లోకాభిరామం

ఎవరున్నారు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయా సదృశా కః అన్యహ అస్తి అంటాడట మనిషి. ఈ మాట ఏకంగా భగవద్గీతలో ఉంది. నా వంటి వాడు మరొకడు లేడు పొమ్మంటున్నది. పోలికలు అనే విషయం గురించి మాట్లాడుతూ నేను తరువాతి అంశాలు అని రాసి లోకాభిరామం వ్యాసాన్ని వదిలేశాను. అది అలవాటులో పొరపాటుగా జరిగింది. అయినా ఆ తప్పును దిద్దుకోవలసిన బాధ్యత నా మీదే ఉంది. కనుకనే మనుషుల మధ్యన పోలికలు లేదా తేడాలు అనే అంశాన్ని కొనసాగిస్తూ కొన్ని కనీసం నాకు ఆసక్తికరంగా తోచిన సంగతులను మీ ముందు ఉంచుతాను.
మనుషుల గుర్తింపు కొరకు వేలిముద్రలు ప్రత్యేకంగా పనికి వస్తాయని చాలామందికి తెలిసి ఉంటుంది. చదువురాని వారు తమ గుర్తింపుగా ఇవాళటికీ వేలిముద్రలు వేస్తున్నారు. ఈ అంగోష్ఠు నిషాను ఫలానా వారిది సహీ అని చిన్నప్పుడు చదివినపుడు నాకు సంగతి అర్థం కాలేదు. ఎల్ టి ఆ అనగా ఎడమచేతి బొటనవేలి గుర్తు అంటే అప్పుడు సంగతి తెలిసింది. ఇంత టెక్నాలజీ పెరిగిన తరువాత కూడా ఆధార్ కార్డ్‌లో వ్యక్తుల వివరాల కోసం వేలిముద్రలను, కనుగుడ్లలోని వివరాలను నమోదు చేసుకుంటున్నారు. అంటే మనుషులకు గుర్తింపుగా వేలిముద్రల ప్రత్యేకతను అంచనా వేయవచ్చు. వేలిముద్రలు కూడా జన్యువుల ప్రభావంతోనే ఏర్పడతాయని చెపితే ఆశ్చర్యం అవసరం లేదు. కానీ తల్లి కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడే వాటిలో కొన్ని తేడాలు కూడా వస్తాయి. శిశువు ఉండే గర్భాశయం గోడలు కొంత ఒత్తిడిని కలుగజేస్తాయి. ఆ లోపల ఉండే ఉమ్మనీరు కూడా శిశువు మీద ప్రభావాన్ని చూపుతుంది. ఒకే రకంగా ఉన్న కవలలో కూడా మొదట్లో వేలిముద్రలు ఒకే రకంగా ఉన్నప్పటకీ, కడుపులో ఉండగానే ఈ పరిస్థితుల వల్ల తేడాలు మొదలవుతాయి. అంటే కవలల వేలిముద్రలు ఒకే రకంగా ఉండవు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నమాట.
వేలిముద్రలను పరిశీలించే వారు ఈ రకమయిన చిన్న తేడాలకు మైన్యూటియే అని పేరు పెట్టుకున్నారు. వేలి చివరలలోని గీతలను పరిశీలిస్తే అవి అక్కడక్కడ రెండుగా చీలినట్టు కనబడతాయి. ఈ చీలికలు ఉండే చోట్లలో చిన్నపాటి తేడాలు ఉంటాయి. మన వారు చక్రం అని చెప్పుకునే వలయాలు కూడా కొంచెం తేడాతో కనిపిస్తాయి. చేతివేళ్ల మీద మాత్రమే కాక కాలివేళ్లలో కూడా ఈ తేడాలు కనిపిస్తాయి.
వేలిముద్రలు అనగానే అందరికీ నేర పరిశోధన గుర్తుకు వస్తుంది. వేళ్ల మీద ఈ గీతల ప్రయోజనానికి, నేరాలకు సంబంధం లేనే లేదు. వస్తువులను పట్టుకోవడంలో ఈ ఎత్తు తగ్గులు సాయం చేస్తాయి అని కొంతకాలం అనుకున్నారు. కానీ నిజానికి అరచేతిలోని, అరికాళ్లలోని ఈ సన్నని గీతల కారణంగా రాపిడి తగ్గుతుంది కానీ, ఎంత మాత్రం పెరగదు. అంటే, కాళ్లు, చేతుల పట్టు విషయంగా వీటికి పాత్ర లేదు అని అర్థం. ఉపరితలం కొంచెం పెరిగినందుకు చర్మానికి రక్షణ ఏర్పడుతుంది అని కూడా కొంతకాలం అనుకున్నారు. స్పర్శ శక్తి ఈ గీత వల్ల పెరుగుతుంది అన్న భావం కూడా ఉంది. ప్రయోజనం ఏమయినప్పటికీ, మనకు వేలిముద్రలు లేకున్నా ఏ రకంగానూ లోపం రాదు. నిజానికి జన్యు పదార్థంలో అనుకోకుండా వచ్చే మ్యూటేషన్స్ కారణంగా అయిదారు కుటుంబాలలో అసలు ఎవరికీ వేలిముద్రలు లేకపోవడాన్ని పరిశోధకులు గమనించారు. ఆ మనుషులు అందరు హాయిగా బతికారు. ఈ మధ్యన ఆధార్ వేలిముద్ర వల్ల కొన్ని చిక్కులు వస్తున్నాయి. పెద్ద వయసు వారి చేతిలో ఈ గీతలు అరిగిపోతాయి. యంత్రం వాటిని గుర్తించలేక పోతుంది. మొత్తానికి వేలిముద్రలు ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేక పద్ధతిలో ఉంటాయి అన్నది మాత్రం నూరుపాళ్లు నిజం.
