ఈ వారం స్పెషల్

కేన్సర్‌పై పోరాటం ... ఆత్మవిశ్వాసమే ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం సాధించగలమా? అంటే ఔననే అన్నారు వారంతా..
నువ్వు సాధించగలవా? అన్నా ఔననే అన్నారు వారంతా..
ఇంతకీ వారు ఎవరు? ఏం సాధించారు? అదే కథ..
విజయగాథ..
వారు సాధించినది ‘కేన్సర్’పై విజయం..
వారు లక్షలాదిమందికి స్ఫూర్తి ప్రదాతలు..
‘వియ్ కెన్, ఐ కెన్’ నినాద స్ఫూర్తికి జీవం పోసినవారు..
కేన్సర్‌తో బాధపడుతున్నవారి ఆశలకు ‘ప్రాణం’పోసినవారు..
***
కేన్సర్.. చంపేస్తుందా?
అదేం లేదు.. దానిని చంపేసి
మనం బతికేయొచ్చు అంటున్నారు వీరంతా..
నమ్మరా.. అందుకు మేమే ఉదాహరణ అంటున్నారు వారిలో మరికొందరు.. ఔను ఇది నిజం..
ఆత్మవిశ్వాసం, ధైర్యం, వైద్యం కలగలిస్తే కేన్సర్‌ను ఓడించడం కష్టం కాదంటున్నారు వారు. మరణం అంచులదాకా వెళ్లి మృత్యువుతో ధైర్యంగా పోరాడి జీవనకాలాన్ని దిగ్విజయంగా పెంచుకున్న వీళ్లంతా మిగతా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు..
ఓ ఏంజిలోనా జోలీ
ఓ యువరాజ్ సింగ్..
ఓ మనీషా కొయిరాలా..
ఓ గౌతమి.. ఓ గిరీష్ ఆర్ గౌడ..
ఒక్కొక్కరిది ఒక చరిత్ర.. ఓ స్ఫూర్తిమంత్రం.. ఓ విజయగాథ..
ప్రపంచంలో కేన్సర్‌వల్ల మరణిస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువే. అయితే ఒకప్పుడు దానిబారిన పడి బతికినవారి సంఖ్య స్వల్పం. కానీ ఇప్పుడు అలాంటివారి సంఖ్య పెరుగుతోంది. నిజానికి ప్రమాదకరమైన స్థితిలో కేన్సర్‌ను గుర్తించి.. కేవలం ఆత్మవిశ్వాసం, ఆధునిక వైద్యం సహాయంతో దానితో యుద్ధం చేసి విజేతలైనవారు వీరంతా. ఒక్కమాటలో చెప్పాలంటే ‘మరణాన్ని’ అంతదూరం నెట్టేసిన వీరులు వీరంతా..
అయితే ఇప్పుడు వీరి ప్రస్తావన ఎందుకొచ్చింది. కేన్సర్‌వల్ల ప్రపంచంలో ఏటా 88 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2030 నాటికి కేన్సర్ మరణాలను బాగా తగ్గించాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యం సాధించాలంటే కేన్సర్‌పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యం, దానిని ఎదుర్కొనేలా స్ఫూర్తినివ్వడం ముఖ్యం. సమాజాన్ని అందుకు సిద్ధం చేయడం కోసం ఐక్యరాజ్య సమితి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన కేన్సర్ అవగాహనా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ‘యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కేన్సర్ కంట్రోల్’ (యూఐసీసీ) సంస్థ సూచన మేరకు 1933లో స్విట్జర్లాండోలని జెనీవాలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుని ఏటా ఫిబ్రవరి 4వ తేదీని ‘వరల్డ్ కేన్సర్ డే’ పాటించడం మొటలుపెట్టారు. యూఐసీసీతో ప్రసిద్ధిగాంచిన కేన్సర్ సొసైటీలు, సంస్థలు, వైద్యసంస్థలు, పరిశోధనా సంస్థలు, చికిత్సాకేంద్రాలు, స్వచ్చంద సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటివి 1069, 166 దేశాలు ‘వరల్డ్ కేన్సర్ డే’ను నిర్వహిస్తున్నాయి. సకాలంలో కేన్సర్‌ను గుర్తిస్తే నివారించడం, జీవనకాలాన్ని పెంచుకోవడం సాధ్యమేనన్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పడం ఈ దినోత్సవ లక్ష్యం. ఆధునిక చికిత్స విధానాలు, పరిశోథనల ఫలితాలు, జాగ్రత్తలు, వైద్య సౌకర్యాలపై వారికి అవాగహన కలిగించే ప్రయత్నం ఇది. ప్రతీ ఏడాది ఒక ‘నినాదాన్ని’ ఎంపిక చేసి చైతన్య కార్యక్రమాలు, ర్యాలీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తారు. అయితే గడచిన మూడేళ్లుగా ‘వియ్ కెన్, ఐ కెన్’ నినాదానే్న ఎంచుకుని అమలు చేశారు. ఆ నినాదం వినిపిస్తున్న మూడో సంవత్సరం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో దీపాలు వెలిగిస్తారు. అలా ఎంపికైన ప్రాంతాల్లో మనదేశంలోని ముంబయి రైల్వేస్టేషన్ ఒకటి.

