లోకాభిరామం

చిత్ర విచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధనలో ఉండగా, పనితీరు చిత్రంగా ఉండేది. నిజంగా పని ఉంటే ఏడు గంటలకు ఉదయాన మెస్‌లో నచ్చీనచ్చని నాష్తా అనే టిఫిన్ అనే ఉపాహారం ముగించుకుని, అక్కడి నుంచే నేరుగా ల్యాబ్‌కు వెళ్లిపోయే వాడిని. మధ్యాహ్నం క్యారియర్ అక్కడికే వచ్చేది. అంటే భోజనం ల్యాబ్‌లోనే అని అర్థం. సాయంత్రం ఆరున్నరకు మళ్లీ రాత్రి భోజనాలు మొదలవుతాయి. ఏ మాత్రం ఆలస్యం చేసి రెండవ వరసకు మారినా అడుగుబొడుగు పద్ధతి తిండి మాత్రమే మిగులుతుంది. కనుక ఆ సమయానికి అక్కడికి చేరుకుని పట్టిందేదో తినాలి. మళ్లీ ల్యాబ్‌కు వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. మధ్యరాత్రికి గదికి చేరిన సందర్భాలున్నాయి. అయితే ఈ రకమయిన పని ఒత్తిడి ఎప్పటికీ ఉండదు. అక్కడ ఎవరో అప్పజెప్పిన పని చేయడం అనే పద్ధతి లేదు. మన పనిని ఒక పథకం ప్రకారం మనమే కల్పించుకుంటాము. ఆ అనుభవంతోనే ఉద్యోగం లేకుండా గడుపుతున్న గత ఒకటిన్నర దశాబ్దాలలో కూడా నా పనులను నేనే కల్పించుకుని బిజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకూ ఇక్కడ కథ చెప్పవలసింది పనిలేని రోజుల గురించి.
పద్ధతిగల విద్యార్థిగా అర్థం లేని కాలక్షేపం చేయకూడదు. చేతనయినంత వరకూ పరిశోధనకు పనికి వచ్చే పనులే చేస్తూ ఉండాలి. కనుక ల్యాబ్‌లో చేయవలసిన పని అంతగా లేనప్పుడు విషయ సేకరణ గురించి లైబ్రరీల వెంట తిరగడం ఒక పద్ధతి. నా పరిశోధనకు పనికివచ్చే పుస్తకాలు జాతీయ పోషకాహార సంస్థ అనే ఎన్‌ఐఎన్ లైబ్రరీలో ఎక్కువగా దొరికేవి. నేను తరచూ ఆ లైబ్రరీకి వెళ్లేవాడిని. అయితే ఎన్‌ఐఎన్‌కు వెళ్లడం అనే మాటకు నేను ఒక కొత్త అర్థాన్ని జోడించాను. నాకు సినిమాలు చూడడం అప్పట్లో బాగా అలవాటు. ఎన్‌ఐఎన్ అని వెళ్లిన సందర్భాలలో సగానికి సగం ఈ అలవాటులో గడిచేది. అంటే నేను లైబ్రరీకి కాక, సినిమాకు వెళ్లేవాడినని అర్థం. ఆ సంగతి ల్యాబ్‌లో నాతోబాటు పని చేస్తున్న ఒకరిద్దరు మాత్రం గమనించారు. ‘నిజంగా ఎన్‌ఐఎన్‌కు వెళ్లేట్టయితే’ అని వాళ్లు నాతో మాట్లాడేవారు. అంటే అప్పుడప్పుడు ఉత్తుత్తి వెళ్లడం కూడా ఉంటుందన్నమాట!
