ఈ వారం స్పెషల్
ఇది పరీక్షాసమయం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎవరైనా ఎదురైతే చాలు మనం అడిగే తొలి ప్రశ్న మీరేం చేస్తున్నారు? అంటాం.. లేదా ఏం చదువుతున్నారు? అనడం సహజం. ఇక పిల్లలు ఎదురైతే చెప్పనక్కర్లేదు.. ఏం చదువుతున్నావు అనే ప్రశ్నతో మొదలు పెట్టి ఏం చదవబోతున్నావు? ఏ కోర్సులో చేరుతావు? పర్సంటేజీలు, ప్రిపరేషన్లు, ఇష్టాయష్టాలూ, ప్రణాళికలూ అన్నీ అడిగేస్తుంటాం..
పరీక్షల సమయం వచ్చిందంటే చాలు ఎవరికివారు బిజీ అయిపోతారు. పిల్లల బిజీతో తల్లిదండ్రులు కూడా పరీక్షల మత్తులోనే ఉంటారు. కొంత మంది ఉద్యోగాలకు సిద్ధమవుతూ ఎంపిక పరీక్షల్లో బిజీగా ఉంటారు. మరికొంత మంది రెగ్యులర్ విద్యాత్మక పరీక్షల్లో తీరిక లేకుండా వుంటారు, ఇంకొంతమంది కొత్త కోర్సుల్లో, కాలేజీల్లో, స్కూళ్లలో చేరేందుకు రాసే ప్రవేశపరీక్షలతో బిజీ..
ఏల్‌కేజీలో చేరాలన్నా నేడు పిల్లలకే కాదు, తల్లిదండ్రులకూ పెద్ద ‘పరీక్షే’. ఇంటర్వ్యూలను ఎదుర్కోవడమే కాదు, ఆయా విద్యాసంస్థలు చెప్పే ఫీజులు చెల్లించాలంటే అందుకు కూడా ఆర్ధికంగా సిద్ధం కావల్సిన అనివార్యస్థితి.
ఉన్నత చదువులకు ప్రవేశపరీక్షలు రాసేవారికీ ఎన్నో టెన్షన్లు. ర్యాంకులు రావాలి, అనుకున్న బ్రాంచిలో, ఆశించిన కాలేజీలో సీటు రావాలి. అందుకు ఆన్‌లైన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, మహా గ్రాండ్ టేస్టులు, ట్యాలెంట్ టెస్టులు ఇక ఈ పేర్లకు హద్దే లేదు. రకరకాల పరీక్షలు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రధానంగా జేఈఈ, నీట్, కేట్, జీ మ్యాట్, నెట్, జీ ప్యాట్ వంటి జాతీయ పరీక్షలతో పాటు రాష్టస్థ్రాయిలో ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీ సెట్, లాసెట్ వంటి పరీక్షలకు లక్షలాది మంది హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల వరకే తీసుకుంటే రాష్టస్థ్రాయి ప్రవేశపరీక్షలకు ఏడు లక్షల మంది హాజరవుతున్నారు. జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలకు మరో మూడు లక్షలమంది హాజరవుతున్నారు. ఇక ఎంపిక పరీక్షలకు 20 లక్షలమంది హాజరవుతుండగా, ఒకటో తరగతి నుండి పీజీ వరకూ రెగ్యులర్ పరీక్షలకు కోటిన్నర మంది హాజరవుతున్నారు. అంటే అన్ని రకాల పరీక్షలకు దాదాపు మూడు కోట్ల మంది విద్యార్థులు తమ భవిష్యత్‌ను పరీక్షించుకుంటున్నారు.
హాయిగా ఆడుతూ పాడుతూ పరీక్షలు రాసేవారు కొందరైతే ఉక్కిరిబిక్కిరి అవుతూ అదేదో ఎవరెస్టు శిఖరం అధిరోహించే బృహత్తర కార్యక్రమంగా మరికొందరు సంసిద్ధమవుతుంటారు. సమయ పాలన, విద్యత్మక అంశాలకు సరైన ప్రాధాన్యత, సహపాఠ్యప్రణాళికల్లోనూ ప్రావీణ్యత, కాలక్రమపట్టిక ఆధారంగా సంసిద్ధత లేకపోవడంతో పరీక్షలు అంటే చాలా మందికి వణుకు మొదలవుతుంది. పిల్లలను చూశాక తల్లిదండ్రులకు సైతం పరీక్షల జ్వరం మొదలవుతుంది.
వ్యక్తుల ప్రతిభను నిర్ణయించే సాధనాల సముచ్ఛయమే పరీక్ష. పరీక్షను సాంకేతిక పరిభాషలో నికష అంటాం. పరీక్షల విధానం తొలుత చైనాలోనే మొదలైంది. నిజానికి విద్య ఎంత పురాతనమైందో పరీక్షలకు సైతం అంత పురాతన చరిత్ర ఉంది.
విద్య త్రిపథగామిని (ట్రిపుల్ ప్రాసెస్). పాఠ్య ప్రణాళిక, బోధన, పరీక్షలు అనే మూడు అంశాలు అంతర్గతంగా ఉన్నపుడే ఆ ప్రక్రియను విద్య అంటాం. పాఠ్యప్రణాళిక విద్య లక్ష్యాలను ప్రతిబింబించాలి. బోధన విద్యార్థులను ఆ లక్ష్యాలకు దగ్గరగా తీసుకువెళ్లగలగాలి. పరీక్షలు విద్యార్థులూ, ఉపాధ్యాయులు లక్ష్య సాధనలో ఎంతవరకూ కృత కృత్యులయ్యారో ఇంకా ఎంత కృషి చేయాలో తెలియజేస్తాయి. వాస్తవానికి పరీక్షలు పాఠ్యప్రణాళిక , బోధన అనుసరించి జరగాలి. కానీ నేడు పరీక్షలే పాఠ్యప్రణాళికనూ, బోధననూ శాసిస్తున్నాయి. ఈ కారణంగానే అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి కదా అని పరీక్షలను నిషేధించలేం. విద్యావిధానంలో పరీక్షలు తప్పనిసరి. మరో మాటలో చెప్పాలంటే అనివార్యమైన పీడన(నెససరీ ఈవిల్) పరీక్షలు. అనేక విద్యా ప్రయోజనాలను సాధించడం కోసం పరీక్షల నిర్వహణ తప్పదు. అందుకే పరీక్షల విధానాన్ని సంస్కరించి అనర్థాలను తగ్గించడానికి కృషి చేయడం తప్ప మరో మార్గం లేదు.