మూఢనమ్మకాల దశ నుంచి..
పూర్వజన్మలో చేసుకున్న పాపంవల్ల ‘కేన్సర్’ వస్తుందన్నది కొందరి మూఢనమ్మకం. కేవలం సంపన్నులకే ఆ రోగం వస్తుందని మరికొందరి అపోహ. ఇవన్నీ పాతరోజుల నమ్మకాలు. నిజానికి ఇవన్నీ నిజం కాదు. ఒకరకంగా పేదదేశాలు, పేదవర్గాలవారే ఎక్కువగా ‘కేన్సర్’ బారిన పడి మరణిస్తున్నారు. కనీస సదుపాయాలు, పౌష్టికాహారం, వైద్యసదుపాయం లేక, ఖరీదైన ఔషధాలు కొనుగోలు చేయలేక, కేన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించలేక ఈ వర్గంలో ఎక్కువమంది మరణిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని, 2030 నాటికి కేన్సర్ మరణాలను సగానికి సగం తగ్గించాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఏటా 90 లక్షలమంది మరణిస్తూంటే వారిలో 44 లక్షలమంది ప్రీమెచ్యూర్ మరణాలే. గడచిన పదేళ్ల గణాంకాల ప్రకారం ఈ విషయం తేలింది. పేదరికం తాండవిస్తున్న ఆఫ్రికాలోను, ఆ తరువాత ఆసియాలోను ‘కేన్సర్’ ఎక్కువగా ప్రాణాలు తీస్తోంది. ఒకప్పుడు అమెరికాలో తీవ్రస్థాయిలో ‘కేన్సర్’ మరణాలు సంభవిస్తే గడచిన రెండు దశాబ్దాలలో దాదాపు 25 శాతం మేరకు తగ్గాయి. అంటే అక్కడ చేపట్టిన కేన్సర్ అవగాహన చర్యలు, చైతన్య కార్యక్రమాలు ఫలితాలన్నిచ్చాయన్నమాట. ఇక మిగతా ప్రపంచంలో ఎందుకు సాధించలేం. అదే విశ్వాసంతో అడుగువేయాలి. ఆ బలమైన అడుగుకు కావలసిన శక్తిని ఇచ్చేవారు ఎందరో ఉన్నారు.
రోజులు మారాయి..
మూఢ నమ్మకాలకు ఇప్పుడు కాలం చెల్లింది. అక్షరాస్యత పెరగడం వల్ల ఇది సాధ్యమవుతోంది. వైద్య, చికిత్స రంగంలో వచ్చిన మార్పులు కేన్సర్ రోగులకు వరంగా మారాయి. తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచంలో ఏటా 1.27 కోట్లమందికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించగలుగుతున్నారు. అయితే వీరిలో 80 లక్షలకు పైగా దానివల్ల మరణిస్తున్నారని అంచనా. అయితే ప్రజల్లో చైతన్యం వస్తే ఈ మరణాలను బాగా తగ్గించవచ్చన్నది అనుభవం చెప్పిన పాఠం. బలమైన ఆహారం, శరీరానికి తగినంత క్రమబద్ధమైన వ్యాయామం వంటి చిన్నచిన్న విషయాలు ఎంతో మేలైన ప్రభావాన్ని చూపిస్తాయన్నది తొలి సూచన. తాజా లెక్కల ప్రకారం కేన్సర్‌లలో 95 శాతం పొగాకు లేదా దాని ఉత్పత్తుల వల్ల వస్తున్నాయి. తక్కువ, మధ్యతరగతి ఆదాయవర్గాల వారికే ఎక్కువగా కేన్సర్ వస్తోంది. అయితే పూర్వంతో పోలిస్తే నిర్ధారణ, చికిత్స విషయంలో ఎంతో పురోగతి సాధించాం. వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే దాదాపు ప్రాణాపాయం తప్పేలా వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాధి నిర్ధారణ విషయంలో విప్లవాత్మక అభివృద్ధి కనిపిస్తోంది. తాజాగా ఒకేఒక సాధారణ రక్త పరీక్షతో ఏడు రకాల కేన్సర్‌లను గుర్తించే వెసులుబాటు త్వరలో రాబోతోంది. ఇది అందుబాటులోకి వస్తే లక్షలాది మందికి మేలు జరుగుతుంది. తొలిదశలో వ్యాధిని నిర్ధారించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్లినికల్ పరిశోధనల్లో తేలిన ఈ పరిశోధన ఫలితాలపై కొన్ని వివరాలను ఈ ఏడాది జనవరి 18న సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. 