పఠనీయం

అందుబాటులో ‘అందమైన జీవితం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుబాటులో మన అందమైన జీవితం
మూలం:ఓషో, అనువాదం:్భరత్
ధర:రూ.270/-
ప్రతులకు:గాంధీ బుక్ హౌస్
9440004261, 9293226169
*
ఆ చూపులు మన వెంట పడుతుంటాయి.. మనల్ని వెంటాడుతుంటాయి.. మనల్ని ప్రశ్నించమంటాయి.. సమాధానాల్ని రాబట్టుకోమంటాయి.. కాని, సమాధానపడమనవు.
అవును, సమాధానపడటం నేర్పని వ్యక్తిత్వం అతనిది. అతనెవరో కాదు.. ఓషో, ప్రపంచ దూషణ భూషణలను సమంగా ఎదుర్కొన్న సంయమన శీలి. ఛీత్కరించినా, ప్రశంసించినా తన పంథా మార్చుకోనివాడు. చెప్పదలచుకున్నది నిక్కచ్చిగా చెప్పటం, దాపరికాలు లేకుండా వర్తించటం అతని ప్రత్యేకత. అందుకే ఇప్పటికీ ఒక వర్గం చేత నీరాజనాలందుకుంటున్నాడు. భౌతికంగా మన మధ్య లేకపోయినా.
అన్నట్టు, ఓషో చూపులనుండి ఎవరూ తప్పించుకోలేరు.. కారణం ఆ చూపుల్లో తాత్విక నేపథ్యాలు పరచుకుని ఉంటాయి. ఒక అసాధారణ తాత్వికతను మనలోకి వొంపుతుంటాయి.. ఆ తాత్వికతతో తడిసి ముద్దవటం ఖాయం. అందుకే ఎన్ని కాంట్రవర్సీలమధ్య ఓషో జీవితం ఎన్ని మలుపులు తిరిగినా అతడు ఏ మాత్రం తలదించలేదు, తలవంచలేదు, తల తిప్పలేదు. ఇటువంటి తాత్వికుడ్ని ఈ ప్రపంచం ఇంతకుముందు చూసి ఉండలేదు.
ఓషో జీవితం నిండా ఎన్ని సంఘర్షణలు.. ఎన్ని వైపరీత్యాలు.. ఎన్ని ఆకర్షణలు.. ఎన్ని వికర్షణలు? ఇన్ని వైరుధ్యాలమధ్య జీవితాన్ని ఇరుకుచేసుకోక లక్షల జీవితాలకి ఇరుసులా మిగిలినవాడు. అందుకే గత శతాబ్ద తాత్విక ప్రభంజనంగా తన జెండా ఎగరేయగలిగాడు. అన్ని తుఫానులను తట్టుకుని ఇప్పటికీ ఆ జెండా బ్రతుకు బాట చూపుతూనే వుంది. ఓషో రాసిన పుస్తకం ‘లైఫ్ మిస్టరీస్’. ఈ ఆంగ్ల గ్రంథాన్ని తాజాగా భరత్ ‘అందమైన జీవితం’ పేరుతో తెనిగీకరించారు. ఓషోను తెలుగువారికి సమగ్రంగా అందించాలన్న తపన భరత్‌ది. ఆ ప్రయత్నంలో వచ్చిన మరో పుస్తకమే ఈ ‘అందమైన జీవితం’. అందుబాటులోనే వుంది టాగ్‌లైన్.
‘నమ్మకం మీ జ్ఞానాన్ని నాశనం చేసే విషంలాంటిది. కాబట్టి, నాతోపాటు మీరు ఎవరినీ నమ్మకండి’ అని అంటున్న ఓషో ‘జీవించడమే జీవిత లక్ష్యం. అది తప్ప, జీవితానికి మరొక లక్ష్యం లేదు. ప్రతిదాని లక్ష్యం జీవించడమే’ అని అంటారు ‘జీవితానికి లక్ష్యమేమిటి?’ అన్న శీర్షికన. మనసు వున్న స్థితిలో మనం మన ఉనికికి అనేకమైళ్ల దూరంలో వుంటామంటారు ఓషో. అంటే మన మనసు చెప్పినట్లు నడుచుకుంటుంటే మనం మన సమాజ జీవవ విధానానికి దూరమైయినట్లే కదా!