ఇక మరింత ముందుకు పోతే ఏకంగా ముఖం చూచి మనిషిని గుర్తించవచ్చు. మనిషికి గుర్తింపు ఆధార్ కార్డ్ కాదు. దాని మీద అంతంత మాత్రంగా వచ్చిన ఫొటోలో అయినా గుర్తింపుగా ఉండేది ముఖం. ఒక మనిషిని గుర్తించడానికి మనం మామూలుగా ముందు ముఖాన్ని మాత్రమే చూస్తాం. కొంతమంది ముఖాలు ఒకే రకంగా ఉంటాయని అనుభవం మీద తెలుస్తుంది. కవల పిల్లల ముఖాలు ఒకే రకంగా ఉంటాయి. కవలలు కాకుండా కూడా అచ్చంగా ఒకే రకం ముఖం ఉండేవారు చాలామంది ఉంటారు. ముఖాల్లో పోలికలు గలవారు ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందిన వారు కావలసిన అవసరం లేనేలేదు. మనిషిని పోలిన మనిషి ఉండడం మామూలే అని మనవారు మొదటి నుంచి చెపుతున్నారు. ఈ ప్రపంచంలో అచ్చం నీలాగే కనిపించేవారు మరొక 28 మంది ఉంటారని ఒక సిద్ధాంతం కూడా ఉంది. దాన్ని పరిశీలించిన వారు లేరు. కానీ నిన్ను పోలిన మనిషిని చూచి పలకరించబోయాను, అని చెప్పిన సందర్భాలు చాలామందికి అనుభవంలో ఉంటాయి.
నార్వే దేవంలో కొన్ని వేల మంది ముఖాలను పోలికల కొరకు పరిశీలించారు. 92 శాతం మంది విషయంలో ఇంచుమించు అటువంటి ముఖం మరొకచోట కనిపించినట్టు తెలిసింది. నిజానికి పోలికలు గల మనుషులను మిగతా మనుషులు గుర్తించలేక తిమక పడటం మామూలు. అయితే ముఖాలను గుర్తించే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కూడా ఈ మనుషుల విషయంలో తికమకపడుతుంది. ఒకే మనిషిని వేరువేరు సందర్భాలలో తీసిన ఫొటోగ్రాఫ్‌ను చూపించినప్పుడు అవి ఒకే వ్యక్తివి కాకపోవచ్చు అన్న అనుమానం యంత్రాలకు కూడా కలిగింది. మనుషులు సగం సందర్భాలలో మాత్రం మారిన ఒక మనిషి బొమ్మను పోల్చగలిగారు. తెలిసిన మనుషుల విషయంలో మరికొంచెం సులభంగా గుర్తించగలిగారు. మొత్తానికి ముఖం మనకు గుర్తింపు అన్న భావం ఉన్నప్పటికీ, మనిషిని పోలిన మనిషి ఉండడం కూడా మామూలే అనుకోక తప్పదు.
