లోకాభిరామం

ఏకాంతమూ.. ప్రశాంతమూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రశాంత ఏకాంత సాయంత్రంలో నిదురించు జహాపనా అంటాడు కవి. సాయంత్రం బాగుందట. అంత చక్కటి సాయంత్రంలో ఏకాంతం కూడా దొరికిందట. అయితే మరి అప్పుడు పడుకోవడంలో అర్థం ఏమిటి? నాకు అర్థం కాలేదు. ఏకాంతంలో మన వ్యక్తిత్వం నిస్సందేహంగా బయటపడుతుంది అంటాడు తాత్వికుడు. గాలిబ్ తన కవితలో ఒకచోట, దిక్కుతెలియని ఏదో ఒక చోటి నుంచి కొత్త ఆలోచన వచ్చేస్తుంది. గాలిబ్ కేవలం ఆ భావనలను కాగితం మీద పెడతాడు, అంటాడు. అంటే ఆలోచనలు తమవి కావు అంటున్నాడు అతను. ఏకాంతంలో ఉంటే మనిషి మనసు రెండు అంతస్తుల్లో పని చేస్తుంది. ఒకటి మనకు తెలియకుండానే కొత్త ఎత్తులకు ఎదుగుతుంది. నాకు ప్రతి నిత్యం రాత్రి పడుకుంటే వెంటనే నిద్ర రాదు. ఏదో ఒక అంశాన్ని తీసుకుని ఆలోచన మొదలవుతుంది. చాలా సందర్భాలలో అది ఉపన్యాసంగా మారుతుంది. నాకు నేనే ఉపన్యాసం చేసుకుంటాను. అందులో అనుకోకుండా కొన్ని కొత్త ఆలోచనలు కనపడతాయి. చటుక్కున లేచి, లైట్ వేసి, మాటలు కాగితం మీద రాసి పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గాలిబ్ అనుభవమే ఇక్కడ నాకు కూడా వస్తున్నట్టు అర్థం కదా. తన కవితలకు కావలసిన భావనలు ఒంటరితనంలో వచ్చాయని ఆయన భావించాడు. అంతుపట్టని సృజనాత్మకతలో నుంచి ఆలోచనలో నుంచి అవి కొత్తగా తలెత్తాయి. రచయితలకు చాలామందికి రాతకు కూర్చునే ముందు కొన్ని పరిస్థితులు అవసరం అనుకుంటారు. నాకు కూడా కొంతవరకు అవసరాలు ఉన్నాయి. అన్నింటికీ మించి ఏకాంతం కావాలి. కనీసం నిశ్శబ్దం కావాలి. చిన్నప్పటి నుంచి నేను రాస్తుంటే మా ఇంట్లో వాళ్లు గోల చేయకుండా ఉండడం నాకు మొదటి నించి అలవాటు. పిల్లలకు కూడా నా సంగతి అర్థమయింది. ఏకాంతం కావాలి నిజమే. కానీ అది అనుకుంటే దొరికేది కాదు. దొరికినప్పుడు దాన్ని అనుభవించడం కూడా వీలు కాదు. మనిషి సంఘ జీవి అని చాలా సులభంగా చెప్పేస్తారు. కానీ ఈ సంఘం మనిషిని తన మానాన తాను ఉండనివ్వదు. అందరూ కలిసి అర్థం లేని కొన్ని ఆచారాలను తయారుచేసి అందరి తలకు చుట్టూ చుడతారు. కనుకనే అంత గోలలోనూ కవి, రచయిత ఏకాంతాన్ని కోరుకుంటాడు. గాలిబ్‌కు ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? అందరికీ అది వీలవుతుందా?
నేను రేడియోలో ఉద్యోగం చేశాను. అక్కడ సమయాన్నిబట్టి తప్పకుండా రాయవలసిందే. కార్యక్రమాలు చేయవలసిందే. నాకు మూడ్ లేదు. ఏకాంతం అంతకంటే లేదు. కనుక నేను రాయలేను అని కూర్చుంటే ఉద్యోగం ఉట్టికి ఎక్కుతుంది. కనుక అవసరం కొద్దీ రాయడం అలవాటయింది. అయితే ఆ రాత వ్యక్తిగతంగా ఉండదు. అంత గొప్పగా కూడా ఉండనే ఉండదు. అక్కడి పరిస్థితులకు అది సరిపోతుంది. అంతేగాని నిజమైన భావుకతలో నుంచి, నిజమైన సృజనాత్మకతలో నించి, నిజమైన మార్మికతలో నుంచి మాటలు పలకాలంటే ఏకాంతం చాలా అవసరం.
