లోకాభిరామం

మనిషి - చేతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాట్లాడే మనిషికి ముఖ్యంగా ఉపన్యసించే మనిషికి తన చేతులను ఏం చేయాలో తెలియదు అంటారు. చేతులను అర్థవంతంగా, అర్థం లేకుండా కదిలించడం మనకు అలవాటు. ఇక ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు చిత్రకారులు మనుషుల చేతులను గీసిన లేదా రాసిన తీరు చూస్తే వాటిలోని వైవిధ్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ప్రసిద్ధులయిన చిత్రకారులు కూడా కొంతమంది ముఖాలను చిత్రించినంత జాగ్రత్తగా చేతులను కూడా చిత్రించారు. రెంబ్రాంట్ ఇందుకు ముఖ్యమయిన ఉదాహరణ అని కళా విమర్శకులే అంటారు. భారతీయ చిత్రకారులను గురించి ఈ విషయంగా పరిశీలనలు జరిగిన సంగతి వివరాలు తెలియవు. ముఖాన్ని చూస్తే మనిషిని గురించి ఎన్నో సంగతులు తెలుస్తాయి. చేతులను చూచి కూడా మనిషి వయసు, సాంఘిక స్థాయి, జీవన సరళి మొదలయినవన్నీ చెప్పవచ్చునని అంటారు. షెర్లక్ హోమ్స్ తన వద్దకు వచ్చిన మనుషుల వృత్తులను కూడా వాళ్ల చేతులను గమనించి గుర్తు పట్టాడు. చేతులు కట్టుకున్న పద్ధతి కూడా ఎన్నో సంగతులు చెపుతుంది. నిండుగా కనిపించే చేతులు కొన్నయితే, బీదతనం కారణంగా, పెరిగిన వయసు కారణంగా ముడతలతో కనిపించే చేతులు మరికొన్ని. ఇక చెయ్యి పైకెత్తి తాను చెప్పదలుచుకున్నది ఆ చేతుల ద్వారా కూడా చెప్పే వ్యక్తి చేతులు అతని బదులుగా మాట్లాడుతాయి. కనుకనే చేతులు కూడా భావావిష్కరణలో ముఖ్య భాగాలుగా ఉంటాయన్నది అనుమానం లేని అంశం. ఒక మనిషి వ్యక్తిత్వానికి, ఆరోగ్య స్థితికి చేతులు ముఖ్య సూచికలుగా కనిపిస్తాయి. ఆ వివరాలను చూచి తెలుసుకోవడానికి కొంత అనుభవం అవసరం కావచ్చు.
‘మాట్లాడగలిగినందుకు మనుషులం అంటున్నారు, కానీ భాషకన్నా చేతులు ఎక్కువ మాట్లాడతాయి’ అన్నారు యు.కె.కు చెందిన ప్రఖ్యాత సర్జన్ సైమన్ కె. ఆయన 2012లో ఒక మనిషికి చేతుల మార్పిడి శస్త్ర చికిత్సను మొట్టమొదటిసారిగా చేశారు. ఇప్పటికీ మనం మాటలతోబాటు సైగలతో మాట్లాడటం తెలిసిన విషయమే. ఇక మాటలు పుట్టక ముందు మనిషి భావ ప్రకటనలు చేతులతోనే జరిగేవి. ఈనాటికీ ఆ పద్ధతి మనకు తెలియకుండానే జరిగిపోతున్నది. ఇక కొన్ని సంస్కృతులలో చేతి కదలికలను కళారూపాల కిందికి మార్చారు. సిసిలీ దేశంలోని ప్రజలకు లెక్కలేనని సంజ్ఞలు తెలుసు. ఇక మన దేశపు నాట్యరీతులలోని వివిధ ముద్రలను గురించి ప్రత్యేకంగా చెప్పుకొనవలసిన అవసరం ఉంది. ఈ ముద్రలకు ఉన్న అర్థం, వాటిలోని సౌందర్యం నాట్యం తెలిసిన వారికి, దానిలోని సౌందర్యం తెలిసిన వారికి సులభంగానే అర్థం అవుతుంది.
ఇక చేతుల ఉపయోగంలో మరొక కోణం కూడా ఉంది. చేతిరాత, బొమ్మ గీయడం, సంగీతం వాయించడం, కుండలు చేయడం నుండి మొదలు మహత్తరమయిన నిర్మాణాలను కట్టడం దాకా మనిషి ఒక్కడే చేయగలిగిన ఎన్నో పనులకు చేతులే ఆధారం.
