లోకాభిరామం
కల గుర్తుంది!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కుక్కకు కల వస్తుందట. ఎక్కడో ఉన్న తిండి సంగతి తెలుస్తుందట. లేచి నేరుగా వెళ్లిందా, తిండి దొరుకుతుంది. లేచి చెవులు దులిపితే మాత్రం ఇక కల వచ్చిన సంగతి కూడా గుర్తు మిగలదట! ఎంత నిజమో గానీ, చక్కని కథ. చెప్పిన సంగతులను పట్టించుకోని వారిని చెవులు దులిపారు, అంటారు.
నాకు కూడా కలలు వస్తాయి. ముఖ్యంగా తెల్లవారుఝామున కలలు వస్తాయి. అంటే మెలుకవ వచ్చే ముందు, అని అర్థం చేసుకోవాలి. ఆలస్యంగా పడుకుంటానన్నది వేరే సంగతి. ఆలస్యంగా లేవడం మాత్రం నిజం. కనుక అందరకీ తెల్లవారిని తరువాత, నేను తెల్లవారుఝాము అనుకుని కలలు గంటాను. నాకు చెవులు దులపడం చేతగాదు. చెవులు కదిలించడం నాట్యాచార్యుడు, ఒకప్పటి మిత్రుడు రాజారెడ్డికి చేతనయింది. చెవులు దులపకున్నా నాకు కలలు గుర్తుండవు. సృజనాత్మకత, కనీసం వెర్రి ఆలోచనలు ఒకింత ఎక్కువగా ఉన్న మనిషినేమో, నాకు చిత్రమయిన కలలు వస్తాయి. ఇవన్నీ తరువాత గుర్తుంటే హాయిగా కథలు, వ్యాసాలు రాసుకోవచ్చు అనిపిస్తుంది కానీ ముక్క గుర్తుండదు.
చిత్రమయిన కలలు వస్తున్నాయని ఎట్ల తెలిసింది? అంటే కలలు వస్తున్నప్పుడు మరో మెదడు భాగం మెలుకువగా ఉండి, కల నాణ్యతను గుర్తించిందా? అదేం కాదు. కల తరువాత కొంత మెలుకవలోనే, కొంత గుర్తుండి, కొంత అటువంటి భావం కలుగుతుంది. ఒకానొక మిత్రుని అంగడిలో పడుకోవలసి వచ్చింది. ఆనాడు ఒకానొక జానపద నవల మొత్తం కలలో వచ్చిన సంగతి నేటికీ గుర్తుంది. గుర్రం మీద నాయకుడు తప్పితే, మిగతా వివరాలు గుర్తులేవు. గుర్తు ఉండి ఉంటే, తెలుగు పాఠకులకు ఒక చక్కని నవల దొరికి ఉండేది గదా? బతికిపోయారు మరి!
చాలామందికి కొన్ని కలలు మళ్లీమళ్లీ వస్తుంటాయని ఎక్కడో చదివినట్టు గుర్తు. నాకు కొంతకాలంపాటు, ఎత్తుల మీది నుంచి అగాధంలోకి, లేక నేల మీదికి పడిపోతున్నట్టు కల వచ్చేది. ఒకసారి పడితే, ఆ కలల క్రమం ఆగేదేమో? కానీ పడలేదు. అట్లా పడుతున్నప్పుడు నా చుట్టు ఇంగువ వాసన కమ్ముకొని ఉండేది. అది గుర్తుంది. నాకు ఈనాటికీ ఇంగువ వాసన నచ్చదు. అయినా వంట మీద అధికారం నాది కాదు గనుక ఇంగువ తింటూనే ఉన్నాను. కింద పడుతున్న కలలు చాలా కాలం క్రితమే ఆగిపోయినయి. జరగవలసిన పతనం జరగనే జరిగింది. ఇంకా పడేదేమిటి?