ఒంటరితనాన్ని ఎవరికి వాళ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇరువురము కలిసి ఒంటరిగా నడుచుచు సాగితిమి అన్న పద్ధతిలో అందరి మధ్యలోను ఏకాంతాన్ని అనుభవించగలగాలి. అప్పుడు గాలిబ్ తీరుగానే కలం పట్టుకున్న ఎవరికైనా కాస్తంత తెలివి సులభంగా ముందుకు సాగుతుంది. కనుకనే ఏకాంతం రచయితలకు అసలైన అవసరం ఒక మహానుభావుడు. ఆయన అనుభవం కొద్ది ఆ మాట చెప్పినట్టు ఉన్నాడు.
చాలామందికి ఒంటరితనం నచ్చదు. నాకు ఒంటరితనం నచ్చుతుంది కానీ మరీ ఒంటరిగా ఉంటే అదేదో ఒక రకమయిన ఒంటరితనం మొదలవుతుంది. మనుషులు ఉండాలి. నా దగ్గర ఉండకూడదు. మనుషులు ఉండాలి. వాళ్లు మాట్లాడకూడదు. మనుషులు నన్ను పలకరించకూడదు. నేను కూడా వాళ్లను పలకరించను. మనుషులు ఉండాలి. తలుపులు అన్నీ మూసుకున్నా సరే ఏదో ఒక కిటికీ తెరిచి ఉంచు. ప్రపంచాన్ని నీ దగ్గరకు వస్తానంటే ఆపకు... అంటూ ఎప్పుడో ఒకసారి కవిత రాసుకున్నాను.
బతుకంతా ఒంటరిగా ఉండనవసరం లేదు. దినంలో కనీసం కొన్ని గంటలు ఏకాకిగా ఉండగలగాలి. నాకు ఉద్యోగం చేసుకున్నంత కాలం ఈ అవకాశం కలగలేదు. కావాలనే ఉద్యోగం మానుకున్నాను. ఆ తరువాత ఒంటరితనమే ఒంటరితనం. ఇంట్లో వాళ్లంతా పొద్దునే్న ఎవరి దారిన వాళ్లు పోతారు. పనిలేని వాడిని కనుక నేను ఇంట్లో మిగులుతాను. బూజులు చూస్తూ, పగుళ్లు లెక్కిస్తూ, ఆవులింతలు తీస్తూ రోజులు గడపవలసిన అవసరం లేదు. అందరూ వెళ్లిపోయిన మరుక్షణం నా ప్రపంచం పరుచుకుంటుంది. నా పుస్తకాలు బయటకి వస్తాయి. నా కాగితం కలాలు నాట్యం చేస్తాయి. నా చేత పిల్లిమొగ్గలు వేస్తాయి. రకరకాల రచనలు బయటపడతాయి. కనుకనే చూస్తుండగానే నేను రాసిన పుస్తకాలు తామరతంపరగా పెరిగి మూడంకెలకు చేరుకునే పరిస్థితి వచ్చింది.
అందరికీ ఏకాంతం ఇంత సులభంగా దొరకదు. చాలామందికి ప్రయత్నించినా సరే ఒంటరితనం దొరకదు. ఈ సంగతి నాకు తెలుసు. ఇంటికి తాళం వేయాలని నాకు కోపంగా వుండేది. తిరిగి వచ్చిన తర్వాత తాళం తీయాలని పిచ్చి కోపం వచ్చేది. కానీ సంవత్సరం దాకా ఇంటికి తాళం వేయవలసిన అవసరం లేకుండా పోయినప్పుడు నాకు తాళం గురించి, ఒంటరితనం గురించి, అందులోని సౌకర్యం గురించి అర్థం అయింది. అయితే అందరూ నాలాగే ఏకాంతం కోరుకునేవారు కారని కూడా నాకు అర్థం అయింది.
