లోకాభిరామం

హాకింగ్ గురించి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అన్న పుస్తకం గురించి విననివారు ఉండరు. ఎక్కడికి వెళ్లినా ఏం మాట్లాడినా ప్రపంచమంతా నిలబడి అతడిని గమనించింది. తాను పరిశోధిస్తున్న వౌలిక భౌతికశాస్త్రం గురించి మాత్రమే కాకుండా అతను మరెన్నో విషయాలను గురించి పట్టించుకున్నాడు. తనలాంటి కదలలేని మనుషులకు సాయం చేయాలని ఎంతో ప్రయత్నించారు. అణుయుద్ధం గురించి ప్రపంచాన్ని హెచ్చరించాడు. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా చేయదలుచుకున్న మార్పులను గురించి హెచ్చరించాడు. అది మన అదుపు తప్పి అపాయకరంగా మారే వీలుందన్నాడు. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కృత్రిమ జ్ఞానం మనం అనుకున్న మార్గాన కాక మరి ఎక్కడికో దారితీసే వీలుంది అన్నారు. ఇతర గ్రహాల నుంచి జీవులు ఇప్పటికే మన భూమి మీదికి వచ్చేశారేమో అన్నాడు. హాకింగ్ నిజంగా ఆసక్తికరమైన వ్యక్తి. అందరికీ ఆసక్తి కలిగించే విషయాలను గురించి అతను ఎన్నో వివరాలను చెప్పి వెళ్లిపోయాడు.
విశ్వం పుట్టినప్పుడు, అంతకుముందు ఏమీ లేదు. అటువంటిది ఏమీ లేదు లోనుంచి విశ్వాన్ని పుట్టించడానికి దేవుని అవసరం లేదు అని అతను గట్టిగా వాదించారు. క్రైస్తవమతం వారికి మూల కేంద్రమైన వాటికన్ వారు అతడిని తమ విజ్ఞానశాస్త్ర కమిటీలోకి చేర్చుకున్నారు. అన్నిటి కన్నా గొప్ప అవార్డు ఇచ్చారు. పోపు స్వయంగా లేచి వచ్చి హాకింగ్ ముందు మోకరిల్లి ముచ్చటించారు. నిజానికి ప్రపంచంలో అందరూ పోప్ ముందు మోకరిస్తారు. ఇక్కడ సంగతి తారుమారైంది. చాలామందికది నచ్చలేదు. గగ్గోలు జరిగింది. ఈ సంగతులన్నీ పక్కనబెట్టి స్టీఫెన్ హాకింగ్ మాత్రం తన విశ్వాసాలను గురించి నిస్సందేహంగా అక్కడే చెప్పేశారు. ఇక ప్రపంచమంతటా గోల మొదలైంది. కంటికి కనిపించని అంశాలను గురించి మానవులకు నమ్మకం ఎక్కువ. అది ఈ 21వ శతాబ్దంలో కూడా కొనసాగుతున్నది. భౌతికశాస్త్రం కూడా అటువంటిదే అన్నాను మరి. అయినా దీని దారి వేరు. స్టీఫెన్ హాకింగ్ లాంటి మనుషులు. అతడిని మనిషి అనకూడదు. అతను ఒక మహా మానవుడు. అటువంటి వారు చాలా మంది రావాలి. అప్పుడు గానీ ఈ ప్రపంచం మరొక వైపు తల తిప్పదు.
