మీ వ్యూస్

ప్రేమమ్ స్వర్ణమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమమ్’ చిత్రం ప్రేమికులకు ఆనందం కల్గిస్తుంది. ఈ చిత్రంలో లెక్చరర్ పాత్రలో శృతిహాసన్ చూస్తుంటే ప్రేమ నిజంగా స్వర్ణమయంగా కనబడ్తుంది ఆ పాత్రలో. ఈ చిత్రంలో నాగచైతన్య ఆరితేరిన నటుడుగా విక్రమ్ పాత్రలో లీనం అయ్యాడు. అనుపమ పరమేశ్వరన్ నటన క్లాస్‌గా చాలా బావుంది. ఈ చిత్రంలో ఒకే ఒక్క డైలాగ్ మనసును గాయపరుస్తుంది. అదేంటంటే ‘కొందరు మన జీవితంలో ఉండరుకానీ హృదయంలో ఎప్పటికీ ఉంటారు’ అన్న డైలాగ్ మన ప్రేమను గుండెలో బంధించుకొని ప్రియురాలు తలపులతోనే జీవించాలనేదే ఈ డైలాగ్. చిన్నప్పటి ప్రేమలు ప్రతి ఒక్కరికీ గుర్తుకుతెస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున, వెంకటేశ్‌లు తళుక్కున మెరిసిపోతారు చిత్రం మొత్తం శృతిహాసన్ నటించిన లెక్చరర్ పాత్ర ప్రేమమ్‌కు ఆధారం.
- కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి
‘అతి’ ప్రచారం..!
‘కుడి ఎడమైతే పొరపాటే!’ సుదీర్ఘ వ్యాసం ఆద్యంతం ఆసక్తికరంగా అర్ధవంతంగా సాగింది. విషయానికి మించి ప్రచారం చేసుకుంటే మొదటికే మోసం ఖాయమన్న వాస్తవం తేటతెల్లం చేయడం బాగుంది. అయినా, ఎన్ని అర్థవంతమైన విషయాలు చెప్పినా, మన నిర్మాతలు అనర్థాలవైపు అట్రాక్ట్ అవుతారనడంలో సందేహం లేదు. స్వర్ణయుగంలోని హాస్య జంటలలో ఒకటైన రాజబాబు, రమాప్రభల అరుదైన జంటను అద్భుతమైన ఛాయాచిత్రం ద్వారా చూడగలిగే అవకాశాన్ని కల్పించిన శరత్కాలం శీర్షికకు ధన్యవాదాలు.
-ఎ వేణుగోపాల్, నెల్లూరు
భలే కొత్తమాట!
వెనె్నలలో -కొత్తమాటగా ‘కోట్లోత్సవం’ సృష్టించడం బావుంది. వ్యాసంలో చెప్పినట్టు కొత్త చిత్రాలు ఎప్పుడూ ఫాస్ట్ఫుడ్ లాంటివే. ఈరోజుల్లో పెద్ద చిత్రాల్లో ఏది ఎక్కువ థియేటర్లు సాధించగలదో అదే హిట్. పెద్ద చిత్రాలు రెండూ ఒకే రోజు విడుదలచేస్తే అది ఆత్మహత్య సదృశమే. అలాంటి సాహసం నిర్మాతలు చేయరని ఆశిద్దాం.
-చంపక్, మాధవనగర్
కైకాలను మర్చిపోయామా?
నవరసాలు పోషించిన మహానటులు ఎన్టీఆర్, ఎస్‌విఆర్‌ల తరువాత ఆ స్థాయి నటన అందిపుచ్చుకున్న కైకాల సత్యనారాయణని నేడు చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం కూడా విస్మరించింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి పురస్కారాలుగాని అవార్డులుగాని వరించకపోవడం విచారకరం. విలన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా, సాంఘిక, జానపద, పౌరాణిక, కౌబాయ్ తరహా పాత్రల్లో సత్యనారాయణ నటించారు అనేకన్నా జీవించారు అనడం వాస్తవం. అటువంటి విశిష్టతగల సత్యనారాయణని గౌరవించాల్సిన విషయాన్ని చిత్ర పరిశ్రమ గుర్తించాలి.
-వేదుల జనార్ధనరావు, వంకావారిగూడెం
మనసును గెలిచినా...
