లోకాభిరామం

సింగర్ మాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐజక్ బషేవిస్ సింగర్ పోలాండ్‌కు చెందిన రచయిత. యిద్దిష్ అనే భాషలో గొప్ప కథలు, నవలలు రాశాడు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా అతను కూడా మరెందరో వలెనే అమెరికాకు వలస వచ్చాడు. (అదేదో అమెరికా మా ఊరయినట్టు వచ్చాడు అని రాశాను. నా కొడుకు, కోడలు ఆ దేశంలో ఉన్నంత మాత్రాన అది నా దేశం ఎంత మాత్రం కాదు. అక్కడికి వెళ్లాలన్న ఆలోచన నాకు లేదు. కనుక వాక్యం మార్చి వలస వెళ్లాడు, అని చదివితే సంతోషిస్తాను) అమెరికాలో విదేశీయులు అక్కడి వారితో కలిసిపోయి బతికే పద్ధతి లేదని నాకు అర్థమయింది. చాలామందికి కూడా అర్థం అయే ఉంటుంది. నాకు ఈ విషయంగా సింగర్ ఎంతో సాయం చేశాడు. పోయినేడు నేను ప్రచురించిన ప్రపంచ కథ అనే సంకలనం సింగర్ కథ ‘అమెరికా కొడుకు’ అన్న ఉపశీర్షికతో వచ్చింది. అక్కడ పోలాండ్ వారు బతికిన తీరును అతను కథల ద్వారా, సంభాషణల ద్వారా చక్కగా చెపుతాడు. అసందర్భం కానేకాదు గానీ, మహత్తరమయిన నవలలు, కథలు రాసిన ఈ రచయిత పిల్లల కథలు రాశాడు. వాటిలో చక్కని హాస్యం మేళవించి రాసిన తీరు బాగుంటుంది. మూడు కోరికలు అనే పేరున నేను సింగర్ బాలసాహిత్యాన్ని, అంటే కథలను సంకలనంగా రాశాను. ‘మంచి పుస్తకం’ వారు ప్రచురించారు. ఆ మంచి పుస్తకం బజారులో దొరుకుతుందేమో చూడండి. లేకుంటే ‘మంచి పుస్తకం’ వారిని అడగండి.
సింగర్ తన రచనా వ్యాసంగాన్ని అమెరికాలో బాగా కొనసాగించాడు. అక్కడ పోలిష్ వారంతా కలిసి పత్రికలు నడిపించుకున్నారు. వాటికి సింగర్ సారథ్యం వహించాడు. తమ దేశం, సంస్కృతులను గురించి చక్కని వ్యాసాలు వరుసబెట్టి రాశాడు. అతని నవలలు, కథలు ఒక ఎత్తయితే, తన బాల్యం గురించి రాసిన సంగతులు మరొక ఎత్తు.
ఆ మధ్యన కథక మిత్రుడు జగన్నాథ శర్మ ఒక మాట అన్నాడు. ‘నాకు వ్యాసం రాయడం రాదు. ఏ సంగతి గురించయినా కథగా మాత్రమే రాస్తాను’ అని. నా అనుభవం అందుకు తలకిందులుగా ఉందని నా అనుమానం. సింగర్ కూడా శర్మ పద్ధతికి తార్కాణంగా ముందు నడిచిన రచయిత. తన రచనలను అందించడానికి వెళ్లడం, అక్కడ అందరూ కాఫీహౌస్‌లో కలవడం, బియ్యం పాయసం తినడం, ఎన్నో సంగతులు మాట్లాడుకోడం, అన్నీ ఆయన కథలుగా రాశాడు. నాకు అట్లా రాయడం చేతగాదా? లేక ప్రయత్నం చేయలేదా?