ఏకాంతం మనిషిని మార్చేస్తుంది. మనిషికి కొత్త దారులు చూపిస్తుంది. నేను ట్రైనింగ్ క్లాసులో ఒక కథ చెబుతూ ఉండేవాడిని. ఇద్దరు మిత్రులు ఒంటరితనం గురించి పందెం వేసుకున్నారు. వారిలో ఒకతను ధనికుడు. రెండో మనిషి మామూలు వాడు. మామూలు మనిషి నేను ఎంత కాలమైనా ప్రపంచంతో పనిలేకుండా ఫోన్‌లు టీవీలు లేకుండా, పత్రికలు కూడా లేకుండా గడపగలను తిండి ఉంటే చాలు అన్నాడు. ధనికుడు ఊరి బయట నాకు ఒక ఇల్లు ఉంది. అందులో నీకు వసతి ఏర్పాటు చేస్తాను. కిటికీలో నుంచి ఎప్పటికప్పుడు నీకు తిండి నీళ్లు అందుతాయి. అంతే తప్ప మనుషుల అలికిడి కూడా వినిపించదు. ఆరు నెలలు నీవు కనుక ఆ పద్ధతిలో మా ఇంట్లో ఒంటరిగా ఉన్నావంటే నా ఆస్తి సగం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. బీద మనిషి సరే అన్నాడు. ముహూర్తం నిశ్చయమైంది. అతడిని ఇంట్లో పెట్టి తాళం వేశారు. తిండి అందుతున్నది. కాలం సాగుతున్నది. ఎక్కడ ఏ తేడా రాలేదు. ఐదున్నర నెలలు గడిచాయి. ధనవంతునికి వణుకు మొదలైంది. సగం ఆస్తికి కాలం చెల్లింది అనుకున్నాడు. ఐదు రోజులు మిగిలాయి. అతను కావలసిన కాగితాలు తయారుచేయించాడు. మిత్రుడు ఇంతకాలంగా గడిపిన ఇంటి దగ్గరికి వెళ్లి దూరం నుంచి చూచి వచ్చాడు. ఎక్కడా ఏ తేడా లేదు. బయట ఒక వాచ్‌మన్ ఉంటాడు. లోపలి మనిషి వచ్చి పిలిస్తే గనుక తలుపు తీయాలి అని అతనికి ఆదేశాలున్నాయి. బయటి వారి పేరున మాత్రం తాళాలు తీయకూడదు. చివరి రోజు వచ్చింది. మరుసటి నాటి ఉదయం వెళ్లి చూస్తే తాళాలు వేసినవి వేసినట్టు కనుక ఉంటే, ఆ మనిషి లోపలే ఉంటే ఆస్తి సగం అతనికి అందించాలి. కాగితాలతో సహా పంతం వేసిన మిత్రుడు ఉదయం అక్కడికి చేరుకున్నాడు. ఆశ్చర్యంగా తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూస్తే మిత్రుడు లేడు. వాచ్‌మన్‌తో వాకబు చేస్తే అయ్యా, ఆయన తెల్లవారుజామున తలుపు తీయమన్నాడు. నేను తలుపు తీశాను. ఆయన ముఖంలో గొప్ప వెలుగు కనిపించింది. గడ్డం కూడా పెరిగి ఉంది. జుట్టంతా పెరిగి ఉంది. ఆయన మారుమాట్లాడకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. నేను తప్పు చేయలేదు కదా అన్నాడు అతను. లోపలికి వెళ్లి వెతికారు. పందెం వేసిన మిత్రుడు ఉన్న గదిలో ఒక కాగితం దొరికింది. ఇన్నాళ్లు ఏకాంతంగా ఉండి నాకు ప్రపంచం గురించి ఆలోచించే అవకాశం అందించావు. భవిష్యత్తు గురించి నాకు గొప్ప ప్రణాళికలు దొరికాయి. నీ డబ్బుతో నాకు పనిలేదు. నా మార్గంలో వెళ్లిపోతున్నాను. మిత్రమా నీకు ధన్యవాదాలు.. అని రాసి ఉంది. మనిషి మీద ఒంటరితనం ప్రభావం అలాగా ఉంటుంది. ఈ పెద్ద మనిషికి ఏకాంతంలో తన గురించి తనకు తెలిసిపోయింది. నిజానికి ఒక కొత్త ఆలోచన ఒక కొత్త మాట పుట్టాలంటే మనసులో కావలసినంత ఏకాంతం ఉండాలి. మన మెదడులో కోట్ల సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి. అవి అనుక్షణం మిగతా వాటితో ముచ్చట పెట్టుకుంటూ ఉంటాయి. కనుక మెదడులో పెద్ద గోల ఉంటుంది. ఆ గోలలో ఒక కొత్త ఆలోచన వచ్చినా సరే కలగలిసి పోతుంది. జాతరలోని గందరగోళంలో కూడా ఎవరో మన పేరు పిలిస్తే వినిపించినట్టు, మెదడులోని గందరగోళంలో కొత్త ఆలోచన బయటకు రావడానికి కొంత దారిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే ఏకాంతం. ఇది సూర్యకాంతం, అయస్కాంతం కాదు అసలు సిసలైన ఒంటరితనం. అందరి మధ్యన కూడా అలవాటు చేసుకోవలసిన ఒంటరితనం. నాకు కుదిరింది అని అనిపిస్తున్నది. ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? లేకుంటే చించి చూడండి!

-కె.బి.గోపాలం