Others

‘హింసామార్గం’ పట్టిన బౌద్ధ సన్యాసులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతమ బుద్ధుడు అహింసను బోధించాడు. ఈ సంగతి అందరికీ తెలుసు. వర్తమానంలో అది కొన్నిచోట్ల తిరగబడింది. ముఖ్యంగా మయన్మార్ (బర్మా)లో ముస్లింల, ముస్లిం మత ఛాందసవాదుల దాడులను తిప్పికొట్టడానికి, తమను తాము రక్షించుకోవడానికి తమ హక్కులను కాపాడుకునేందుకు బౌద్ధులు హింస-విధ్వంసానికి తెగబడ్డారు. 2013 సంవత్సరం నాటి అల్లర్లలో, బౌద్ధులు జరిపిన దాడుల్లో అనేక మంది ముస్లింలు మరణించారు. అపారమైన ఆస్తినష్టం జరిగింది. ఎంతోమంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చాలామంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి.
2011 సంవత్సరంలో అప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు బుద్ధ విగ్రహాలను కూల్చేసి నానా బీభత్సం సృష్టించాక, అంతకుముందు చైనా కమ్యూనిస్టు టిబెట్‌లో బౌద్ధ్ధర్మం ఆనవాలు లేకుండా చేయడంతో మయన్మార్ బౌద్ధ సన్యాసుల, గురువుల ఆలోచనల్లో కొంత మార్పు కనిపించింది. అంతవరకు శాంతి కాముకులు.. ప్రశాంత జీవనం గడిపే వారన్న పేరుగల వారు కాస్త కొందరు ముస్లింల ముఖ్యంగా తాలిబన్ సంస్కృతితో ప్రేరేపితులైన వారు జరిపిన దాడులు, బౌద్ధం ఆచరించే ఆడవారిపై అత్యాచారాలు పెరగడంతో బౌద్ధ ధర్మాన్ని పరిరక్షించుకోవాలన్న కాంక్ష బౌద్ధ గురువుల్లో కనిపించసాగింది. వారిలో ప్రముఖుడు- యువ రాడికల్ బౌద్ధ సన్యాసిగా పేరొందిన ఆశిన్ విరాతు. ఈ బౌద్ధ గురువుకు ఎక్కువ మంది అనుయాయులున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయన క్రియాశీలకంగా కనిపిస్తారు.
మయన్మార్‌ను ఇస్లామిక్ స్టేట్‌గా మార్చేందుకు ‘కుట్ర’ జరుగుతోందని, వివిధ దేశాలలో ఆమేరకు జరుగుతున్న కార్యక్రమాలను పసిగట్టి, ముఖ్యంగా అప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అమానవీయదాడుల మత సహిష్ణుత పాటించని వైనం.. పొరుగు ఆగ్నేయాసియా దేశాల్లో ముస్లిం రాడికల్స్ క్రియాశీలకంగా పనిచేయడాన్ని గమనించిన అశిన్ విరాతు మరికొంతమంది బౌద్ధ గురువులు తమ మతాన్ని, బౌద్ధ సన్యాసులను, తమ ప్రజలను కాపాడుకునేందుకు వీలుగా ‘ఆత్మరక్షణ’ చర్యలను ప్రోత్సహించారు. దాంతో మయన్మార్‌లో 2013 సంవత్సరం తరువాత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరస్పరం దాడులు పెరిగాయి. చాలా సందర్భాల్లో హింస చెలరేగింది. దగ్ధకాండ కొనసాగింది. అటూ ఇటూ మరణాలు జరిగాయి. చివరికిది అంతర్జాతీయ సమస్యగా మారింది. దాంతో అమెరికా టైమ్ పత్రిక ‘‘ది ఫేస్ ఆఫ్ బుద్ధిస్ట్ టెర్రర్’’ పేర ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. అశిన్ విరాతు క్లోజ్- అప్ ఫొటోపై ఆ అక్షరాలు అచ్చేసింది.
ముఖ్యంగా బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి రోహింగ్యా ముస్లింలు మయన్మార్‌లోకి అక్రమంగా ప్రవేశించి దేశ సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. బుద్ధిస్టు ప్రజలు అధికంగా ఉన్న ఆ దేశంలో తమ ఉనికిని కోల్పోయే ప్రమాదమున్నదని భావించి ఈ రకమైన హింసా ప్రవృత్తికి పాల్పడినట్టు బౌద్ధమత పెద్దల మాట. అయితే అందరూ ఈ దారిలో నడిచేందుకు సిద్ధంగా లేరు. మితవాదులూ ఉన్నారు. సంయమనం పాటించాలని ప్రబోధించే మత పెద్దలూ ఉన్నారు. కాని యువ బౌద్ధ సన్యాసులు మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బౌద్ధ మతస్తుల అమ్మాయిలపై అత్యాచారాలు జరపడం, వేధించడం, ముస్లిం యువకులను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయడం.. ఇట్లా అనేక విషయాలను భరించలేక బౌద్ధులు దాడులకు తెగబడ్డారు. వారికి వెన్నుదన్నుగా అశిన్ విరాతు నిలిచాడు, నాయకత్వం వహించాడు. మానవ హక్కుల ఉల్లంఘన మయన్మార్‌లో జరుగుతోందని ఆయన మీడియా ప్రతినిధులకిచ్చిన ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. తమను తాము జాతీయ వాదులుగా ప్రకటించుకున్నారు. అయితే ప్రత్యర్థులు మాత్రం బౌద్ధమత తీవ్రవాద సన్యాసులని ముద్రవేశారు.