కొన్ని అజరామరమైన చిత్రాలు ప్రేక్షకాదరణను ఎందుకు పొందలేకపోతున్నాయో చిత్రంగా ఉంటుంది కదూ! ఉదాహరణకు మనసే మందిరం, ఇందులోని నటీనటులు ఉద్ధండ పిండాలని ప్రత్యేకంగా ఉదహరించనక్కర్లేదు. అక్కినేని, సావిత్రి, జగ్గయ్యల కాంబినేషన్ ఎలాంటి పాత్రలలోనైనా ఇమిడిపోయి అద్భుత క్రియేటివిటీని సృష్టించగలరు. అందుకు ఎన్నో సాక్ష్యాలున్నాయి. అక్కినేని పాత్ర మరణం కారణం అనుకుందామా? అంటే అది మదిలో అతికే అతి సున్నిత సహజ సన్నివేశం. పోనీ తెరవెనుకవారు వారి రంగాలలో సిద్ధహస్తులు కాదనుకుందామా అంటే అదీకాదు. కారణం దొరకని కారణమనుకుంటూ ప్రేక్షక మనస్తత్వాలని సరిపెట్టుకోవాలి. ఆర్థిక విజయం సాధించకపోయినా చిత్రం అజరామరమే. ఫ్లాష్‌బ్యాక్ విశే్లషణ బావుంది.
-ఎన్ రామలక్ష్మి, సికిందరాబాద్
ఆప్టే మాటకు అర్థముందా?
పాక్ కళాకారుల్ని దేశంనుంచి వెళ్లగొట్టాలన్న డిమాండ్‌పై బాలీవుడ్ ప్రతిస్పందనలు కొన్ని విచిత్రంగా ఉన్నాయి. దేశంలోకి స్విస్‌వాచీలు, వాటి స్టోర్స్ వస్తున్నప్పుడు పాక్ కళాకారులు వస్తే తప్పేంటి? అని ప్రశ్నించిన రాధికా ఆప్టేకి అసలు ఇంగితం, అవగాహనా ఉన్నాయా? అనిపిస్తోంది. స్విస్ వాచీలు మనుషుల్ని చంపే బాంబులు కాదు. స్విస్ ప్రభుత్వం పాక్‌లాగ ఉగ్రవాదం ఎగుమతి చేయడంలేదు. దేశ భాగాన్ని కబళించాలనుకోవడం లేదు. నక్కజిత్తుల పాక్‌పట్ల బహు జాగ్రత్త వహించాలి. ఉరీ ఘటనపై నిరసన వ్యక్తం చేయడానికి నిరాకరిస్తున్న పాక్ కళాకారులకు రెడ్ కార్పెట్ ఆహ్వానం ఎందుకు? ఆపాటి కళాకారులు మన దేశంలో లేరా?
-సుభాష్, శ్రీనగర్
రామాయణమా?
ఓ ఆతృత కథానాయకుడు ఒక రాత్రికి భార్య కాకుండా వేరే స్ర్తితో సౌఖ్యం పొందాలని అనుకునే కథనంతో రూపొందించిన సినిమా రామాయణం ఎలా అవుతుంది? రామాయణం అన్న పేరుకే మచ్చతెచ్చేలా ఈ సినిమా కథనం సాగింది. రామాయణమంటే పవిత్రమైనది. ఇందులో అంతా అపవిత్రమైన వావి వరసల ముచ్చటే కనిపించింది. అసలు రామాయణం అన్న పేరును ఈ సినిమాకు పెట్టాలని ఎలా అనిపించిందో ఏమో? సినిమా చూసి చాలా బాధపడ్డాం.
- వి.రాఘవరావు, చిన్నగంజాం
హీరోయిజం
ఏ కథ ముఖ్యమైన పాత్ర చుట్టూ తిరుగుతుందో, ప్రధాన సమస్యమీద పోరాటం చేస్తుందో అదే హీరో పాత్ర. అంటే నాయకుడన్నమాట. బక్కపలచని మహాత్మాగాంధీ భారత్‌కు హీరో కాలేదా? సినిమా వేరు, జీవితం వేరు కాదు. సామాజిక సమస్యలే కథలు కావాలి. వాటిని తెరకెక్కించే నేర్పు, ఓర్పు ఉంటే హీరో వికలాంగుడైనా విజయం తథ్యవౌతుంది. ఎన్టీఆర్ నటించిన కలసి ఉంటే కలదు సుఖంలో హీరో పాత్ర అలాంటిదే. ఆరాధనలో ఎఎన్‌ఆర్ చూపులేనివాడు. ఇవి అఖండ విజయం సాధించలేదా? ఇప్పుడు మన హీరోలు పర్సనాలిటీ ఎలా వున్నా, ఎద్దుల్లాంటి విలన్ల సమూహాల్ని ఒంటి చేత్తో చితకబాదేస్తారు. అసహజం అయినా ప్రేక్షకుడు తాత్కాలిక ఆనందం పొందుతున్నాడే తప్ప హృదయంతో ఆస్వాదించడు. సాధ్యాసాధ్యాలు గమనించని దర్శకులు ఇలాంటి చిత్రాలను తీసి ఎంతమంది చెవులల్లో పూలు పెడతారో ఏంటో?
- ఎన్.ప్రకాశరావు, సికిందరాబాద్