లోకాభిరామం

ఇది కథేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయమ్మ ప్రతి నిత్యం 72 పనులు ఒకదాని తరువాత ఒకటి పొల్లువోకుండ చేస్తుంది. పనిలో ఉన్నప్పుడు మాటలుండవు. ఒక్క పని కూడా కొత్త పద్ధతిలో చేసేది లేదు. చేసే పనులలో రెండు పూటలా తులశమ్మ పూజ కూడ ఉన్నది. ఉండేది ఐదంతస్తుల భవనం. అన్నిటికన్నా మీది మాలెలో. అక్కడ పాదుచేసి చెట్లు పెంచేందుకు ఉండదాయె. తులశమ్మను ఈ మధ్యన వీలున్నవాండ్లు కూడా తొట్లలోనే పెంచుతున్నరు. ఇక్కడ కూడ చెట్టు తొట్టెలోనే ఉన్నది. ఆ తొట్టెలోని చెట్టుకు ఆయమ్మ రెండు పూటల చెంబెడు నీళ్లు పోసి దండము పెడుతుంది. పొద్దున్న రెండు ఊదు వత్తులు కూడా ఉంటయి. ఆకాశములో ఉంటే కిందికన్నా గాలి ఎక్కువ ఉంటుంది కదా! తులశమ్మకు దీపము పెట్టాలనన్న ప్రయత్నము ఫలించినట్టు లేదు. దీపానికి ఒక గాజుబుడ్డి తెచ్చి పెట్టినరు. అయినా ఆరిపోయింది. ఆ తరువాత మంటితోటి చేసిన గూడు వంటి ఒక ఏర్పాటును తెచ్చిపెట్టినరు. అందుట్లో కూడ దీపము నిలబడలేదు. కనుక ఊదువత్తులు చాలునన్న నిర్ణయానికి ఆయమ్మ వచ్చింది. వాటిని పాదులోని మన్నులో గుచ్చుతుంది ఆయమ్మ. అవి బాగనే కాల్తయి. వాసన ఎవరికి వస్తుందో తెలియదు. మొత్తానికి అడుగున పుల్లలు మాత్రము మిగులుతయి.
ఇల్లు ఆకాశములో ఉన్నది గద, అందుకని తులశమ్మకు పొద్దున్న మాత్రమే ఎండ తగులుతుంది. చెట్టుకు ఒక పక్కన గోడ ఉంది. ఎదుటి దిక్కు నుంచి ఎండ రావాలె. కనుక కొమ్మలన్నీ వెలుగు వచ్చేటి దిక్కుకు వాలి ఉంటయి.
తొట్టెలో ఉండేదే కొంచెము మట్టి. నిత్యమూ చెంబుల కొద్దీ నీళ్లు పోస్తుంటే అందుట్లోని మెత్తటి మట్టి మొత్తముగా కారిపోతుంది. పాత మన్ను తీయకుండనే కొత్త మన్ను తెచ్చిపోస్తే చెట్లు కొంత పొట్టిగయినయి.
‘అదేమి? అట్ల చేసినరు’ అన్నడు ఆయన.
‘పాత మన్ను తీస్తే, ఏర్లు పాడయిపోవా?’ అడిగింది ఆయమ్మ.
‘పట్నవాసపోండ్లతోటి ఇదే కష్టము’ అనుకున్నడు ఆయన. మీదికి అనలేదు.
కొత్తగ పోసిన మన్నులో ఊదువత్తి పుల్లలన్నీ పూడుకుపొయినయి. ఓపిక కలిగినప్పుడు ఆయన మిగిలిన పుల్లలను తీసేస్తడు. ఆయమ్మకు పుల్లలను తీసేటి అలవాటు లేదు. ఈయన కొన్ని దినాలు తీయలేదు. అట్ల మిగిలిన పుల్లలన్నీ మునిగిపోయినయి.
‘ఈ పుల్లలు ఏనుకోని చెట్లయింటె ఎంత బాగుండు. ఊదువత్తులు కాస్తె ఇంకెంత బాగుండు?’ తమాషకు అంటడు ఆయన. అట్ల జరుగదని తెలియకనా?
