ఈ వారం స్పెషల్
అమ్మభాష కమ్మదనం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మాతృభాష అంటే అమ్మ భాష.. తల్లి ఉగ్గుపాలతో రంగరించి తాను మాట్లాడుతూ, బిడ్డలకు నేర్పించే భాషనే మాతృభాష అంటారు. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. ప్రతి మనిషి పుట్టగానే తల్లి పొత్తిళ్లలోనే మాతృభాషను నేర్చుకుంటాడు. మనిషి పుట్టగానే నేర్చుకునే ప్రథమ భాష కాబట్టే దీన్ని మాతృభాష అని పిలుస్తున్నారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 21న జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. భారతదేశం 1947లో విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. ఆ సమయంలో బెంగాల్ ప్రాంతంలోని పశ్చిమభాగం భారతదేశంలోని తూర్పు ప్రాంత పాకిస్తాన్‌లోకి వెళ్లిపోయింది. తూర్పు పాకిస్తాన్‌గా గుర్తింపు పొందిన ఆ ప్రాంతానికి, పాకిస్తాన్‌కు మధ్య సాంస్కృతిక, ఆర్థిక, భాషాపరమైన ఘర్షణలు ఏర్పడినాయి. పాకిస్తాన్‌లో అధికార భాషగా ఉర్దూను ప్రకటించారు. బెంగాలీ భాషను మాట్లాడే తూర్పు పాకిస్తాన్‌లో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో అక్కడ హింసతో కూడిన ఉద్యమం ప్రారంభమైంది. ఫలితంగా ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు 21 ఫిబ్రవరి 1956లో ప్రాణాలు కోల్పోయారు. ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చడంతో గత్యంతరం లేక 28 ఫిబ్రవరి 1956న పాక్ సర్కార్ బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. అనంతరం జరిగిన విముక్తి పోరాటంలో ఆ ప్రాంతం బంగ్లాదేశ్‌గా అవతరించింది. మాతృభాష కోసం ఫిబ్రవరి 21న మరణించిన నలుగురు విద్యార్థుల జ్ఞాపకార్థం ఆ రోజును ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో 17 నవంబర్ 1999న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21గా ప్రకటించింది. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా 21 ఫిబ్రవరి 2000 నుండి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఏ భాష అయినా భావ వ్యక్తీకరణకు తోడ్పడే సాధనమనే చెప్పాలి. నోటితో చేసే ధ్వనుల రూపానే్న భాష అని అంటాము. మన ఆలోచనలు ఇతరులకు తెలియజేయడానికి, ఇతరుల భావాలను మనం తెలుసుకోవడానికి ఉపయోగించే మాధ్యమమే భాష.
అధికార భాష
ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలున్న భాషలు రమారమి ఆరువేలు ఉంటాయి. ప్రపంచీకరణ పుణ్యమా అని వీటిలో సగానికి సగం మృతభాషలుగా మారిపోవడానికి ప్రమాదపుటంచులో ఉన్నాయి. మన తెలుగు భాష కూడా ఈ జాబితాలో ఉన్నట్లు యునెస్కో సర్వేలో తేలింది. ఎక్కడైతే 30 శాతం మంది పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తారో ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్లేనని యునెస్కో పేర్కొంది. ఇటువంటి లెక్కలను అనుసరించి మన మాతృభాష అయిన తెలుగు మృతభాషగా మారే ప్రమాదపుటంచుల్లో ఉన్నట్లు చెప్పవచ్చు. అందువల్ల మన మాతృభాషను కాపాడుకోవడానికి అనేకమంది తెలుగు భాషా ప్రియులు కంకణం కట్టుకుని పలు రకాలుగా ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నారు. గత మూడు వందల ఏళ్లల్లో ఆస్ట్రేలియా, అమెరికా దేశాలలో అనేక మాతృభాషలు అంతరించిపోయాయి. ఈ కారణంగానే యునెస్కో మాతృభాష పరిరక్షణ అనేది ప్రజల పౌర, జాతీయ, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులలో అంతర్భాగమని తేల్చి చెప్పింది. మన దేశంలో దాదాపు 3, 372కు పైగా భాషలు మాట్లాడతారని తేలింది. ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడే దేశం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదేమో? ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరువేల భాషలు మాట్లాడుతున్నారని అంచనా. వీటిలో దాదాపు సగం భాషలు ప్రమాదపుటంచులో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి సర్వేలో తేలింది. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో హిందీ మాతృభాషగా ఉంది. అయితే ప్రాంతీయంగా అక్కడి వారు మరికొన్ని ఇతర భాషలు కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిషా, పంజాబ్, బెంగాల్, కాశ్మీర్ ఇత్యాది వారికి ప్రాంతీయంగా వారి మాతృభాషలు ఉన్నాయి. ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి వెళ్లినప్పుడు భాషా సమస్య కూడా ఉత్పన్నమైనది. బ్రిటీష్ వారి పాలనా కాలంలో ఆంగ్ల భాషను కొందరు నేర్చుకోవడంతో ఒకరి భావాలు మరొకరు తెలుసుకునే అవకాశం కలిగింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వ కార్యకలాపాలు జాతీయస్థాయిలో ఏ భాషలో చేయాలనే ప్రశ్న ఉత్పన్నమైనది. ఆ కారణంగా మన నాయకుల మధ్యన జరిగిన చర్చల ఫలితంగా 14 సెప్టెంబర్ 1949లో హిందీని అధికార భాషగా నిర్ణయించారు. ఎన్నో మలుపుల మధ్య భారత రాజ్యాంగంలోని 343వ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. ఆ కారణంగా ఆంగ్ల భాష అధికార హోదాను కోల్పోయింది. హిందీ భాషకు పట్టం కట్టారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతీయ కార్యకలాపాలను మాతృభాషలోనే జరుపుకోవచ్చని పేర్కొనడంతో ఈ వివాదం కొంతమేరకు సద్దుమణిగింది. హిందీతో పాటు ఆంగ్ల భాష కూడా ఉండాలని తమిళులు ఉద్యమాలు జరిపారు. హిందీతో పాటు ఆంగ్ల భాషను సైతం 15 సంవత్సరాల పాటు ఉపయోగించుకోవచ్చని 26 జనవరి, 1950లో తీర్మానించారు. తరువాత హిందీ, ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో సైతం ప్రభుత్వ కార్యకలాపాలు చేసుకోవచ్చని నిర్ణయించారు. ఇన్ని చేసినా ఇప్పటికీ ప్రభుత్వ కార్యకలాపాలు అనేక రాష్ట్రాలలో ఆంగ్లభాషలోను, మరికొన్ని రాష్ట్రాలలో హిందీలోను జరుగుతున్నాయి. ఆంగ్లం, హిందీ భాషల ప్రాధాన్యత ప్రాంతీయ భాషలకు లభించకపోవడం శోచనీయం.
భారతదేశంలోని 130 కోట్ల మంది జనాభాలో హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఇత్యాది అనేక రాష్ట్రాలలోని కోట్లాది ప్రజలు హిందీని మాట్లాడుతున్నారు. అందువల్ల అక్కడ హిందీ అధికార భాషగా మనగలుగుతుంది. ఇతర రాష్ట్రాలతో కేంద్రం ఆంగ్లభాషలోనే కార్యకలాపాలు నడుపుతుంది. తొలుత దక్షిణాది వారికి హిందీ భాష తెలియదు. