లోకాభిరామం

పిల్లల మధ్యన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకాశం ఇనిస్టిట్యూట్ అని ఒక సంస్థ ఉంది. వాళ్లు ఒక సందర్భంలో సైన్స్ రచనలను గురించి వారంపాటు ఒక వర్క్‌షాప్ నడిపించారు. నేను అప్పుడు ఉద్యోగంలో ఉన్నాను. కనుక ప్రతి నిత్యమూ వెళ్లి అక్కడ పాల్గొనే అవకాశం లేదు. ఆ కార్యక్రమాన్ని ప్రతిపాదించి నడిపించిన పెద్దమనిషికి నామీద మంచి అభిప్రాయమే ఉన్నట్టుంది. ఒకరోజు నా ఉపన్యాసం కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు నేను మాట్లాడుతూ బాల సాహిత్యం గురించి ఒక గట్టి అభిప్రాయాన్ని బయటపెట్టాను. సీనియర్ పాత్రికేయులు వరదాచార్యులుగారు ఆ రోజు అక్కడ ఉన్నారు. నా తరువాత ఆయన మాట్లాడారు. ఇంతకూ నేను చెప్పిందేమిటంటే ‘ఎవరయినా ఒక కొత్త విషయం తెలుసుకోవాలంటే, పిల్లలుగా మారి తెలుసుకోవలసిందే, మనసులో కొన్ని ఆలోచనలు పెట్టుకుని నేర్చుకుంటామని బయలుదేరితే అది అంత సులభంగా జరగదు. ముఖ్యంగా సైన్స్ గురించి పెద్దలకు కూడా తెలియదు. కనుక వారు మెదడులో అనుమానాలు పెట్టుకోకుండా వింటేగానీ కొంత సంగతులు తలకెక్కవు’ అన్నాను. అక్కడ ఉన్న పెద్దలతో సహా అందరూ నా మాటను ఒప్పుకున్నట్టే ఉన్నారు.
మిత్రులు వేదకుమార్ చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ నడిపించేవారు. తరచుగా ఎక్కడో ఒకచోట ఫిల్మ్ షోలు ఉండేవి. వేదకుమార్ గారికి ఒక మంచి పేరుంది. ఆయన నడుపుతున్న బడికి కూడా పేరుంది. ఆయన పాటించే పద్ధతులు మంచివని అందరికీ నమ్మకం ఉంది. కనుక ఆయన వేసే సినిమా షోలకు చాలా బడుల నుంచి వందల సంఖ్యలో పిల్లలు వచ్చేవారు. కష్టపడి ప్రపంచం నలుమూలల నుంచి పిల్లల సినిమాలను సేకరించి ప్రదర్శించేవారు. సినిమా చూపించి పంపితే లాభం లేదు కదా? సినిమా ముగిసిన తరువాత పిల్లల అనుమానాలు, పెద్దల అభిప్రాయాలు బయటపడేట్టు ఒక సెషన్ నడిపించేవారు. నాకు సినిమా గురించి అవగాహన ఉందని ఎందుకు అనిపించిందో తెలియదుగానీ వేదకుమార్ తరచుగా నన్ను ఆ చర్చలను నడిపించడానికి పిలిపించేవారు. నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. పిల్లల సినిమా మీద అంతకన్నా ఆసక్తి. కనుక అవకాశం వదలకుండా చాలా సందర్భాలలో చర్చలలో పాల్గొని పిల్లలతో మాట్లాడాను. నేను ఎక్కడో బజారులో తిరుగుతూ ఉంటే స్కూల్ పిల్లలు ఎదురు వచ్చి విష్ చేసి పలకరించేవారు కూడా. మిమ్మల్ని చిల్డ్రన్స్ ఫిల్మ్ షోలో చూచాము అని వారంటే నాకు పట్టరానంత సంతోషం అయ్యేది.
