పఠనీయం

ప్రవచనాల మధురామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతా పంచామృతమ్
(ఐదు సంగ్రహ గీతార్థ సారములు)
రచయిత: మారోజు సూర్యప్రసాదరావు, పుటలు:240, వెల:రూ.100/-,
ప్రతులకు: ఇం.నెం.5-6-18/బి, పాక్బండ బజార్, పెట్రోలు బంకు వెనుక, ఖమ్మం- 507 001.
*
మనిషికి ఇహ పర సాధకాలుగా మార్గదర్శనం చేసే సూక్తులు, నీతులు, వృత్తాంత పూర్వక సందేశాలు, ప్రవర్తన ప్రవచనాలు, కథా వస్తు ధ్వని పూర్వక నిర్దేశాలు, ఆదేశాలు నిండి ఉండే గ్రంథాలను ‘గీత’లు అంటారు. ఉదాహరణకు భారతంలోని ‘్భగవద్గీత’, కూర్మ పురాణంలోని ‘ఈశ్వరగీత’, ‘శివ రహస్యం’ అనే బృహద్గ్రంధంలోని ‘ఋషభగీత’ మొదలైనవి. ఈ ‘గీతలు’ అనేవి మన పురాణ ఇతిహా స వాఙ్మయంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక అయిదింటిని తీసుకొని మా రోజు సూర్యప్రసాదరావు ‘గీతా పంచామృతం’ అనే పేరుతో ఒక సార సంగ్ర హ గ్రంథం రచించారు ఇటీవల.
బ్రహ్మ పురాణంలో మరీచి మహర్షికి బ్రహ్మ ఉపదేశించిన ‘బ్రహ్మగీత’, మహాభారత శాంతి పర్వంలోని ‘జాజలి తులాధార గీత’, అధ్యాత్మ రామాయణంలోని‘వసిస్ఠగీత (యోగ వాసిష్ఠం)’, భాగవత దశమ స్కంధంలోని వేణు గీత- భ్రమరగీతలతో కూడిన ‘గోపీ గీత’, అష్టావక్ర- జనక మహారాజుల మధ్య నడచిన సంవాద (సంభాషణ) రూపమైన ‘అష్టావక్రగీత’- ఈ అయిదు గీతలలోని లౌకిక, పారమార్థిక విషయాలను సరళమైన భాషలో సగటు పాఠకుడికి సులభగ్రాహ్యంగా అందించారు రచయిత ఈ పుస్తకంలో.
42వ పుట (బ్రహ్మగీత)లోని ‘్ధర్మేతి వతువః పురుషోత్త మానాం..’ అనే శ్లోకానికి ‘పరలోకానికి పోయినపుడు ధర్మం ఒక్కటే ఆత్మబంధువు అవుతుంది. అర్థ, కామాలను ఎంత జాగ్రత్తగా నియంత్రించుకొని అనుభవించినా వాటి ఫలితాలు స్థిరాలు కావు. అవి ఏలాటి సత్ఫలితాలనూ ఇవ్వవు అంటూ తెలియబరచిన తాత్పర్యం ప్రతి మనిషి దృష్టిలో పెట్టుకొని మనుగడలో అడుగు అడుగు ముందుకు వేయాలి. ఈ జీవన సూత్రాన్ని మానవజాతి మొత్తం త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే భువియే దివి అయిపోతుంది. అపుడు ఇక ఎక్కడా ఏ ‘దిశ’ దారుణంగానీ, ఏ ‘నిర్భయ’ చట్టం యొక్క అవసరం గాని ఉండదు.