1000మందికి జరిపిన తొలిదశ పరీక్షల్లో 70 శాతం మేరకు కేన్సర్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ పరీక్షను ‘లిక్విడ్ బయాప్సీ’ అని పిలుస్తున్నారు. ఓవరిన్, ఉదరం, కాలేయం, పాంక్రియాటిస్, కొలెరైకాల్, లంగ్, బ్రెస్ట్‌వంటి కేన్సర్‌లను ఈ పరీక్ష ద్వారా ఇట్టే పసిగట్టవచ్చు. శరీరంలో ఏ భాగంలో కణుతులు కేన్సర్ కణాలున్నాయో ఈ పరీక్షల్లో తేలుతుందన్నమాట. ఈ పరీక్షల ఫలితాల్లో మరికొన్ని విషయాలు తేలాయి. ఈ పరీక్షల్లో 98 శాతం మేరకు ఓవరిన్ కేన్సర్‌లను సులభంగా గుర్తించడం వీలైంది. ఆ తరువాత బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించడం సులువైంది. వీటిని తొలిదశలో ఉండగానే ఈ లిక్విడ్ బయాప్సీలో గుర్తించడం సులువుగానే ఉంది. మిగతా రకాల కేన్సర్‌లను 78 కేసుల్లో మూడో దశలోను, 43 శాతం 1వ దశలోనూ గుర్తించగలిగారు. మగవారిలో ఎక్కువగా లంగ్ కేన్సర్ ఉంటోంది. ఆ తరువాత ప్రొస్టేట్, బ్రెస్ట్ కేన్సర్ బాధితులు ఎక్కువ.
ఇదీ భారతం
మన దేశంలో బ్రెస్ట్ కేన్సర్, ఓవరిన్, ఉదర సంబంధ కేన్సర్‌లు ఎక్కువగా మహిళలకు వస్తున్నాయి. ఇక మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, నోరు, ఉదర సంబంధమైన కేన్సర్‌లు ఎక్కువగా వస్తున్నాయి. అయితే కేన్సర్ మరణాల్లో మహిళలకన్నా మగవారిలో ఎక్కువగా ఉంటున్నాయి. మనదేశంలో అన్ని వయసులవారిని కలసి చూసినప్పుడు బ్రెస్ట్ కేన్సర్‌వల్ల ఏటా 1,44,937 మంది మరణిస్తున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్ వల్ల 1,58,924 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐ-ఎమ్‌ఇఆర్‌కు చెందిన పరిశీలన ప్రకారం 2012లో 5.37 లక్షల మంది మహిళలు, 4.77 మంది పురుషులు కేన్సర్‌బారిన పడ్డారు. అంటే కేన్సర్ బాధితుల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. అయితే అలా కేన్సర్‌బారిన పడినవారిలో మరణించినవారి సంఖ్య పురుషులతో పోలిస్తే తక్కువ. 3.26 లక్షల మంది మహిళలు కేన్సర్ కారణంగా మరణిస్తే పురుషుల్లో 3.56 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అలవాట్లు, జీవనశైలి, పరిసరాల పరిశుభ్రత, ఆహారం, జన్యు పరిణామాల కారణంగా కేన్సర్‌బారిన పడుతున్నారు. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు కేన్సర్‌ను గుర్తించడం త్వరితగతిన సాధ్యమవుతోంది. అలసట, బరువుతగ్గడం, శరీరంపై ఉంటే పుట్టుమచ్చల స్వరూపం హఠాత్తుగా మారడం, వాటినుంచి రక్తం కారడం వంటివి కొన్ని సూచనలు. శరీరంలో కణతులు ఏర్పడడం మరో సంకేతం. అయితే కేవలం ఈ లక్షణాలే కేన్సర్‌కు సూచన అని చెప్పలేం. అవి ఒక సంకేతం కావచ్చు. అంతే. శారీరక, మానసిక కుంగుబాటును కలిగించే కీమోథెరపీ వంటి చికిత్స ఖరీదుతో కూడినది. ఒకప్పుడు కరెంటు షాక్, రేడియేషన్ వంటి ప్రక్రియలు తీవ్రమైన బాధను కలిగించేవి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మేలైన, ఫలితాన్నిచ్చే వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి పేదలకు సేవలు అందిస్తున్నాయి. కొన్ని స్వచ్చంద సంస్థలు అద్భుతమైన ఆసరా అందిస్తున్నాయి. ఇలాంటి సంస్థల గురించి విస్తృత ప్రచారం బాధితులకు ఎంతో ఓదార్పునిస్తుంది. *