కల వస్తూ ఉంటుంది. మెలుకవ వస్తుంది. కొంతసేపు కల గుర్తుంటుంది. నడిరాత్రి గనుక తిరిగి నిద్రలోకి జారుకుంటాము. చిత్రంగా అదే కల టీవీ ఎపిసోడ్‌ల లాగ మళ్లీ మొదలు అవుతుంది. నాకు ఈ సీరియల్ కలలు వచ్చిన కాలంలో టీవీ అంతగా ప్రచారంలో లేదు. కలలు టీవీ పద్ధతిలో వస్తున్నాయన్న ఆలోచన కూడా అప్పుడు రాలేదు. కలలు, వాటి తీరు గురించి ఒక నిపుణుడితో, మాధ్యమం ద్వారా మాట్లాడవలసిన సందర్భం వచ్చింది. ఆయనను మామూలుగా అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగారు. నేను తప్పించుకునే పరిస్థితి లేదు. నాకీ అవస్థ తప్పలేదు. బాగా తెలివిగల వారికి మాత్రమే తెగిన కల మళ్లీ కొనసాగుతుంది. మీరు చాలా తెలివిగల వారు అయి ఉండాలి, అన్నారు ఆ మానసిక నిపుణుడు. నేను విషయం పక్కకు మళ్లించాను. ఎందుకన్నది మీకు అర్థమయి ఉంటుంది.
ఉన్నట్టుండి కలల గురించి ఇన్ని సంగతులు ఎందుకు చెపుతున్నాను, అంటే కారణం ఉంది. ఈ మధ్యన ఒకానొక రోజు తెల్లవారిన తరువాత కూడా పడుకుని ఉండగా వచ్చిన కల నాకు చాలా భాగం గుర్తుంది. వెంటనే లేచి నాలుగు ముక్కలు కాగితం మీద రాశాను కూడా. ఆలోచించినపుడు అట్లా రాయడం అలవాటే. కల గురించి నోట్స్ రాయగలగడం అలవాటు లేదు.
నాకు ఈ మధ్యన కలల్లో ఒక రెకరింగ్ థీమ్, అంటే మళ్లీ మళ్లీ వచ్చే అంశం ఒకటి ఫిక్స్ అయింది. నేను మళ్లీ చదువు కొరకు యూనివర్సిటీ క్యాంపస్‌లో చేరినట్లు కల వస్తుంది. అక్కడ హాస్టల్ ఉంటుంది. అందులో నా గది ఉంటుంది. నేను రెగ్యులర్‌గా అక్కడ ఉండడం లేదని దాన్ని మరెవరికో ఇస్తారు. ఇలా కల సాగుతుంది. ఈసారి కూడా క్యాంపస్ గురించే కల. కానీ, ఈసారి ఏకంగా క్లాసు గురించి వచ్చింది. నేను సైన్స్ కాలేజీలో పి.ఎచ్,డి చేశాను. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో జెర్మన్ డిప్లొమా క్లాసులు మాత్రం అటెండ్ అయ్యాను. ఆ కాలేజీలో చదువుకోవాలన్న కోరిక నిజంగా మిగిలి ఉంది. కనుకనే, ఎకనామిక్స్, రాజనీతి లాంటి ఒక క్లాసులోకి వెళ్లాను. పాఠం చెపుతున్న గురువు యువకుడు. తన కుక్కను క్లాసులోకి వెంట తెచ్చుకున్నాడు. దానికి అతను రొట్టె తినిపిస్తున్నాడు. క్లాసులో చాలామంది ఉన్నారు. అతను అటెండెన్స్ తీసుకున్నట్లు గుర్తులేదు. కానీ చూస్తూండగా సగం మంది లేచి వెళ్లిపోయారు. అటెండెన్స్ కొరకు మాత్రమే క్లాసుకు వచ్చేవాళ్లు కొంతమంది ఉంటారు. అయినా క్లాసులో చాలామంది మిగిలారు. సినారే క్లాసులకు విద్యార్థులు కాని వారు రావడం గుర్తుంది. ఇక్కడా అదే పద్ధతి. ఆయన అంటే కలలో పంతులు బాగా పాఠం చెపుతున్నాడు. నేను ప్రశ్న కూడా అడిగాను. కానీ ఆయనకు ఓపన్ మైండ్ లేదన్న భావం నాకు మిగిలింది. ఎవరినో కోట్ చేస్తూ మామూలు పద్ధతిలో జవాబు యిచ్చాడు. మీకు ఈ సంగతి గురించి స్వంత అభిప్రాయం లేదా? అని అడిగాను. మొత్తానికి ఆర్ట్స్ ఉపాధ్యాయులంతా, సోషల్ సైంటిస్ట్‌లంతా, సైన్స్ చదవాలి, కనీసం ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ చదవాలి. అప్పుడు మీ ఆలోచన ధోరణి మారుతుంది, అంటూ నేను తీవ్రంగా మాట్లాడాను.
