పఠనీయం

శిప్రముని వాఙ్మయ నికషోపలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నికషోపలం (వ్యాససంపుటి)
- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్
వెల:375/- ప్రతులకు: నవోదయ, ఆర్యసమాజ్ మందిరం ఎదురుగా, కాచిగూడ, హైదరాబాద్-500 027.
ఫోన్:040-24652387.
=================================================
సంస్కృతంలో నికషోపలం అనే పదానికి సమానార్థకంగా కసౌటీ - గీటురాయి - టచ్‌స్టోన్ వంటి పదాల ప్రయోగం జరుగుతూ ఉంటుంది. చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ వివిధ సందర్భాల్లో రచించిన వ్యాసాలు ఇటీవల సంకలనాలుగా వస్తున్నాయి. శిప్రవాక్యం - వ్యాసదర్శనము నికషోపలం అనే పేర్లతో ఇప్పటికే మూడు సంకలనాలు వెలువడ్డాయి.
నికషోపలంలో తొలి వ్యాసం చాలా బరువైనది. ఆర్యశబ్దము గుణ వాచకమా? జాతి (రేస్) వాచకమా? అనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఆర్యులు ఎక్కడినుండి వచ్చారు? ఆర్య ద్రావిడ సంబంధాలేమిటి? ఈ అంశంపై పాశ్చాత్య విద్వాంసులు ఏమన్నారు? లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి అంశాలు భాషా శాస్త్రం భౌగోళిక శాస్త్రం, చారిత్రక నేపథ్యాలలో పరిశోధించి పరిశీలించి ‘కృణ్వంతో విశ్వమార్యమ్’ అనే సుదీర్ఘ వ్యాసాన్ని సంతరించారు. ఇది ఈ తరంలోని విద్యార్థులకే కాదు పండితులకు కూడా మార్గదర్శనం చేస్తుంది అనటంలో సందేహంలేదు.
జొరస్ట్రానియన్లు అగ్నిపూజకులు. వీరి మత గ్రంథాలు అలెస్టా భాషలో ఉన్నాయి. తర్వాతికాలంలో అవి పహ్లవి, అరబిక్, ఆంగ్ల భాషలలోకి అనువదింపబడ్డాయి. ఈ అహిర్‌మర్ద ఎవరు? జంషడ్‌జీ అంటే అర్థం ఏమిటి? జరుతష్ట పదానికి సమానార్థకమైన ఆంగ్ల పదం సంస్కృతం ఏదైనా ఉందా? యస్నా అంటే మరేదో కాదు యజన శబ్దమే. వెండిడాడ్ అంటే భారతీయుల గృహ్యసూత్రాలే సుమా! ఈ అద్భుత పరిశోధన తెలుగులో ఇప్పటివరకూ రాలేదు అనేది నిర్వివాదాంశం. ఈ నికషోపలం సంకలనంలో వెండిడాడ్ ఒక పరిచయం అనే వ్యాసం ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని మద్దిగాం సమీపంలోని మాకవరంలో శ్రీ ఉమాసహిత నీలకంఠేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఇది అత్యంత ప్రాచీనమైనది. దీనిపై నూరేండ్ల క్రితం వంతుల బ్రహ్మదేవకరి ఒక యక్షగానం రచించారు. నేడది అలభ్యము. ప్రొఫెసర్ శివప్రసాద్ శ్రమించి శిథిల ప్రతిని ఒకదానిని సేకరించారు. దానిని పరిష్కరించి నీలకంఠేశ్వర యక్షగాన పరిచయము అనే ఒక వ్యాసాన్ని రచించి పాఠకుల సౌకర్యార్థం ఈ సంకలనంలో చేర్చారు. దానితోబాటు ఆ ప్రాచీనదేవాలయం (మాకవరం)లోని ఆలయ శిల్పాన్ని