ప్రేమను గురించి ఓషో ఈ స్టేట్‌మెంట్ చూడండి- ‘ప్రేమలో పడడమంటే సచేతనం నుంచి అచేతనానికి, బుద్ధి నుంచి చిత్తవృత్తుల్లోకి జారిపడటమే’ అట. కాస్త ఆలోచించాల్సిన అంశమే మరి.
‘నేనెప్పుడూ ఏకాంతం నుంచి ఎందుకు తప్పించుకుంటున్నాను?’ అన్న శీర్షికలో ‘ఏకాంతం ఎప్పుడూ విషాదాన్ని కలిగించదు. అయితే ఏకాంతంలో ఉండకూడదనే భావనే మీకు విషాదాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే, ఆ భావనే విషాదకరమైనది. అందుకే అది సమస్యను సృష్టిస్తోంది’ అని అన్న ఓషో మాటల అంతరార్థం తెలియాలంటే జీవించటం అంటే ఏమిటో తెలిసి ఉంటేనే సాధ్యం.
‘ఉద్రిక్తత లేకుండా ప్రశాంతంగా ఉండడమెలా?’ అన్న శీర్షికలో ఉద్రిక్తతను ఓషో నిర్వహించిన తీరు చూడండి. ‘‘గతంలో మీరు వాస్తవంగా జీవించలేదు. అయినా ఏదోవిధంగా మీ గతం గడిచిపోయింది. కానీ, మీరు వాస్తవంగా జీవించలేదన్న సత్యం మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ వేస్తుంది. అంటే, పూర్తిగా జీవించని ఏ అనుభవమైనా మిమ్మల్ని వెంటాడుతూ వేధిస్తూనే వుంటుంది. అదే మీలోని ఉద్రిక్తత’ మింగుడు పడని- అలాగని కొట్టిపడెయ్యలేని జీవన వాస్తవం ఇది.
మన శరీరాన్ని పసిపాపలా ప్రశాంతంగా ఉంచుకోవాలంటారు ఓషో. చాలా నిదానంగా నడవటం, ప్రతి పనిని నిదానంగా చేయటం అవశ్యకర్తవ్యం అనే ఓషో మాటలలో ఎంతో నిగూఢత దాగివుంది. జ్ఞానోదయమనేది ఎక్కడో దూరంగా ఉండే ఒక లక్ష్యం కాదు. అది మన నుంచి కనీసం ఒక్క అంగుళం దూరంలో కూడా లేదు. జ్ఞానమే మనం అని అంటారు ఓషో. సత్యాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం లేదు. కారణం దాని సౌందర్యం ఎప్పటికీ తరగనిది. సత్యానికి ఎప్పుడూ ఎలాంటి మెరుగులు దిద్దవలసిన పనిలేదు. కానీ కల్పనకు ఎప్పుడూ మెరుగులు దిద్దుతూ పోవలసిందే అన్నది ఓషో తాత్విక దృక్పథం.
నలభై రెండు శీర్షికలలో పరచుకున్న ‘అందమైన జీవితం’లో దొరకని జీవితమంటూ లేదు.. దొర్లని జీవితాంశమంటూ లేదు.. దొరకబుచ్చుకోలేని జీవిత అంశ అంటూ లేదు. భరత్ ఈ తెనుగీకరణలోని 170వ పుటలో ‘శక్తి ఎప్పుడూ వేళ్ళ ద్వారా విడుదలవుతుంది’ అన్నట్లుగా ఓషో శక్తిని భరత్ తన కలం వేళ్ళ ద్వారా ‘అందమైన జీవితం’లో మనకు అందుబాటులోకి తీసుకొచ్చి ఓషో తాత్వికతను తెలుగువారికి మరింత దగ్గర చేశాడు. ఇది చదవాల్సిన పుస్తకమే కాదు.. అందమైన జీవితాన్ని మనలోకి వొంపుకోవాల్సిన పుస్తకం కూడా.

-విశ్వర్షి వాసిలి 9393933946