మరేదో కోర్స్ కూడా చదువుతున్నానట. అక్కడ పరీక్షలు ముగిసినయి గనుక, ఈ క్లాస్‌కు వెళ్లగలిగానట. కలలో ప్రసక్తి వచ్చిన ఒక వ్యక్తి పేరు ‘మృత్యుకుమారి’. ఏమిటి సందర్భం? పేరు గుర్తుంది, బలంగా గుర్తుంది. సందర్భం మాత్రం గుర్తులేదు.
ఎవరో లేపితే మెలుకవ వచ్చింది. కల తెగింది. కనుక గుర్తుందా? దానంతగా శుభంకార్డు పడితే గుర్తుండదా? చకచకా కవర్ వెనుక పెన్సిల్‌తో నోట్స్ రాసిన తరువాత చూస్తే ఇంట్లో కరెంట్ లేదు. ఢాం అని చప్పుడు వచ్చింది. కరెంట్ పోయింది. కానీ మళ్లీ వచ్చింది. కరెంట్ మళ్లీ పోయింది అన్నారు. కరెంట్ వచ్చింది గనుక ఢాం అనడంతో కరెంటుకు సంబంధం లేదు గదా? అన్నాను. రెండోసారి కూడా ఢాం అన్నది, కరెంట్ పోయింది, అన్నారు. అంటే ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. అది మనదా? అంటే మన భవనానికి చెందినదా? లేక అందరిదా? అంటే ఎక్కువ మందికి చెందినదా? ఎక్కువ మందికి సంబంధించినదయితే, ఎవరో కంప్లెయింట్ చేస్తారు. కరెంట్ వస్తుంది. ఆదివారం.
ఇంట్లో ఒక పక్కన నీళ్లు రావడం లేదు, అన్నారు. ఒక ఫేజ్‌లో కరెంట్ పోతుంది. కానీ నీళ్లు అట్లా ఒక పక్కన రాకుండా ఉండే వీలు లేదు! మొత్తం యింటికి ఒకటే వాల్వ్ మరి. కలలోలాగే వాదం, సైంటిఫిక్ ఆలోచనలు, మెలుకువ వచ్చిన తరువాత కూడా కొనసాగినయన్నమాట! ఎందుకో మరి నాకు ఆ ఉదయమంతా ఉత్సాహంగా ఉంది. ఆలోచనలు బాగా సాగాయి.
కల గుర్తుంటే ఉత్సాహంగా ఉంటుందా? కలలోని అంశం ఉత్సాహకరమయినది గనుక ఆ భావం కొనసాగిందా? ఈ లోపల ఒక మిత్రుడు ఫోన్ చేశారు. నిజంగా పెద్దమనిషి. నేనంటే ఎంతో అభిమానం గల మనిషి. లోకాభిరామంలో వచ్చిన వ్యాసం బాగుందని చెప్పడానికి ఫోన్ చేశారు. ఆ క్రమంలో ఆయన చెప్పిన కొన్ని మాటలు నాకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. నేను రాయాలి గదా అన్న భావం బాగా బలపడింది. లోకాభిరామం, చాలామంది చదువుతారు. అందరూ వచ్చి బాగుందని చెప్పరు. గొప్పవాళ్లెవరో ఒకరిద్దరు, ఆ మాట చెపితే, కాన్ఫిడెన్స్ నిలుస్తుంది. కనుకనే రాయాలి అనిపిస్తుంది. లేకుంటే, ఎందుకొచ్చిన సోది? అనిపిస్తుంది!