Others

‘ఆమె అపహాస్యం’పై ఎందుకింత కవ్వింత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసులోని భావాలను వ్యక్తం చేయటానికి నవ్వు ఒక సాధనం. నవ్వడం నిజంగా ఒక కళ. ఒక మహిళ నవ్వు ‘పెద్దల సభ’లో ఈ మధ్య వెల్లివిరిసి, రాజకీయ సంచలనం కలిగించింది. రాజకీయ నాయకులు సమయానుకూలంగా హాస్యాన్ని జోడించి చేసే ప్రసంగాలకు పాలక, ప్రతిపక్షాలు కలసిమెలిసి హాయిగా నవ్వుకోవడం మనకు కొత్త కాదు. కానీ, రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా దేశప్రధాని సమాధాన ప్రసంగంపై పరోక్షంగా ఎద్దేవా చేయటానికి నవ్వును ఓ సాధనంగా ప్రయోగించడం బహుశా ఇదే ప్రథమంగా భావించవచ్చు. ప్రధాని మోదీ, సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఇద్దరూ సమయస్ఫూర్తి కలిగిన మేధావంతులు. నవ్వు ద్వారా ఆమె తన స్పందనను వ్యక్తపరిస్తే, పోటాపోటీగా రామాయణ పాత్ర ప్రస్తావనతో మోదీ దేశ ప్రజలను రక్తి కట్టించారు యుక్తివంతంగా.
ఆరోజు ప్రధాని ప్రసంగాన్ని సభ్యులందరూ సావధానంగా వింటున్నారు. సహజంగా లొసుగులు, రంధ్రానే్వషణల కోసం ప్రతిపక్ష సభ్యులు ఎంతో శ్రద్ధగా వింటారు. ప్రధాని అధికార పార్టీ సాధిస్తున్న ఘన విజయాలను ఏకరవు పెట్టడం పాలకపక్ష సభ్యులకు సహజంగానే హర్షదాయకం. అందరూ నిశ్శబ్దంగా వుండగా- ఒక అట్టహాసం పెల్లుబుకటంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఆ నవ్వులో ‘వ్యంగ్యోక్తి’ ధ్వనింప చేయటంలో రేణుకా చౌదరి ప్రతిపక్ష సభ్యురాలిగా కృతకృత్యులయ్యారు. ఆధార్ కార్డుల ప్రయోజన వివరణాంశంలో- వాజపేయి హయాంలో అందుకు బీజం పడిందనే అధికార పక్షం ప్రశంస ఆమెకు అతివాగాడంబరంగా అనిపించి బిగ్గరగా నవ్వడం- ఆ తర్వాత అది ఒక వెకిలి చేష్టగా ఎవరు నిందించినా పట్టించుకొనే వ్యక్తిత్వం కాదు ఆమెది. సభ మొత్తం అటువైపే చూసింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఒక్క నిమిషం ప్రసంగాన్ని ఆపవలసినదిగా ప్రధానికి సూచించి, ‘అలాంటి ప్రవర్తన మీకు సరికాద’ని అర్థం వచ్చేటట్టు ఆమెను మందలించారు. ఆ సందర్భంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకొని, రామాయణం సీరియల్ తరువాత అటువంటి నవ్వు వినే భాగ్యం మనకు ఈరోజే దక్కిందని ‘కౌంటర్’ ఇచ్చారు. రామాయణ కథాకావ్యంలో సుమధుర సుస్మిత మందహాస వికటాట్టహాసికాలున్నాయి. రేణుకా చౌదరి నవ్వు- మోదీకి ఏ సందర్భంలోని ఏ పాత్రను గుర్తు చేసిందన్నది చర్చనీయాంశమైంది. సహజంగా ఆ టెలీ సీరియల్‌లో తాటకి, శూర్పణఖ వంటి రాక్షస మహిళలు వికటాట్టహాసాలున్నాయి కూడా. రేణుక రామాయణంలో ఎవరు?- మోదీ దృష్టిలో.
భారత ప్రజాస్వామ్యంలో పాలకవర్గానికి, ప్రతిపక్ష పార్టీలకు విధులు వేరైనా సామాన్య జనావళి పట్ల జవాబుదారీ బాధ్యత వుంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అన్ని రాజకీయ పార్టీలు అధికారం చేజిక్కిందుకోవటమే పరమావధిగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ సిద్ధాంతాలు కనుమరుగవడంతో కేవలం పదవులు సాధించేకొనే వేటలో రాజకీయవేత్తలు నిమగ్నం అవుతున్నారు. అధికారం ఎలాగైనా కొనసాగించి అత్యధికంగా సీట్లు సంపాదించే సంఖ్యాబలం కోసం తాపత్రయం, మార్గాల అనే్వషణ లక్ష్యమైంది. అధికారం ఎలాగైనా నిలబెట్టుకోవాలనే తపన- సింహాసనం అధిష్ఠించిన మరుక్షణం నుంచే ప్రారంభమవుతుంది. జనం విశ్వసించి ఓట్లు వేసి గెలిపించినా, ప్రతిపక్ష నేతలు తమ బాధ్యతను త్రోసిరాజని అధికారం వైపు అర్రులు చాస్తుంటారు. అనైతికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, ‘ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్య పాలన’ వైపు అధికార పార్టీలు పరుగులు తీస్తున్నాయి. అధికారం చేజిక్కించుకొన్న పార్టీలు, మళ్లీ రానున్న ఎన్నికల సంవత్సరం తప్ప మరో లక్ష్యం లేని దిశలో ఎటువంటి అనైతికతకైనా తెగిస్తున్నారు. తొలితరం పార్లమెంటునేతలు ఏ పార్టీ వారైనా నిర్మొహమాటంగా విమర్శించేవారు. మంచిని ప్రశంసించేవారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం తపించేవారు. ప్రతిపక్షం మళ్లీ తల ఎత్తకుండా అణచివేయటమే లక్ష్యంగా ఇప్పటి అధికార పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు. అందుకే శ్రుతి మించిన నిందారోపణలు. సీనియర్ ఎంపీగా రేణుకా చౌదరి ప్రధాని మోదీ ప్రసంగంపై ఆ క్షణంలో స్పందించిన తీరు గర్హనీయం కావచ్చు. రాజ్యసభ చైర్మన్‌గా ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు ఎంతో సమయోచితంగా ఆమెను తప్పుపట్టి చురక వేశారు. ప్రధానమంత్రిగా మోదీ కేవలం ఆమె అపహాస్య ప్రవర్తనపై రామయణం టీవీ సీరియల్ పాత్రల ప్రస్తావనలోకి వెళ్లి ఆమె ఎవరిలా ప్రవర్తించారో సూచించవలసిన అగత్యం వుందా?

- జయసూర్య సెల్: 94406 64610