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి అనేక రాష్ట్రాల వారు హిందీని విధిగా నేర్చుకుంటున్నారు. దీన్ని అనుసరించి హిందీతో పాటు ఆంగ్లభాష, వారి ప్రాంతీయ భాషలో కూడా విద్యాభ్యాసం చేయడానికి అవకాశం కలిగింది. అనేక వందల మాతృభాషలకు నిలయమైన భారతదేశంలో పర్యటించాలంటే హిందీ, ఆంగ్లభాష తప్పనిసరిగా నేర్చుకోవలసిన అవసరం వచ్చింది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ ద్వితీయ స్థానం పొందగా, బెంగాలీ భాష ఏడవస్థానం, పంజాబీ పదవ స్థానం పొందాయి. తెలుగు రాష్ట్రాలలో 9 కోట్ల మంది తెలుగువారుండగా, ఇతర రాష్ట్రాలు, 120 దేశాలలో మరో ఆరుకోట్ల మంది వెరసి 15 కోట్ల మంది ఉంటారని అంచనా. అందువల్లే ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగుకు 6వ స్థానం, భారతదేశంలో హిందీ తరువాత అత్యధికం ప్రజలు మాట్లాడే భాష తెలుగు అంటే ఆశ్చర్యం కలగక మానదు. అందువల్ల భారతీయ భాషల్లో తెలుగుకు ద్వితీయ స్థానం ఇవ్వాలని అనేక మంది పోరాటం జరుపుతూనే ఉన్నారు. నిజానికి మనదేశంలో 16 వందలకు పైగా మాతృభాషలు ఉన్న ట్లు అంచనా. రెండు వందల భాషలకు వందలాది మాండలీకాలున్నాయి. ఇన్ని భాషలున్నా వేళ్లపై లెక్కించదగిన భాషలకు మాత్రమే లిపి ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1966లో తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ ఒక చట్టం చేశారు. ఆ తరువాత 19 మార్చి 1974లో అధికార భాషా సంఘాన్ని స్థాపించడం జరిగింది. తొలి భాషా ప్రయోక్త రాష్ట్రంగా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీనికి తొలి అధ్యక్షుడిగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య నియమితులయ్యారు. అధికార భాషా సంఘంతో పాటు అనేకమంది ప్రభుత్వ కార్యకలాపాలు మాతృభాషలోనే జరగాలని ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో సఫలీకృతం కాలేకపోయారు. పాలకుల భాష ఒకటి, ప్రజల భాష మరొకటిగా మారిపోయాయి. హిందీ, ఆంగ్లంతోకలిపి మన దేశంలో 22 అధికార భాషలున్నాయి. వీటిలో ఇండో-ఆర్యన్ భాషలు 5, టిటెటో-బర్మా భాషలు 2, ద్రావిడ భాషలు - 4, ముండా అనే భాష ఒకటి వెరసి 22 అధికార భాషలు గుర్తింపు పొందాయి. సంస్కృతంతో పాటు తెలుగు, తమిళ భాషలు సైతం 31 అక్టోబర్ 2008లో భారత ప్రభుత్వ గుర్తింపు పొందాయి.
అభివృద్ధి చెందిన దేశాలలో మాతృభాష
మాతృభాష అంటే ఎవరి మాతృభాష అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎవరి మాతృభాషలు వారికున్నాయి. ఎన్ని మాతృభాషలు ఉన్నా మన ఆహారం, సంప్రదాయం, మాతృభాషను ప్రతి ఒక్కరూ మరింతగా ఇష్టపడతారు. మన ఇంటి భాషే సొంతభాషగా అక్కున చేర్చుకుంటాము. సాంకేతికంగా అభివృద్ది చెందిన చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, స్వీడన్, రష్యా, స్విట్జర్లాండ్ ఇత్యాది అనేక దేశాలలో వారి మాతృభాషల్లోనే విద్యాబోధన జరుగుతుంది. ఇంగ్లండ్, అమెరికాలలో ఆంగ్లం మాతృభాష కావడంతో అక్కడ మాతృభాష అయిన ఆంగ్లంలోనే విద్యాబోధన జరుగుతుంది. అమెరికాలో ఇంటర్ విద్యనందు ప్రపంచ భాషల్లో ఇష్టమైన ఒక భాషను ఐచ్ఛికంగా తీసుకుని విధిగా నేర్చుకోవాలి. విద్యాభ్యాసంలో భాగంగా విద్యార్థి ఎంచుకున్న భాష నేర్చుకున్న పిదప, ఆ భాషను మాట్లాడే దేశానికి వెళ్లి కొన్ని మాసాల పాటు అక్కడే నివసించి అక్కడి ప్రజలతో మమేకమై పూర్తి స్థాయిలో ఆ భాషను నేర్చుకోవాలి. మన దేశం నుండి అనేక మంది వైద్య విద్యను అభ్యసించడానికి నేడు చైనా వెళుతున్నారు. అటువంటివారు ఏడాదిలోగా చైనా భాషను నేర్చుకుని సంభాషించాలి. లేకుంటే వారు వైద్య విద్యను నేర్చుకోవడానికి అనర్హులుగా ప్రకటించి వారి దేశానికి పంపించి వేస్తారు.