అక్కడ కూడా నేను కొన్ని విచిత్రమయిన అభిప్రాయాలను బయటపెట్టాను. నిజానికి దేశం మొత్తం మీద కలిపి జరిగే పిల్లల ఫిల్మ్ ఫెస్టివల్ రెండు సంవత్సరాలకు ఒకసారి హైదరాబాద్‌లోనే జరుగుతుంది. వేదకుమార్‌గారి సొసైటీ కారణంగా నేను వరసబెట్టి నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా కొన్ని సంవత్సరాలపాటు పాల్గొన్నాను. ఐమాక్స్‌తో మొదలు మరెన్నో సినిమా హాళ్లలో వారంరోజులపాటు చూపించే పిల్లల సినిమాలను మరో పనిలేకుండా చూచాము. ప్రతి నిత్యం సాయంత్రం ఎక్కడో ఒకచోట ఒక చర్చా వేదిక నడిచేది. ఐమాక్స్ లేక ముందు, ఆబిడ్స్‌లోని సంతోష్ సినిమాలో ఈ రకం చర్చలు జరిగేవి. పబ్లిక్ గార్డెన్‌లోని ఇందిరా ప్రియదర్శినిలో కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. దేశం నలుమూలల నుంచి వచ్చిన సినిమా పెద్దలను ఎంతోమందిని కలిసి మాట్లాడే అవకాశం అక్కడే వచ్చింది.
పిల్లల కొరకు సినిమా తీసేవారంతా పెద్దవాళ్లు. పిల్లల గురించి, వారి ఆలోచనలను గురించి ఊహించాలంటే ఈ పెద్దలంతా తమ చిన్నతనంలోకి, అంటే కొన్ని దశాబ్దాల వెనుకకు పోతారు తప్ప, ఇవాళటి పిల్లల పరిస్థితిలోకి పోయే వీలు వీరికి తక్కువ అని నేను గట్టిగా వాదించాను. చాలామంది ఈ మాటను అవునన్నారు. నిజానికి ఆ ఉత్సవాలలో భాగంగా పిల్లలు సినిమా తీసేందుకు నేర్చుకునే పరిస్థితులను కూడా కల్పించేవారు. బహుమానాలు నిర్ణయించే విషయంలో కూడా పిల్లలే న్యాయ నిర్ణేతలుగా ఉండేవారు. కానీ సినిమా తీసింది మాత్రం పెద్దవాళ్లు. ఆ సినిమాలలోని ఆలోచనలను గురించి పిల్లలు బయటపెట్టిన అనుమానాలు నా సిద్ధాంతాన్ని నిజం చేసేవిగా చాలా సందర్భాలలో నాకు తోచింది.
మొత్తం మీద ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పిల్లల సినిమాలను చూచే వీలు దొరికింది. ఇవాళ వాటిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఏ ఒకటి, రెండు మాత్రమే మనసులో మెదులుతున్నాయి తప్ప మామూలు సినిమాలలాగే మిగతావన్నీ మెదడు మూలల్లో మరుగున పడిపోయాయి.
పిల్లలు అనగానే వాళ్లకేదో నీతులు చెప్పాలని, బతుకు గురించి నేర్పించాలని మనందరికీ ఒక గట్టి అభిప్రాయం. చిన్నప్పటి నుంచి బడిలో కూడా కథ చెప్పి, ఈ కథ వలన తెలియు నీతి ఏమనగా.. అంటూ వివరణ కొనసాగేది. అంతేగానీ కేవలం కౌబాయ్ సినిమాలాగ కాలక్షేపానికి చూచి మరిచిపోగల పిల్లల సినిమాలు ఉండకూడదా? నిజం చెపితే పెద్దల సినిమాలలో కూడా జానపదం తరహా వెనుకబడిన తరువాత కేవలం వినోదం కోసం చూచే సినిమాలు కరువయిపోయాయి. ఫిల్మ్ ఫెస్టివల్‌లో చూచిన ఒక సినిమాలో ఒక పిల్లి ఉంటుంది. అది ఒక అట్టపెట్టెలో పడుకోవడం నాకింకా గుర్తుంది. ఆ పిల్లి అందమయిన పిల్లగా మారుతుంది. ఇక కథ ముందుకు సాగుతుంది. ఏమవుతుంది అని నన్ను అడగకండి. ఆ సినిమా నడిచినంతసేపు ఎవరూ స్థిరంగా సీట్లో కూచోలేదని నా అనుభవం ప్రకారం చెపుతున్నాను. అంత బాగుంది ఆ సినిమా. ఈ సందర్భంగా నన్ను నేనే ఒకటి, రెండు ప్రశ్నలు