నేను సైన్స్ రాస్తానని నిర్ణయించుకున్నాను. రాస్తున్నాను. ఇక మీద కూడా రాస్తాను. కనుక ప్రతి అంశాన్ని సూటిగా, సులభంగా, వ్యాసంగా చెప్పడం అలవాటయింది. నేను సైన్సు వ్యాసాలు రాయడం మొదలుపెట్టిన తొలినాళ్లలోనే శ్రీనివాస శాస్ర్తీ, నన్ను హాస్యం కాలమ్ రాయి, అన్నాడు. మెట్ల మీద నుంచి పడితే తగిలే గాయాల గురించి ఒక సైన్స్ వ్యాసం రాశాను. దీనే్న హాస్యంగా రాయవచ్చు కదా, అన్నాడు శాస్ర్తీ. నిజమే అనిపించింది. కానీ త్వరలోనే జ్ఞానోదయం అయింది. సీరియస్‌గా సైన్స్ విషయాలు రాస్తున్న నేను, హాస్యం కూడా రాయడం, అందులో సైన్సులాగ ధ్వనించే సంగతులు రాయడం తప్పు అని అర్థమయింది. పాఠక మిత్రులను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని అనుమానం పుట్టింది. నా సైన్స్ వ్యాసాలకు, హాస్యానికి తేడా కనిపించాలి. కనుక కలియబెట్ట కూడదు అనుకున్నాను. ఇది నా గోల. సింగర్‌కు ఈ బాధ లేదు గదా! అందుకే అతను మహా రచయిత అయ్యాడు. నేను ఇలాగ ఉండిపోయాను.
‘కొత్త దేశంలో ఉన్నావు గదా? అంతా తిక్కతిక్కగా ఉంది గదా?’ అని సింగర్‌ను ఎవరో అడిగారు. ‘అమెరికా వచ్చిన కొత్తలో ఒంటరిగా ఉన్నాను అనిపించింది. నాకు ఆలోచనలు రెండు దారులలో సాగుతుంటాయి. వాటిలో ఒక ధోరణి ప్రకారం నేను ఏ ఒంటరి ద్వీపానికో చేరి అక్కడ ఎవరి కంటా పడకుండా ఏకాంతంగా బతకాలి. ఎదురవుతున్న క్రూరత్వానికి అందకుండా ఉండాలి. మరో మనిషికి కనబడగూడదు. మరెవరూ నాకు కనబడగూడదు అనుకున్నాను. అయితే స్ప్లిట్ పర్సనాలిటీ గదా! కాదు. మనిషిని గదా! మనుషుల మధ్యనే ఉండాలి అని మరొక ఆలోచన కూడా కలిగింది. అందరితో మాట్లాడాలి. అందరి మధ్యలో ఉండాలి అనేది, ఈ రెండవ ధోరణి’ అంటాడు సింగర్ జవాబుగా! తెలుగు సినిమాలో ఆత్మ అద్దంలో కనిపించి ఏదో చెప్పినట్లు ఉంది గదూ?
పాపం రచయిత లోలోపల ఎంతో సంఘర్షణకు గురయ్యారు. జనంతో అవసరం లేదు అనుకుంటే ఒంటరి బతుకు. అది మరెవరో కాదు. తాను లేదా నేను. మరెవరూ లేరు అంటే ఈ తాను, నేను అన్న మాటకు అర్థం లేదు. అందుకే సింగర్, అందరి మధ్యన ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఒక్కరే ఉండిపోతే, లోపలి చేదుతనం, అనుమానాలు పెరుగుతాయి. పిచ్చి రెండంతలవుతుంది’ అన్నాడు ఐజక్ బషేవిస్ సింగర్! ఇక్కడే ఈ రచయిత నాకు మరీమరీ నచ్చడంలోని రహస్యం తెలిసిపోయింది. నేను ఒకప్పుడు, అందరి మధ్యన ఉంటూ ఒంటరితనం అనుభవించాను. ఎవరితోనూ మాట్లాడకుండా ఆరునెలలు గడిపాను. ఈ మధ్యన కూడా రకరకాల కారణాలుగా రోజంతా ఒంటరిగా, మాటలేకుండా గడుస్తున్నది. ఆరు నెలల మవునంలో నాకు పిచ్చి పెరిగినట్టు తెలియలేదు. ఇప్పుడు తెలుస్తున్నది. అందుకే ఆగకుండా రాత, అంతకన్నా ఎక్కువగా చదువు సాగిస్తున్నాను.
