అతను ఏం పాడుతున్నాడో అన్న ప్రశ్న పుట్టింది. వెళ్లి అతడినే అడిగితే సరి! బహుశా తన మీద తనకే నమ్మకం కలిగినట్టు లేదు! అని జోకులు వేసుకోవడం ఇవ్వాలళటి వరకు గుర్తుంది. మరొక కుర్ర గాయకుడు ఏదో చేస్తున్నాను అనుకుని పంతువరాళిలో తిరిగిన చోటనే తిరుగుతున్నాడు. దాని గురించి కూడా జోకులు వేసుకున్నాము. సంగీత కచ్చేరీలను గురించి పత్రికలలో సమీక్షలు కూడా రాసే చోటికి నేను చేరుకున్నాను అంటే ఆశ్చర్యం కలుగుతుంది. చెన్నైలో జరిగిన సంగీత సభలలో కూడా పాట ముగిసిన తరువాత రంగస్థలం మీదకు వెళ్లి మాట్లాడిన అనుభవం వింతగా ఉంటుంది. నేను శ్రోతగానే ఉండిపోవాలని నా కోరిక.
పల్లెలో రాత్రిపూట రేడియోలో రకరకాల స్టేషన్లు పలికేవి. పట్నంలో భవనాల కారణంగా, వాడుతున్న కరెంటు కారణంగా అక్కడి స్టేషనే్ల సరిగ్గా వినిపించవు. పల్లెలో వింటున్నప్పుడు మధ్యరాత్రి ఒక కన్నడ పాట విన్నాను. అది మనసులో నాటుకు పోయింది. పాడిన మనిషి మల్లికార్జున్ మన్సూర్. అది మాత్రం గుర్తుంది. ఆ పాట కోసం ఎక్కడ వెతికినా మళ్లీ దొరకలేదు. బెంగళూరు వెళ్లినప్పుడు కూడా ఎంతో మందిని అడిగాను. దుకాణాలలో అడిగాను. అయినా దొరకలేదు. సంవత్సరాలు గడిచాయి. పాటలో మొదటి రెండు వరుసలు తప్ప మరొకటి జ్ఞాపకం లేదు. కానీ అందులోని కమ్మదనం మెదడులో లోతుగా నాటుకుపోయింది. అక్క కేళవ్వ, నానొందు కణసు కండేనే, అన్నవి ఆ మాటలు. ఇది పల్లవి. ఇందులోనే ఆ గాయకుడు చూపించిన మలుపులు మళ్లీ మళ్లీ మెదడులో సుడులు తిరిగాయి. చాలా కాలం తరువాత ఒక వెబ్‌సైట్‌లో పాట దొరికింది. పర్రీకర్ ఒక సంగీతాభిమాని తన వద్ద ఉన్న సంగీతాన్ని మొత్తం ఈ సైట్‌లో అందజేస్తాడు. అయితే ఆ సంగీతం గురించి వ్యాసాలు రాశాడు. సందర్భానికి తగినట్టు అక్కడక్కడ తగిన పాటలకు లింకులు ఇస్తడు. అటువంటి లింకులో ఒకచోట అక్క కేళవ్వ పాట కూడా ఉంది. లింకు నొక్కితే ఒకసారి పాట వినొచ్చు. అంతే. కానీ కంప్యూటర్‌లో కొంత లోతుపాతులు తెలిసిన నేను ఆ పాట ఉన్న చోట్ల కూడా కనుగొన్నారు. పాటలు నా కంప్యూటర్లోకి దించుకున్నాను. దాన్ని అందరికీ తెలిసిన ఎం పీ 3 అనే పద్ధతికి మార్చాను. అప్పట్లో డాక్యుమెంట్లు, పాటలు దాచుకోవడానికి ఈ స్నిప్స్ అని ఒక సైట్ ఉండేది. అందులోకి ఈ పాట కూడా ఎక్కించాను. ఆ సైట్‌లో నేను పెట్టిన చాలా పాటలు వందల మంది విన్నారు. అక్క కేళవ్వ పాటను నేను వందల సార్లు విన్నాను.
