Others

వోటు రాజకీయంలో ఎంతకైనా తెగిస్తారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్‌డిఎను వీడారు. గత ఎన్నికల్లో ఆయన ఏపీలో అధికారంలోకి రావడానికి మోదీ సహకరించారు. ‘ప్రజల మనోభావాల’ పేర ఇపుడు ఆయన ఎన్‌డిఎకు ‘గుడ్ బై’ చెప్పారు. వైకాపా అధినేత జగన్ పాదయాత్ర చంద్రబాబుకు ముచ్చెమటలు పోయించింది. విభజన చట్టంలో ‘ప్రత్యేక హోదా’ ప్రస్తావన లేనప్పటికీ నాయకుల మాటలు, పార్టీల మేనిఫెస్టోల్ని ఉటంకిస్తూ ‘హోదా’ కోసం తెదేపా, వైకాపా పట్టుబడుతున్నాయి. మోదీ ప్రభుత్వం, భాజపా నేతలు ఆంధ్రను ఆదుకుంటామని అరచి గీపెడుతున్నా ప్రస్తుత పరిస్థితిలో అవి అరణ్య రోదనలే అవుతున్నాయి. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు భాజపా విశేష కృషి చేయాల్సివుంది. మీడియాను, ప్రజలను ఆకట్టుకోవడం, వొప్పించడం పెద్ద సవాలే. మళ్ళీ అధికారంలోకి రావాలంటే చంద్రబాబుకు మరో మార్గం తోచినట్టులేదు. చివరకు వైకాపా లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆయన ‘సై’ అన్నారు.
‘ప్యాకేజీ’ని మెచ్చుకున్న చంద్రబాబు కేంద్రంపై తిరగబడాలని నిర్ణయించడం ఆశ్చర్యకరం. మొదట మోదీ ఫోనులో కలవకపోయినా తరువాత రోజు మాట్లాడిన మోదీ మాట మన్నించి మంత్రులు, ఆర్థికవేత్తల బృందంతో ఢిల్లీవెళ్లి, సామరస్య పూర్వక వాతావరణంలో చర్చించుకుని నిధులు రాబట్టుకొనే ప్రయత్నం చేసి వుండవలసింది. మీడియా కూడా బిజెపి నేతల్ని ప్రశ్నిస్తున్నదే కాని చంద్రబాబును నిలదీయడం లేదు. లక్ష కి.మీ మేర రహదారుల నిర్మాణం, అనేక విశ్వవిద్యాలయాల ఏర్పాటు, 35వేల కోట్ల ఎల్‌ఇడి బల్బుల సహాయం, 24 గంటల విద్యుత్తును, అనేక ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, పోలవరం, రాజధాని నిర్మాణం వంటి అనేక విషయాల పట్ల కేంద్రం సహకరిస్తున్న తీరును ‘హక్కుగా’ భావించి రాజకీయం చేయడమే చంద్రబాబుకు తెలిసిన విద్య. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచి తమ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కూడా ఆయన తన హక్కుగా భావిస్తున్నారు. నిధులు తీసుకోవడమేకాని లెక్కలు చెప్పకపోవడం కూడా హక్కుగా భావిస్తున్నారు. కాగా, ఈ విషయంలో జైట్లీ వ్యవహార శైలిని కూడా తప్పుబట్టాల్సిందే. ప్రజల ప్రయోజనాల కంటే అధికారమే పరమావధి అవుతున్న నాయకుల శైలి ఆలోచనార్హమవుతున్నది. ఐదువేల కోట్ల వ్యయంతో అద్భుతమైన ‘నయా రాయపూర్’ను నిర్మించిన చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని చంద్రబాబు అనుసరించారు. ఇప్పటికే 3500 కోట్లు కేటాయించబడిన అమరావతిలో ఆరు బిల్డింగులు, రోడ్డు మాత్రమే దర్శనమిస్తున్నాయి. సింగపూర్ వరకూ రాజధాని కలను విస్తరింపజేసిన చంద్రబాబును ఆనాడే యలమంచిలి శివాజీ వంటి కార్యకర్తలు హెచ్చరించారు. కాని ఆయన తీరేవేరు. 40 ఏళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానం ఒక బహుళ ప్రయోజనం వైపు ఎంత దూరం వెళ్ళిందో చెప్పడం ప్రశ్నార్థకమవుతుంది. 30 ఏళ్ళ తరువాత కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడడం కొందరు నేతలకు రుచించడం లేదు.
దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు వార్తలకెక్కారు. ఎన్‌డిఎ కన్వీనర్ పదవి లేకపోవడం, అది తనకు దక్కకపోవడం ఆయనకు అవమానమైంది. పోలవరంలో 7 మండలాలు ఎపికి కలుపుకోవడంలో మోదీని అధిగమించి, ఆయన తన నిర్ణయం అమలుచేసుకొనగలిగారు. గత 3,4 ఏళ్ళుగా ఆయన కేంద్రంపై ఆధిపత్యం కోసం, ఎపికి ఏది జరిగినా తనవల్లనే జరిగిందన్న ప్రచారం కోసం చాలా తాపత్రయపడ్డారు. లోపాయికారిగా నిధుల నిర్వహణ, అవినీతి వంటి విషయాలు కూడా రచ్చకెక్కుతున్నవేళ మోదీతో బాబు బంధం బలహీనమైన వాస్తవం ప్రజలు తెలుసుకోవాల్సి వుంది. అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేకపోవడం కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధికి గండిపడింది. ఇపుడు మోదీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో టిడిపి మీద రాజకీయ యుద్ధం ప్రకటించే అవకాశం వుంది. మరోపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చంద్రబాబుకు మద్దతు పలుకుతూ ఆంధ్రకు ప్రత్యేకహోదా యివ్వాలంటున్నారు. చంద్రులిద్దరూ వొకటయ్యారు. ఐటి హబ్‌కు, హైద్రాబాద్‌లో ఐటి బలపడేందుకు చంద్రబాబే కారణమని ఆమధ్య కెటిఆర్ కితాబిచ్చారు కూడా. మోదీని వొకప్పుడు ఫాసిస్టు అన్న కెసీఆర్ మధ్యలో చల్లబడి ‘అవినీతి మరకలేని వ్యక్తి మోదీ’అంటూ ప్రశంసించారు.
మళ్ళీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన కేంద్రంపై సమరం మొదలెట్టారు. తాను సర్వే చేయించానని మళ్ళీ తమదే అధికారమని, రిజర్వేషన్ల విధానంపై కేంద్రం పెత్తనం సహించమని అంటున్నారు. ‘మార్పు’కోసం తాను ధర్డ్‌ఫ్రంట్ కడతానని కెసీఆర్ బీరాలు పలికారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం యిచ్చిన రూ.450కోట్లకు లెక్కలు చెప్పాలంటూ కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని అడగడమే యిందుకు కారణం అంటున్నారు. శాసనసభలో ప్లకార్డుల ప్రదర్శనను వ్యతిరేకించే కెసిఆర్, తమ ఎంపీలు మాత్రం పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శిస్తూ రిజర్వేషన్లపై చట్టసభలు నడవకుండా ఆందోళన చేస్తుంటే చోద్యం చూస్తున్నారు.
రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ ప్రజలకు ప్రత్యేక తెలంగాణ లభించిన ఆనందానికి ఇంకా నాలుగేళ్ళు పూర్తి కాలేదు. కేసీఆర్‌కు వొక్కసారిగా నాడు చంద్రబాబులా కేంద్రంలో ‘రింగు మాస్టారు’ కావాలనిపించింది. ఆయన ఫ్రంట్ కడ్తామంటున్నారు. ప్రధానిని సైతం ఏకవచన ప్రయోగం చేసి మాట్లాడారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. రజాకర్ల మూలం నుండి పుట్టిన మజ్లిస్‌కు దాసోహమంటున్నారు. కాకతీయ, భగీరధల వంటి మంచి పథకాల అమలుకు ఆయన సంకల్పం మరింత గట్టి చేసుకోవాల్సి వుంది. రాష్ట్ర జనాభాకు రెండు లక్షల కోట్ల అప్పులభారం తగిలించారు. మమతను కలుస్తానంటున్నారు. తన్ను నమ్ముకున్న తెలంగాణ ప్రజల ఆశల్ని వమ్ముచేయాలనుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కొత్త పరిశ్రమలు రావట్లేదు. ఫార్మా రంగం కోసం ‘ముచ్చెర్ల’ను ఏ రకంగానూ సిద్ధం చేయడం లేదు. ‘స్వచ్ఛ్భారత్’ కాలనీల్లో, బస్తీల్లో ఎప్పుడో పడకేసింది. తడి, పొడి చెత్తడబ్బాలు అందని బస్తీవాసులు ఎందరో వున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులిద్దరి సభ్యత్వాన్ని రద్దుచేసి తమ ప్రజాస్వామ్య విలువల్ని చాటుకున్నారు. కుంభకోణాల గురించి పత్రికలు రాస్తున్నా తీసుకున్న నిర్దిష్ట చర్యలు కన్పడట్లేదు. చివరకు బతుకమ్మ చీరలు పంపిణీ కూడా అభాసుపాలయింది. కుటుంబ పాలన నడుస్తోంది. విశ్వవిద్యాలయ విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు కెసిఆర్ పాలన పట్ల ఆక్రోశంతో వున్నారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా తెలంగాణా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది.
కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయమై లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ ఆమధ్య మాట్లాడుతూ, పాతికేళ్ల క్రితం పరిస్థితితో పోలిస్తే ఇపుడు ఫెడరల్ వ్యవస్థ బలపడిందని, కొన్ని కొరవలున్నా థర్డ్‌ఫ్రంట్ కట్టగానే అవి తీరవని అన్నారు. మోదీ కూడా 12 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా వున్నారు. ఆయన తమ హయాంలో ఏనాడూ నాటి యుపిఎ ప్రధాని చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు. తన పాలనాయంత్రాంగం సహకారంతో ఆ పని చక్కబెట్టేవారు. అధికారం సర్వసమస్యలకు పరిష్కారం కాదు. పదవులు నిలుపుకునేందుకు సిద్ధాంతాలు పక్కనబెట్టి ఎలాబడితే అలా కలిసిపోయి కలబడడం, గెలవడం- బలుపుకాదు, వాపు మాత్రమే. అధికారం అనే ఈ తరహా అంధకారం నుంచి నాయకులు బయటపడాలి. 2019 ఎన్నికల్లో మోదీ ఓడినా ఆయన ప్రతిపక్షంలో వుండి ప్రజల తరఫున పోరాడాల్సిందే. సదాసర్వదా అధికారంలో వుండడం చైనా కామ్రేడ్లకే చెల్లింది. చైనా దేశాధ్యక్షుడి రెండు విడతల పదవీ కాలంపై ఉన్న పరిమితిని ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది. మన దేశంలో ప్రజాస్వామ్యం గురించి ప్రసంగాలు చేసే కమ్యూనిస్టులు ఈ విషయమై కిక్కురుమనడం లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగల భారత్‌లో అధికారమే ఎపుడూ కేంద్ర బిందువుకాలేదు. అధికారం కోసం గడ్డికరవడం నేతల నీతి కాకూడదు. అన్నీ చట్టంలో వుండవు. విలువల చట్రంలోబడి నాయకులు వ్యవహరించాలి. అపుడే ప్రజలలో మన్నన, పాలనలో సంస్కరణ సాధ్యమవుతుంది.

- తాడేపల్లి హనుమత్ ప్రసాద్