సాధారణంగా విద్యార్థులను కృతార్థులను చేసి వారిని పై తరగతులకు పంపించడానికి తప్పిన వారిని అదే తరగతిలో కొనసాగించడానికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారనే భావన అందరిలో ఉంది. అందుచేతనే పిల్లలకు, తల్లిదండ్రులకు పరీక్షలంటే భయం. పరీక్షలు లేకుంటే పిల్లలు చదవరని, వినరని ఉపాధ్యాయులకు భయం. కానీ పరీక్షల అసలైన ప్రయోజనాలు వేరే ఉన్నాయి.
పరీక్షలు విద్యార్థుల అభ్యాసనం ద్వారా సాధించిన ప్రావీణ్యాన్ని వ్యక్తపరచేందుకు తోడ్పడతాయి. అది వారి విద్యాప్రమాణాన్ని కొలిచి వారి పాండిత్యానికి సాక్ష్యం ఇస్తాయి. ఈ సాక్ష్యం ఆధారంగానే విద్యార్థి తను ఎక్కడున్నదీ ఇంకా ఎంత కృషి చేయాల్సి ఉన్నదీ తెలుసుకోగలుగుతాడు. పరీక్షలు విద్యార్థి కృషికి ప్రేరణాలుగా ఉంటాయి. విద్యార్థులు పై పాఠాలు నేర్చుకునేందుకు తగిన పూర్వ జ్ఞానాన్ని కలిగి ఉన్నారా? లేక వెనుక పాఠాలు మరోమారు బోధించాలా అనే నిర్ణయాన్ని ఉపాధ్యాయుడు చేయడానికి పరీక్షలే ఆధారం . విద్యార్ధులకు సమాన ప్రతిభ ఉన్న సమూహాలుగా విభజించేందుకు సామూహిక విద్యాభ్యాసానికి అవసరం. పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఈ విభజనకు ఆధారం అవుతుంది. పరీక్షలు విద్యార్థి ప్రతిభకే కాకుండా ఉపాధ్యాయుడి ప్రజ్ఞకూ నిదర్శనం. పరీక్ష ఫలితాలు ఉపాధ్యాయుని బోధన వల్ల విద్యార్థులు సగటున ఏ స్థాయికి చేరుకున్నారో తెలియజేస్తుంది.
ఉపాధ్యాయులు తాము అనుసరించే బోధన పద్ధతులు సరైనవో కాదో నిర్ణయించుకుని, విద్యార్థుల సగటు సామర్థ్యాలు తక్కువగా ఉన్నపుడు టీచర్లు తమ పద్ధతులు మార్చుకోవాలి. విద్యార్థులు సాధనలో అక్కడక్కడా లోటును గుర్తుపట్టి పరీక్ష అనంతరం ప్రత్యేక తరగతులు నిర్వహించి ఆ లోటును భర్తీ చేసి వారిని సంపూర్ణ ప్రజ్ఞావంతులుగా మార్చవచ్చు.
పరీక్షలు ఉపాధ్యాయుల మధ్య పోటీ తత్త్వాన్ని మేల్కొలిపి వారు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. రెండు వేర్వేరు తరగతులకు ఒకే సబ్జెక్టును బోధించే ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విషయంలో ఇలాంటి పోటీ ఏర్పడుతుంది.
కొన్ని సంవత్సరాల పరీక్ష ఫలితాలను విశే్లషించి పరిశీలించి ఒక తరగతి పాఠ్య ప్రణాళికను ఆ తరగతి పిల్లల సామర్థ్యానికి తగిందో లేదో తెలుసుకోవచ్చు. ఫలితంగా పాఠ్యప్రణాళికలో అవసరమైన మార్పులు చేయవచ్చు.
పరీక్షల విధానంలో లోపాలు
నేడు పరీక్షలు విద్యావిధానంలో అన్యాయానికి చిహ్నంగా పరిగణించబడుతున్నాయి. 1857లో బోధనా రహిత విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యాయి. మాధ్యమిక విద్యకు సంబంధించి మెట్రిక్యులేషన్ పరీక్షలను ఈ వర్శిటీలే నిర్వహించేవి. పరీక్షా విధానం పెడమార్గానికి పట్టడానికి ఇదే నాందీ ప్రస్తావన అయ్యింది. విద్యార్థుల దృష్టి , అధ్యాపకుల దృష్టి కూడా విశ్వవిద్యాలయాలు నిర్వహించే పరీక్షలపైనే పడింది. ఆనాటి నుండి ఎక్కవ మంది విద్యార్ధులు వీలైనంత ఎక్కువ మార్కులతో పరీక్షల్లో కృతార్థులు కావాలనే లక్ష్యం మొదలైంది. ప్రతి ఏడాది తాము చదివిన సబ్జెక్టుల్లోనే కొన్ని వ్యాసరూప ప్రశ్నలు పరీక్షల్లో ఇవ్వడం వాటిని విద్యార్థి రాయడం, మార్కులు కేటాయింపు జరిగి పరీక్షలు ఉత్తీర్ణులు కావడం ఇదో తంతుగా మొదలైంది. వాస్తవానికి ఈ వ్యాస రూప జవాబుల్లో విద్యార్థి సామర్థ్యాలను నిర్ధుష్టంగా తెలుసుకోవడం చాలా కష్టం. ఒకే జవాబుకు ఇద్దరు మూల్యాంకనకర్తలు రెండు భిన్నమైన మార్కులను కేటాయించడం లేదా ఒకే మూల్యాంకన కర్త రెండు సందర్భాల్లో భిన్నమైన మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రయోగాత్మకంగా కూడా ఎన్నో మార్లు రుజువైంది. ఈ కారణాలతో పరీక్ష విధానం అసంతృప్తికి దారితీసింది. 1852 నాటి హంటర్ కమిషన్ నివేదిక మొదలు స్వాతంత్య్రానంతరం 1952-54లో నియమితులైన మాధ్యమిక విద్యా ఆయోగ్ - మొదలియార్ కమిషన్, 1962-64 విద్యా ఆయోగ్ - కొఠారి కమిషన్ నివేదికలు సైతం పరీక్షల విధానంపై తీవ్ర విమర్శలు చేశాయి.