కోరిక ఉండనీ లేకపోనీ, మనిషికి మానవత్వంతో సంబంధం ఉండాలి, అంటాడు సింగర్. మాట చాలా బాగుంది, అనిపించింది. పిల్లల గురించి ఆలోచించే వారి మనస్తత్వం మరొక చిత్రంగా ఉంటుంది. ‘నేను చిన్న వయసులో నుంచే చదివేవాడిని. కానీ, రచయిత ఎవరు? అన్న సంగతి పట్టించుకోలేదు. టాల్‌స్టాయ్ రచనలు చదివాను. కానీ, ఆయన గురించి తెలియదు. నేను చదువుతున్నది, అనువాద రచన అని కూడా తెలియదు. ఏదయితేనేమి? నాకు కావలసింది కథ. రచయితతో నాకు పనిలేదు. దోస్తొయేన్‌స్కీ అనే పేరు సరిగా పలకడం తెలిసేది కాదు. అయినా ఆ సంగతి నాకు పట్టదు. నిజమయిన పాఠకుడు, అందునా యువ పాఠకుడు, రచయిత గురించి అంతగా పట్టించుకోడు. అయితే అకడమిక్, లేదా తెలిసిన పద్ధతి పాఠకుడికి కథతో పని ఉండదు. అతనికి రచయిత కావాలి’ అంటాడు సింగర్. ఈ మాటలు చదివినప్పుడు నా బుర్ర తిరిగిపోయింది.
చిన్నతనం నుంచి ఎన్ని పుస్తకాలు, ఎన్ని రకాల పుస్తకాలు చదివిందీ లెక్కలేదు. అప్పట్లో కథ, విషయం తలకు ఎక్కేది. ఇప్పుడు రచయితను అయినట్లున్నాను. నిన్న సాయంత్రం రెండు పుస్తకాలు అందాయి. బాగా ఖర్చుపెట్టి, అన్ని పేజీలు రంగులలో అచ్చువేశారు. వాటిలో ఒకటి కథాసంకలనం. అందులో బొమ్మలున్నాయి. అయితే అవి నలుపు తెలుపు బొమ్మలు. ఆశ్చర్యం ఏమిటంటే, నాకు కథలు చదవాలని తోచలేదు. ఈ పుస్తకం ఇట్లా వేయవలసిన అవసరం ఉందా? అన్న అనుమానం మాత్రం బలంగా ఎదురయింది? నేను అకడమిక్ పాఠకుడిని అయినట్టు లెక్క. అనుమానం లేనే లేదు.
‘ఈ కాలంలో రచయితలను గురించిన ప్రచారం ఎక్కువయింది, అంటాడు సింగర్. అది ఆయన చెప్పవలసిన అవసరం లేదు. ‘ఈ కాలంలో చదివేవాళ్లు, తాము కూడా రాయాలి అనుకుంటున్నారు. వాళ్లకు మార్కెట్ మీద మనసు పెరిగింది. సరుకుల తయారీ మీద ఆసక్తి మొదలయింది. మంచి పాఠకులు, నిజమయిన పాఠకులు, అందునా పిన్నవయసు పాఠకులు రచయిత ఎవరు? ఎటువంటి వ్యక్తి అని అడగరు! పుస్తకం చదివి ఆనందం పొందాలని మాత్రమే అనుకుంటారు’ అంటాడు మహా రచయిత బషేవిస్ సింగర్.
అందరూ రచయితలు కావాలి, అనుకుంటారా? నాకు అనుమానం! రచయితలు మాత్రం తమ రచనకు ప్రజాదరణ దొరికితే సంతోషిస్తారని, అనుభవపూర్వక మయిన అనుమానం. రచయితకన్నా, రచన గొప్పది. అది పదికాలాలు నిలబడుతుంది. రచయిత భావాలను నిలబెడుతుంది. అందులో రచయిత కనిపించవలసిన అవసరం లేదు!

కె. బి. గోపాలం