ఎవరు చూడకుండ, ఎండిపోయిన పాత చెట్లను ఆయన పీకేసినడు. పడి మొలిచిన పది చెట్లు పది దిక్కుల చూస్తుంటె కలిపి తాడుగట్టి ఒక దగ్గరికి తెచ్చినడు. వంగిన చెట్లను ఎనికికి తిప్పి పెట్టిన తరువాత కొంతకాలానికి ఆకులు మాత్రము సూర్యుని దిక్కు తిరిగినయి. ఇంకా కొమ్మలు తిరగలేదు. తిరుగుతయేమో తెలియదు.
‘చెట్టు బాగయింది’ అన్నది ఆయమ్మ.
ఆయన చెట్టు దగ్గర నిలబడి ధ్యాసగ చూస్తున్నడు.
‘పూజ చేసిన వాళ్లకంటె, సేవ చేసిన మీకే ఎక్కువ పుణ్యం వస్తుంది!’ అన్నది పక్కింటి పెద్దమగారు. ఆయన ముసిముసిగ నవ్వినడు. ఆయన పల్లె మనిషి. పుణ్యము గురించి పట్టించుకోని మనిషి. ఆయనకు చెట్లు, చెట్ల తీరు మాత్రము తెలుసు.
... ....
ఇంతకూ ఇది కథంటారా? లేక నిజంగా జరిగిందంటారా? ఇది నేను రాసిందే. ఈ మాట చెప్పిన వెంటనే నీవు కథకుడవు కాదు కదా, తప్పకుండా నిజమే రాసి ఉంటావు అంటారేమో? వ్యాసాలు రాసేవారు కథలు రాయకూడదని ఎక్కడా లేదు. వ్యాసాలకు పనికొచ్చే విషయాలను కథలుగా మలిచి అందించకూడదని ఎక్కడా లేదు. ప్రపంచంలో సగం కథలు ముందుగా సగంలో ఆగిపోయిన అనుభవాలు. మధ్యలో ఆగిపోయిన వాక్యాలు. పూర్తి చేయకుండా వదిలిన వ్యాసాలు. వాటిని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పూరించుకోవచ్చు. నేను ఈ విషయంగా ఒక పెద్ద వ్యాసానే్న రాశాను. ఒక సంపాదక మిత్రుని కారణంగా అది ప్రపంచానికే కాదు, నాకు కూడా అందకుండా పోయింది. లోకాభిరామం వరుసలో ఈ సంగతిని ఎప్పుడో ప్రస్తావించినట్టే ఉన్నాను.
ఇంతకూ తులసి చెట్టు సంగతి చూద్దాం. మేము ఆకాశంలో బతుకుతున్నది నిజమే. అంటే అయిదవ అంతస్తు అన్నమాట. మేమున్న ఈ లెవల్‌లో నాలుగిళ్లున్నాయి. ఒక ఇంట్లో ఎవరూ ఉండరు. వాళ్లు మరో దేశంలో ఉంటారు. ఈ మధ్యన ఇల్లు రెంట్‌కు ఇవ్వకుండా తాళం పెట్టుకుని వెళ్లిపోతున్నారు. మిగతా ఒక ఇంట్లో ద్వారం ముందే తొట్లలో బోలెడు చెట్లున్నాయి. వాటిల్లో తులసి మొక్క కూడా తప్పకుండా ఉంటుంది. మరొక ఇంటి వాళ్లు పైకప్పు మీద ఒక చిన్నపాటి తోటనే పెంచుతున్నారు. అక్కడ కూడా ఒక తులసి చెట్టు ఉంటుంది. అంటే నా కథకు ప్రాతిపదిక దొరికిందని అర్థం. ఇక కథ అల్లుకోవడమే తరువాయి. చెప్పిన కథ నిజంగానే జరిగిందని మీరు అనుకుంటే నాలోని కథకునికి అసంతృప్తిగా ఉంటుంది. నేనే కాదు, ఏ కథకుడు నీవు రాసింది నూరుపాళ్లు నిజం అంటే ఒప్పుకోడు. నిజాన్ని రాసేవాళ్లు పత్రికా రచయితలు. కథా రచయితలు ఆలోచనలను కండరాలుగా విషయమనే అస్తిపంజరం మీద పేర్చి అందమయిన ఆకారాలను తయారుచేస్తారు. ఇక్కడ చిన్న చిక్కు ఉంది. చదివే వాళ్లు మాత్రం కథ నిజంగా జరిగినట్టే ఉంది, నిజానికి మా ఇంట్లోనే లేదా కనీసం నాకు తెలిసిన పరిస్థితుల్లోనే ఇట్లా జరగడం నేను ఎరుగుదును అనుకుంటారు. కథకులు మాత్రం తాను రాసింది ఎంతవరకు నిజం అన్నది చెప్పరుగాక చెప్పరు. చెప్పవలసిన అవసరం అంతకన్నా లేదు.