కూడా సేకరించి ముద్రించారు. తెలుగులో యక్షగాన చరిత్ర, నీలకంఠేశ్వర యక్షగానంలో కాళిదాస కథాగతమైన క్రమం ఎంతవరకు ఉంది? అనే అంశాలు స్పృశించారు. ఇలా జీర్ణోద్ధరణ చేయటం రచయిత సాహిత్య సేవకు పరిశోధక మేధకు నిజంగా నికషోపలమే. ఇటీవలికాలంలో భారతదేశంలో జరిగే వివిధ విషయాలపైన ముదిగొండ వారు తనదైన ఆలోచనా దృక్పథంలో విషయ వివరణ చేస్తూ ‘ఈ కల్పన బాగుంది’ అనే గ్రంథాన్ని రూపొందించారు. అందులోని ప్రతీ వ్యాస సారంశం ప్రతివారిని ఆలోచింపచేస్తుంది. ఇందులో ఆర్టికల్ 19ఎ, బిలు ఇచ్చిన భావస్వేచ్ఛ, దేశద్రోహానికి దారితీయకూడదు అని శివప్రసాద్ స్పష్టీకరించారు. ఈ సంకలనంలో ఆయా సందర్భాలలో దేశంలో జరిగిన వివిధ రాజకీయ పరిణామాల సందర్భంగా రచయిత ఆంధ్రభూమి దినపత్రికలో శిప్రవాక్యం శీర్షికలో వెలువరించిన వ్యాసాలు కూడా ఇందులో కొన్ని ప్రచురించారు. ఇవి విశే్లషణాత్మకంగా గణాంకాలతో (స్టాటిస్టిక్స్) సోదాహరణంగా ఉండటంవల్ల చెప్పిన విషయానికి ప్రామాణికత పెరుగుతున్నది.
ఇందులో దేశ రాజకీయాలు, రాజకీయ నేతల ఆలోచనలు ఎటువైపుకు మళ్లుతున్నాయ వాటికి కారణాలేంటి అనే ఆలోచనాపరంపరలు పాఠకు నిలో మొలకెత్తుతాయ. తెలంగాణ రాజకీయాల్లో ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ అస్తిత్వం ఎంత? అపర చాణుక్యుడు ఎవరు? పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన ఆర్థిక పరిణామాలేమిటి? ఉగ్రవాదం .... ఇలా ఎన్నో అంశాలను ప్రతీ వ్యాసం లోను విశే్లషణాత్మకంగా ప్రొఫెసర్‌గారు వివరించారు. తమిళనాడు రాజకీయాల పయనం ఎటు? చైనాతో స్నేహం చేస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే. దేశంలోని అన్ని సమస్యలకూ మూలకారణం దేశ ప్రజలలో దేశభక్తి లోపించటం ఇట్లాంటి వ్యాసాలు ఈ వ్యాస సంకలనంలో చోటు చేసుకున్నాయ. తృతీయ ఫ్రంట్ ప్రయోగం ఎందుకు విఫలమైంది? కాంగ్రెస్ ముక్త్భారత్ అనే లక్ష్యానికి బిజెపి ఎంత చేరువలో వుంది? ఇలా ఆసక్తికరమైన సమాకాలీన రాజకీయాంశాలపై లోగడ శివప్రసాద్ ప్రచురించిన వ్యాసాలు ఇందులో పొందుపరిచారు. ఏ వ్యాసమైనా ప్రామాణికంగా ఉండటంతోబాటు రీడబిలిటీ ఎక్కువగా ఉండటంవలన ఇవి విశేషంగా లోగడ లక్షలాది పాఠకులను ఆకర్షించినట్లే ఇపుడు పాఠకులను ఆకర్షిస్తాయ. ఈ గ్రంథాన్ని శ్రీ భిళ్లముడి సీతారామస్వామి దంపతులకు రచయిత అంకితం చేయడంతోబాటు కృతిభర్త వంశవృక్షాన్ని సేకరించి సచిత్రంగా ప్రచురించారు. పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఈ గ్రంథం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది అని వేరే చెప్పనక్కరలేదు.

-జొన్నాభట్ల నరసింహప్రసాద్