అక్క మహాదేవి కన్నడంలో వచనాలు రాసిన ప్రసిద్ధ భక్తురాలు. చెన్న మల్లికార్జున దేవునికి తనను తాను అంకితం చేసుకున్నది. ఆయనను పెళ్లాడినట్టు భావించింది. ఈ పాటలో దేవుడు తనకు కలలో కనిపించాడు అని ఆమె తన అక్కకు చెబుతున్నది. చిన్నచిన్న జడలతో, చెన్న మల్లికార్జునుడు, బిక్షకు రాగా చూశానమ్మా అంటుంది అక్కమ్మ. బియ్యం, వక్కలు, కొబ్బరికాయ కనిపించాయి అంటుంది. అవన్నీ శుభ లక్షణాలు. అయితే చిన్న పిల్లవాడుగా కనిపించిన మల్లికార్జునుడు కలలో పారిపోయాడు. ఆయనను పట్టుకోవాలి. అది తపన. పాలమూరు అనే మహబూబ్ నగర్ వాడిని. కన్నడ కొంత అర్థం అవుతుంది. కానీ పాటల్లోని లోతు తెలిసి అర్థం కాలేదు. వెతికి ఈ పాట అర్థాన్ని పట్టుకున్నాను. కొంతకాలానికి ఒక పుస్తకం దొరికింది. కన్నడ వచన సాహిత్యం గురించి ఆ పుస్తకంలో విశదంగా రాశారు. అంశం మీద నాకు చాలా అభిమానం మొదలైంది. ఇప్పటికే ఆ పాట ఎన్నిసార్లు విన్నానో తెలియదు. మల్లికార్జున్ మన్సూర్ చాలా గొప్ప గాయకుడు. యూ ట్యూబ్‌లో ఆయన పాటలు కొన్ని ఉన్నాయి. గజ్జెలు పలికాయి అంటూ ఆయన పాడే పాట అద్భుతంగా ఉంటుంది. ఇక రాగం వివరంగా పాడితే సంగీతం గురించి తెలియకపోయినా సరే, వినాలి అనిపిస్తుంది.
ఈ రకంగా కొన్ని పాటలు నా మెదడులో తుమ్మెదల వలె హోరు చేస్తుంటాయి. అది కొన్ని రోజులపాటు కొనసాగుతుంది. అటువంటి పాటలలో ఇంకొకటి తమిళంలో ఉంటుంది. గాయకుడు పేరు దండపాణి దేశిగర్. పాట రచయిత భారతీదాసన్. సుబ్రహ్మణ్య భారతి పేరు తమిళం గురించి తెలిసిన వాళ్లకు అందరికీ తెలిసి ఉంటుంది. సుందర తెలుంగు అని ఆయన తెలుగును కూడా ఎంతో మెచ్చుకున్నాడు. భారతీయార్ పాటలు గొప్పగా ఉంటాయి. ఆయనకు ఒక మానసిక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుని పేరు భారతీదాసన్. భారతికి దాసుడు అన్న మాట. ఈ దాసుని పేరు మీద ఒక యూనివర్సిటీ కూడా ఉందంటే అతని గొప్పతనం గురించి ఊహించవచ్చు. ఈ భారతీదాసన్ ఒక పాట రాశాడు. తున్బం నేర్గయిల్ యాళ్ ఎడుత్తు ఇన్బం శేర్క మాట్టాయో, అంటుంది పాట మొదటి పాట. అంటే పల్లవి. మొదటిసారి విన్నప్పుడు వర్ణమెట్టు, తెలుగులో చెప్పాలంటే వరుస, స్వరాల వరుస గొప్పగా తోచింది. పాట దేశ్ అనే హిందూస్తానీ రాగంలో ఉంటుంది. ఈ రాగంలో తెలుగులో కూడా కొన్ని సినిమా పాటలు ఉన్నాయి. వాటికన్నా టీవీ, రేడియో ద్వారా అత్యంత ప్రచారం పొందిన ఒక పాట ఒకటి చాలామందికి తెలిసే ఉంటుంది. మిలే సుర్ మేరా తుమ్హారా అంటూ మొదలయ్యే ఈ పాట దేశ్ రాగంలో ఉంది. దేశంలోని ప్రసిద్ధ గాయకుడు అందరూ ఈ పాటలో పాలుపంచుకుంటారు. రాగం పేరు దేశ్. ఆ రాగంతో దేశాన్ని ఒకటి చేయాలని ప్రయత్నం జరిగింది.