వేసుకుంటాను. నిజంగా సరదా కోసం సినిమా చూడదలుచుకుంటే హారీపాటర్ సినిమాలు కూడా బాగున్నాయి అనుకోవాలి గదా! అవి నాకు ఎందుకు నచ్చలేదు? ఈ ప్రశ్న నేను ఎవరినీ అడగడం లేదు. నేనే జవాబు చెప్పాలి. ఆ జవాబు నా దగ్గర ఉంది. జానపదం సినిమాలో రాజులు, రాజకుమార్తెలు ఉన్నంతకాలం సమస్యలేదు. రాక్షసులు వచ్చినా సమస్య లేదు. మంత్రాలు మొదలయితే మాత్రం నాకు చికాకు మొదలవుతుంది. పిల్లలు, నాతో సహా (మనసులో అందరమూ పిల్లలమే) ఇలాంటి మంత్రాలు నిజంగానే ఉంటాయని అనుకునే గట్టి వీలు ఉంది కదా! ఫాంటసీ అని ఒక మాట ఉంది. అంటే కేవలం ఊహలో పుట్టింది అని అర్థం. సైన్స్ ఆధారంగా రాసే చాలా కథలు ఫాంటసీలే. ఒక పుస్తకం లేదా సినిమా ఫెంటాస్టిక్‌గా ఉందంటే నిరాధారంగా అయినా సరే సరదాగా ఉందని అర్థం. ఇందాక నేను చెప్పిన సినిమాలో వలె పిల్లి అమ్మాయిగా మారుతుందని ఎవరూ ఆశించరు. ఆశించరని కనీసం నా నమ్మకం. కానీ మన సమాజంలో మంత్రాలు, మాయలకు గొప్ప చోటుంది. పూజ చేస్తే లక్ష రూపాయలు రెండు లక్షలు అవుతాయని చెపితే నమ్మి మోసపోయిన సంఘటన ఈ మధ్యనే జరిగింది. ఇటువంటి సందర్భంలో మొత్తం మంత్రాల మీదే ఆధారపడి హేరీ పాటర్ కథలు రాసుకుంటే పిల్లలు గోడల్లోకి దూసుకుపోయే ప్రయత్నం చేసి ముక్కులు పగలగొట్టుకుంటారేమోనని నా భయం తప్ప ఆ సినిమాల మీద నాకు మరో అభిప్రాయం లేదు.
పిల్లల పుస్తకాలు కూడా ఇదే పద్ధతిలో ముందుకు సాగుతాయి. మొదటి నుంచి ఒకటే ఆలోచన. పిల్లలకు ఏమి తెలియదు. వాళ్లకు చెప్పాలి అన్నది ఆ ఆలోచన. బాగానే ఉందేమో. కానీ మనకు వాళ్లకన్నా బాగా తెలుసు అనుకోవడంలో పెద్ద చిక్కు ఉంది. పిల్లలు పెద్దలకన్నా తెలివిగా, వేరుగా ఆలోచించగలరు అన్నది నేను అనుభవం మీద నేర్చుకున్న సత్యం. నేను రాసిన అక్షరాలకు నా పిల్లలు మొదటి పాఠకులు, విమర్శకులుగా ఉండటంతో నేను ఎంతో నేర్చుకున్నాను.
పిల్లల ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో చూచిన సినిమాల్లో మరో చిత్రం నాకు బాగా గుర్తుంది. ఒక పెద్దమనిషి ఉంటాడు. అతను కొండ ప్రాంతాలలో కష్టపడి సైకిల్ నడుపుతూ పల్లెలకు వెళతాడు. అక్కడ బడిలో పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు అందిస్తాడు. అప్పుడప్పుడు వచ్చి అంతకు ముందు ఇచ్చిన పుస్తకాలను తీసుకుని కొత్త పుస్తకాలు ఇస్తాడు. తిరిగి ఇస్తున్న పుస్తకాలు పిల్లలు చదివారా లేదా తెలుసుకుంటాడు. ఆ పుస్తకాల గురించి వాళ్లతో మాట్లాడతాడు. ఈ కథలో నీతి ఉందా? నాకు లేదనే అనిపించింది. ఇటువంటి ప్రయత్నాలు మన దగ్గర కూడా కొంతవరకు జరిగాయని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా చూచిన పిల్లలు ఇలాగెందుకు జరగడం లేదు అని అడుగుతారని నేను ఆశించాను. అడిగారేమో తెలియదు.
పిల్లలతో మాట్లాడే సందర్భంగా, వాళ్లను పూర్తి వ్యక్తులుగా గుర్తించి, తెలివిగలవారుగా గుర్తించి మాట్లాడితే బాగుంటుందన్నది నా అనుభవం. మీరెవరూ నా మాట కాదనరని అభిప్రాయం.

కె.బి. గోపాలం