చెప్పింది కథలాగా నడిస్తే, వాస్తవమయినా మరింత బాగుంటుంది. రాముడు మంచి బాలుడు, వేళకు బడికిపోవును అని రాయడం చాలా సులభం. కానీ ఒక సీన్ సృష్టించి, డైలాగులు పండించి రాముడు మంచి బాలుడు అన్న నిర్ణయం చదివే వారు చేసుకునే పరిస్థితి వచ్చేట్టు చేస్తే అది రచయిత శక్తికి నిదర్శనం అవుతుంది. నూటికి నూరుపాళ్లుగా నిజమయిన విషయాన్ని కూడా కథగా చెప్పిన సందర్భాలు మహా రచయితలకు కూడా చాలా ఉంటాయని నా అనుమానం.
కథలు వాస్తవికంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. సినిమాలలో మాత్రం ఈ రకమయిన వాస్తవికత కొరకు ఎవరూ ఎదురుచూడరు. అనుకోని సందర్భాలలో అనుకోని విషయాలు జరిగి కథ అనుకోని మలుపులు తిరిగితే అది సినిమాటిక్ పద్ధతి అని అర్థం. అంతెందుకు? మీకు ఎంత దుఃఖం వచ్చినా వౌనంగా కుమిలిపోతారు తప్ప, గడ్డం పెంచుకుని, శాలువా కప్పుకుని పాటను లంకించుకుంటారా? అక్కడే కథానిక, సినిమాల మధ్యన తేడా కనపడుతుంది. నా తులసి చెట్టు కథ నిజంగానే జరిగిందని నేను అన్నాననుకోండి. వెంటనే నాతోబాటు పాఠకులకు కూడా కొంత అసంతృప్తి కలుగుతుంది. కథకు ప్రాతిపదిక దొరికితే చాలు. ఆ తరువాత కొంచెం మసాలా జోడించాలి. నేను చెప్పిన ఈ కథలో మసాలా జోడించే పరిస్థితి లేదు. అచ్చంగా ఈ పద్ధతిలోనే ఈ మధ్యన షార్ట్ ఫిల్ములు వస్తున్నాయి. వాటిలో పాటలు, అనుకోని మలుపులు ఉండవు. నిజానికి న్యూవేవ్ కింద కొన్ని దశాబ్దాల నుంచి వచ్చిన సినిమాలలో కూడా ఇటువంటి పరిస్థితి కనిపించింది. బెంగాలీ, మలయాళీ సినిమాలు చీకటిగా ఉంటాయని మా ఆచార్లుగారు అనడం నాకింకా గుర్తుంది. మామూలు సినిమాల్లో నీడలు ఉండవు. మరీ వాస్తవికం సినిమాలలో సందర్భాన్నిబట్టి చీకటి కూడా ఉంటుంది. అట్లాంటి సినిమాలకు అవార్డులిస్తారు అనేవాళ్లు. ఈ మధ్యన ఆ ట్రెండ్ పోయింది. లేకుంటే బాహుబలికి బహుమతి వచ్చి ఉండేది కాదు.
మొత్తానికి తులశమ్మ కథకు ఏమని పేరు పెడదాం?

కె.బి. గోపాలం