ప్రధానంగా పరీక్షలు పాఠ్యప్రణాళికనూ, బోధనను అనసరించడానికి బదులు వాటిపై అజమాయిషీ చేస్తున్నాయని 56 ఏళ్ల క్రితమే కొఠారీ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. పరీక్షలు సమగ్రంగా లేవని, పూర్వపు పరీక్ష విధానంలో రాత జవాబులు సరికాదని, బోధనతో పాండిత్యం పెరిగినా వారిలో క్రియాశీలత పెరగడం లేదని నిర్ణయించారు. జ్ఞాపకశక్తి మినహా వ్యక్తిత్వ వికాసానికి చిహ్నాలైన ఇతర సామర్థ్యాలను పరీక్షించడం లేదని, పరీక్ష ఫలితాలే అదృష్టంగా మారాయని, మూల్యాంకనం ఆత్మాశ్రయంగా ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ప్రామణీకృత పరీక్షా పత్రాలను తయారుచేసే అలవాటు ఈ దేశంలో లేదని, విద్యార్థుల దృష్టి ఎపుడూ పబ్లిక్ పరీక్షలపైనే కేంద్రీకృతమై ఉంటోందని, బోధనాభ్యసన సంఘటన సమర్థతను నిర్ణయించే వీలు లేకుండా పోతోందని ఆ నివేదిక వివరించింది.
పరీక్షా విధానంలో సంస్కరణలు
పరీక్షల్లో సంస్కరణలు 1953లోనే ప్రారంభమయ్యాయి. ఆ ఏడాది భారత ప్రభుత్వం బెంచిమన్ బ్లూమ్‌ను దేశానికి ఆహ్వానించి ఇక్కడ పరీక్షల విధానాన్ని పరిశీలించి మార్పులకు వీలయ్యేలా సంస్కరణలకు సూచనలు ఇవ్వాలని కోరింది. అన్ని రకాలుగా బ్లూమ్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరీక్షా సంస్కరణలకు ఒక జాతీయ పరిశోధనా సంస్థను స్థాపించాలని, ఈ సంస్థ పరీక్ష భావన స్థానంలో మూల్యాంకన భావన తీసుకురావాలని, మూల్యాంకన విధానంలో క్రమక్రమంగా వస్త్వాశ్రయత లేక లక్ష్యాశ్రయతను ప్రవేశపెట్టాలని బ్లూమ్ సూచించారు. ఈ సిఫార్సులను ఆసరగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం 1953లో కేంద్ర మూల్యాంకన సంస్థ (సెంట్రల్ ఇవాల్యూషన్ యూనిట్)ను స్థాపించింది. తర్వితి కాలంలో అదే ఎన్‌సీఈఆర్టీగా మారింది.
కేంద్ర విద్యా సలహా పరిషత్ (కేబ్) వెనువెంటనే, మాధ్యమిక స్థాయిలో పరీక్షా విధానంలో వస్త్వాశ్రయ నికషలను ప్రవేశపెట్టడం జాతీయ విధానంగా ప్రకటించింది. 1953 నుండి అనేక రాష్ట్రాల్లో ఈ సంస్కరణ ప్రారంభమైంది. వస్త్వాశ్రయ ప్రశ్నలు, లఘూత్తర ప్రశ్నలను చేర్చారు. దాంతో ఎవరు దిద్దినా ఒకే మార్కులు వచ్చే ఆస్కారం ఏర్పడింది. వ్యాస రూప జవాబులకు ఉన్న గుణాలు దీనికి లేకపోవడంతో రెండింటి సమ్మేళనంగా ప్రశ్నాపత్రం ఉండాలని నిర్ణయించారు.