ప్రపంచ కార్మికులారా, ఏకంకండి అన్నచోట పిడికిలి పట్టిన మనిషి చెయ్యి ఒకటి కనిపిస్తుంది. ఈ పిడికిలి రహస్యాన్ని మనం పట్టించుకున్నట్టు కనిపించదు. నాలుగు వేళ్లు అరచేతిలోకి మరల్చడానికి వీలుంటుంది. బొటనవేలు వాటి మీద వచ్చి అదుముతూ చేతికి ఒక ఆయుధం ఆకారాన్ని ఇస్తుంది. ఈ రకంగా చేతులను మార్చడం మనకు దగ్గరి దాయాదులు అయిన చింపాంజీలకు కూడా అంత బాగా చేతకాదు. ఈ ప్రయత్నంలోనే మనిషి బొటనవేళ్లు మరింత పొడుగు పెరిగాయి. పిడికిలి వీలయింది. ఆ పిడికిలితో పోరాటం కూడా వీలయింది. ఈ లోపల వేళ్ల చివరలు వెడల్పుగా మారాయి. గోళ్లు కూడా వెడల్పయ్యాయి. ఈ మార్పుల కారణంగా మరొక ప్రయోజనం చేకూరింది. దొరికిన వస్తువును బొటనవేలి సాయంతో మిగతా వేళ్లు ఆధారంగా పట్టి, ఎత్తి కంటి దగ్గరికి తెచ్చి కావలసినంతగా పరిశీలించే శక్తి మనిషికి వచ్చింది.
మనిషి అరచేతుల వైశాల్యం తగ్గింది. వెడల్పు పెరిగింది. మిగతా వేళ్లతో పోలిస్తే బొటనవేలు మాత్రం ఎక్కువగా పెరిగింది. అసలు ఈ బొటనవేలు తీరు గురించి మానవ పరిణామంలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. నిప్పు, చక్రంతోపాటు మిగతా వేళ్లకు ఎదురుగా రాగల బొటనవేలు ఉన్నందుకే మనిషి ఈనాటి స్థితికి చేరగలిగాడు అన్నది వారు నిష్కర్ష చేసి చెప్పిన విషయం.
చేతుల మార్పు కారణంగా మనిషికి పనిముట్లు వాడే శక్తి కలిగింది. సుమారు మూడున్నర మిలియన్ సంవత్సరాల కాలంనాడే మనిషి వాడిన పరికరాలు దొరికాయి. అవి రాతి పరికరాలు, దొరికిన రాయిని నాణ్యత ప్రకారం గుర్తించి మరొక రాయితో కొడితే దానికి వాడిగల అంచు మిగిలే విధంగా ముక్క ఊడి వస్తుంది. ఈ రకం ఆయుధాల కారణంగా మాంసాన్ని చీల్చడం, చర్మం నుండి గోకడం వీలయింది. చర్మాన్ని బాగు చేయడమూ వీలయింది. పొడుగాటి ఆయుధాల సాయంతో తవ్వడం, దున్నడం తెలిసింది. అయితే విషయం అంతటితో ఆగిపోలేదు. పిడికిలి గురించి చెప్పుకున్నాము. ఈ పిడికిలి పోరాటంలో భాగంగా ఆయుధంగా అందివచ్చింది. ఆడతోడు కొరకు పోరాడుతున్న మగ మానవులు ఒకరిని ఒకరు పిడికిలి పోట్లతో పడగొట్టే ప్రయత్నాలు చేశారు. చేతిలోని ఒడుపు ఒకవేపు అయితే పోరాటంలో వాటి పాత్ర మరొకవేపు నిలిచింది.