64వ పుట (జాజలి-తులాధారగీ)లోని ‘నగములెల్ల పుణ్య నగములు.. ఆత్మతీర్థ మెరుగు అకలుషునకు’ అనే పద్యంలో ‘ఆత్మ అనే తీర్థం ఒకటుంది. ఆ తీర్థమేమిటో తెలిసినవారికి లోకంలోని కొండలన్నీ పవిత్ర పర్వతాలే; నదులన్నీ పావన జల పరిపూర్ణాలే’ అంటూ కనిపించే భావార్థం బహు గంభీర సందేశాత్మకంగా ఉంది. ఈ ‘గీత’లోని విశేషాంశం ఏమిటంటే తులాధారుడు అనే ఒక వైశ్య కులపు వడ్డీ వ్యాపారి జాజలి అనే మహా మునికే అద్భుతమైన జ్ఞానబోధ చేస్తాడు. భారతంలో ధర్మవ్యాధుడు అనే కసాయివాడు కౌశికుడు అనే ఋషీశ్వరుడికే అమోఘమైన తాత్త్విక ధర్మప్రబోధం చేసినట్లు.
బహువిధ వికలాంగుడయ్యుండి కూడా అష్టావక్రుడు రాజర్షియైన జనక మహారాజుతో ధీటుగా చేసిన తాత్త్విక చర్చ అచ్చెరువును కలిగిస్తుంది. ఆ సందర్భంలో ఒక చోట తాతాల్కికములైన పురాణ, ప్రసూతి, శ్మశాన వైరాగ్యాలలో కాకుండా సహజ స్వచ్ఛ తత్త్వ సుందర మానసిక వైరాగ్యాన్ని అలవాటు చేసుకుంటే ‘తృష్ణ’ అనేది అంతరించి సుఖం కలుగుతుంది అని తెలియజేసిన ‘యత్ర యత్ర భవే తృష్ణా..’ అనే శ్లోకం (197వ పుట) అష్టావక్ర గీతకే మకుటాయమాన శ్లోకం.
అష్టావక్ర గీతలోనిదే మరో ముఖ్య సూక్తి శ్లోకం ‘అచిత్యం చింతమనోపి..’ అనేది (204 పుట).
‘చింతించుట అనే భావాన్ని త్యజించినపుడు ఆత్మ సంస్థితి ఏర్పడుతుంది. అహం అంతమై ఆత్మ స్ఫురిస్తుంది. అపుడు జీవాత్మ కృతార్థతను పొందుతుంది’ అంటుంది ఆ శ్లోకం. ఇదే పరమార్థం. ఆలోచన, తాత్త్విక తార్కికత ఇటీవలి కాలంలో కొందరు యోగులు, తాత్త్వికులు, ధ్యానపరులు చెప్తున్న ‘్భవాతీత ధ్యానం’ (ట్రానె్సడెంటల్ మెడిటేషన్)లో ఉండి ఉండవచ్చు.
వస్తుపరంగా ఈ ప్రవచన గ్రంథం ఉదాత్త నైతిక తాత్విక అంశాల సంగ్రహమే. కానీ శాబ్దిక దోషాలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ. వైశిష్ట్యత, ప్రాముఖ్యత (52వ పుట), స్మశాన (198వ పుట), ప్రారబ్ద అంటూ ఒకే వాక్యంలో మూడుసార్లు మొదలైన శబ్ద అసాధుత్వాలు అసంతృప్తిని కలిగిస్తున్నాయి. వైశిష్ట్యము, ప్రాముఖ్యము, శ్మశానము, ప్రారబ్దము అని ఉండాలి. 224వ పుటలో ‘శాంతశుద్ధి’ అన్నారు. ‘శాంతిశుద్ధి’ అనాలి. ‘శాంతి’ పూర్వక - దాయిక శుద్ధి అనే అర్థం రావాలి అక్కడ. శాంతమైన శుద్ధి కాదు.చిన్న చిన్న దోషాలను మినహాయస్తే మొత్తంమీద ఈ గీతా పంచకం మంచి ప్రవచనాల మధురామృతం. అందరూచదివి తెలుసు కోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయ.

-శ్రీపతి పండితరాధ్యుల పార్వతీశం