Others

స్వాతంత్య్ర సమరయోధుడు అష్పాఖుల్లాఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు వర్ధంతి
*
‘నా మాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం చేయాలనుకున్నాను. నా త్యాగం వృథాకాదు. మరెందరో త్యాగధనులకు స్ఫూర్తినిస్తుంది. నా హిందూస్థాన్ స్వేచ్ఛావాయువులు పీలుస్తుంది. చాలా త్వరగా బానిస సంకెళ్ళు తెగిపోతాయి. దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రంకోసం ఉరి కంబాన్ని ఎక్కబోతున్న మొట్టమొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతున్నాను’ అంటూ అష్పాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్దాడి మెడలో తానే వేసుకున్నాడు.
భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. బ్రిటీష్ పాలనలో దాదాపు 200 సంవత్సరాలు అణగారిపోయింది. చివరికి వారి అన్యాయాన్ని, అరాచకాలను అరికట్టడానికి, స్వాతంత్య్రం పొందడానికి కొంతమంది నాయకులు ముందుకు వచ్చారు. 1857లో ది ఇండియన్ రెబిలియన్ గ్రూప్‌తో స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రారంభించారు. అప్పటినుండి దేశానికి స్వాతంత్య్రం రావడానికి 90 సంవత్సరాలు పట్టింది. ఈ స్వాతంత్య్ర సమరంలో వేల సంఖ్యలో వయసుతో సంబంధం లేకుండా పాల్గొన్నారు. ఈ స్వాతంత్య్ర సమరయోధుల్లో 27 సంవత్సరాల పిన్న వయసులోనే దేశంకోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ అష్పాఖుల్లాఖాన్ చిరస్మరణీయుడుగా నిలిచిపోయాడు. భరతమాత స్వేచ్ఛకోసం స్వాతంత్య్ర పోరాటం చేసిన సర్దార్ భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల కంటే నాలుగు సంవత్సరాల ముందే భరతమాత ఒడిలో ఒదిగిపోయాడు. అష్పాఖుల్లాఖాన్ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న షాజహాన్‌పూర్‌లో అక్టోబర్ 22, 1900న జన్మించాడు. తండ్రి షఫీకుర్ రెహమాన్ పోలీసు శాఖలో పనిచేసేవాడు. తల్లి మజ్హరున్నీసా. ఈ దంపతుల ఆరుగురు సంతానంలో అష్పాఖుల్లా చివరివాడు. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు అష్పాఖుల్లాఖాన్ పాఠశాల విద్యార్థి. ఇది అతనిపై గొప్ప ప్రభావాన్ని చూపి, స్వాతంత్య్ర సమరయోధుడుగా మారడానికి కారణమయింది. మహాత్మాగాంధీ, చౌరీచౌరా ఉదంతము తర్వాత సహాయ నిరాకరణోద్యమం నిలిపివేయడంతో చాలామంది భారతీయ యువకులు నిరాశ చెందారు. అలాంటి యువకులలో అష్పాఖ్ ఒకడు. ఈయన భారతదేశాన్ని వీలయినంత త్వరగా పరాయి పాలననుంచి విముక్తం చేయాలన్న తపనతో, అతివాద ఉద్యమకారులతో చేరాడు. ఈ సమయంలోనే ఈయనకు షాజహాన్‌పూర్‌కు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు రాంప్రసాద్ బిస్మిల్‌తో పరిచయమేర్పడింది. హిందూ మతం గొప్పతనం గురించి ఇతర మతస్థులకు బోధించడానికి వెనుకాడని ఆర్యసమాజ్ సభ్యుడైన రాంప్రసాద్ బిస్మిల్‌తో సాంప్రదాయ ముస్లిం మతస్థుడైన అష్పాఖుల్లాఖాన్ స్నేహం కొంత విభిన్నమైనదే. అయినా వారిద్దరి సమష్టి లక్ష్యం ఒకటే. భారత స్వాతంత్య్ర సముపార్జన. దీనితో ఇద్దరు మంచి మిత్రులయ్యారు.