‘969 ఉద్యమం’ పేరిట మయన్మార్‌లో బౌద్ధులు చాలా కాలంగా ఆందోళనలు జరుపుతున్నారు. తమకు సంక్రమించిన హక్కులను ఎవరు కాలరాయాలని చూసినా ఊరుకోలేమని ఎలుగెత్తి చాటుతున్నారు. వీరిలో అతివాద జాతీయ వాదులూ ఉన్నారు.
గతంలో మయన్మార్‌లో దాదాపు ఐదు దశాబ్దాలపాటు సైనిక పాలన కొనసాగిన సందర్భంలో బౌద్ధమత పెద్దలు వారిపై విశ్వాసాన్ని చూపలేదు. ఈ సమయంలోనే చాలామంది బౌద్ధసన్యాసులు జైలుపాలయ్యారు. కొందరు సంవత్సరాలపాటు జైలులోనే మగ్గారు.
ప్రజాస్వామిక వాది, సంస్కరణాభిలాషి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అంగ్‌సాన్ సూకీ 2015 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ‘నేషనల్ లీగ్’ తరఫున గెలిచి విజయఢంకా మోగించారు.
1948లో మయన్మార్ (బర్మా)కు బ్రిటీషు వారి నుంచి స్వాతంత్య్రం లభించింది. ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది. అయితే సైనిక తిరుగుబాటు కారణంగా సుదీర్ఘకాలం సైనిక నియంతృత్వ పాలన కొనసాగింది. స్వాతంత్య్రానికి పూర్వం జపాన్ చేతిలోనూ ఆ దేశం నలిగింది. ఇలా అక్కడ అశాంతి ఏదో రూపంలో కొనసాగుతూనే ఉండటం గమనార్హం. వర్తమానంలో అంగ్‌సాన్ సూకీ పాలన కొనసాగుతున్నప్పటికీ మతపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మయన్మార్‌ను ఇస్లామిక్ స్టేట్‌గా మార్చేస్తారేమోనన్న ఆందోళన బౌద్ధ మతాన్ని ఆచరించే వారిలో కనిపిస్తోంది. ముస్లింలు పాలకులను మచ్చిక చేసుకుని తమ కార్యక్రమాల్ని ఉద్ధృతం చేస్తారన్న భావన వారిలో బలంగా కనిపిస్తోంది. అందుకే బౌద్ధమత జెండాలతో ఊరేగింపులు, ప్రదర్శనలు జరిగాయి. ముస్లిం వ్యతిరేక నినాదాలు వినిపించాయి. ఆ విధంగా బౌద్ధ ఆరామాలు, శిక్షణ కేంద్రాలు, పగోడాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయాలుగా గాక రాజకీయ చర్చలకు కేంద్ర బిందువులయ్యాయన్న విమర్శ వినిపించింది. అయితే తమ ‘మార్గం’ నుంచి తాము పక్కకు జరగలేదని బౌద్ధ నియమాల ప్రకారమే ఆరామాలు, ఇతర కేంద్రాలు పనిచేస్తున్నాయని సీనియర్ బౌద్ధ సన్యాసులు అంటున్నారు. అలాగే ఎందరో ముస్లిం శరణార్థులకు ఆశ్రయం కల్పించామని చెబుతున్నారు. మొత్తం మీద మయన్మార్‌లో బౌద్ధులు ముఖ్యంగా యువ సన్యాసులు- ప్రజలు హింసామార్గం ఆత్మరక్షణకు అవసరమేనని చెబుతున్నారు.
భారత, చైనా ప్రజలు గణనీయంగా వున్న మయన్మార్‌లో మరో పార్శ్వమేమిటంటే.. చైనా సరిహద్దు ప్రాంతాల్లో పెద్దఎత్తున జూదశాలలు, వ్యభిచార గృహాలు పనిచేస్తున్నాయి. ఇదో సమస్యగా మారింది. చైనా కరెన్సీ ప్రవాహంలా పారుతోందక్కడ. చైనా సెల్ సిగ్నల్స్ మాత్రమే అక్కడ (సరిహద్దులో) వస్తాయి. వ్యాపారం ‘పచ్చి’గా కొనసాగుతోంది. అక్కడి వాతావరణం పూర్తి భిన్నంగా, వెలుగు జిలుగులతో కనిపిస్తోంది. బౌద్ధమత ఆనవాలు కలికానికైనా కానరావు. టిబెట్ రాజధాని ‘లాసా’లో ఎలాంటి వాతావరణముంటుందో అంతకన్నా రెండాకులు ఎక్కువే మయమ్మార్ సరిహద్దుల్లో దర్శనమిస్తోంది. చైనా సంస్కృతి దండిగా కనిపిస్తోంది. ఇదో విచిత్ర సన్నివేశం..
ఆ విధంగా ఓ వైపు రోహంగ్యాలు, స్థానిక ముస్లింలు, మరో వైపు చైనా వ్యాపార సంస్కృతి, జూదశాలల పెరుగుదల, మాదక ద్రవ్యాల వ్యాపారంపై పట్టుకోసం గ్యాంగులు పోటీ.. దాడులు.. అస్తవ్యస్త పరిస్థితులు చూస్తే ఇది నిజంగా ‘బుద్ధిస్టు’ దేశమా? అని ఎవరైనా విస్తుపోక తప్పదు.
బౌద్ధ ఆరామాలలో సాధారణ పూజలు, బాల సన్యాసుల పఠనం, మతపరమైన క్రతువులు, భిక్షాటనం అన్నీ యథాతథంగా కొనసాగుతున్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మైనార్టీ ముస్లింలు ఏ విధంగా ఎప్పుడు విరుచుకుపడతారో తెలియని స్థితి. దాంతో బౌద్ధులు అప్రమత్తులై ఉన్నారు. అవసరమైతే హింసామార్గం అనుసరించడానికి సిద్ధమంటున్నారు.

-వుప్పల నరసింహం 99857 81799