మనిషిని గుర్తించడానికి నడక తీరు కూడా పనికి వస్తుందని మీకు ఎప్పుడయినా తోచి ఉంటుందని నేను మాత్రం అనుకోవడం లేదు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకే రకంగా నడవరు అంటే నమ్మండి. మనిషి మొదట్లో కోతులు, చింపాజీలాగే నాలుగు కాళ్లమీద నడిచాడు అంటే నవ్వు రావచ్చు. కానీ పదిహేను లక్షల సంవత్సరాల నాడు మనిషి రెండు కాళ్ల మీద నడవడం నేర్చుకున్నాడు. వేట విషయంగా ఈ మార్పు జరిగింది. అలాగే రక్షణ లేని ఆరుబయట జీవితం కూడా నిటారుగా నిలబెట్టింది. మొదట్లో మనుషులు అందరు ఇంచుమించు ఒకే రకంగా నడిచారు. ఒక కాలిని ఎత్తి నేల మీద ఉన్న మరో కాలుకన్నా కొంచెం ముందు ఇంచుమించు అదే గీత మీద పడేట్లు కిందకు దించారు. ఈనాటికీ నడక తీరును పరిశీలించే చోట ఒక గీత గీసి దాని వెంట నడిపిస్తారు. కొందరు నడిస్తే రెండు కాళ్ల ముద్రలు గీత మీద ఉంటాయి. మరి కొందరి మడమలు మాత్రమే గీతను తగులుతాయి. ఇంకా కొందరి విషయంలో రెండు కాళ్లు గీతకు రెండు పక్క కొంచెం దూరంలో పడతాయి. నడకలో కాలు నడుము వద్ద నుంచి మొదలు ఒక పద్ధతిలో, ఒక ఊపుతో కదులుతుంది. అది కొంచెం గుండ్రంగా తిరుగుతుంది కూడా. అయితే ఈ కదలికలో తేడా కారణంగా నడక కూడా ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమయిన పద్ధతిలో ఉంటుంది. మరీ వేలిముద్రల వలె కాకున్నా నడక తీరు ప్రకారం మనుషులను గుర్తించడానికి వీలు తప్పకుండా ఉంటుంది. 90 శాతం వరకు నడక ఆధారంగా మనుషులను గుర్తించవచ్చు. చిన్నపిల్లలు తప్పటడుగులు వేస్తారు. ఇక కొంచెం స్థిరంగా నడవడం చేతనయిన తరువాత ప్రతి ఒక్కరికి ప్రత్యేకమయిన నడక, ఊపు మొదలవుతుంది. శరీరం పెరగడం ఒక వయసులో ఆగిపోతుంది. ఆ తరువాత నడకలో ఎక్కువగా మార్పు రాదు. కాలు నిడివి, నడుము, పిరుదుల వెడల్పు నడకను నిర్ణయిస్తాయి. ఇక వాతావరణ ప్రభావం కూడా కొంత ఉంటుంది. వ్యాయామం, శరీర శ్రమ కారణంగా కండరాలు పెరుగుతాయి. వాటి ఆకారం ప్రకారం నడకలో కొంత తేడా వస్తుంది.
నడక ప్రకారం మనిషిని గుర్తించడం సులభమే కానీ, దాన్ని వర్ణించి చెప్పడం కష్టం. ఇది పరిశోధకులు గమనించిన చిత్రమయిన విషయం. కాలి కదలికను వర్ణించడానికి తగిన మాటలు లేవు. కానీ కంప్యూటర్ మాత్రం ఆ కదలికను బాగా గుర్తించ గలుగుతుంది. మొత్తం కాలు, తరువాత పాదం కదులుతున్న తీరును గమనించి అది వివరాలుగా మారుస్తుంది. నడుము, మోకాళ్లు, పాదాలు మొదలయిన భాగాలు కదులుతూ ముందుకే కాక అటుఇటు జరిగిన వివరాలను ఒకదానికి ఒకటి సాపేక్షంగా గుర్తించడం వీలవుతుంది. ఆ కదలిక ఆధారంగా నడక తీరును ఒక్కొక్క వ్యక్తి విషయంలో నిర్ణయించి చెప్పవచ్చు.
నడకలో అరికాలు నేలకు తగిలే తీరు కూడా ప్రతి వ్యక్తిలోనూ వేరువేరుగా ఉంటుంది. కొంతమంది మడమ ముందు మోపి తరువాత వేళ్లను నేలకు తగిలిస్తారు. సైన్యం, ఎన్‌సిసిలో బలవంతంగా ఈ రకం నడక నడిపిస్తారు. కొందరిలో ఎలుగుబంటి నడక అనే పద్ధతిలో మొత్తం పాదం ఒకేసారి నేలకు తాకుతుంది. ఈ రకంగా ఉండే తేడాను ప్రెషర్ ప్యాడ్ మీద నడిపించి సులభంగా గుర్తించవచ్చు. జపాన్‌లో ఈ రకం పరిశీలనలకు గాను చక్కని పద్ధతిని తయారుచేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులను గుర్తించడానికి ఈ పద్ధతి ఆధారంగా ఏర్పాట్లు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. స్మార్ట్ ఫోన్‌ను అడ్డంగా తిప్పితే ఆ సంగతి దానికి తెలుస్తుంది. అంటే ఫోన్‌లో కదలికను గుర్తించే ఒక పరికరం ఉంటుందని అర్థం. ఈ రకం పరికరాన్ని మరిన్ని వివరాలను సేకరించే పద్ధతిలో తయారుచేయవచ్చు. అప్పుడది వేగం, అందులోని తేడాలు, కాలి కదలికలను గుర్తిస్తుంది. అప్పుడు మోషన్ సెన్సర్ ఆధారంగా మనుషుల్లో తేడాలు తెలుసుకోవచ్చు. ఆ తేడాలు సెల్‌ఫోన్‌లకు కూడా తెలియజేస్తే మరొక విచిత్రం జరుగుతుంది. తెలిసిన పద్ధతి కాక, మరొక రకంగా కదిలే మనిషి ఆ ఫోన్‌ను వాడడానికి ప్రయత్నిస్తే అది పనిచేయదు. సాధారణంగా మనం ఇలాటి సంగతులను పట్టించుకోము. ఆసక్తి కలిగించే సంగతులు మరిన్ని మరొకసారి.

-కె.బి.గోపాలం