క్రైమ్/లీగల్

ఉపాధి కూలీ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్దిరాల, ఏప్రిల్ 5: ఉపాధి కూలీ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన నూతనకల్ మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు శుక్రవారం చోటుచేసుకుంది. నూతనకల్ మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన కట్టా మల్లయ్య తన తల్లి సూరమ్మకు ఉపాధి పని ఇవ్వాలని మూడురోజుల క్రితం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ చెవుల అరుణను అడుగగా ఆమె అతన్ని చెప్పుతో కొట్టిందని ఆరోపిస్తూ ఆదేరోజు ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. అయిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్థాపానికి గురైన మల్లయ్య గురువారం ఎంపీడీవో కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నాకి పాల్పడగా గమనించిన వారు వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకొని ఆగ్రహించిన గ్రామస్తులు ఘటనకు కారణమైన ఫీల్డ్ అసిస్టెంట్‌ను సస్పండ్ చేయాలని నూతనకల్‌లోని సూర్యాపేట- దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో చేశారు.

డీసీఎం బోల్తా.. వ్యక్తి మృతి
ఆత్మకూర్(యం), ఏప్రిల్ 5: మం డల కేంద్రంలో డీసీయం బోల్తా పడిన సంఘటనలో వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మోత్కూర్ నుంచి బొమ్మలరామారం వెళ్తున్న డీసీఎం..డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న బొమ్మలరామారం మండలం రామునితండాకు చెందిన వాహన యజమాని ఇంద్రావత్ పాండు(36) అక్కడికక్కడే మృతి చెందాడు. అదే విధంగా కేకే తండాకు చెందిన లావ్య స్వామికి తీవ్ర గాయాలు కావడంతో 108 సహాయంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. డీసీఎంలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుజరుపుతున్నట్లు ఎస్‌ఐ కె.యాదగిరి తెలిపారు.

యువకుడి ప్రాణం తీసిన ఫ్లెక్సీ కర్రలు
మిర్యాలగూడ టౌన్, ఏప్రిల్ 5: మిర్యాలగూడ పట్టణం హనుమాన్‌పేట వద్ద బుధవారం రాత్రి సుమారు 11 గంటలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే కర్రలున్న ఆటోను మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న బీ.వేణు (22) అనే యువకుడు ఢీ కొనడంతో తీవ్ర గాయాలకు గురై అనంతరం మరణించారు. పట్టణానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డిలు రాక సందర్భంగా టీఆర్‌ఏస్ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా హనుమాన్‌పేట వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు ఆటోను నిలిపి ఉంచారు. మిర్యాలగూడ మండలం చింతపల్లికి చెందిన వేణు బైక్ పై వస్తుండగా చీకటిలో ఆటోరిక్షాలో ఉంచిన కర్రలను గమనించలేదు. ఆటోలో ఉన్న కర్ర కడుపులోకి వెళ్లడంతో తీవ్ర గాయాలకు గురయ్యారు. వెంటనే హైద్రాబాద్ కామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మహిళ గొంతుకోసి దారుణహత్య
కోదాడ, ఏప్రిల్ 5: కోదాడ పట్టణ శివారు బాలాజీనగర్‌లో పట్టపగలే మహిళ దారుణహత్యకు గురైంది. కుటుంబసభ్యులు అందరూ శుభకార్యానికి వెళ్ళగా మహిళ ఒక్కరే ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో బ్లేడ్‌తో గొంతుకోసి ఆమె మెడలో వున్న సుమారు ఐదు తులాల బంగారుగొలుసును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకొనిపోయారు. పోలీసులు, కుటుంబసభ్యులు చెప్పిన వివరాలమేరకు బాలాజీనగర్‌కు చెందిన బర్మావత్ లక్ష్మిబాయి (45) ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బ్లేడ్‌తో గొంతుకోసి ఆమె మెడలోని ఐదు తులాల బంగారు గొలుసును అపహరించుకొనిపోయారు. కుటుంబసభ్యులు అందరూ బంధువులు ఫంక్షన్‌కు వెళ్లడంతో లక్ష్మిబాయి ఒక్కరే ఇంట్లో వున్నారు. ఫంక్షన్ పూర్తి అయిన తరువాత మధ్యాహ్నం ఇంటికి చేరుకొన్న భర్త సీతారాంసింగ్, కొడుకు సునీల్‌లు రక్తపుమడుగులో పడివున్న లక్ష్మిభాయిని చూసి వెంటనే పట్టణంలోని హాస్పిటల్‌కు తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. కోదాడ డియస్‌పి సుదర్శన్‌రెడ్డి, పట్టణ ఇన్సిపెక్టర్ శ్రీనివాసరెడ్డి సంఘటనాస్ధలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో బాలాజీనగర్‌లో ఇల్లు అద్దెకు కావాలని వచ్చి వృద్ధమహిళను రోకలిబండతో కొట్టి చంపి ఆమె వద్దవున్న బంగారునగలను ఎత్తుకెళ్లిన సంఘటన చోటుచేసుకొంది. వంటరి మహిళలను హత్య చేసి బంగారునగలను దోచుకెళుతున్న ఉదంతాలతో బాలాజీనగర్‌వాసులు భయాందోళనలకు గురైతున్నారు.