లోకాభిరామం

పట్నం పట్టింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పల్లె ఒడిని పెరగాను, పక్కకెలా జరిగాను’ అని కవిత రాసుకున్నానా? ఏం కవిత అది? ఎలా జరిగానని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నానా? నాలో నేను ఆలోచిస్తున్నానా? నా తలకాయ! తెలిసి తెలిసి పట్నం చేరుకున్నా గదా!
చిన్ననాట మా ఊళ్లో నా మిత్రుడొకడు, హైదరాబాద్ అనే పట్నం గురించి మాట్లాడుతూ, ‘నర అడివి’ అన్నడు. అది అడవి. కానీ చెట్లలాగ ఒకరికొకరితో పని లేకుండా నరులు పెరిగే అడవి, అని వాని భావం. నాకదేదో దుష్ట సమాసం తోచింది అంతేగాని, అసలు సంగతి తలకెక్కినట్టు లేదు, అప్పట్లో!
నా చదువు, పల్లె పక్కనున్న పాలమూరులో జరిగింది. నేను పల్లెను వదిలి పాలమూరులో గడపడం అది పూర్తిగా మరో కథగా, నవలగా, చరిత్రగా చెప్పవలసిన సంగతి. వివరాలలోకి వెళ్లనుగానీ, ఎమ్మేలో, పట్నం అనే భాగ్యనగరపు ఉస్మానియాలో చేరాను. ఆసుపత్రి కాదు లెండి, విశ్వవిద్యాలయంలో! పల్లా దుర్గయ్య, యశోదమ్మ, సినారే లాంటి పంతుళ్ల దగ్గర చదువుకుని తెలుగు మాష్టారు అయ్యే యోగం లేదు మరి. అటు ఎమ్మెస్సీలో సీటు వచ్చింది. అదేదో అంతులేని అదృష్టం అంటూ, వెళ్లిపొమ్మన్నారు. ఆ జంతువుల గురించి చదువుకుంటే ఒరిగేదేమిటో తెలియదు. అయితే చిత్రంగా చదువు ఒరుగల్లుకు మారింది. అక్కడ కాలం హాయిగా సాగింది. నా బుద్ధిమంతనానికి మెచ్చి బంగారు పతకం కూడా ఇచ్చారు. అన్నట్లు సరిగ్గా పరీక్షలకు కొంత కాలం ముందు, మా ప్రత్యేక శాఖ గురువుగారికి, హైదరాబాద్‌కు బదిలీ వచ్చింది. ఆయనకు కృతజ్ఞత చెబుదాము గదాని మళ్లీ ఉస్మానియాలో కాలుపెడితిని. ఆయన సూటిగా ‘ఏం చేస్తావు తరువాత?’ అని ప్రశ్నించారు. ‘ప్రొఫెసర్ చారిగారు వరంగల్ రమ్మన్నారు. పిఎచ్‌డికి చేరతాను’ అని మోమాటం లేకుండా చెప్పాను. ‘మీది మహబూబ్ నగరం. మధ్యలోని పట్నాన్ని దాటి వరంగల్ వరకు పోవడం అవసరమా? నా లాబ్‌లో నీ కొరకు ఒక సీటు ఖాళీగా ఉంది. వచ్చి చేరిపో (ఈ అర్థం వచ్చే ఇంగ్లీషు మాట) అన్నారాయన. అది మలుపు. అవుననిపించింది. చేరిపోయాను. ఫెలోషిప్ వచ్చేదాకా ఏ బంధువుల ఇంట్లోనో కాలక్షేపం చెయ్యవచ్చునని పథకం. ఆ పనే చేశాను. కానీ అవేరొండు గాథ! మొత్తానికి పట్నంలో పడిపోయాను. హాస్టల్‌లో కూడా చేరాను. ఆ తరువాత భువనగిరి అనే బోంగీర్‌లో కొలువు దొరికింది. బతుకంతా అక్కడ గడిపేది లేదని తెలుసు. ఆ సంగతి గురించి ఆలోచించేలోగా హైద్రాబాద్‌లో కొలువు దొరికింది. మరోసారి ‘యు టర్న్!’ చలో పట్నం! నిజానికి ఇల్లు వెతకాలన్న ఆలోచన కూడా గట్టిగా రాకముందే పెళ్లి మాత్రం అయ్యింది. ఆవిడగారు హైదరాబాద్‌లో పుట్టలేదు గానీ, అక్కడే చదువుకున్నారు. మరో చిత్రం! ఆమెకు నౌకరీ పట్నంలో రాలేదు. చచ్చీ, చెడీ, పట్నానికి ఆమెను బదిలీ చేయించేసరికి నాకు దిల్లీలో సద్యోగం వచ్చింది.
బాబు, పాప ఎవరో పుడతారు. ఆమె రాష్ట్ర ప్రభుత్వం వారి కొలువులో చేరారు. కనుక దిల్లీ వాళ్లకు, ‘రాను’ అని చెప్పవలసి వచ్చింది. లేకుంటే దిల్లీలో పేద్ద ఆఫీసరయి ఉండేవాడిని. మనలను మరీ పట్నం పట్టుకున్నది గదా!
