మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనస్సును పట్టి తిన్నగా నిలిపియుంచునంత కాలము సన్మార్గమున చక్కగనే నడచును, ప్రయోజనకారిగనే యుండును. కాని నీ జాగరూకత రవంత కొఱవడినంతనే అది సన్మార్గము వీడి పెడత్రోవనుబట్టును.
580. ‘‘ఇత్తడి చెంబు అనుదినము తోముచుండని యెడల చిలుము పట్టి కగ్గిపోవును. అట్లే అనుదినము దైవధ్యానముచేయని యెడల వరుని హృదయము మలినమగును’’అని శ్రీతోతావురి వచించువాడు. శ్రీగురుదేవుడొకప్పుడందులకిట్లు సమాధానమొసగెను. ‘‘చెంబు బంగారుదైనయెడల ప్రతిదినము తోముట అనావశ్యకము.’’ బ్రహ్మసాక్షాత్కారము పొందిన వానికిక ప్రార్థనములతో నిమిత్తము లేదు.
సాధనావశ్యకత
581. లోతులేని చెఱువునుండి శుభ్రమైన నీటిని గైకొని త్రాగవలయుననిన, నీటిని కలపకుండ, జాగ్రత్తగా, మెల్లగా, పైభాగమునుండి గైకొనవలయును. కలచినయెడల అడుగుననున్న బురద పైకివచ్చి నీటినంతయు మలినము చేయును. నీవు పరిశుద్ధుడవుకాదలచెదవేని నీ శక్తి సామర్థ్యములను నిరుపయోగమైన చర్చలందును వాగ్వాదములందును వ్యర్థముచేసికొనక, దృఢ విశ్వాసముతో క్రమముగా సాధనలను సాగింపుము. లేని పక్షమున నీయల్పబుద్ధి కలవరపడును.
582. (కలకత్తాలోని కోటీశ్వరుడగు) యదునాథ మల్లికుని వంటి శ్రీమంతుని సిరిసంపదలను గూర్చియు భవనములను గూర్చియు భోగట్టా చేయువారనేకులుందురు. కాని స్వయముగా ఆతని దర్శనముచేసి పరిచయము సంపాదించువారే కొలదిమందియోయుందురు. అటులనే ధర్మశాస్తమ్రులను జరుపువారును మతధర్మములనుగూర్చి ప్రసంగించువారును అనేకులుందురు, కాని భగవద్దర్శనము గోరియందులకై కష్టించి సాధనలు చేయువారరుదు.
583. కార్యసిద్ధికి తగిన మార్గము అవలంబింపుము. ‘‘పాలలో వెన్న కలదు’’ అని గొంతు బొంగురుపోవునట్లు నీవు ఎంత యఱచినను వెన్న చిక్కదు. నీకు వెన్న కావలసిన యెడల పాలను తోడుపెట్టి పెరుగు చేయవలయును, పిమ్మట దానిని చిలుకవలయును. అప్పుడు నీకు వెన్న లభించును.
అటులనే దేవుడు నీకు ప్రత్యక్షము కావలయునని కోరుదువేని శ్రద్ధ్భాక్తులతో సాధన చేయుము. అంతియేకాని ఊరక, ‘‘ఓ దేవుడా! దేవుడా!’’యని యఱచిననేమి ప్రయోజనము?
584. నగరులోనికి పోయి రాజదర్శనము చేయగోరువాడు అచటికి వెడలి ద్వారములన్నిటిని దాటవలయును. అటులగాక వెలుపలి కోటగుమ్మము దాటగనే, ‘‘రాజుగారెక్కడ?’’అని యడిగినయెడల వానికి రాజుగారు కానరారు. సప్తద్వారములను దాటిననే కాని రాజును దర్శింపజాలడు.
585. సాక్షాత్కారము వలయుననిన, సాధన చేసి తీరవలయును, ఒకనాడు నేను భావసమాధి స్థితిలోనుండగా హలధర పుష్కరమున ఒక దృశ్యమును గంటిని. ఒక పల్లెటూరివాడు నీటిమీది నానుచు తొలగించి నీటిని పుడిసిట బట్టి మఱలమఱల పరీక్షించుచుండెను. నాచును తొలగింపనిదే నీరు బాగుగా కానబడని చందమున కష్టించి సాధనలు సాగింపనిదే భగవంతునియందు నిర్మల భక్తియు వాని సాక్షాత్కారమును గలుగనేరనని తెలుపుటకో యనునటుల జగజ్జనని యాదృశ్యమును జూపెను. ధ్యానము, నామస్మరణము, సంకీర్తనము, ప్రార్థన, దానధర్మయజ్ఞ యాగాచరణము మొదలగు సత్కార్యములు భగవత్ప్రాప్తిని గలుగజేయును.
586. శ్రీకృష్ణుడు సైతము రాధాయంత్రార్చనకు సంబంధించిన మహాసాధనల ననేకము చేసెను. బ్రహ్మయోని (బ్రహ్మముయొక్క సృజనశక్తి) యే రుూ యంత్రము. దానిని గూర్చిన ధ్యానార్చనలే (శ్రీకృష్ణుడు సాగించిన) సాధనలు. అనంతమైన బ్రహ్మాండములు ఈ బ్రహ్మయోనినుండి ప్రభవించుచున్నవి!

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి