లోకాభిరామం
అదే బాగుంది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వంద నవలలు, కథలకన్నా, అద్దంలో వలె ఎదుట కనిపిస్తున్న బతుకు ఆసక్తికరమయినది, అనిపిస్తుంది. అవును, నిజమేగాని, దాన్ని అందరి ముందు పరిచి పంచుకోవడానికి అభ్యంతరాలు ఉండయి. ముందు, దాన్ని అందంగ చెప్పేటందుకు చేతనయి ఉండవలె. అది పెద్ద సమస్య కాదు, అనే అనుకుందాము. ఈ బతుకు నా ఒక్కనిది కాదు. ఇందులో ఎంతో మంది ముందు వెనుక, ఇరుపక్కల ఉంటేనే అది సాగింది. సాగుతున్నది. ఇంకెంత కాలమో తెలియదుగాని సాగుతుంది. నాకు ఒక్కనికి అనుమానము లేదు గనుక, నేను నా కథను ప్రపంచం ముందు పెడతానంటే, అందుకే కుదరదు! తిరుమల రామచంద్రగారు, హంపీ నుంచి హరప్పా దాకా’ అనే శీర్షికతో జీవితానుభవాలను చెప్పినరు. కథ హైదరాబాద్‌కు రావడంతో ఆగిపోతుంది. ‘ఎందుకట్లా ఆపినారు’ అని అడిగితే ఆయన చెప్పిన జవాబు వెనుక ఈ పరిస్థితే ఉందని గట్టిగా చెప్పగలను. అమ్మా, నాన్నా లేరు. బతికి ఉన్నప్పుడు వారికి నచ్చిన పనులు చేయడముతో బాటు, మరొక రెండు పనులు చేస్తే ‘కొడుకుదనము’ నిలబడుతుందని శాస్తమ్రు చెపుతున్నది. నేను మొదటి పనిలోనే జారి పడ్డానన్న సంగతి నాకు తరువాత అర్థమయింది. ఆ సంగతులు చెప్పాలంటే, నాకే ముందు సంకోచము. సరే, చెపితే, మనస్తాపము తీరుతుంది, అనుకోవచ్చు. అది కూడ కుదరదని అర్థమవుతున్నది.
ఒక పని చేయవచ్చు. నేను చెప్పదలుచుకున్నది ఏదో చెప్పాలె. కానీ, దాన్ని ఇప్పుడే బయటపెట్టగూడదు. కాలమే ఆ పని చేస్తుంది.
ప్యాదతనము అన్నది పైసలకే కాదు, మనసునకు సంబంధించినది అన్న సంగతి అర్థము కావడానికి జీవితకాలం పట్టింది. ఫేన్‌మన్, ‘ఫైన్‌మన్’ అనాలేమో అనే నొబేల్ బహుమతి గ్రహీత మాటలు ఎన్ని మాట్లు ఎంతమందికి, మళ్లీమళ్లీ చెప్పిననో లెక్కలేదు. ‘తప్పు చేస్తిమి అని తెలుస్తుంది. కానీ, అప్పటికింక, దాన్ని సరిదిద్దుకునే అవకాశము లేదని కూడ తెలుస్తుంది’ అంటడు, ఆయన. మనసుకు పట్టిన బీదతనము కారణంగ ఎన్నో పనులను మనము, వీలవుతయి, అని గూడ ఆలోచించలేని పరిస్థితికి దిగబడిపోతము. ఇది నా వ్యక్తిగతమయిన సమస్య కాదు. సామాజిక సమస్య! ఇది ఆశ్చర్యకరమయిన సంగతి. ‘నీ గమ్యాలు ఎంత సులభంగ ఉంటయి, అంటే, అన్యాయంగ, చూస్తుండగనే నీవు వాటిని అందుకుంటవు’ అని అర్థం వచ్చే మాట ఒకటి ప్రచారంలో ఉండేది. గమ్యాలను మరింత ముందుకు జరపగలిగి ఉండాలి. నాతో సహా, చాలమందికి ఇది చేతగావడము లేదు.