తమ సాయుధ ఉద్యమానికి ఊపునివ్వడానికి, సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొనుగోలుచేయడానికి ఉద్యమకారులు 1925 ఆగస్టు 8న షాజహాన్‌పూర్‌లో ఒక సభను నిర్వహించారు. కాకోరి రైలుదోపిడీ, కాకోరి కుట్ర అనేది బ్రిటీష్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో ఆగస్టు 9, 1925న లక్నో సమీపంలో ఉన్న కాకోరిలో జరిగిన ఒక రైలు దోపిడీ. ఈ దోపిడీని హిందూస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌ఏ) చేసింది. దీనికోసం రాజాప్రసాద్ బిస్మిల్, అష్పాఖుల్లాఖాన్ హర్రాన్‌కు చెందిన హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌గా అవతరించారు. స్వాతంత్య్రం సాధించాలనే ఉద్దేశ్యంతో బ్రిటీష్ సామ్రాజ్యంపై విప్లవాత్మక చర్యలు చేపట్టేందుకు ఈ సంస్థ స్థాపించారు. సభ ఏర్పాటుచేశారు. ఆ సభలో చాలా తర్జనభర్జనల తర్వాత రైళ్లలో రవాణాచేసే ప్రభుత్వ కోశాగారాన్ని దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 9న అష్పాఖుల్లాఖాన్, రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్రలాహిరి, ఠాకూర్ రోషన్‌సింగ్, సచీంద్ర బక్షి, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంది లాల్, మన్మధనాథ్ గుప్తలు కలిసి కాకోరీ గ్రామం దగ్గిర ప్రభుత్వ ధనాన్ని తీసికెళుతున్న రైలుని దోచుకున్నారు. లక్నోకు తప్పించుకున్నారు. బ్రిటిష్‌వారినుంచి దొంగిలించబడిన నిధులు హెచ్‌ఆర్‌ఎకు నిధులయ్యాయి. ఒక ప్రయాణీకుడు అహ్మద్ అలీ యాదృచ్ఛికంగా చంపబడ్డాడు. దాని కారణంగా అది మాన్స్లాటర్ కేసుగా మారింది ఈ సంఘటన తరువాత. బ్రిటీష్ ప్రభుత్వం మన్హంట్, హెచ్‌ఆర్‌ఎలో పాల్గొన్న అనేక మంది విప్లవకారుల్ని అరెస్టుచేసింది.
1925 సెప్టెంబర్ 26 ఉదయం పోలీసులు రాంప్రసాద్ బిస్మిల్‌ను పట్టుకున్నారు. అష్పాఖ్ మాత్రము పోలీసులకు దొరకలేదు. అజ్ఞాతములో బీహార్‌నుంచి బనారస్‌కు వెళ్లి అక్కడ 10 నెలలపాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు. అజ్ఞాతంలో మరెంతో కాలం ఉండలేక విదేశాలకి వెళ్లి ఇంజనీరింగ్ చదవాలని నిశ్చయించుకున్నాడు. దేశాన్ని వదిలి వెళ్ళేమార్గాలు అనే్వషిస్తూ ఢిల్లీచేరాడు. అక్కడ ఒక పఠాన్ స్నేహితుణ్ణి ఆశ్రయించాడు. కానీ అదే స్నేహితుడు అష్పాఖ్‌ను వెన్నుపోటు పొడిచి, పోలీసులకి ఆయన జాడ తెలియచెప్పాడు. అష్పాఖుల్లాను 1927, డిసెంబర్ 19న ఉరితీశారు. ఉరితీతకు ముందు తన చివరి మాటలుగా.. ‘నా దేశ సోదరులారా! మీరు మొదట భారతీయులు. ఆ తర్వాతే వివిధ మతాలవారు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐకమత్యంతో ఆంగ్లేయులను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యంకావాలి’అన్నాడు. షాజహాన్‌పూర్‌లోని ఈయన సమాధి ఇప్పుడు ఒక స్మారక స్థలమైనది. కొందరు చరిత్రకారులు అష్పాఖుల్లాఖాన్ రాజద్రోహ నేరముపై ఉరితీయబడిన తొలి ముస్లిం అని భావిస్తారు.

- దామరాజు నాగలక్ష్మి, nagalakshmidamaraju@gmail.com