అప్పట్లో హైదరాబాద్‌లో అక్కడక్కడ మలయాళం, తమిళం, బెంగాలీ లాంటి భాషల సినిమాలు కూడా మామూలుగానే థియేటర్‌లలో ఆడేవి. కనుకనే నేను వాటిని చూడగలిగానని నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది. ఆబిడ్స్‌కి దగ్గరలో ఒక చోట ఒక చిన్న సినిమా హాలు ఉండేది. అది నేల మీద కాక రెండవ అంతస్తులో ఉండేదని జ్ఞాపకం. పేరు బహుశా లైట్‌హౌస్ అయి ఉండాలి. అందులో నేను ఛెమీన్ అనే మలయాళ సినిమా చూడడం బాగా గుర్తుంది. కేవలం నా మీద గౌరవం కొద్దీ ఒకానొక మిత్రుడు నాతోబాటు ఆ సినిమాకు వచ్చాడు. సినిమా గొప్పది. కానీ మాటకు మాట అర్థం కాలేదు. నాతో వచ్చిన మిత్రుడికి అసలే అర్థం కాలేదు. ఆ తరువాత శివశంకర్ పిళ్లే నవలను తెచ్చుకుని చదివిన తరువాత మాత్రమే సినిమాలోని ఆంతర్యం కొంత అర్థమయినట్టుంది. ఆదూర్ గోపాలకృష్ణన్ సినిమాలు కూడా చూచిన జ్ఞాపకం ఉంది. కానీ మలయాళ సినిమాల విషయంగా ఒక ద్వంద్వ వైఖరి అప్పట్లో మొదలయింది. ఉంటే సినిమా చాలా గొప్పగా ఉంటుంది, లేదంటే తకర, అవళుడ రావుగళ్ లాంటి సినిమాలు మరో రకంగా ఉంటాయి. ఈ రెండవ రకం సినిమాలు ఎందుకు మొదలయినయో తెలియదు. కుర్రతనం గనుక చూచినట్టున్నాము. నిజానికి ఇలాంటి సగం బూతు సినిమా చూస్తూ ఉండగా, సికిందరాబాద్‌లోని ఒక థియేటర్‌లో చెప్పాపెట్టకుండా వాడు ఒక బ్లూఫిల్మ్ మొదలుపెట్టాడు. పక్కన ఉన్న మిత్రుడు ఆశ్చర్యపోయి ‘ఇదేమిటి?’ అని అడుగుతున్నాడు. అంతలో ఆ ముక్క ఏదో అయిపోయింది. ఇంత దరిద్రంగా ప్రేక్షకులను ఆకర్షించే పద్ధతులు సినిమా హాళ్ల వాళ్లు అప్పట్లో వాడుకున్నారంటే నవ్వు పుడుతుంది. అయితే ఇక్కడ మొగమాటం లేకుండా ఒక విషయం చెప్పాలి. మేము కుర్రవాళ్లుగా ఉన్నప్పుడు అమ్మలు, అమ్మాయిలు ఉండే తీరు వేరు. ఇప్పటి తీరు పూర్తిగా వేరు. ఇప్పటి వారికి అంగాంగ ప్రదర్శనలు హాయిగా ఇంట్లో, రోడ్డు మీద కనిపిస్తూనే ఉన్నాయి. ఆ విషయం అవసరం లేదు. మళ్లీ సినిమా హాలుకు వెళదాం.
కాచిగూడ ప్రాంతంలో ఒక సందులో బసంత్ సినిమా అని ఒక హాలు ఉండేది. ఆ ప్రాంతంలో కన్నడిగులు ఎక్కువగా ఉండేవారని సులభంగానే అర్థమయింది. కనుకనే ఆ హాలులో కనీసం ఆదివారాలు ఉదయం మంచి కన్నడ సినిమాలు వేసేవారు. ఒందానొందు కాలదల్లి అని ఒక సినిమా చూచినట్టు నాకు ఇవాళటికీ గుర్తుందంటే అది ఆ సినిమా గొప్పతనం. లంకేశ్ అనే దర్శకుడు ఆ కాలంలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అతను ఒక పత్రిక కూడా నడిపించాడు. దాని పేరు లంకేశ్ పత్రిక. గిరీశ్ కాసరవల్లి, గిరీష్ కర్నాడ్ సినిమాలు కూడా అప్పుడప్పుడే మొదలయినట్టున్నాయి. సంస్కార అనే సినిమా చూచి, మిగతా వాళ్లందరినీ చూడమని చెప్పి ఆ తరువాత ఆ సినిమా గురించి ఒకానొక సాయంత్రం నేను ఏకంగా ఒక సెమినార్ ఏర్పాటు చేశాను. అంటే ఒక చర్చ ఏర్పాటు చేశానని అర్థం. అందులో చాలామంది పాల్గొన్నట్టు కూడా గుర్తుంది. బూతు సినిమాలు చెప్పీ చెప్పక చూచారంటే కుర్రతనం వల్ల అని నచ్చచెప్పుకోవచ్చు. ఘటశ్రాద్ధ, సంస్కార లాంటి సినిమాల గురించి కూడా చర్చలు జరిగాయంటే ఆ కుర్రతనం చాటున బోలెడంత కుతూహలం కూడా ఉందని అప్పట్లోనే అర్థమయింది. మంచి సినిమా, మంచి పుస్తకం దొరికితే ఎవరూ వెకిలి కుర్రతనాన్ని బయటపెట్టుకునే అవసరం ఉండదని కూడా అర్థమయింది.