ఆంగ్ల మాధ్యమ విద్య
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాధ్యమాన్ని తీసివేసి ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమమే అయినప్పటికీ ఒక తెలుగు పాఠ్యాంశం ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ అంతా తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ప్రజా వ్యతిరేకంతో పాటు మరికొన్ని సాంకేతిక కారణాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రాథమిక స్థాయి వరకు పూర్తి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేసి ఏడాదికి ఒక తరగతి చొప్పున ఆంగ్ల మాధ్యమాన్ని పెంచుకుంటూ పోవాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. శాస్ర్తియ అధ్యయనం లేకుండా తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేసి, తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేస్తున్న 26 లక్షల మంది విద్యార్థులపై ఆంగ్ల మాధ్యమాన్ని బలవంతంగా రుద్ది, నిర్బంధం చేసిన ఈ నిర్ణయాన్ని కూడా అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. ప్రాథమిక స్థాయి వరకు తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన చేసి 6వ తరగతి తరువాత ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని, తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు రెండింటినీ కొనసాగిస్తే ఎవరికి ఇష్టమైన మాధ్యమంలో వాళ్లు విద్యాభ్యాసం చేస్తారనేది అనేకమంది వాదన. తెలంగాణా ప్రభుత్వ పాఠశాలల్లో రెండు మాధ్యమాలలో విద్యాభ్యాసము చేయడానికి వెసులుబాటు కల్పించడంతో అక్కడి ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. నిజానికి ఆంగ్ల మాధ్యమమనేది ఇప్పటి అంశం కాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు 2007 ప్రాంతంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేశారు. అప్పటి అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబికె ప్రసాద్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దాంతో రాజశేఖర్‌రెడ్డి ఈ విషయమై కొన్ని మార్పులు చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని జిల్లాపరిషత్, పట్టణ ప్రాంతాల్లోని మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకున్న 500 మందికి పైగా విద్యార్థులున్న పాఠశాలకు సక్సెస్ పాఠశాలల పేరుతో అదే పాఠశాలలో ఒక విభాగాన్ని ప్రారంభించి తొలుత 6, 7 తరగతులకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుకుంటూ పదవ తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన చేయాలనేది ఆయన ఆలోచన. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అనేది ఐచ్ఛికం కావడంతో ఇష్టం లేని వారు తెలుగు మాధ్యమంలో కూడా చదువుకునే అవకాశం ఉన్నందున తెలుగు భాషాభిమానుల్లో అంత తిరుగుబాటు రాలేదు. ఆ తరువాత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత అప్పటి విద్యాశాఖామాత్యులు డాక్టర్ సి నారాయణ పట్టణ ప్రాంతాలలోని మున్సిపల్ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమ విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు. తొలుత 6, 7 తరగతులకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టి తరువాత ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుకుంటూ పదవతరగతి వరకు పూర్తి స్థాయి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని భావించారు. తెలుగు మాధ్యమాన్ని తొలగించరాదనే వ్యతిరేకత రావడంతో ఆంగ్ల మాధ్యమాన్ని ఐచ్ఛికం చేసి ఎవరికి ఇష్టమైన మాధ్యమంలో వారు విద్యాభ్యాసం కొనసాగించవచ్చని నిర్ణయించారు.