ఒడుపు అన్న మాట వాడుకున్నామే గానీ నిజానికి రెండు చేతులకు తగినంత ఒడుపు చేతకాదు. అసలు ఒక చేతికి కూడా ఉండవలసినంత ఒడుపు లేదు. చిన్నపిల్లలను గమనిస్తే ఈ విషయం సులభంగా అర్థమవుతుంది. పాకే పాపకు దొరికిన వస్తువును వేళ్లతో కాకుండా అరచేతితో ఎత్తడానికి ప్రయత్నం చేస్తుంది. వయసు పెరిగిన కొద్దీ ఒక సంవత్సరం నాటికి వేళ్ల ఉపయోగం తెలుస్తుంది. పిల్లలు నిజంగా తమ చేతిని ఒడుపుగా వాడుకునే శక్తి పది సంవత్సరాల నాటికి మాత్రమే వస్తుందని పరిశోధకులు గమనించారు. ఎడమ, కుడిచేతి వాటం అన్నవి జన్యుపరంగా వచ్చే లక్షణాలు అని పరిశోధకులు అన్నారు. అయినప్పటికీ, మనిషికి తన తీరుకు వ్యతిరేకంగా అంతగా వాడుకలోకి రాని మరొక చెయ్యిని కూడా వాడడం అలవాటు చేసుకునే వీలు ఉంది. చిన్ననాటి నుంచి నేర్పిస్తే పిల్లలు రెండు చేతులతోనూ ఒడుపుగా పని చేయడం నేర్చుకో గలుగుతారు. భారత వీరుడు అర్జునుడు అటువంటి ఒడుపు ఉన్నవాడు కనుకనే సవ్యసాచి అనిపించుకున్నాడు. గాంధీ ఎడమ చేతితో కూడా రాసేవారు. నిన్నమొన్నటి వరకు టైప్‌రైటర్ అనే ఒక యంత్రం బాగా వాడుకలో ఉండేది. ఇప్పటికి కూడా ఆ పద్దతిలో టైప్ చేస్తున్న వారు రెండు చేతులను సమాన వేగంతో వాడగలుగుతారు. కానీ మొబైల్ ఫోన్‌ల కారణంగా కీబోర్డు తీరు మారింది. అది అరచేతి సైజుకు వచ్చింది. ఇప్పుడు అందరూ దాన్ని ఒక చేతితోనే వీలయినంత వేగంగా వాడుతున్నారు.
ఇంత చెప్పుకున్నా చేతులకు చేతకాని పనులు ఇంకా కొన్ని ఉన్నాయి. మనిషి చేయలేని పనులను ‘చేతకాని’ పని అని వర్ణిస్తున్నాము. అంటే మనిషి చేతికి వీలుకాని పని అని అర్థం. మనిషి చేసే పనులలో అసంకల్పితంగా జరిగే శ్వాస, వినికిడి, దృష్టి లాంటివి తప్ప తలుచుకుని చేసే పనులన్నీ చేతులతోనే వీలవుతాయి. అయినప్పటికీ ఆ చేతులకు చేతకాని లేదా వీలుకాని పనులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మీ చేతిలోని వేళ్లను ఒక్కొక్కదానే్న రకరకాలుగా కదిలించడానికి ప్రయత్నించండి. ఒకటి రెంటికి వీలయినట్టే ఉంటుంది. కానీ చిన్నవేలు, ఆ పక్కనున్న వేళ్లు ఒక్కొక్కటిగా కదలవు. నిజానికి ఆ మూడు వేళ్లకు నాడులు కలిసి ఉంటాయి. టైప్ చేసే వారికి ఒక్కొక్క వేలి కదలిక గురించి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. ఒక వేలితో ఒక కీని నొక్కుతూ ఉంటే, పక్కనున్న వేళ్లు కూడా అనవసరంగానే కదులుతాయి. లోపలి నాడుల ద్వారా, కండరాల ద్వారా వేళ్ల మధ్యన బంధనాలు ఉండడం ఇందుకు కారణం.
కళ్లలో లాగే చేతులలో కూడా 17వేలకు పైగా రిసెప్టర్ కణాలు ఉంటాయి. అవి చేతికి తగిలిన వివిధ అంశాలను గురించి తెలుసుకుంటాయి. ఈ లక్షణం వంశపారంపర్యంగా వస్తుంది. వినికిడి లాగే ఈ లక్షణాలకు కూడా ప్రత్యేకంగా జన్యువులు ఉన్నాయి. అయినప్పటికీ స్పర్శ తెలియడంలో తేడాలు కూడా ఉండనే ఉంటాయి. ఆ లక్షణం వంశపారంపర్యంగా వస్తుంది. దానికీ వినికిడికీ ఆధారమయిన జన్యువులు ఒకటేనని కూడా తెలిసింది. చెవులు బాగా వినిపించని వారికి చేతులకు స్పర్శ కూడా తక్కువగా తెలుస్తుందట. రెంటిలోనూ ఇంద్రియ శక్తితోబాటు యాంత్రిక లక్షణాలు కూడా చేరి ఉంటాయి కనుక బహుశా ఈ రకంగా జరుగుతుండవచ్చు. అయితే పూర్తి గుడ్డివారు మాత్రం చేతులతో ముట్టుకుని ఎన్నో సంగతులను గుర్తించగలుగుతారు. ఇక ఈ విషయంగా ఆడ, మగ మధ్యన కూడా తేడాలు ఉన్నాయి. ఆడవాళ్లకు వేళ్లు చిన్నవి గనుక వాటికి గల గ్రహణ శక్తి ఎక్కువ అంటున్నారు పరిశోధకులు.

-కె.బి.గోపాలం