పఠనీయం
మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర
రచన- డా. బెల్లంకొండ సంపత్‌కుమార్
వెల: రూ.40/-
ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమి
కళాభవన్, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్.
*
ఒక ప్రాంతపు సాహిత్య చరిత్రను పఠించడంవల్ల ఆ ప్రాంతపు సాంస్కృతిక సామాజిక జీవనం పట్ల పాఠకుడికి ఒక సమ్యక్ దృష్టి ఏర్పడి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. రాజకీయ చరిత్రలు చేయలేని పనిని ఒక సాహిత్య చరిత్ర సునాయాసంగా సాధించగలుగుతుంది. ఈ రచన అంత సులభంగాదు. ఆ ప్రాంతంలోని వివిధ సాహిత్య ప్రక్రియలపై విస్తృతమైన అధ్యయనం, అనుభవం, కృషి, పట్టుదల, శ్రమ తప్పనిసరిగా కావాలి.
రాష్ట్రాల పునర్విభజన తర్వాత ఆయారాష్ట్రాల చరిత్ర రచనమీద చరిత్రకారులు శ్రద్ధ వహిస్తున్నారు. తెలంగాణ చరిత్రకారులు మరొక అడుగు ముందుకువేసి స్థానిక సాహిత్య రచనలను అందించే ప్రక్రియను ప్రారంభించారు. ఆ ఒరవడిలో రచించిన గ్రంథమే మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర. ఇందులో మొత్తం ఐదు భాగాలు పొందుపరచి వున్నవి. మొదటిది భౌగోళిక నైసర్గిక స్వరూపం. మెదక్ జిల్లా హద్దులు, అక్కడి నేలలు, స్వరూప స్వభావాలు, పర్వత శ్రేణులు, అడవులు, రవాణా గురించి తెలిపారు. అడవుల గురించి, శిరుశినగండ్ల కృష్ణమాచార్యులు మూడు లక్షల ఎకరాల బీడులందు పులులు తిరుగాడు పొదలు గలిగిన అని ‘మెతుకుసీమ’ ప్రథమ ఖండంలో వివరించారు. ఖనిజ సంపద గురించి పలు రాజవంశాల పాలకుల వివరాలు తెలియజేశారు. రెండవ భాగంలో స్థానిక రాజుల పరిపాలనా పద్ధతులను, నాటి చారిత్రక వ్యవస్థను కూలంకషంగా చర్చించారు. చౌదరి అనే పదాన్ని ఆ రోజుల్లో ఒక గొప్ప బిరుదుగా పరిగణించేవారు. ‘పేరు స్థిరమొప్ప నల్లమపేట నిల్పె, అల తటాకంబు గొల్పె మల్కాపురమునకు, తగవుల దీర్చి పెద్దలను నిలిపె, ప్రజల చౌదరియని ప్రఖ్యాతి పార్థివుండు’ అని కవులు కీర్తించారు. పీష్వాలను జయించుటలో సహాయపడిన శంకరాంబకు రాయెబాగిన్ (రాజ్ఞిశార్దూల) అని బిరుదు నిజాం నవాబు ఇవ్వడం లాంటి సంగతులు ఆసక్తికరంగా వున్నాయి. మూడవ భాగమైన సామాజిక పరిస్థితులు సంస్కృతిలో ఎన్నో పాత విషయాలు తెలియజేశాయి. ముస్లిం స్ర్తిలలో పరదా పద్ధతి అని, దేశ్‌ముఖ్, దేశ్‌పాండ్యాలు ఇండ్లలో ఘోషా పద్ధతులు అమలులో వున్నవి. ఆనాటి సమాజంలోని కోలాటం, భజనలు, కీర్తనలు, నాటకాలు, బతుకమ్మ పండుగల గురించి వివరించారు. ‘మంతఖిఖానా’లు అంటే సామాజిక నిర్ణయాలు తీసుకునే విధానాలు తెలిపారు. నాల్గవ భాగంలో ప్రాచీన సాహిత్య చరిత్ర, ప్రబంధ పూర్వ యుగం గురించి సవివరంగా విపులీకరించారు. పదవ శతాబ్దంనాటి తెలుగు వీర శైవుల సంబంధాల గురించి పదమూడవ శతాబ్దంనాటి మల్లినాథ సూరి కవి గురించి కోసలనాడులో ‘ఆరె’ భాష గురించి 16వ శతాబ్దినాటి లక్ష్మీశకవి గురించి చర్చించారు. ప్రబంధ కవులలో చివరి కవి ముదిగొండ బ్రహ్మయ్య లింగం వ్రాసిన శివరహస్య ఖండము అనే కావ్యాన్ని గురించి తెలిపారు. ఐదవ భాగములో ఆధునిక సాహిత్య చరిత్ర క్రీస్తువకం 1800 నుండి 1930 వరకు జరిగిన సాహిత్య పరిణామాలను గురించి సోదాహరణంగా తెలిపారు. శ్రీ వానమామల నరసింహదాసు, కందాళ సుందరాచార్యులు, దొంతి కృష్ణమాచార్యులు, మాయావరం రామశాస్ర్తీ, కృష్ణాగౌడ్, వడ్ల మల్లయ్య మొదలగు తొలి దశ కవుల గురించి వివరించారు. ఇక పునర్వికాసపు మలిదశలో 1930 నుండి 1970 వరకు గల కవుల ప్రస్థావన వుంది.
శ్రీ వెల్దుర్తి మాణిక్యారావు రచించిన షర్కేముష్కిరాత్ అనే ఉర్దూ గ్రంథం బహుళ జనాదరణను పొందింది. ఇక వర్తమాన సాహిత్య కవుల గురించి విశదీకరించి రాశారు. శ్రీ ఏలేశ్వర నాగభూషణాచార్య, ఎం.డి.అహ్మద్ ఆనవాళ్ళు లేనివాళ్లు, కాలం ఖడ్గంమీద భయకంపిత పావురాలం మేము నవాబులం కాదు అంటూ పేద ముస్లింల గురించి కవయిత్రి సముద్రాల శ్రీదేవి, మాసాయిపేట యాదగిరి మాదిగ సాహిత్య రచనల గురించి వివరించారు.
కథాసాహిత్య కవుల గురించి సాహితీ సంఘాల కృషిని, ప్రోత్సాహ కార్యక్రమాలను పత్రికారంగ పాత్రికేయుల గురించి సోదాహరణంగా వివరాలు అందించారు. మొత్తంమీద ఈ గ్రంథ రచనకు దాదాపు 19 గ్రంథాలను కూలంకషంగా పరిశీలించి క్లుప్తంగా వివరంగా మెదక్ జిల్లా యొక్క పూర్తి వివరాలను అందించిన డా. బెల్లంకొండ సంపత్‌కుమార్ కృషి ఎంతో కొనియాడదగింది.
ఆఖరుగా ఒక్కమాట. గ్రంథ ముఖచిత్రంగా ఆ జిల్లాలో ప్రసిద్ధి చెందిన క్రీస్తు దేవాలయాన్ని ముద్రించడం ఎంతో ముదావహంగావున్నా, కించిత్ లోపభూయిష్టంగా కనబడుతున్నది. కారణం మన భారతీయతత్వం భిన్నత్వంలో ఏకత్వం అన్ని మతాలు వర్గాలు సమానం. అదే మన వాంగ్మయాలు చెబుతున్న పరమార్థం.