నాడు ఆంగ్లమాధ్యమ విద్యాబోధన నిర్ణయాన్ని వ్యతిరేకించిన వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తదుపరి నేడు యూటర్న్ తీసుకుని తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి ఆంగ్లమాధ్యమ విద్యను నిర్బంధం చేస్తున్నామనడంతో సమస్య తీవ్రతరమై చాలా వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
మాతృభాష తల్లిపాల వంటిది
ఐక్యరాజ్యసమితి 28 జనవరి 2019 సంవత్సరాన్ని అంతర్జాతీయ దేశీయ భాషల సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 2680 భాషలు మృతభాషలుగా మారుతున్నాయని, అందులో తెలుగు భాష కూడా ఉన్నట్లు ఐరాస ప్రకటించడంతో తెలుగు వారిలో ఆందోళన ప్రారంభమైంది. మన అమ్మభాషను బ్రతికించుకోవడానికి ఇప్పటి నుండే ఏం చేయాలనే ఆలోచనలు ప్రతి తెలుగు వాడి మెదళ్లలో ఉత్పన్నమైంది. ఐరాస అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏడువేల భాషలు మాట్లాడుతున్నారని అంచనా. మాతృభాష తల్లి వంటిది. పరభాష పోతపాలవంటిది’ అని కొమర్రాజు లక్ష్మణరావు ఒక సందర్భంలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1969లో ఇంటర్ విద్య, 1971 నుండి డిగ్రీ విద్యలో తెలుగును బోధనా భాషగా చేశారు. తెలుగు అకాడెమీ చక్కని పుస్తకాలను రూపొందించింది. మన తెలుగు రాష్ట్రాలలోని సార్వత్రిక విశ్వవిద్యాలయాల ద్వారా పి.జి.లో సైతం చరిత్ర, సామాజిక శాస్త్రం వంటి అనేక పాఠ్యాంశాలను మాతృభాషలో విద్యాభ్యాసం చేసే అవకాశం ఉంది. నేడు మహారాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ భాషగా తెలుగును సైతం ప్రోత్సహిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుండి వలస వెళ్లిన వాళ్లు అక్కడ ఐచ్ఛిక పాఠ్యాంశంగా తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. మూడు విభాగాలలో ఇక్కడి తెలుగు మాధ్యమ పాఠ్యపుస్తకాలు తయారవుతున్నాయి. కొన్ని ప్రథమ భాషగా తెలుగు, తృతీయ భాషగా తెలుగుతో పాటు ఉద్యోగస్తులు బదిలీపై మహారాష్ట్ర వెళితే వారి పిల్లల కోసం ద్వితీయ భాష ఐచ్ఛిక పాఠ్యాంశంగా తెలుగు పాఠ్య పుస్తకాలను తయారుచేస్తున్నారు. పూణేలో మహారాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మాత మరియు పాఠ్య ప్రణాళిక పరిశోధన సంస్థ తెలుగు విభాగ పాఠ్యపుస్తకాల విశేషణాధికారికి డాక్టర్ తులసీ భారత్ భూషణ్ పర్యవేక్షణలో 8వ తరగతి వరకు బాలభారతి, 9, 10 తరగతుల వారి పుస్తకాలకు కుమారభారతి, 11, 12 తరగతుల తెలుగు వాచకానికి యువభారతి అనే పేర్లతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలను ముద్రించి పాఠశాలలకు అందిస్తున్నారు. సుదూర ప్రాంతంలోని మహారాష్ట్ర వంటి వారు సైతం మన తెలుగును బ్రతికిస్తుంటే తెలుగువారమైన మనం మన భాషను బ్రతికించుకోవడానికి కృషి చేయలేమా? అనే విషయాన్ని ప్రతి తెలుగు వాడు ఆలోచించాలి.
ఆంగ్లంలో విద్యాభ్యాసం చేస్తేనే ఉద్యోగాలు వస్తాయా?
మన భాషపై ఉన్న ప్రేమతో పరాయి భాష అయిన ఆంగ్లాన్ని చులకన చేసి మాట్లాడటం సబబు కాదు. ఆంగ్ల భాష నేర్చుకోవడం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. దేని ప్రాధాన్యత దానిదే. అయితే మన మాతృభాషకు నష్టం వాటిల్లకుండా దాన్ని బ్రతికించుకుంటూ ఆంగ్ల భాషతో పాటు ఓపిక ఉంటే ప్రపంచంలోని ఏ భాషనైనా నేర్చుకోవచ్చు. అసలు ఆంగ్ల భాషకు ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏమిటని పరిశీలిస్తే దాన్ని నేర్చుకుంటే ఆర్థికంగా ఎదగవచ్చనే అపోహలో కొట్టుమిట్టాడటమని చెప్పవచ్చు. మన దేశం బ్రిటీష్ వారి పాలనలో ఉన్నప్పుడు ఆంగ్ల భాషను నేర్చుకుంటే ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు అదే అపోహలో మనం జీవిస్తున్నాం. తెలుగు భాషను నేర్చుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తామనే నమ్మకం కల్పించలేకపోతున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ్ల భాషలో విద్యాభ్యాసం చేసిన వారి జీవితాల్ని పరిశీలిస్తే అనేక నిజాలు తెలుస్తాయి. వీరిలో 5 శాతం మంది మాత్రమే అమెరికా వంటి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళుతున్నారు. 