ఆ ప్రయత్నంలో భాగంగానే ఫిల్మ్ క్లబ్స్ అనే సంస్థలతో అప్పుడే పరిచయాలు మొదలయ్యాయి. తరువాత చాలా గొప్ప సినిమాలు తీసి పేరు సంపాదించుకున్న నరసింగరావు అప్పట్లో ఒక క్లబ్ నడిపించేవాడు. అందరమూ కలిసి నిజంగా ఎన్నో మంచి సినిమాలు తెప్పించుకుని చూచాము. గణశత్రు అన్న సత్యజిత్‌రాయ్ సినిమా అట్లా చూచిందే అని జ్ఞాపకం. కానీ సికిందరాబాద్‌లో నడిచే ఈ క్లబ్బు ఎందుకో విజయవంతంగా ముందుకు సాగలేదు. ఒకానొక రెడ్డిగారి కృషితో నడుస్తున్న మరొక ఫిల్మ్ క్లబ్ మంచి సినిమాలు చూచే అవకాశాలను అందజేసింది. ఈ మధ్యన ఆ రెడ్డిగారు మళ్లీ కనిపించారు. ఆయన ఇంకా ఫిల్మ్ క్లబ్‌ను చురుకుగా నడిపిస్తున్నారని చెపితే ఆశ్చర్యం కలిగింది.
ఈ మధ్యన టివికి వాడుతున్న సెట్ టాప్ బాక్స్ పాడయిందని అర్థమయింది. దాన్ని మార్పించాను. అప్పుడు ఒక విషయం తెలిసింది. మొత్తం మూడు వందలకు పైన ఛానల్స్ ఇంట్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిల్లో ఇందాక నేను ప్రస్తావించిన భాషల ఛానల్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో వెతికి మరీ ఆయా భాషల సినిమాలు చూచాం కదా! ఇప్పుడు ఇన్ని ఛానల్స్‌లో ఆ రకం సినిమాలు కనిపించే అవకాశం ఉందా అని అనుమానం మొదలయింది. బెంగాలీ ఛానల్స్ కూడా బోలెడు కనిపిస్తున్నాయి. అట్లాగని అన్నిట్లో గొప్ప సినిమాలు చూపిస్తారంటే అబద్ధం. ఏ భాష ఛానల్ అయినా ఎప్పుడూ మంచి సినిమాలు చూపించడం కుదరదు. లాటరీ టికెట్ తగిలినట్టు అప్పుడో ఇప్పుడో మంచి సినిమా చూపిస్తే ఆ సంగతి మనకు తెలియదు. అంటే సమాచారం సముద్రంలాగ అందుబాటులోకి వచ్చింది. అందులో మనకు కావలసిందేమిటో వెతికి చూడడం కుదరదని సారాంశం అన్నమాట.
కరువు గురించి బెంగాలీ సినిమాలు చూచాను. ఒకటి, రెండు సన్నివేశాలు గట్టిగా గుర్తున్నాయి. అకాలేర్ సంథానే అని ఒక పేరు కూడా గుర్తుంది. ఎందుకోగానీ ఇది సత్యజిత్‌రే సినిమా అనుకున్నాను. రే తీసిన ఒకానొక సినిమాలో బెంగాల్ కరువు గురించి చాలా బాగా చూపించాడని మాత్రం గుర్తుంది. మనసులో తికమక మొదలయింది. అయితే సముద్రంగా సమాచారాన్ని అందించే మరొక సౌకర్యం ఇంటర్నెట్ ఉండనే ఉంది. తెలివిగా వెతికితే అందులో ఎన్నో విషయాలు తెలుస్తాయని తెలుసు. కరువు గురించి రే తీసిన సినిమా అశని సంకేత్ (అశోని శంకేత్ అనాలేమో!) అని అర్థమయింది. ఆశ్చర్యంగా ఈ సినిమా మొత్తం ఉచితంగా చూడడానికి ఇవాళ దొరుకుతున్నది.
మళ్లీ అదే మాట. సినిమా గురించి కూడా సముద్రం ఉంది. మనకేం కావాలో వెతకడమే ఒక కష్టం. ఎన్‌ఐఎన్ అనే పద్ధతి ఇప్పుడు పనికిరాదు.

కె.బి. గోపాలం