కొంతమంది తాము చేసిన ఏదో ఒకటి రెండు పనుల వల్ల గొప్ప పేరు సంపాదించుకుంటారు. మరికొంతమంది చాలా గొప్ప విషయాలు అందించినప్పటికీ వాటికన్నా వాళ్ల వ్యక్తిత్వమే ఎక్కువగా ప్రచారంలోకి వస్తుంది. అటువంటి వారిలో హాకింగ్ గురించి చెప్పుకోవాలి. సమకాలీన ప్రపంచంలో అతనికి మించిన శాస్తజ్ఞ్రుడు లేడు అని అన్నారు. కానీ అతను చేసిన భౌతికశాస్త్రం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఫిజిక్స్ రంగంలో వాళ్లే అతను చూపిన మార్గం మీద నడిచే ప్రయత్నంలో బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. గురుత్వాకర్షణ గురించి న్యూటన్ చెప్పిన అంశాలను ఐన్‌స్టైన్ కాదన్నాడు. ఆయన చెప్పిన పద్దతి ప్రకారం ఒక పెద్ద నక్షత్రం తన గురుత్వాకర్షణ శక్తికి తానే గురై కుచించుకుపోతుంది. అటువంటి అవకాశం ఉంది. అక్కడ ఆలోచనకు అందని సాంధ్రతతో ఒక నిర్మాణం తయారవుతుంది. దాన్ని సింగులారిటీ అన్నారు. అందులో నుండి కనీసం కాంతి కూడా బయటకు రాదు. ఇటువంటి నిర్మాణాలు విశ్వంలో అంతటా విస్తరించి ఉన్నాయి అన్న సంగతిని చాలా కాలం ఎవరూ పట్టించుకోలేదు. 50 దశకం తర్వాత వాటి మీదకు దృష్టి మళ్లింది. వాటికి చిత్రంగా బ్లాక్ హోల్స్ అని పేరు పెట్టారు. హాకింగ్ వీటి విషయంగా కొత్త మార్గాన్ని చూపించారు. పాత అవగాహనలు పనికిరావు అన్నాడు.
బ్లాక్ హోల్స్ గురించి స్టీఫెన్ హాకింగ్ చేసిన పరిశీలన, ప్రతిపాదనలు ప్రపంచాన్ని కొత్త దారిలోకి తిప్పాయి.
స్టీఫెన్ మామూలు మనిషి కాదని ఎన్నిసార్లు చెప్పినా తక్కువ కాదు. ప్రపంచం గురించిన పూర్తి అవగాహన కోసం అతను ప్రయత్నించాడు. అందరూ బ్లాక్‌హోల్స్ పుట్టుక గురించి ఆలోచిస్తూ ఉండగా అతను మాత్రం విశ్వం పుట్టుక గురించి ఆలోచన మొదలుపెట్టాడు. రోజర్ పెన్ రోజ్ అనే మరొక పరిశోధకులతో కలిసి విశ్వం గురించి పునరాలోచన సాగించాడు. విశ్వం అనే సినిమాను ఒక్కసారి వెనక్కు తిప్పి చూడగలిగితే సింగులారిటీ అనే చోటుకి చేరుకుంటాం అని వాళ్లు ప్రతిపాదించారు.
వాక్యం చివరలో పెట్టే చుక్క అంత నిర్మాణంలో నుంచి, ఈ విశ్వం అంతా పుట్టింది అని ఒక ప్రతిపాదన చేశారు. విశ్వం వ్యాప్తిని గురించి ఆలోచించే శక్తి మన బుర్రలకు లేదు అంటే ఆశ్చర్యం కాదు. అంతటి విశ్వాన్ని గురించి ఆలోచించగల బుర్ర స్టీఫెన్ హాకింగ్‌కు మాత్రం ఉంది.
బ్లాక్ హోల్‌లోకి వెళ్లిన పదార్థం బయటకు రాదు అని అప్పటి వరకు విజ్ఞాన శాస్త్ర ప్రపంచం అనుకుంటూ ఉన్నది. హాకింగ్ మాత్రం అందుకు వ్యతిరేకంగా ఆలోచించాడు. బ్లాక్‌హోల్స్‌కి పదార్థాన్ని బట్టి పరిమాణం, సాంధ్రత ఉంటాయి అన్నాడు. బ్లాక్ హోల్స్ గురించి ముందు జరిగిన పరిశోధన వివరంగా చెప్పుకోవాలంటే మనలాంటి వాళ్లకు అంత సులభంగా వీలు కాదు.