మొదలియార్ కమిషన్, కొఠారి కమిషన్ చేసిన ముఖ్యమైన సిఫార్సుల్లో పరీక్షకు బదులు మూల్యాంకన విధానం ప్రారంభించాలనేది. అదే మరికాస్తా నవీకరించబడి నేడు నిరంతర మూల్యాంకనంగా రూపాంతరం చెందింది. అందులో భాగంగానే అసైన్‌మెంట్లు, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ అమలులోకి వచ్చాయి. అన్నింటికీ మించి విద్యార్థుల్లో పరీక్ష భయాన్ని పోగొట్టాలి. విద్యార్థులు సంవత్సరం చివరిలో కొద్ది నెలలు విపరీతంగా శ్రమపడి పరీక్షలు రాసే విధానం పోవాలనే సెమిస్టర్ విధానం అమలులోకి తెచ్చారు. అంతే కాదు, సెమిస్టర్‌కు ముందు ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్ లేదా ప్రాక్టికల్స్ లేదా వైవా పేరిట పరీక్షలు నిర్వహించడం అమలులోకి వచ్చింది. అంటే దాదాపు ప్రతి వారం ఏదో ఒక రకంగా పరీక్ష రాసే అలవాటు ఆ వారంలో జరిగిన సబ్జెక్టును అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇలా జరిగే పరీక్షల్లో వచ్చే మార్కులు అన్నింటినీ అంతర్మూల్యాంకన విధానం (ఇంటర్నల్ అసెస్‌మెంట్) అమలులోకి తెచ్చారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికీ నిరంతర వికాసానికి వివిధ దశల్లో పరిశీలించి వాటి ఫలితాలను క్యూములేటివ్ రికార్డుల్లో నమోదు చేయాలని అభ్యసన క్షేత్రాలు అన్నింటిలో విద్యార్థి ప్రతిభకు విలువ కట్టాలనే ఆలోచన అమలులోకి వచ్చింది. ముఖ్యంగా ప్రాథమిక దశల్లో వార్షికంగా జరిగే ప్రమోషన్ పరీక్షలు నిషేధించాలని, డిటెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కేంద్రం యోచిస్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 7వ తరగతి వరకూ డిటెన్షన్ అమలులో లేదు. ఏడో తరగతి ఉత్తీర్ణులైతే వారు మళ్లీ పదోతరగతిలోనే పబ్లిక్ పరీక్షలకు హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సంస్కరణలలో భాగంగా 1961లో రాష్ట్ర మూల్యాంకన సంస్థను ఏర్పాటు చేశారు. అదే తర్వాతి కాలంలో ఎస్సీఈఆర్టీలో భాగంగా మారింది.
అంటే ఆరుదశాబ్దాలుగా పరీక్షల సంస్కరణలపై కసరత్తు జరుగుతునే ఉంది. ఇందుకు రెండు డజన్లకు పైగా కమిటీలు అనేక రకాల సిఫార్సులను అందించాయి. అయినా విద్యార్థుల్లో పరీక్షల భయం పోలేదు. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్ మొదలైపోతుంది. ఏదో విధంగా ప్రశాంతంగా పరీక్షలు గడిచి మంచి ర్యాంకులు, మార్కులు వస్తే చాలు అనుకుంటారు.
సుదీర్ఘ చరిత్ర
భారతదేశానికి ఎలా చూసుకున్నా ఐదు వేల సంవత్సరాల విద్యా చరిత్ర ఉంది. స్థూలంగా ప్రాచీన, మధ్య, ఆధునిక యుగంగా విభజిస్తే క్రీశ 11వ శతాబ్దం వరకూ ప్రాచీన యుగంగా చెప్పవచ్చు. ఆ యుగంలో హిందూ విద్యా విధానానికి ప్రముఖ స్థానం దక్కింది. క్రీశ ఆరో శతాబ్దంలోనే హిందూ మతానికి ప్రత్యర్థులుగా బౌద్ధ, జైన్ మతాలు ప్రచారం పొందాయి. బౌద్ధమతాధారంగా బౌద్ధ సంప్రదాయ విద్యావిధానం రూపొందింది. 11 వ శతాబ్దంలో మహ్మదీయ దండయాత్రలు ప్రారంభం అయ్యాయి. ఫలితంగా ఇస్లాం మతం కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రచారం పొందింది. ముస్లిం సంప్రదాయ విద్యా విధానం కూడా దేశంలో ప్రారంభం అయింది. కొంత హెచ్చుతగ్గులుగా వివిధ కాలాల్లో తొలుత హిందూ, బౌద్ధ, జైన్ విద్యా విధానాలు, 11వ శతాబ్దం తర్వాత హిందూ, మహ్మదీయ సంప్రదాయ విద్యా విధానాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఇక మధ్య యుగంలో పాశ్చాత్యులు వర్తకం కోసం దేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని, క్రమంగా వీరు దేశ రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యాధికారాన్ని సంపాదించారు. బ్రిటిష్‌వారి ఏలుబడిలో స్వదేశీ సంప్రదాయ హిందూ, బౌద్ధ విద్యల తర్వాత మధ్యయుగంలో వచ్చిన మహ్మదీయ విద్యావిధానం కూడా క్రమేపీ అంతరించి క్రైస్తవ మిషనరీలు రంగంలోకి వచ్చాయి. 17వ శతాబ్దంలో భారత్‌లో దిగుమతి అయిన పాశ్చాత్య విద్యావిధానం దినదినాభివృద్ధి పొందుతూ వచ్చింది.
వేదాలు, వేదాంగాల నుండి ఉపనిషత్తులు, ఇతిహాసాల నుండి ఎంతో జ్ఞానాన్ని గ్రహించిన మనమే , తిరిగి పాశ్చాత్య విద్యపై ఆధారపడి ఆ దిశగా పయనించాల్సి వచ్చింది. చారిత్రక సత్యాల ప్రకారం రుగ్వేదకాలంలోనే స్థూలంగా పని విభజన జరిగింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలతో కూడిన చాతుర్వర్ణ సమాజం ఏర్పడింది. కానీ తర్వాతి కాలంలో ఈ కుల విభజన స్థిరత్వం ఏర్పరచుకుంది. కులాన్ని జన్మతో ముడిపెట్టడం ప్రారంభమైంది. చాతుర్వర్ణాల ధర్మాలు కూడా నిర్ణయించారు. ఆయా ధర్మాలను నిర్వర్తించడానికి కావల్సిన జ్ఞానాన్ని వైదిక సమాజంలో వ్యక్తి అభ్యసించాలనే సామాజిక కట్టుబాట్లు మొదలయ్యాయి.