మా అమ్మాయి, లేదా మరొకరు, ఓలా ఆటో పిలిచి ఎక్కడికో పొయినరు. నేను ఆ తరువాత ఎప్పుడో, దానికి కిరాయ ఎంతయింది? అని అడిగిన. నేను వెళ్లవలసి వస్తే, ముందు తెలిసి ఉండడము మంచిది అన్నది భావన. అంకె తెలిసింది. అది నాకు ఎక్కువ అనిపించింది. అదే మాట అనేసినట్టున్న. మామూలు ఆటోను అడిగితే, అందుకు రెండతలు అవుతుంది. ఇదే మేలు, అని వాండ్లు నన్ను ఆశ్చర్యంగ చూచి నచ్చజెప్పినరు. అవసరమయిన చోట పైసలు పెట్టకుండ పని జరుగదు. ఆ సంగతి తెలియక కాదు. ఆ భావన మనసులో లోతున మరెక్కడో కెలుకుతున్నది. ఒకసారి నేను ఒక పెద్ద, నిజంగా పెద్ద హోటేల్‌లో ఒక పార్టీ, కార్యక్రమానికి వెళ్లవలసి వచ్చింది. అది పొలిటికల్ పార్టీ కాదు. మందు, తిండి రకం పార్టీ. నేను సికింద్రాబాద్ స్టేషన్‌లో బస్ ఎక్కిన. నాకు దిగవలసిన స్టాప్ పేరు తెలియదు. మొగమాటము లేకుండ, సంగతి చెప్పి, కండక్టర్‌ను సాయము అడిగిన. అతని మాటలు నాకు గుర్తుండిపోయినయి. చాల టైం ఉంది గనుక బస్సు ఎక్కిన అని వివరణ యివ్వవలసి వచ్చింది.
అటువంటిదే ఒక అయిదు నక్షత్రాల హోటేల్‌లో ఒక పార్టీ జరిగింది. అందులో నేను అందరితో గలగల మాట్లాడుతూ హాయిగ గడిపిన. అయితే ఆ విందును ఒక పెద్ద సంస్థ వారు ఏర్పాటు చేసినరు. ఆ నిర్వహణ బాధ్యత తలకెత్తుకున్న పెద్ద మనిషి, నాకు మంచి మిత్రుడు. పార్టీ ముగిసే సమయం వచ్చింది. ఆ పెద్దాయన నా వద్దకు వచ్చి, ‘తమీ! నీ తాన సంచి ఉన్నదా?’ అని అడిగినడు. లేదు, అని జవాబు చెప్పి, ఆత్రం పట్టలేక, ఎందుకు సంచి? అని కూడ అడిగిన. ‘అక్కడ చూడు. వాడు ఎన్ని రకాల పండ్లు పెట్టినడు. మనవాండ్లు ఒక్కటి కూడ ముట్టలేదు. వాడు ఆ పండ్లు అన్నింటికి కూడ బిల్లు వేసి ఉంటడు. మనము తినకుంటే తీసి లోపల పెట్టుకుంటడు. మరి నష్టము ఎవరికి? మనకే గద?’ అని వివరించినడు. హోటేల్ వాళ్లను ఒక సంచి అడిగి ఉండవచ్చు గద, అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. అప్పట్లో మనసులో అదొక రకమయిన భయం. అడిగితే, లేకి సన్నాసులు, అంటరేమొ? అనుకుంటరేమో? ఆయనకూ, నాకూ ఒకే రకం బీదతనం!
