Others

ఒక భాష ఉద్భవిస్తోంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(ముదురుభాష, మురికి భాష; సంస్కార భాష కాదు, వికార భాష)
*
ఒక భాష ఉద్భవిస్తోంది, నయాభాష, నయాదౌర్ భాష
ఇంకా.. మరింకా ఎదుగుతోందది, దినదినం.. ప్రతిదినం
రణరంగ భాషలాంటి రాజకీయ భాష
రక్షణ భాష కాదు, భక్షణ భాష,
ఒక కొత్త నిఘంటువుకది పునాది వేస్తోంది,
ఒక ‘అనాది’ భాషనది తిరగ తోడుతోంది.

కొంటె భాష, కొండెంగ భాష, బూతు భాష, బురదలాంటి భాష
మనకు ఇదివరకే ఎంతోకొంత ఉండింది.
ఇపుడది మరింత పెరిగింది, ఇంకా పెరుగుతోంది.
అదే ‘దుష్ట్భాష’, ‘దూషణభాష’, ‘దుష్ప్రచార భాష’,
‘పరుషభాష’, ‘కరుష భాష’, ‘కటువు భాష’,
‘కొంచెపు భాష’, ‘వంచెపు భాష’
ఎన్నో కొత్తకొత్త పదాలు, పద జంటలు, పద-జమిలీలు,
పద-చలాకీలు, పద-బులాకీలు వచ్చి చేరాయి దానిలో
ఇంకెంతో పెరుగుతోంది, రోజురోజుకీ అలలాంటి అనాగరిక పదజాలం.

ఒకప్పుడు రాజకీయం ‘సూత్రాలపై’, ‘సిద్ధాంతాలపై’
‘ప్రణాళికలపై’, ‘పథకాలపై’, ‘స్వచ్ఛంద సేవాభావాలపై’,
‘సంస్కరణ కార్యక్రమాలపై’, ‘సర్వోదయ విలువలపై’,
‘సంఘ సంక్షేమ సార్వజనీన లక్ష్యాలపై’ ఆధారపడేది.
ఇపుడది తంత్రాలపై, కుతంత్రాలపై, కుటిలాలపై, కుమ్ములాటలపై,
కుత్సిత స్వభావాలపై, కురుక్షేత్ర పగ-పన్నాగం లాంటి వాటిపై
ఆధారపడుతోంది.

మనకు యుద్ధాలలో రెండు విధాలైనవి ఇంతవరకే ఉండేవి.
ఒకటి ‘ప్రచ్ఛన్నం’, ఇంకొకటి ‘పరోక్షం’,
ఆంగ్లంలో ఒక దానిని War, , ఇంకొక దానిని Cold War అంటారు.
అదే ఖర్మ ఇపుడు భాషకు కూడా సంతరించింది.
ఒక కొంచెపు భాష ఇదివరకే ఉంటే
దానికన్నా కొంచెపుది ఇపుడావిర్భవించింది.
ఒక ‘మరుగు’ భాష ఇదివరకే ఉంటే,
ఇంకొక మురుగు భాష ఇపుడుద్భవించింది.

ఏది ఎంతకాలమో తెలియదు కాని
చూస్తుంటే అనతికాలంలోనే ప్రతి రాజకీయ వేదికా
ఒక ‘అంగడి’, ‘గొంగడి’ ‘రణరంగడి’లాంటిదయి
అధఃపాతాళానికి పోయేట్టుంది.
దాని అంగడి-భాష, దాని వీధి-భాష, దాని విచ్చలవిడి- భాష,
రాజకీయాలనే కాదు రాజకీయేతర భాషలను కూడా ప్రభావితం
చేసి వాటినికూడా బజారుకు లాగేట్టుంది,
లాగేదేంటి? లాగుతూనే ఉంది.
ఒక్కొక్కసారి ‘మాటల’ యుద్ధం కన్నా
చేతల యుద్ధమే మేలేమోననిపిస్తుంది.
చేతలు ప్రాణం తీసేవేకాని మానం తీసేవి కావుగా మరి!
మరి మానం పోయాక ప్రాణం ఉంటేనేం? లేకపోతేనేం??

ఒకప్పుడు పల్లెటూరివారు, చేతితో పనిచేసేవారు
అనాగరికంగా మాట్లాడతారని ముక్కుమీద వేలేసుకున్న
ముద్దుముద్దు ముచ్చట్ల ముసుగులు ధరించే పట్టణపువారు
ముట్టుకుంటేనే ముక్కు మూసుకునేవారు
ఇపుడు ముదురుభాష, మురుగుభాష, మరుగుభాష, తరుగుభాష,
తాలుభాష, గలీజు భాష మాట్లాడుతున్నారు.

పాపం! పల్లెటూరివారే పరేషానవుతున్నారు,
అంత ‘పన్నీరు భాష’ మాట్లాడుతామని నీల్గే విర్రవీగేవారు
ఇలా ఇంత పచ్చిమాంసం తినేవారు మాట్లాడేలాంటి
పల్లెరుకాయ లాంటి భాష మాట్లాడుతున్నారేమిటా? యని.

హతోస్మి! హతోస్మి!
ఇదే ఇకముందటి సంస్కృతి, సంస్కారం,
నాగరికతయితే, రాజకీయమయితే
ఇంకేముంది?
ఇకముందు హరేరామ! హరేరామ! అంటూ
హార్టుపై చేయి వేసికొని హైరానా పడాల్సిందే అందరూ.

ఒకప్పటి రాజకీయాలలో కార్యకర్తలు,
కార్యదీక్షాపరులు, కార్య నిష్ఠాపరులు,
అసమాన దిగ్గజాలు, నిప్పులాంటి నిజాయితీపరులు,
నిండయిన వారు, నిమగ్నత కలవారు,
మెండయిన విలువ కలవారుండేవారు,
ఇప్పుడెందరో కల్లవారు, కల్లిబొల్లి మాటలాడేవారు,
కరాటే లాంటివారు
మామూలు వాడుక పదాలలో మిన్న, వెన్నలాంటి
పెద్ద విషయాలు మాట్లాడేవారు
‘జానలు’, ‘మూరలు’, ‘బొంకులు’, ‘రంకులు’
‘పల్లకి బోయిలు’, ‘పాద పూజారులు’ ఉద్భవిస్తున్నారు.

వీరా మన నేతలు! మన మంత్రులు! మన ముఖ్యమంత్రులు?
వీరేనా మన నవ జాతి నిర్మాతలు! నవ యుగకర్తలు?
వీరేనా మన యువకులకు బాటలు, తోటలు?
వీరేనా మన విద్యార్థులకు దివిటీలు, ముందుచూపు, ముఖచూపువారు,
ఎటుపోతోంది ఈ దేశం, ఈ రాష్ట్రం?
ఎటు తీసుకుపోతున్నారు-
మన నాల్గు నాలుకల నాయకులు
పదవుల కొరకు పదిసార్లు పదివైపుల మారేవారు,
కరెన్సీ కట్టలకు ఉవ్విళ్లూరుతూ కదం త్రొక్కేవారు
కాళ్ళు కూడా పట్టుకునేవారు.

-డాక్టర్ కొండలరావు వెల్చాల 98481 95959 krvelchala2012@gmail.com