బ్లాక్‌హోల్స్‌లో వేడిమి ఉంటుంది అన్నాడు స్టీఫెన్. ఆ వేడిని అది బయటకు వెదజల్లుతుంది అని కూడా అన్నాడు. అలా బయటకు వస్తున్న వేడిమికి హాకింగ్ రేడియేషన్ అని పేరు పెట్టారు. అందులో నుండి వేడి బయటకు వస్తుంది కనుక కొంతకాలానికి బ్లాక్ హోల్ కుచించుకుపోతుంది అని కూడా ఒక అద్భుతమైన విషయాన్ని ప్రపంచం ముందు హాకింగ్ ప్రతిపాదించారు. బ్లాక్‌హోల్స్ అంటే నల్లని రంధ్రాలు అని అర్థం. అవి నల్లనివి ఏమీ కావు అన్నాడు హాకింగ్. నిజానికవి రంధ్రాలు కూడా కావు. మరి ఆ పేరు ఎందుకు పెట్టినట్టు, తెలియదు. కొంతకాలానికి బ్లాక్‌హోల్ లేకుండా ఇగిరిపోతుంది అని కూడా అన్నాడు. అయితే అందుకు పట్టే కాలం విశ్వం వయసు కన్నా ఎక్కువగా ఉంటుంది అన్నాడు. మన వయసు గురించి సరిగా లెక్క తెలియని మనలాంటి వాళ్లకు, విశ్వం వయసు, బ్లాక్‌హోల్ వయసు గురించి ఆలోచించడం కొంచెం కష్టమే.
అణువుల కన్నా చిన్న బ్లాక్‌హోల్స్ ఉన్నాయి అన్నది అర్థం చేసుకోవలసిన మరొక సత్యం. లక్షల హైడ్రోజన్ బాంబులతో శక్తితో అవి పేలడానికి అవకాశం ఉంది.
హాకింగ్ అందించిన ఇటువంటి అవగాహనలతో కాస్మలజీ అనే అంతరిక్ష శాస్త్ర రంగంలో వారు అందరూ గట్టి కుదుపులకు గురయ్యారు. బ్లాక్ హోల్ సమాచారం అనేది ఒక సమస్యగా తయారైంది. ఉండు ఒక నక్షత్రం ఉంటుంది. అది కుచించుకుని సింగులారిటీ తయారవుతుంది. అదే బ్లాక్‌హోల్. మరి అటువంటి బ్లాక్‌హోల్ సమసిపోతే నక్షత్రంతో పాటు అందులోకి వెళ్లిన సమాచారం ఏమవుతుంది? అది ప్రశ్న. సమాచారం సమసిపోవడానికి వీలు లేదు. మనలాంటి మామూలు మెదళ్లకు ఈ విషయాలు అర్థం కావు. అర్థం అయిన వారికి మాత్రం ఇక నిద్ర పట్టదు. అందులోని అంతు తేలే దాకా వీళ్లు ఏదో చేస్తూనే ఉంటారు. సమాచారం కూడా నాశనం అవుతుంది అంటాడు హాకింగ్. అది భౌతికశాస్త్ర సిద్ధాంతం ప్రకారం కుదరదు అంటారు మిగతా వాళ్లు. ఆ మిగతా వాళ్లలో ప్రెస్కిల్ అనే పరిశోధకుడు ఒకాయన 1997లో హాకింగ్‌తో ఈ విషయంగా పందెం వేసుకున్నారు. 2004లో ఈ విషయంగా తాను ఓడిపోయానని హాకీ ఒప్పుకున్నాడు. ఆయనలోని గొప్పతనం అప్పుడు బయటపడింది. పందెం ప్రకారం ఒక విజ్ఞాన సర్వస్వాన్ని ప్రత్యర్థికి ఆయన అందించాడు. అయితే ఆ సర్వస్వం బేస్‌బాల్ అనే ఆటకు సంబంధించింది. ఓడిపోయాడు. కానీ కూలిపోలేదు. బ్లాక్‌హూల్‌లో నుంచి వచ్చే సమాచారం నిష్ప్రయోజనం అయి ఉంటుంది అన్నాడు అతను. పుస్తకం బదులు దాన్ని కాల్చి బూడిదను ప్రత్యర్థికి ఇస్తే బాగుండేది అని చమత్కరించాడు.