శాస్ర్తియ విభజన
సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విభజించినట్టే జీవితాన్ని కూడా నాలుగు దశలుగా విభజించారు. శిశువు ఐదేళ్లు గడచిన తర్వాత ఏడేళ్లలోపు ఉపనయనం, అనంతరం బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభించి 18వ సంవత్సరం వరకూ గురువు సన్నిధిలో విద్యాభ్యాసం కొనసాగించేవారు. ఈ దశలో లౌకిక జీవనం సుఖమయం చేసుకుని సమాజంలో వ్యక్తి తన విధులను సక్రమంగా నేర్చుకోవడానికి తగిన విద్యాబోధన, ముక్తిమార్గానే్వషణకి పునాది వేసేవారు. చివరకి సమవర్తనోత్సవం (స్నాతకోత్సవం)లో పాల్గొని గురుదక్షిణ ఇచ్చి గురువు దగ్గర ప్రతిజ్ఞ తీసుకుని బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచి గృహస్తాశ్రమంలోకి విద్యార్థి ప్రవేశించేవాడు. తాను నేర్చిన విద్యను ఆచరణలో పెట్టి అందులోని లోటుపాట్లను గ్రహించేవాడు. ఈ కాలంలోనే వ్యక్తి ఆచార్యత్వాన్ని స్వీకరించేవాడు. తనకు లభ్యమైన విశ్రాంతిని విజ్ఞానాభివృద్దికి, నూతన విద్యానే్వషణకు, విజ్ఞాన వినియోగానికి, శిష్యుల ద్వారా నిత్యం సంఘంలో పరిస్థితులను తెలుసుకోవడానికి సమాజకళ్యాణానికి పాటుపడేవారు. ఆధ్యాత్మిక దృక్పథం సన్నగిల్లి సమాజంలో కర్మకాండకు, ఆచార వ్యవహారాలకు అధిక ప్రాధాన్యం రాగానే మఠాధిపతులు, రాజ్యాధిపతులు విద్యావ్యవస్థను దారిమళ్లించారు.
ఈ క్రమంలోనే లౌకిక విద్యావిధానం అనేది అమలులోకి వచ్చింది. హిందూ విద్యావిధానానికి రెండు ఆశయాలు ఉండేవి. 1. ఐహికం, 2. ఆముష్మికం. ఐహిక జీవనానికి, సమాజంలో సంఘజీవనానికి అపరావిద్య, పరలోక సంబంధమైన అంశాలకు పరా విద్య ఉండేవి. ప్రాచీన ఆర్య సంప్రదాయ విధానంలో విద్యా బోధన ప్రధానంగా వౌఖికం గానూ, శ్రవణం ద్వారా సాగేది. అపుడే వల్లెవేసే పద్ధతి మొదలైంది.
సాముదాయక బోధన
ప్రాచీన విద్యా విధానంలో సాముదాయక బోధన లేదు. వైయక్తిక విద్యా బోధనలో వ్యక్తి అభివృద్ధికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యం ఉంటుంది. సుశిక్షితుడైన వ్యక్తి మాత్రమే సమాజంలో తన హక్కులను సమాజం పట్ల తన బాధ్యతలను అవగాహన చేసుకోగలుగుతాడు. అందుకే ప్రతి వ్యక్తికీ అన్ని అవకాశాలూ అందుబాటులోకి తీసుకురాగలిగితే సంఘంలో ఎటువంటి ఆటంకం లేక భౌతిక, మానసిక, నైతిక , ఆధ్యాత్మిక సంభావ్యతలను అలవరుచుకునే అవకాశం ఏర్పడుతుంది. దీనినే జీవశాస్తవ్రాదులు ఒక విధంగా ప్రకృతి వాదులు మరో విధంగా విజ్ఞాన శాస్తవ్రాదులు, ఆధ్యాత్మిక వాదులు, ప్రగతిశీల వాదులు తమదైన శైలిలో నిర్వచనాలిచ్చారు.
ప్రాచీన విద్యలో ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో ప్రతిభ ఉన్న కొందరు విద్యార్థులు బోధన కార్యక్రమంలో పాల్గొనే వారు. ఈ పద్ధతిలో తరగతులను నిర్వహించడాన్ని పాశ్చాత్యదేశాల్లో మానిటోరియల్ సిస్టం అని పిలిచేవారు. 18వ శతాబ్దంలో మద్రాసులో పనిచేసిన బెల్ అనే ఆయన ఈ పద్ధతిని మనదేశంలో చూసి, ఇంగ్లాండ్‌లో దీనిని ప్రవేశపెడితే తక్కువ ఖర్చుతో సార్వజనీన విద్యను అందించగలమని ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. ఈపద్ధతినే ఇంగ్లాండ్‌లో బెల్ సిస్టం అనే పేరుతో ప్రచారం పొందింది. తర్వాతర్వాత అనేక పరిణామాల అనంతరం ఆంగ్లేయుల పాలనలో పాశ్చాత్య విద్యావిధానం అమలులోకి వచ్చింది.