15 శాతం మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే, 50 శాతం మంది అసంఘటిత రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. మిగిలిన వారు ఏదో ఒక పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆంగ్లంలో చదివితేనే ఉద్యోగం వస్తుందనడం సమంజసం కాదు. ఆమాటకొస్తే అమెరికాలో అందరూ ఆంగ్లంలోనే మాట్లాడతారు. అక్కడ నిరుద్యోగం ఎందుకు ఉంది? బాల్యం నుండి మాతృభాషలో విద్యాభ్యాసం చేసినప్పటికీ మన పిల్లలు పూర్తి స్థాయిలో డిగ్రీలు పొందలేకపోతున్నారు. ఒకటవ తరగతిలో 12 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే పదవ తరగతి వచ్చేసరికి అయిదు లక్షల మందే విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. మిగిలిన వారు చదువుకు స్వస్తి పలుకుతున్నారు. ఈ సంఖ్య ఇంటర్‌లో 30 శాతం, డిగ్రీకి 20 శాతం, పోస్టు గ్రాడ్యుయేషన్‌కు 5 శాతం మంది మాత్రమే పూర్తి చేస్తున్నారు. అనునిత్యం మాట్లాడే మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తేనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి. అదే పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం చేస్తే మధ్యలోనే చదువును నిలిపివేసే వారి సంఖ్య ఇంకా అధికంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలన్నట్లు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడానికి ముందు అనేక జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. పేదలు, దళిత, మైనారిటీ వర్గాలలో తల్లిదండ్రులు తెలుగే సరిగా చదవలేరు. ఆంగ్ల మాధ్యమంలో పిల్లలు చదివితే వారికి ఏవైనా సందేహాలు వస్తే తల్లిదండ్రుల నుండి విద్యా పరంగా ఎటువంటి సహాయ, సహకారాలు లభించవు. ఉపాధ్యాయులు పూర్తిస్థాయి ఆంగ్లబోధన చేయగలరా? వారికి సరైన శిక్షణనిచ్చారా? ఇలా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లవాడు ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం చేయలేక చేతులెత్తేస్తే పరిస్థితి ఏమిటి? కాబట్టి తెలంగాణాలోలా ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలి. ప్రాథమిక విద్య వరకు తెలుగుమాధ్యమంలోనే బోధించాలి. ప్రాథమిక విద్య ముగిసే వరకు ప్రతి ఏడాది ఆంగ్ల భాషను ఒక పాఠ్యాంశంగా పెట్టడం వల్ల విద్యార్థులు ఆ భాషను నేర్చుకుని అవగాహన పొందుతారు. ఆ తరువాత ఆరవ తరగతి నుండి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే విద్యార్థులు ఎటువంటి బెరుకు లేకుండా ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం చేస్తారు. బలవంతంగా వారిపై ఒక భాషను రుద్దినంత మాత్రాన ప్రతి ఒక్కరూ ఆంగ్లభాషలో రాత్రికి రాత్రి మహాకవి కాళిదాసులు కాలేరు. ఆంగ్ల మాధ్యమంలో బోధన, ప్రస్తుత పోకడలూ, వాటి నుండి వస్తున్న సమస్యలపై అవగాహనపై సమాచారం రాబట్టడానికే ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలంలో ఒక చర్చను లేవనెత్తింది. మీ దేశంలో స్థానిక భాష ఆంగ్లమా? అని ప్రశ్నిస్తే కేవలం 8 శాతం మంది మాత్రమే ఆంగ్ల భాషని సమాధానమిచ్చారు. మీ దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థలో ఆంగ్లం ప్రధాన భాషగా ఉందా? అని అడిగిన ప్రశ్నకు 13 శాతం మంది మాత్రమే ఔనని సమాధానం చెప్పారు. అంటే అనేక దేశాల వారు మాతృభాషకే అధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు తేలింది. ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషా మాధ్యమన విద్యను ప్రోత్సహించడంతో పెరుగుతున్న ఆసక్తిని ధృవీకరిస్తూ ఐరాస 2008లో ఒక అధ్యయన సంకలనాన్ని రూపొందించింది. దీని ప్రకారం ఆంగ్ల మాధ్యమ బోధనలో ఉపాధ్యాయులను, వారి సహాయకులనూ నియమించడం, పాఠ్యాంశాలను రూపొందించడం, మూల్యాంకనం చేయడం ఇత్యాది వాటిలో తలెత్తే సమస్యలను పరిష్కరించుకోవడం అనేది మాతృభాషా మాధ్యమంలో సులభతరం అవుతుంది. విద్యార్థికి అర్థమైనప్పుడే ఆసక్తిగా బోధనపై శ్రద్ధ పెట్టగలడు. మాతృభాషలో విద్యాభ్యాసమైతే తల్లిదండ్రులే కాదు ఇరుగు పొరుగువారు కూడా సందేహాలు నివృత్తి చేయడంలో ఎంతో కొంత సహాయం చేస్తారు. బాలబాలికలకు నిజమైన భావప్రేరణ వచ్చేది మాతృభాషలో బోధన వల్లేనని మహాత్మాగాంధీ 1938లో ‘హరిజన్’ పత్రికలో పేర్కొన్నారు.