ఏంజిలినా జోలీ

హాలీవుడ్ నటి ఏంజిలినా జోలీ గురించి తెలియనివారుండరు. తెరపై ఆమె నటన కోట్లాదిమంది అభిమానులను అలరిస్తుంది. అయితే వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సాహసానికి గుర్తులు. కేన్సర్ బాధితులకు గుండెనిండా ధైర్యాన్నిచ్చే చర్యలు. ఆమె కుటుంబంలో ఎనిమిది మంది కేన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో తల్లి ఒకరు. ‘బ్రక’ జీన్ కారణంగా ఆమె ‘బ్రెస్ట్ కేన్సర్’కు గురైనట్లు గుర్తించడం, ఆ విషయాన్ని స్వయంగా జోలీ న్యూయార్క్ టైమ్స్ పత్రికకు వెల్లడించడం సంచలనమైంది. రెండుసార్లు ‘మస్టెక్టొమీస్’ సర్జరీ ద్వారా పాలిండ్లను తొలగించుకున్న ఆమె ‘కేన్సర్’ను ఎదిరించి బతకడానికి నిశ్చయించుకున్నట్లు ధైర్యంగా చెప్పింది. ఆ తరువాత కొంత కాలానికి ‘అండాశయాన్ని’ కూడా తొలగించాల్సి వచ్చింది. కేన్సర్‌ను తొలిదశలో గుర్తించి చక్కటి వైద్యం చేయించుకుంటే మనల్ని అదేం చేయలేదని, ఆ విషయాన్ని తాను నిరూపించానని జోలీ చెప్పింది.

కేన్సర్ కారకాల్లో పొగాకు మొదటి స్థానంలో ఉంది. 95 శాతం కేసులు పొగాకు ఉత్పత్తుల వల్లేనన్నది నిర్ధారణ అయింది.