ఊళ్లో మా యిల్లు లంకంత ఉండేది. ముందు తలుపు దగ్గర ఎవరన్న పిలిస్తే, లోపల వరకు వినిపించేదిగాదు. వాండ్లు మరొక తలుపు దగ్గర వచ్చి పిలిచేవాండ్లు. అట్లంటని మేము కలిగిన వాండ్లమా అంటే కాదు. అది మట్టి ఇల్లు. మట్టిగోడలు. మట్టి మిద్దె. మట్టి నేల. గచ్చు చేయించే వెసులుబాటు లేదు. ఆ మట్టినేలను వారానికి రెండుసార్లు అలుకాలె. అలుకవలె. అంటే, పెండ, పేడతో కొంచెము ఎర్ర మట్టి కలిపి ఇల్లంత నేలకు పట్టించవలె. అది ఆరిన తరువాత చీపురుతో ఊడిస్తే, పెండలోని గడ్డి సంబంధమయిన పోగులు వేరుగ వచ్చి, నేల నునుపుగ మిగులుతుంది. ఆ కాలపు పశువులు గడ్డి, ఆకులు మాత్రమే తినేవి. ఈ కాలములో పేడను చేత ముట్టుకోవడము కుదురదు. అంత లంకంత ఇంటిని, అమ్మకు వీలుగాని సందర్భాలలో నేను కూడ అలికిన. అలికి ముగ్గేసిన ఇల్లు, అంటే అందానికి ప్రతీక. యశోదారెడ్డి గారి కథలో ఈ మాటను గురించి సినారె గారు ఒక సభలో చెపితే నా ఒళ్లు పులకించింది. ఇవాళ నేనున్న యింట్లో నేల పాలరాతిది. దాన్ని తుడువడమే గాని, మరొక రకంగ శుభ్రము చేసే మార్గమే లేదు. అలికి ముగ్గు పెట్టే అదృష్టము లేని యిండ్లు ఇవి. ఇందులో సుఖము గూడ లేదు. ఆకాశములో ఇల్లు. నాలుగు అంగుళముల మందము గోడలు. ఇంక ఎండకాలము వచ్చిందంటే, అందులోని సుఖము అనుభవించితేనే తెలుస్తుంది.
మనసు బీదరికము మరింత గాటము గావడానికి మనుషులు కూడ కారణము అయినరని చెప్పక తప్పదు. ‘తింకింగ్ బిగ్’ అని ఒక పద్ధతి ఉన్నది. పేదవారికి అది చేతగావడము లేదని నేనే అన్న. అంటున్న. అందులోనుంచి బయట పడాలన్న కోరికతో కొన్నిచోట్ల పెద్ద ఆలోచనలు, పెద్ద మనసు చేసి, కొన్ని పనులు చేసే పరిస్థితి వచ్చింది. మనము అనుకున్నట్లే మన తోటివారు కూడ అనుకుంటరని, మనము అనుకుంటము. అది కుదరదు. ఒకసారి కాదు, నాలుగుసార్లు, నక్షత్రాలు కనిపించే పరిస్థితి ఎదురయింది. మొదటిసారికే తెలివి కలిగి ఉండాలె గద? ఎందుకు అదే పొరపాటు, అన్నిసార్లు చేస్తిమి? అన్నది జవాబులేని ప్రశ్న. పేదరికానికి దీనికి ఏమన్న సంబంధము ఉన్నదా? తోచడము లేదు!
ఎన్ని చెప్పినా, నాక పేదరీకమే బాగున్నది, అనిపిస్తుంది. కలిగిన వానికి కునుక పట్టదు. చావుకన్న భయము లేదు. గోచికన్న దరిద్రము లేదు. కనుక వాడెవడో మోసముజేసే అంటే, ఫలితమేమి. పైసలు పొయినయి. అవి మనవిగావు. కనుక పొయినయి. అనుకునేది. తినే రొట్టె ఒకటి తిని దుప్పటి కప్పుకోని పండుకునేది. నిద్రమ్మ వద్దన్నా వచ్చి జోకొడుతుంది. ఇటువంటి బతుకులోని కథలు ఆసక్తికరముగ ఉంటయా? లేక మందిని ముంచి, నిద్రరాక, పిచ్చి లేచిన వాని సంగతులు బాగుంటయా? దొగ్గలి కూర తిన్నరా ఎప్పుడన్న? అది రుచిగల పదార్థము. అది పేదరికపు రుచి!