సాలుసరి పరీక్షలు
నిర్ధిష్ట కాలక్రమ పట్టిక, ప్రత్యేక పాఠ్య విషయాలు, ప్రత్యేక ఉపాధ్యాయుల నెల వారీ వేతనాలపై ఉపాధ్యాయుల నియామకం, విద్యార్జనకు ఫీజులు కట్టడం, సాలుసరి పరీక్షలు, ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతి వంతున విద్య నిచ్చెన మెట్లు ఎక్కడం, విద్యా విధానంపై ప్రభుత్వ పర్యవేక్షణ ప్రారంభం అయ్యింది. క్రీ.శ. 1600 నాటికే ఫ్రెంచి, డచ్చి, బ్రిటిష్ వర్తకులు భారతదేశంలో వ్యాపారాభివృద్ధికి పోటీపడ్డారు. మొగలాయి పాలకులను, హిందూ సంస్థానాదీశులను ఆశ్రయించి, కలకత్తా, ముంబై, చెన్నై మొదలైన కీలక ప్రాంతాల్లో గిడ్డంగులు స్థాపించారు. ఈ గిడ్డంగుల రక్షణకు సైనికులు, వారి అధ్యాత్మిక జీవన క్రమానికి వారితో పాటు క్రైస్తవ మత ప్రచారకులు దేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. 18వ శతాబ్దంలో తూర్పు ఇండియా కంపెనీ దేశరాజకీయాల్లో ప్రవేశించి ఇతర పాశ్చాత్య వర్తక సంఘాలను అణిచివేయగలిగింది. దేశంలో కంపెనీ నిబంధనల చట్టం-1813 అమలులోకి రావడంతో విద్య విధానం గాడితప్పి కొత్త రూపానికి సంతరించుకుంది. విద్యా సంఘాలకు కంపెనీ కొత్త చట్టం ప్రకారం ఏటా లక్ష రూపాయిలు గ్రాంట్ ఇవ్వడానికి నిశ్చయించింది. దీంతో కంపెనీ సూత్రం ప్రకారం భారతదేశంలో సంస్కృతీ సాహిత్యాల వికాసానికి, పండితుల పోషణకు శాస్త్ర విజ్ఞాన బోధనలకు ఏటా లక్ష రూపాయిలు ఖర్చు చేయాలి, ఈ గ్రాంట్ భారతీయ సాహిత్య వికాసానికి ఖర్చుచేయాలా లేక ఆంగ్ల సాహిత్య వికాసానికి ఖర్చు చేయాలా కంపెనీ ప్రోత్సహించాల్సింది ప్రాగ్విజ్ఞానమా(ఓరియంటల్ నాలెడ్జి), లేక పాశ్చాత్య విజ్ఞానమా? విజ్ఞాన బోధన భారతీయ భాషల్లో కొనసాగాలా? లేక ఆంగ్లంలో కొనసాగాలా? అనే మీమాంశ ఏర్పడింది.
విద్యకు నిర్ణీత శ్రేణి
1854లో ఉడ్ నివేదిక ప్రకారం విద్యను నిర్ణీత శ్రేణుల్లో విభజించాలని నిర్ణయించారు. 1882లో హంటర్ నివేదిక, 1902లో భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ నివేదికలు విద్య రూపాన్ని పరిశుద్ధం చేశాయి. 1935లో మెకాలే ప్రతిపాదనలు వచ్చాయి. దేశంలో కొత్త విశ్వవిద్యాలయాలు నెలకోల్పాలని, వర్శిటీలకు సిండికేట్‌లు ఉండాలని, సెనేట్‌లు ఉండాలని, పరీక్ష విధానంలో మార్పులు అవసరమని, అనుబంధ కాలేజీలను అనుమతించేటపుడు వర్శిటీల పాత్ర కూడా నిర్దేశించారు. 1904లో భారతీయ విశ్వవిద్యాలయ చట్టం అమలులోకి వచ్చింది.
1917లో సర్ మైఖేల్ శాడ్లర్ కమిషన్ నివేదిక ఆధారంగానే అన్ని వర్శిటీలో బోధన వనరులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పాఠశాల స్థాయి నుండి విద్యలో వౌలికమైన మార్పులు చేయాలని, రెండేళ్ల ఇంటర్మీడియట్‌ను డిగ్రీ కాలేజీల నుండి విడదీయాలని నిర్ణయించారు. 1929లో హర్టాగ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రాధమిక విద్యలో వృథా, స్తబ్దుతపై దృష్టి పెట్టారు. 1937 ఎబట్, ఉడ్ నివేదికలలో సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్యనూ ప్రోత్సహించాలని సూచించారు. వివిధ శ్రేణుల్లో వివిధ రకాలైన వృత్తి శిక్షణాలయాలను ప్రారంభించాలని పేర్కొన్నారు. 1937 నాటికి జాతీయోద్యమం పతాకస్థాయికి చేరుకోవడం, రెండో ప్రపంచ యుద్ధం, దేశంలో రాజకీయ సాంస్కృతిక గందరగోళం మధ్య కేంద్ర విద్యా సలహా పరిషత్ సర్ జాన్ సార్జంట్‌ను ఆహ్వానించి యుద్ధానంతరం విద్యాభివృద్ధి కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించమని కోరింది. ఈ ప్రణాళికను ఆయన 1944లో అందజేశారు.8 నుండి 14 ఏళ్ల బాలురకు నిర్బంధ ప్రాధమిక విద్యను అందించాలని సార్జంట్ కమిషన్ సూచించింది. వికలాంగుల విద్యపైనా దృష్టి పెట్టాలని, సాధారణ విద్య నుండి సాంకేతిక విద్యకు మారేందుకు అవకాశం కల్పించాలని సార్జంట్ కమిషన్ పేర్కొంది. సార్జంట్ నివేదిక ఆధారంగానే ఏఐసీటీఈ, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్‌లు ఏర్పాటయ్యాయి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా సార్జంట్ నివేదిక చాలాకాలం పాటు మార్గదర్శకంగా ఉంది.
స్వాతంత్య్రానంతరం విద్యావ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నాలు జరిగాయి. వాటిలో విశ్వవిద్యాలయాల కమిషన్ (రాధాకృష్ణన్ కమిషన్ ) -1947, మాధ్యమిక విద్యా కమిషన్ (డాక్టర్ ఏ లక్ష్మణ్‌స్వామి ముదిలియార్ కమిషన్)-1952, 1956-57లో అఖిల భారత స్థాయిలో మొట్టమొదటి విద్యా సర్వే, 1967 లో రెండో విద్యా సర్వే, 1973లో మూడో విద్యా సర్వే, 1978లో నాలుగో విద్యా సర్వే, 86లో ఐదో విద్యా సర్వే, 1993లో ఆరో విద్యా సర్వే దేశంలో విద్యాస్థితిగతులను కళ్లకుకట్టినట్టు వివరించాయి. జాతీయ విద్యా కమిషన్ (కొఠారీ కమిషన్)-1964 ముఖ్యమైనవి. ఇవి కాకుండా కొన్ని ప్రత్యేక విద్యా సమస్యలపై కూడా ఇంకొన్ని సంఘాలను నియమించారు.