ప్రభుత్వాల తప్పిదం
తిలాపాపం తలా కొంచెం అన్నట్లు మాతృభాషకు హాని జరగడంలో ప్రభుత్వాల తప్పిదం కూడా లేకపోలేదు. వాస్తవ పరిస్థితుల్ని వదిలేసి వారి రాజకీయాల కోసం పిల్లల భవితను నాశనం చేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా మన భాషా సంస్కృతుల్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రేమిస్తున్నారు. తప్పితే దాన్ని బ్రతికించుకునే దిశగా అడుగులు వేయడం లేదు. పొరుగు రాష్టమ్రైన తమిళనాడులో వారి మాతృభాషలో విద్యాభ్యాసం చేసిన వారికి ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. మన తెలుగువారు ఇప్పటి వరకు ఇటువంటి చర్యలు చేపట్టలేదు. 1966లో అధికార భాషా చట్టాన్ని తీసుకుని వచ్చాము. ఇన్ని సంవత్సరాలు గడచినా పాలనలో పూర్తి స్థాయిలో తెలుగు అమలుకు నోచుకుందా? అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. నీ బిడ్డలు ఏ మాధ్యమంలో ఎక్కడ చదువుకున్నారంటే, నువ్వెక్కడ చదివావు? అంటూ ఒకరినొకరు అసభ్య పదజాలంతో తిట్టుకుంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పటికైనా పేద బిడ్డల్ని ఎలా పైకి తేవాలనే దానిపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది.
ప్రభుత్వాలు ఏం చేయాలి?
మాతృభాషను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు తమ వంతు కృషి చేయాలి. రాష్ట్రం సచివాలయం నుండి పంచాయతీ వరకు పరిపాలన అంతా తెలుగులోనే జరగాలి. ఇందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలి. న్యాయస్థాన తీర్పులు సైతం తెలుగులోనే ఉండేలా పూనుకోవాలి. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. వంటి పరీక్షలు సైతం తెలుగులో రాసే అవకాశం కల్పించాలి. పాఠశాలల బోధన కనీసం ప్రాథమిక స్థాయి వరకు తెలుగు మాధ్యమంలోనే సాగాలి. ఆ తరువాత ప్రాథమికోన్నత విద్య తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో ఇష్టమైన దాన్ని ఎంచుకుని విద్యాభ్యాసం చేసే అవకాశం విద్యార్థులకు కల్పించాలి. వాడని భాష వాడిపోతుంది. భాష నశిస్తే జాతి మొత్తం నశిస్తుంది.