ఇలా ఉండగా, నేను చేస్తున్న ఉద్యోగం నాకు నచ్చింది. కానీ, మా సంస్థ వారికి నచ్చలేదు. నా వంటి మరో ఎనమండుగురితో సహా, నన్ను కూడా మేనేజ్‌మెంట్ అధికారులుగా మార్చేశారు. అప్పుడు నాకు విశాఖపట్నానికి బదిలీ అయ్యింది. నిజం చెపుతున్నాను, సంతోషంగా వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నాను. అది జరిగితే నా పరిస్థితి పూర్తిగా మరొక రకంగా ఉండేది. కానీ, పట్నం నన్ను పట్టుకున్నదాయె. నా పై అధికారి నన్ను పిలిచి ‘ఏమిటి, వెళ్లిపోతావా?’ అన్నాడు. ‘ఓ!’ అన్నాను. ‘కాదు. నీ భార్య ఇక్కడ ఉంది గదా, నీకు, ఇక్కడే ఉండే ఏర్పాటు నేను చేస్తాను’ అన్నాడాయన. అది బతుకులో మలుపున్నర. ప్రలోభం అంటారే, బాగా పని చేసింది. ఉండిపోయాను. ఆ మహానుభావుడు, కేవలం స్వార్థంతో నన్ను అట్టిపెట్టుకుని, అరవ చాకిరీ చేయించుకున్నాడని నాకు, అర్థం కావడానికి చాలాకాలం పట్టింది. ఉద్యోగంలో ఏ మాత్రం సంతృప్తి లేదు. అయినా, బుద్ధిగా పని చేసానని, సవినయంగా చెపుతున్నాను. ఆ తర్వాత ప్రమోషన్ రావడం, ఆషాఢభూతులు కలుగజేసుకుని నన్ను శంకరగిరి మాన్యాలకు పంపడం (అందుకు, నేనే కొంత, నా ముక్కుసూటిదనం మరింత కారణమని అర్థం కావడానికి చాలాచాలా కాలం పట్టింది!) నా ఆరోగ్యం నాశనం కావడం, నేను ఉద్యోగం వదిలేసి, మళ్లీ పట్నం చేరడం అది మరొక నవలకు సామగ్రి! తిరిగి పట్నమనే హైదాలో పడ్డాను. అది మరి నన్ను గట్టిగా పట్టుకున్నదాయె!
ఏదో పని మీద నన్ను ఒకసారి కారులో ఎక్కించుకుని, నగరం ఆవలి అంచులకు తీసుకుపోయారు. తిరిగి వస్తుంటే, ఇది మన ఊరేనా? అని అనుమానం వచ్చింది. ఊరు మారిన తీరు గురించి చెపితే, పాత వాసనలు, నాస్టాల్జియా (లోకాలో ఉండేది అదేనాయె!) నేను అయిదవ అంతస్తులో బతుకుతాను. నాలుగయిదు రోజుల దాకా నేల మీద కాలుపెట్టే పని లేదు. అధవా కిందకు వెళ్లినా పట్నంలో తిరగడం అంతకన్నా లేదు. నా పరిధి, గానుగెద్దు పద్ధతిలో సాగుతున్నది. ఆ మధ్యన ధైర్యం చేసి ఎక్కడికో బయలుదేరాను. అవునా, అన్నట్టు పుణ్యాత్ముడు, నా ఫోను, దాంతోబాటు దక్షిణగా అందులో దాచుకున్న డబ్బులు కొట్టేశాడు. కొత్త ఫోను కొనక తప్పలేదు. ‘నన్ను నేను వెతుక్కుంటూ, నగరంలో బతుకుతునానను’ అని దశాబ్దాల క్రితం కవిత రాశాను. ఇప్పుడా వెతకడం వ్యర్థమని అర్థమయింది. నేను లేను! మరి ఎవరీ రాస్తున్నది అంటే, ఏమో నాకు తెలియదు! నాకు కూడా అనుమానం వస్తూనే ఉంటుంది ఈ విషయంగా!
నాన్నను అడుక్కున్నా, నాతో వచ్చి ఉండడానికి ఒప్పుకోలేదు. వస్తే, చుట్టంలాగ ఇవాళ రావడం, రేపు తిరుగుటపా! ఒకసారి, రాత్రి పొద్దుపోయింతరువాత గోల మొదలుపెట్టాడాయన. ‘ఆకాశంలో ఇల్లు కట్టుకున్నవు. నాకు ఊపిరి సలుపుత లేదు. కింద వాచ్‌మన్ దగ్గర మంచం వెయ్యి. పోయి పండుకుంట!’ అని. బస్సెక్కించి నమస్కారం చేశాను. ఆయన నాతో ఈ నగరంలో, ఈ నర అడివిలో ఉండడం నాకు నచ్చలేదు. ఆయన అంతిమ దశలో అక్కడే, తన పల్లెలోనే వెలసిన, మెడికల్ కాలేజీ వారి ఆస్పత్రిలో ఉన్నడు. అపస్మారకం అసలు లేదు. కానీ, దైవచింతనతో మరేదో లోకంలో ఉన్నడు. నన్ను చూపించి ఎవరు, అని అడిగినరు. ‘పట్నపోడు’ అన్నడు నాన్న. నాకు ఈ అక్షరాలు రాస్తుంటే, ఏడుపు ఆగడం లేదు. ఎందుకొచ్చిన పట్నం ఇది. నాకేమిచ్చింది? నన్ను దయ్యమయి పట్టి మనిషిని గాకుండా చేసింది గదా! పారిపోయేందుకు గూడ లేదా?

కె.బి. గోపాలం