Others

అమరజీవి స్ఫూర్తితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి
*
స్వాతంత్య్ర సమరయోధుడు జతిన్‌దాస్ తరువాత అత్యంత సుదీర్ఘకాలం నిరాహారదీక్ష చేసినవారు అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక్కరే. ఆంధ్ర రాష్ట్రంకోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేశారాయన. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి పునాదులు పడ్డాయి. 1912లో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ప్రస్తావన వచ్చింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాష్ట్రాల విభజనను ఏ ప్రాతిపదికన నిర్ణయించాలనే అంశంపై నాటి కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసింది. అవిభక్త మద్రాసులో వున్న తెలుగువారు ఎప్పటినుంచో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కొందరు జాతీయ నాయకులు ప్రత్యేకాంధ్ర వైపు మొగ్గుచూపారు. అయితే, నాయకుల మధ్య అనైక్యతవల్ల 1952వరకు ప్రత్యేకాంధ్ర కార్యరూపం దాల్చలేదు. 1901 మార్చి 16న గురవయ్య, మహాలక్ష్మమ్మలకు శ్రీరాములు జన్మించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గాంధీజీ మార్గంలో పయనించి 1952 అక్టోబర్ 19న మద్రాసులో మహర్షి బులుసు సాంబమూర్తి ఇంటివద్ద ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఈయన దీక్ష గురించి దేశవ్యాప్తంగా తెలిసింది. ఎంతోమంది దీక్షను సందర్శించారు. మద్దతుగా మరెంతోమంది ఆందోళనలు చేశారు. అయినా ప్రభుత్వం తేల్చలేదు. సరైన రీతిలో స్పందించలేదు. 58 రోజులపాటు దీక్ష కొనసాగించిన పొట్టి శ్రీరాములు డిసెంబర్ 15న అసువులు బాశారు. ఆయన ప్రాణత్యాగంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం 1953 అక్టోబర్ 1న ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలలోని జిల్లాలను కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరిచింది. కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటుచేయగా, గుంటూరులో హైకోర్టు ఏర్పాటుచేశారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ప్రసిద్ధి పొందింది. విశాలాంధ్ర అనే భావన కారణంగా 1956లో ఆంధ్ర, తెలంగాణలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటుచేశారు. పొట్టి శ్రీరాములు చిన్నతనంనుండే గొప్ప దేశభక్తి కలిగియుండి గాంధీజీ ఆశయాలను పుణికిపుచ్చుకున్నారు. ఒకవైపు స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూనే, మరోవైపు నిమ్న వర్గాల హక్కులకోసం పోరాడారు. ఆనాటి సమాజంలో బహుజనులకు దేవాలయాల్లో ప్రవేశముండేది కాదు. దళితులు దేవాలయాల్లో ప్రవేశించాల్సిందేనని పట్టుబటి వారికి ఆలయ ప్రవేశాన్ని కల్పించారు శ్రీరాములు. హైద్రాబాద్‌లో ప్రారంభమైన తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టి పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీగా మార్చారు. 2008లో నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణము చేశారు. 1969నుండి 2014 వరకు ప్రత్యేక తెలంగాణ కొరకు జరిగిన పలు ఉద్యమాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను 29వ రాష్ట్రంగా ప్రకటించింది. దానితో రాజధాని లేని ప్రాంతంగా నవ్యాంధ్ర మిగిలింది. పొట్టిశ్రీరాములు మొక్కవోని దీక్షతో ఆంధ్ర రాష్ట్రంకోసం ప్రాణత్యాగం చేసిన తీరును నేటి నాయకులు స్ఫూర్తిగా తీసుకొని నవ్యాంధ్ర పునర్ నిర్మాణానికి నడుం బిగించాలి. ప్రత్యేక హోదా లేదా అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగడానికి చట్టబద్ధమైన ప్రత్యేక ప్యాకేజీ విషయంలో నాయకులు అందరూ ఒకే తాటిపైకివచ్చి సమిష్టి నిర్ణయాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముంది.
*చిత్రం... అమరజీవి పొట్టి శ్రీరాములు

- యం.రాంప్రదీప్, 9492712836