యువత బాధ్యత
తెలుగులో విద్యాభ్యాసం చేస్తున్నాము, మాట్లాడుతున్నాము అని సరిపెట్టుకోకుండా యువత కూడా తమ వంతు కర్తవ్యంగా మన మాతృభాష అయిన తెలుగును బ్రతికించుకునే ప్రయత్నం చేయాలి. నేటి యువత అంతర్జాలం పట్ల చాలా అవగాహనను కలిగి ఉన్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. నేడు అంతర్జాలంలో అనేక బ్లాగులు నడుస్తున్నాయి. ఆరోగ్యం, ఆహారం, క్రీడలు, వంటలు, యాత్రా విశేషాలు ఇత్యాది సమాచారాన్ని తెలుగులో ఉండేలా చూసుకోవాలి. ఫేస్‌బుక్, వాట్సప్ ఇత్యాది మాధ్యమాలలో సైతం తెలుగును విరివిగా ఉపయోగించాలి. యూట్యూబ్ ద్వారా కూడా మన తెలుగు భాష గొప్పతనాన్ని దశదిశలా వ్యాప్తి చెందేలా చేయాలి. ఇలా ఆధునిక సమాచార మాధ్యమాల ద్వారా మన మాతృభాషను సమర్ధించుకుంటూ బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక మాధ్యమల ద్వారా ఆంగ్ల భాషకు ఎనలేని గుర్తింపు, గౌరవం వస్తున్నాయి. అంతర్జాలంలో ఎటువంటి సమాచారం కావాలన్నా ఆంగ్ల భాషలో లభిస్తుంది. కొన్ని రాష్ట్రాల వారు అదే సమాచారం తమ మాతృభాషలో అనువదించి లభించే ఏర్పాటు చేసుకుంటున్నారు. మన తెలుగు వారు సైతం అనేక విషయాలను కొంత మేరకు అంతర్జాలంలో తెలుగు భాషలో అందుబాటులోకి తెచ్చారు. యంత్ర సాయంతో అనువదించిన అంశాలు కొన్ని సందర్భాలలో అర్థం చేసుకోలేము. కొందరు పూనుకుని అందించిన అంతర్జాలంలో పొందుపరచిన తెలుగు సమాచారం చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఎటువంటి సమాచారమైనా తెలుగులో సైతం మనకు అంతర్జాలంలో లభించేలా కృషి చేయాలి. ఆధునిక, సాంకేతిక అంశాలకు అనుకూలంగా ఉండేలా మన మాతృభాష అయిన తెలుగును ఆధునీకరించే దిశగా కృషి చేయాలి. మాతృభాషకు ప్రమాదం వాటిల్లుతుందనే సందర్భాలలో రచయితలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా స్పందించవలసిన అవసరం ఉంది. చాలామంది అనేక వేదికలపై పూలమాలలు, జ్ఞాపికలు ఇస్తుంటారు. వీటి స్థానంలో తెలుగు పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం వల్ల మన తెలుగు భాషకు చాలా మేలు జరుగుతుంది. ఇదే రీతిలో పాఠశాలల్లో అనేక పోటీలు పెడుతుంటారు. విజేతలకు కప్పులు ఇచ్చే బదులు బాలసాహిత్యానికి సంబంధించిన నీతికథల పుస్తకాలు బహూకరించడం ద్వారా పిల్లల్లో భాషా జ్ఞానంతో పాటు నైతిక విలువలు కూడా పెంపొందుతాయి. ప్రతీ ప్రాంతంలో సభలు నిర్వహించి తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తూ అవగాహన కల్పించాలి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన సైకతశిల్పి డి.శ్రీనివాస్ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పలుమార్లు ఇసుకలో శిల్పాలు చెక్కి మాతృభాష గొప్పతనాన్ని దశదిశలా చాటారు. ఇంకా అనేక మంది వారు ఎంచుకున్న మార్గాల ద్వారా మాతృభాషను పరిరక్షించుకునేందుకు కృషి చేస్తున్నారు.
ఏది ఏమైనా మాతృభాషతోనే జ్ఞాన వికాసం జరుగుతుందనేది సత్యం. మాతృభాష సృజనకు పట్టం కడుతుంది. సొంత ఆలోచనలనేవి మాతృభాషతోనే సాధ్యం. మాతృభాషలో పట్టు లభిస్తే ఆంగ్ల భాషను సులభంగా నేర్చుకోవచ్చు. కేవలం భాష బ్రతికితే చాలదు. వికసిస్తేనే జాతి పురోగతి. కనీసం ప్రాథమిక విద్య వరకైనా తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేస్తేనే గ్రహణశక్తి, జ్ఞాన దృష్టి పెరుగుతాయని విద్యా శాస్త్ర సిద్ధాంతం. కాబట్టి మాతృభాష అనేది సంస్కృతి వెలుగు, మనోవికాసానికి మాతృభాష ఎంతగానో దోహదపడుతుందనే విషయాన్ని ఎవరూ మరువకూడదు. మన మాతృభాష అయిన తెలుగును మృతభాష కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతీ తెలుగువాడి భుజాలపై ఉంది. అందుకే జయహో తెలుగు అని నినదిద్దాం. మన తెలుగు భాషను కాపాడుకోవడానికి నడుం బిగిద్దాం. *