మనీష కొయిరాలా..
బాలీవుడ్ సంచనాల తార, అందాల భామ మనీషా కొయిరాలా అండాశయ కేన్సర్‌తో బాధపడుతున్న విషయం 2012లో బయటపడింది. మూడేళ్లపాటు ఆమె చికిత్స చేయించుకున్నారు. సినీరంగం నుంచి ఎంతోమంది ఆమెకు ధైర్యవచనాలు చెప్పారు. వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఆమె కేన్సర్‌పై పోరాటం చేయడం మొదలుపెట్టింది. కేన్సర్ వల్ల తనకు ఇష్టమైన సినీరంగానికి దూరమైన మనీషా కొయిరాలా మూడేళ్ల తరువాత మళ్లీ వెండితెరపై సంపూర్ణ ఆరోగ్యంతో, మునుపటి అందంతో ఓ వెలుగువెలిగింది. ‘కీమో థెరపీ చేయించుకుంటే జుత్తు ఊడిపోతుందని, శరీరం బక్కపల్చగా అయిపోతుందని ముందే తెలుసు. దానికి మానసికంగా సిద్ధమయ్యా కూడా. కీమోథెరపీ పూర్తయ్యే సరికి కనుబొమ్మలు, తలపై ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోయాయి. శరీరం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. నన్ను నేను అద్దంలో చూసుకుంటే గ్రహాంతరజీవిలా కనిపించా. అయితే అచంచలమైన ఆత్మవిశ్వాసంతో మళ్లీ మామూలు మనిషినయ్యా. కేన్సర్ మనల్ని ఏం చేయలేదు. మానసకింగా దృఢంగా ఉండాలంతే’ అని అంటారామె.

‘కుమాసి’ ప్రత్యేకం!
ఆఫ్రికా దేశమైన ఘనాలో అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరం ‘కుమాసి’. ఇక్కడ జనాభా దాదాపు 20 లక్షలు. ఈ పట్టణానికి ఒక గౌరవం దక్కింది. 2025 నాటికి ఆ నగరంలో ఒకరికి కూడా కేన్సర్ రాకూడదన్న లక్ష్యంతో చేపట్టే ‘విత్ కేన్సర్ ఛాలెంజ్ ప్రాజెక్టు’కు ఈ పట్టణం ఎంపికైంది. ప్రపంచంలో ఈ అవకాశం దక్కించుకున్న నాలుగో పట్టణం ఇది. ఆఫ్రికాలో ఈ అవకాశం దక్కించుకున్న తొలి పట్టణం ఇది. ఈ మేరకు యూఐసీసీతో పట్టణాధికారులు అవగాహన కుదుర్చుకున్నారు. ప్రపంచంలో అత్యాధునిక కేన్సర్ నిర్ధారణ, చికిత్స సౌకర్యాలు, సామగ్రి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. తాజా వైద్య విధానాలతో సమర్ధమైన చికిత్సలు చేస్తారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఇదంతా అమలు చేస్తారు.