స్టీఫెన్ హాకింగ్ జీవన ధోరణి గురించి నేను రాసిన పెద్ద పుస్తకంలో ఎక్కువగా చెప్పడానికి నాకు అవకాశం దొరికింది. కదలలేని ఆ వ్యక్తి హాస్యప్రియుడు అంటే నమ్మకం కలుగదు. కనుకనే అతను నాకు చాలా దగ్గరగా వచ్చినట్టు కనిపిస్తాడు. బ్రిటీష్ ప్రభుత్వం వారు తాను ఆశించిన సాయం చేయలేదు. తమ చక్రాల కుర్చీని మార్గరేట్ థాచర్ కాళ్ల మీదుగా నడిపించాలి అని హాకింగ్ చమత్కరించాడు. ప్రిన్స్ చార్ల్స్‌తో ఇంచుమించు అంత పని చేశాడు.
ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అన్న పుస్తకం గురించి చెప్పకుండా ముగిస్తే నా మానసిక మిత్రుడు హాకింగ్‌కు అన్యాయం చేసిన వాడిని అవుతాను. హాకింగ్ కేవలం పరిశోధకుడు మాత్రమే కాదు. బతకనేర్చిన మనిషి, బతుకు గురించి చాలా ఆసక్తికరంగా ప్రపంచానికి చెప్పగలిగిన మనిషి, విశ్వం గురించి అతను రాసిన పుస్తకం చాలా సంక్షిప్త చరిత్ర అన్న పేరుతో ప్రపంచం ముందుకు వచ్చింది. లక్షల కాపీలు అమ్ముడైంది. వాస్తవం చెప్పాలంటే అది నాతో సహా ఎవరికీ అర్థం కాలేదు. అయినా సరే ఈ ప్రపంచంలో అతిగొప్ప పుస్తకాలలో ఒకటిగా నిలబడింది. హాకింగ్ మరెన్నో పుస్తకాలు రాశాడు. ఆశ్చర్యకరంగా కూతురుతో కలిసి నవలలు రాశాడు. విశ్వం గురించిన విశేషాలు చిన్న పిల్లలకు అర్థం అయ్యే రీతిలో కథా రూపంలో చెప్పిన తీరు అసామాన్యంగా ఉంటుంది.
ఏదో కొంచెం ఆరోగ్య సమస్య ఉన్నందుకు నేను పనులన్నీ మానుకుని ఏ పనీ చేయకుండా కాలం గడుపుతుంటాను. చెయ్యి కదిలించడానికి వీలుకాని స్టీఫెన్ మాత్రం ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. న్యూటన్, ఐన్‌స్టైన్ ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేశారు. అయితే అది కథనానికి సంబంధించిన విషయం. స్టీఫెన్ హాకింగ్ ప్రభావం మాత్రం రానున్న కాలానికి సంబంధించినది. అతని ఆలోచన ధోరణి, అందించిన పరిశోధనా అంశాలు ముందు ముందు చాలా కాలం వరకు ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాయి. మనుషులు చాలామంది పుడతారు.
పుట్టుక ఎందుకో తెలియకుండానే వెళ్లిపోతారు. కొంతమంది మాత్రం తమ అడుగుజాడలను ప్రపంచంలో స్థిరంగా వదిలిపోతారు. అటువంటి వారిని అనుక్షణం ఆదర్శంగా భావించడం మన కర్తవ్యం. అంతకంటే ఎక్కువ మనం ఏమీ చేయలేము. చేతులెత్తి నమస్కరించడం తప్ప....

-కె.బి.గోపాలం