అంతర్జాతీయంగా కొనసాగుతున్న కృషిలో భాగంగానే భారత్‌లో 1968లో జాతీయ విద్యావిధానం, నవీకరించిన జాతీయ విద్యా విధానం, 1985లో ప్రొఫెసర్ డీపీ ఛటోపాధ్యాయ నేతృత్వంలోని కాన్‌పోలిస్ కమిటీ, 1992లో జనార్ధనరెడ్డి కమిటీ నివేదిక, 2001లో సర్వశిక్షా అభియాన్, 2005లో నేషనల్ నాలెడ్జి కమిషన్ నివేదికలు, 2009లో నిర్బంధ ఉచిత విద్య హక్కు చట్టం, ప్రొఫెసర్ యుశ్‌పాల్ కమిటీ నివేదిక, బీజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన నూతన విద్యావిధాన పత్ర రూపకల్పన కమిటీలు చాలా ముఖ్యమైనవి.
ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలు ఆధారంగా అనేక మార్పులూ, చేర్పులూ జరిగాయి. విద్యా విధానంలో జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల్లోనూ , పూర్వ విద్య, ప్రాధమిక విద్య, మాధ్యమిక విద్య, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్యలో అనేక సంస్కరణలు వచ్చాయి. వయోజన విద్య, బాలికా విద్య, నిమ్నవర్గాల విద్య, అల్పసంఖ్యాక వర్గాల విద్యకు కొత్త కొత్త పథకాలు అమలుచేశారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఎఐసీటీఈ తరహాలో ఎన్‌సీటీఈ వంటి అపెక్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. నాణ్యతా పరిరక్షణకు ఎన్‌బీఏ, నేక్ సంస్థలు, పుస్తకాల పాఠ్యప్రణాళిక రూపకల్పనకు ఎన్‌సీఈఆర్టీ, పరీక్షల నిర్వహణకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు, గణాంకాల రూపకల్పనకు నీపా, వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇలా విద్యారంగంలో ప్రతి విభాగాన్ని పరిరక్షించేందుకు, పర్యవేక్షించేందుకు నియంత్రణ మండళ్లు, వ్యవస్థలు రూపుదిద్దుకున్నాయి.
అంతర్జాతీయంగా సైతం యునెస్కో, ఐక్యరాజ్యసమితిలు విద్య సంవర్ధనపై ఎన్నో కమిటీలను నియమించాయి. అంతర్జాతీయ ఒప్పందాలను ఏర్పాటు చేశాయి. యునెస్కో ఎప్పటికపుడు ఖండాల వారీ, దేశాల వారీ విద్యావ్యాసంగం ఎలా ఉందో వివరించే నివేదికలను రూపొందించింది. వాటిని గమనంలో ఉంచుకునే జాతీయ స్థాయిలో అనేక కమిటీలు పనిచేశాయి. స్థానిక అవసరాలు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిఫార్సులు చేశాయి. 21వ శతాబ్దంలో విద్యావిధానం ఎలా ఉండాలనేదానిపై జాక్వస్ డెలార్ 1996లో ఇచ్చిన నివేదిక ప్రాతిపదికగా యునెస్కో అనేక సంస్కరణలకు నడుం బిగించింది.
ముందురోజే చూసుకోవాలి
* ముందు రోజే పరీక్ష కేంద్రాలను చూసుకోవాలి. అక్కడికి వెళ్లి వాకాబు చేసుకోవాలి. పరీక్ష రోజు కనీసం రెండు గంటల ముందు కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష రోజు ఎంత లేదన్నా కొంత ఒత్తిడి ఉంటుంది కనుక ఆహారం తప్పనిసరి తీసుకోవాలి.
ఆభరణాలు వద్దు
* పరీక్ష రోజు ఆహ్లాదంగా సిద్ధం అవ్వండి, ఆభరణాలు వేసుకోవద్దు, విచిత్రమైన చేతి గడియారాలు తగిలించుకోవద్దు. సాధారణ డ్రెస్‌లే వేసుకోండి. ఎక్కువ పాకెట్లు ఉన్న డ్రెస్‌లు అస్సలు వద్దు. ఈ మధ్య అన్ని పరీక్షలకు డ్రెస్ కోడ్ పెడుతున్నారు. ముందుగానే మీరు రాస్తున్న పరీక్షకు సంబంధించిన డ్రెస్ కోడ్ తెలుసుకోండి
ఉచితంగా ఆన్‌లైన్ నోట్సులు
* పరీక్షల సన్నద్ధతకు వేలు, లక్షలు వెచ్చించాల్సిన పనే్లదు, యూట్యూబ్‌కు వెళ్తే లక్షలాది వీడియోలు అన్ని అంశాలపై అందుబాటులో ఉన్నాయి. పరీక్షల సమయంలో కాకుండా చాలా ముందుగా సమయం చిక్కినపుడు యూట్యూబ్ వీడియోలను చూడటం, కొన్ని ఆన్‌లైన్ టెస్టులు రాయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
ఆలోచిస్తూ గడిపేయవద్దు
* ప్రశ్నాపత్రంలో తొలి ప్రశ్నకు సమాధానం రాస్తూ గడిపేయవద్దు. ఒక వేళ అది కష్టంగా అనిపిస్తే వెంటనే తర్వాతి ప్రశ్నకు వెళ్లిపోవాలి. మొత్తం ప్రశ్నాపత్రంలో ఖచ్చితంగా తెలిసిన సమాధానాలను ముందుగా రాయాలి. తర్వాత మరోమారు చూసుకుని మిగిలిన వాటికి సమాధానాలు ఇవ్వాలి. తెలిసిన జవాబులే వచ్చినా, ఒక్కో మారు అన్నింటికీ సమాధానం రాసే సమయం చిక్కదు. కనుక జవాబులు రాసేటపుడు టైం మేనేజిమెంట్ తప్పనిసరి పాటించాలి. లేకుంటే తెలిసిన జవాబులు కూడా వదిలేయాల్సి వస్తుంది.