కరుణాశ్రయం

కేన్సర్ ముదిరిపోయిన దశలో, మరణం తప్పదు అన్న విషయం నిర్ధారణ అయితే, ఆ విషయం రోగికి, వారి బంధువులకు తెలిస్తే వారిలో అనేక మార్పులు వస్తాయి. సేవ చేయడం మాటలు చెప్పినంత తేలిక కాదు. మనసులోంచి సేవ చేయాలన్న తపన రావాలి. పరిస్థితులు అనుకూలించాలి. ఆర్థిక స్థోమత ఉండాలి. అన్నీ ఉన్నా ఒక్కోసారి ఒత్తిడిలో విసుక్కోవడం మామూలే. అలాంటి స్థితిలో రోగి ఇంకా బాధపడిపోతాడు. ఎంత దగ్గరి బంధువులైనా చివరికి భార్యాభర్తలైనా, పిల్లలైనా ఒక్కోసారి విసుగుచెందుతారు. కానీ బెంగళూరులోని ‘కరుణాశ్రయం’లో అలాంటిదేం లేదు. కేన్సర్ ముదిరిపోయిన రోగులను ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని వారి మిగిలిన జీవితంలో ప్రశాంతంగా, హాయిగా, మానసికంగా కుంగుబాటుకు గురికాకుండా, వీలైనంత ఉపశమనాన్నిచ్చే వైద్య సేవలతో వారిని చక్కగూ చూస్తూ తుదిశ్వాస విడిచేవరకు కనిపెట్టుకుని ఉండటం ఆ ఆశ్రమం లక్ష్యం. ఇప్పటివరకు ఇలా 19వేల మంది ఇన్‌పేషెంట్లకు ఆ కరుణాశ్రయం ఆశ్రయం ఇచ్చింది. వారిలో ఏడువేల మంది తమ తుది జీవితాన్ని అక్కడే చాలించారు.. కావలసినంత తృప్తితో. ‘ఇక్కడ మనవాళ్లకన్నా చక్కగా చూస్తారండి. కాలకృత్యాల దగ్గరినుంచి, స్నానం చేయించడం దగ్గరనుంచి, మానసిక వైద్యుల తోడ్పాటుతో ఎక్కడ లేని ధైర్యం వచ్చేలా, ఉపశమనం కలిగేలా తయారు చేస్తారండి. మనకు ఎప్పుడు ఏం కావాలో వారే చూస్తారండి. వేణ్ణీళ్లతో స్నానం చేయిస్తారండి. మనవాళ్లు దగ్గరలేరన్న ధ్యాసే రాన్విరండి. అల్పాహారం, కావలసిన పానీయం, రెండుపూటలా భోజనం, వేళప్రకారం పడుకునే వెసులుబాటు, పండుగలు, పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు అన్నీ చేస్తారండి. జీవితం ముగిసిపోతుందని తెలిసినప్పటికీ వీరు చూపేది ఆదరణ, జాలి కాదు. సొంత మనుషులను వీరి తమ సేవలతో మరిపిస్తారు. అంతా ఉచితమే. ఇక్కడ చేరడమూ సులభమే. రోగి వైద్యపరీక్షలు, స్థితిని నిర్ధారించే ధ్రువపత్రాలు, వైద్య నివేదికలు ఉంటే చాలు, చేర్చుకుంటారు. వీళ్ల సేవాతత్పరత చూస్తే ఆశ్చర్యం వేస్తుంది’ అని అనేవారు హైదరాబాద్‌కు సీనియర్ జర్నలిస్ట్ విజయ్‌కుమార్. బ్లడ్‌కేన్సర్‌తో బాధపడిన ఆయన మూడువారాల క్రితం కరుణాశ్రయంలో తుదిశ్వాస విడిచారు. అంతకుముందు ఆయన తరచూ మాట్లాడుతూ కరుణాశ్రయం సేవానిరతిని చెబుతూండేవారు. 150 మంది స్ట్ఫా నిరంతరం పనిచేస్తారు. ఇళ్లలో ఉండే కేన్సర్ రోగులకూ సాంత్వన చేకూర్చేందుకు వారి ఇళ్లకు వెళ్లి సేవలందించే వెసులుబాటూ ఉందని చెప్పేవారాయన. ఇలా 3500 మందికి వారు సేవలు అందిస్తున్నారు. 1999లో దేశంలో తొలి హాస్పిక్ ట్రస్ట్ బెంగళూరులో ఏర్పడింది. ఇండియన్ కేన్సర్ సొసైటీ, బెంగళూరు రోటరీక్లబ్ దీనిని నిర్వహిస్తున్నాయి. 20 నిధులు ప్రైవేటు సంస్థల నుంచి, మిగతా 80 శాతం నిధులు వ్యక్తిగత దాతల నుంచి విరాళాల రూపంలో వస్తున్నాయి. అద్భుతమైన వసతి, అంతకుమించి ఆదరణ, అధునాత మానసిక, శారీరక ఉపశమన రీతులు అక్కడి కేన్సర్ రోగులకు ఉపశమనాన్ని అందిస్తున్నాయి. విజయకుమార్ మరణానికి పది రోజుల ముందు కూడా అదే చెప్పేవాడు.

గిరీష్ ఆర్ గౌడ
కర్నాటకకు చెందిన గిరీష్ ఆర్ గౌడ ప్రఖ్యాత కిక్‌బాక్సర్. కుస్తీ ప్రాక్టీస్ చేస్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడు. గత ఏడాది మాట ఇది. ఆ తరువాత పరీక్షల్లో అతడు బ్లడ్‌కేన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. అయనా పట్టువదల్లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను మళ్లీ ‘బాక్సింగ్’ బరిలోకి దిగాలన్న పట్టుదల ముందు కేన్సర్ ఓడిపోయింది. 103 కీమోథరపీల తరువాత అతడు పూర్తి ఆరోగ్యంతో మళ్లీ బరిలోకి దిగాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణపతకం సాధించాడు. ఇప్పటికి 9 సార్లు జాతీయ స్వర్ణపతకాలు సాధించిన గౌడ ప్రపంచస్థాయి పోటీల్లో ఇప్పటివరకు రెండుసార్లు రజత పతకాలు సాధించాడు.

యువరాజ్‌సింగ్
ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ యువరాజ్‌సింగ్ కెరీర్ ఉజ్వలంగా ఉన్నప్పుడు మైదానంలో ఉండగా అస్వస్థకు గురయ్యాడు. వివిధ పరీక్షల అనంతరం అతడి ఊపిరితిత్తుల మధ్య 11 సెంటీమీటర్ల వ్యాసార్థంలో, అంటే ఓ బంతి పరిమాణంలోని కణితి ఉన్నట్లు గుర్తించారు. కీమోథరపీ సహా కేన్సర్ నివారణ చికిత్సలు చేయించుకున్నాడు. మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో బ్యాట్ చేతబట్టి ఔరా అన్పించాడు. అమెరికాలో చికిత్స చేయించుకున్నాడు. ‘కేన్సర్‌ను చూసి భయపడకండి, సానుకూల దృక్పథంతో బతకండి, ఆత్మవిశ్వాసంతో ఊపిరితీయండి. మంచి వైద్యం చేయించుకోండి. మనదైన జీవితం సాఫీగా సాగిపోతుంది. కేన్సర్ మనల్ని ఏమీ చేయలేదు. నేను కేన్సర్‌కు గురైనప్పుడు మళ్లీ తిరిగి బ్యాట్ చేతపడతానని అనుకోలేదు. ప్రఖ్యాత క్రీడాకారుడు లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్ఫూర్తితో ధైర్యంగా, సానుకూల దృక్పథంతో చికిత్స చేయించుకున్నా. ఏడాదిలో కోలుకుని కేన్సర్‌ను ఓడించా. మళ్లీ బ్యాట్‌తో మైదానంలోకి అడుగుపెట్టా. ఇదంతా భగవంతుడి దయ.’ అంటాడు యువరాజ్. ఆ తరువాత కేన్సర్ బాధితుల్లో కొత్త ఆశలు చిగురించేలా అండగా నిలిచాడు. వివిధ చైతన్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

ప్రపంచంలో కేన్సర్ మరణాలు ఆఫ్రికాలో ఎక్కువ.
ఆ తరువాతి స్థానం ఆసియాది.

గౌతమి..
తెలుగువారికి బాగా పరిచయమైన సినీనటి, ప్రఖ్యాత సినీనటుడు కమల్‌హాసన్ మాజీ సతీమణి గౌతమి బ్రెస్ట్‌కేన్సర్‌తో బాధపడ్డారు. 35 ఏళ్లవయసులో ఆమె కేన్సర్‌తో పోరాటం మొదలుపెట్టారు. ‘్భయాన్ని ముందు పోగొట్టాలి. తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మనకు ఇలాంటి సమస్యల్ని సృష్టిస్తున్నాయి. ఈ విషయాల్లో మార్పులు తెచ్చుకుని ఒక క్రమపద్ధతిలో జీవిస్తూ వైద్యచికిత్సలు చేయించుకుంటే కేన్సర్ మనలను ఏమీ చేయలేదు. ఇంకా నేను బతికి ఉన్నానంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఇక ఒక్కరోజు కూడా వృధా చేయను. కేన్సర్‌తో పోరాడేవారికి అండగా, ధైర్యాన్ని నూరిపోస్తాను. కేన్సర్‌పై ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తాను. ఆత్మవిశ్వాసమే అసలు మందు’ అన్నారామె. హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాల్లో కేన్సర్ అవగాహన కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు.

కవర్‌స్టోరీ: కృష్ణతేజ