భారతీదాసన్ రాసిన పాటను స్వర పరచడానికి దండపాణి దేశిగ(క)ర్ రెండు సంవత్సరాలు తీసుకున్నాడట. నా దగ్గర ఉన్న ఒకానొక రికార్డింగ్‌లో ఆయన మధ్యలో పాట ఆపి, స్వరం కట్టడానికి తాను పడ్డ కష్టాలను గురించి చెబుతాడు. ఆయన కర్ణాటక సంగీత గాయకుడు. నేను హాయిగా ఏ కాంభోజి రాగంలోనో ఈ పాటకు వరస కట్టి ఉండవచ్చు, అంటూ ఆయన చాలా శాస్ర్తియంగా పాడి వినిపిస్తారు. కానీ మనసు దోచుకునే మాటలు ఉన్న ఈ పాట అంతే మనసు దోచుకునే పద్ధతిలో పాడాలని చాలా రోజులు వేచి ఉన్నారు. ఒకరోజు ఒక రాగం చివరికి మనసులో మెదిలింది. అప్పుడు వరుస కట్టాను, అని ఆయన పాట కొనసాగిస్తాడు. వినడానికి పాట చాలా గొప్పగా ఉంటుంది. చిక్కని తమిళం కనుక చటుక్కున అర్థం కాదు. కనుక మళ్లీ అర్థం కోసం వెతకడం మొదలుపెట్టాను. అది దొరికిన తరువాత ఆశ్చర్యం, దానితోపాటు పాటలో ఆసక్తి అంచెలంచెలుగా పెరిగాయి.
మనసుకు కష్టంగా ఉంది. కలతగా ఉంది. ప్రియురాలా! ఈ సమయంలో వీణ చేతికి తీసుకుని నాకు కొంత ప్రశాంతత కలిగించవచ్చు కదా? అంటున్నాడు పాటగాడు. తరువాతి మాటల్లో తమిళ్ పాడి అంటాడు. వీణ మీద వాయిస్తే సరిపోదు, దానితోపాటు పాడాలి కూడా! ఆ పాట తమిళంలో ఉండాలి! ఆహా! ఎంత గొప్ప భావన! అనిపించింది. యాళ్ అన్నది ఒక ప్రాచీన వైద్యం. అది వీణ లాగా ఉంటుంది. చివరిలో సింహం ముఖం ఉంటుంది. దానివల్ల బహుశా వాద్యానికి ఈ పేరు వచ్చి ఉంటుంది. ఈ పాటను నిజానికి కర్ణాటక సంగీత గాయకులు కూడా ఒకరిద్దరు కచ్చేరీలలో పాడారు. యూ ట్యూబ్‌లో ఈ పాట దొరుకుతుందన్న నమ్మకం. ఆసక్తి గలవాళ్లు వింటారని అంతకంటే గట్టి నమ్మకం.
కొన్ని సినిమా పాటలు కూడా చటుక్కున గుర్తుకు వచ్చి రోజులపాటు మనసులో తిరుగుతాయి. మై జిందగీ క సాత్ నిభాతా చలాగయా, అనే పాట నా మనసులో చాలా రోజులపాటు తిరిగింది. వెతికితే యూ ట్యూబ్‌లో పాట దొరికింది. పాత కాలంలో సినిమాలు చూసే సౌకర్యం ఉండేది కాదు. హిందీ సినిమాలు అంతకన్నా దొరికేవి కాదు. ఈ పాట దేవానంద్ మీద చిత్రీకరించారు. అంటే నాకు కలిగిన ఆనందాన్ని అంతులేదు. మిలిటరీ ఆఫీసర్ దేవానంద్ చూపించిన హావభావాలు పాటలోని పస పెరిగేలా చేశాయి.
మొత్తానికి పాటలు మెదడులో తుమ్మెద లాగా మోగుతూ తిరగడం మారలేదు. కొంతకాలం క్రితం కళావతి రాగంలో విన్న ఒక పాట ఆ రకంగా తిరిగింది. ఈ మధ్య రాతలు ఎక్కువైనట్టు నాకు తోస్తున్నది. మెదడులో తుమ్మెద పాట తిరగడం లేదు! ఇదేం బాగోలేదు!
*చిత్రం...అక్క మహాదేవి