* ప్రతి రోజూ కనీసం ఆరు నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. నిరంతరం విరామం, విశ్రాంతి, ఆటవిడుపు ఉండాలి కనుక దేనినీ విస్మరించాల్సిన పనే్లదు. అలా అని ఆటల్లోనో, టీవీలోనో, సెల్‌ఫోన్‌లోనో మునిగిపోవద్దు..
* పరీక్షలకు సిద్ధం అయ్యేవారు క్రమపద్ధతిలో సంసిద్ధం అయితే అది శిక్షగా అనిపించదు. పరీక్షలకు ముందు రోజు చదవడం, లేదా 20 రోజుల ముందు చదువు ప్రారంభించడం మంచిది కాదు.
* ప్రతి అంశానికీ స్వయంగా నోట్సు తయారుచేసుకోవాలి , చిన్న చిన్న కార్డులపై వాటిని నోట్ చేసుకోవాలి. పాఠాల వారీ వాటిని ట్యాగ్ చేసి ఉంచుకుంటే రివిజన్‌కు అవి బాగా ఉపయోగపడతాయి.
ఆన్ లైన్ ప్రాక్టీస్
ఇపుడు అంతా ఆన్‌లైన్ మయం కనుక కొన్ని ఆన్‌లైన్ టెస్టులు మాక్ టెస్టులు రాయాలి. దాని వల్ల కొంత ప్రాక్టీస్ అవుతుంది.
మరో రెండు మూడు నెలల్లో దేశంలో నూతన విద్యావిధానం అమలులోకి రాబోతోంది. నూతన విద్యావిధానానికి తుది రూపం ఇచ్చేముందు జాతి ఆలోచనలను కోరింది. నాటి కేబినెట్ కార్యదర్శి టీఎస్‌ఆర్ సుబ్రమణియన్ కమిటీ రిపోర్టు పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం మరింత సమగ్రత కోసం శాస్తవ్రేత్త డాక్టర్ కే కస్తూరి రంగన్ అధ్యక్షతన నూతన విద్యా విధాన రూపకల్పన కమిటీని నియమించింది. ఈ కమిటీ హేమాహేమీలతో భేటీ అయ్యింది. జయప్రకాశ్ నారాయణ, పీ రామారావు, జేఎస్‌రాజ్‌పుత్, విజయ్ కేల్కర్, అనిరుధ్ దేశ్‌పాండే, దినేష్‌సింగ్, మోహన్‌దాస్‌పాయ్ వంటి వారితో సమాంతరంగా చర్చించింది. దేశవ్యాప్తంగా 70కి పైగా వర్కుషాప్‌లను నిర్వహించింది. పూర్వ విద్య, భాషలు, ఉపాధ్యాయ విద్య , ఉన్నత విద్య, సాంకేతిక విద్య, పాఠశాల నిర్మాణం, విద్యాసాంకేతికత, నేషనల్ రీసెర్చి ఫౌండేషన్, రాష్ట్రీయ శిక్షా ఆయోగ్, విద్యాసంస్థలకు ఆర్ధిక సహకారం అందించడంపై కమిటీ నివేదిక ఇచ్చింది. 2019 జనవరి 3న నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టంలోని క్లాజు 16ను పార్లమెంటు సవరించింది. ఏ విధంగా చూసినా డిటెన్షన్ విధానం పరీక్షలతో ముడిపడిన అంశం.
నూతన మూల్యాంకన పద్ధతులు పరీక్షల ఒత్తిడి తగ్గిస్తాయని భావించినా, అవి మరింత పెంచుతునే ఉన్నాయి. అంతర్మూల్యాంకనం, గ్రేడింగ్ పద్ధతి ఏదీ సరైన పరిష్కారం కావడం లేదు. అయితే సారూప్యతను సాధించడంలో ఈ చర్యలు సత్ఫలితాలనే ఇచ్చాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా అన్ని పోటీ పరీక్షలకూ జాతీయ పరీక్షా వ్యవస్థ- నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ఏర్పాటు గొప్ప నిర్ణయమే. అందులో భాగంగానే పరీక్షల సంస్కరణలు కూడా ఇమిడి ఉన్నాయి.
మారుతున్న దేశ సామాజిక ఆర్ధిక పరిస్థితులతో పాటు పరీక్షల విధానమే కాదు, దేశ విద్యావిధానం కూడా ఎప్పటికపుడు పరిణామం చెందుతూ ఉండాల్సిందే. ఆ విధంగా విద్యా వ్యవస్థ మార్పు చెందినపుడే ఆ వ్యవస్థకూ , ప్రజల అవసరాలకు, ఆశయాలకు ఒక పొంతన ఉంటుంది. విద్యా వ్యవస్థ సార్ధకమవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వర్తమానానికీ, భవిష్యత్‌కూ విద్య విశిష్టమైన మదుపు. అదే జాతిని సంస్కృతీకరించే పాత్రను కూడా పోషిస్తుంది. జాతి సమైక్యతను దోహదం చేసే దృక్కోణాన్ని, మనో భావాలను కూడా మెరుగుపెడుతుంది. శాస్ర్తియ దృష్టినీ , స్వతంత్రంగా ఆలోచించే మానవ శక్తినీ పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్య నవసమాజ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.
బెస్ట్ ఆఫ్ లక్...