లోకాభిరామం

తీరు మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిగతా జంతువులు కేవలం ఆకలి తీర్చుకోవటానికి మాత్రమే తింటాయి. మనిషి సంగతి అలా కాదు. వేట, సేకరణ పద్ధతిలో తిండి సంపాదించుకున్నంత కాలం మిగతా జంతువులలాగే రోజంతా అదే పని. వంట తెలిసిన తర్వాత, దాచుకోవడం కూడా తెలిసింది. తీరిక మొదలయింది. మనిషి తీరు మారింది.
వస్త్రం సంగతి తెలియదుగానీ, కూడు, గూడు అన్నవి ఏ ప్రాణికయినా ముందు అవసరం. మనిషికి మరింత అవసరం. మనుగడ సాగాలంటే తిండి ఉండాలి. ఎండ, వానల నుండి కాపాడుకోవడానికి గూడు ఉండాలి. ఇక మానం, మర్యాద అన్న సంగతి ఆ మధ్యలో ఎక్కడో వచ్చింది. తిండి విషయంగా మాత్రం మనిషి తీరు మొదటి నుంచి మిగతా జంతువులకన్నా వేరుగా ఉంది. మిగతా జంతువులకు ఎక్కడ దొరికింది అక్కడ, ఎప్పుడు దొరికింది అప్పుడు, ఎంత దొరికితే అంత తినడం పద్ధతిగా సాగుతున్నది. మనిషి మాత్రం భోజనాలు చేసేదాకా వచ్చాడు.
మంట కారణంగా వంట తెలిసింది. వండిన వస్తువు మరింత రుచిగా ఉంటుందని తెలిసింది. అనుభవం మీద వండిన వస్తువు కారణంగా ఎక్కువ శక్తి అందుతుందని తెలిసింది. నమలవలసిన అవసరం తగ్గుతుందని అర్థమయింది. కనుక ప్రపంచం నలుమూలలోనూ మనిషి వంట నేర్చుకున్నాడు. కనిపించిన ప్రతి వస్తువును వాడి ఆ వంటను రుచుల పంటగా మార్చాడు. చెట్టు మీద కాయ, సముద్రంలో ఉప్పు అన్న మాట ఊరికే పుట్టలేదు. ఆటవిక జాతుల వారు కూడా తమ తిండిలోని కొంత భాగాన్ని అయినా వండుకు తింటున్నారని పరిశోధకులు గమనించారు.
చింపాంజీలు ప్రతి నిత్యం కనీసం ఆరు గంటల కాలం తిండిని నములుతూ గడుపుతాయట. మనం తిండి పేరున ఒకనాడు ఒక గంటకన్నా ఎక్కువ గడపడంలేదు. తిండిని పండించడం, నిలువ చేయడం అన్న పద్ధతులకు తోడుగా వంట వచ్చిన తరువాత మనిషికి తీరిక ఎక్కువయింది. ఈ కారణంగా సామాజిక సంబంధాలు ఎక్కువయ్యాయి. ఆలోచనల అవసరం ఎక్కువయింది. మెదడు అప్పటికే పెరిగింది. ఇక ఆ మెదడుకు కావలసినంత పని దొరికింది. సంస్కృతి మొదలయింది. పాట పాడాలని తోచింది. బొమ్మ గీయాలని తోచింది. ఆటలు తోచాయి. మరెన్నో తోచాయి.
తిండి కేవలం అవసరం అనే పరిస్థితి పోయి ఒక సాంఘిక మర్యాదగా రూపుపోసుకున్నది. కుటుంబంలోని వారు కలిసి తినడం మొదలయింది. తిండిని మరి కొంతమందితో పంచుకోవడం మొదలయింది. అందరినీ ఆహ్వానించి తిండిని పండుగగా తినడం ఒక గొప్ప మార్పు. చింపాంజీలు ఇవాళ్టికీ దేని తిండి అదే తింటున్నాయి. దొరికింది దొరికినప్పుడు తింటున్నాయి. అవి ఎప్పుడో మాత్రం కలిసి వేటాడి తింటాయి. మనిషి ఎప్పటికీ కలిసి తినాలని అనుకుంటాడు.
అన్ని మానవ సమాజాలలోను భోజనం ఒక సామూహిక కార్యక్రమంగా మారింది. ఇప్పటికీ ఇంట్లోని వారంతా ఒక పూట అయినా కలిసి భోజనం చేయాలన్నది చాలా కుటుంబాలలో కనిపిస్తున్నది.
ఇంటి బాధ్యత, తిండి బాధ్యత, దానిని పంచే బాధ్యత కలకాలంగా ఆడ మనుషుల మీద మాత్రమే ఉన్నది. వైదిక సంస్కృతిలో హోమం చేసే సమయంలో భార్య ఇచ్చిన ధాన్యాన్ని భర్త అగ్నికి సమర్పిస్తాడు. అంటే ఇంటి బాధ్యత, తిండి బాధ్యత ఆడమనిషి చేతులలో ఉందని అర్థం. వంట కూడా మామూలు పరిస్థితులలో ఆడవారి బాధ్యతగా ఈనాటికీ సాగుతున్నది. కానీ మన సంప్రదాయంలో కూడా గొప్ప వంటవారి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు నలుడు, భీముడు అన్న పేర్లు వినిపిస్తాయి. హోటళ్లలో వంటవారు సాధారణంగా పురుషులు. పెళ్లిళ్లు, పేరంటాలలో వంటచేసేది కూడా పురుషులే. దీనికి మానవ శాస్త్రంలో సూచన లేకపోలేదు. ఒక పెద్ద జంతువును వేటాడి తెచ్చిన మగవాళ్లు ఆనాడు ఆ జంతువును ప్రత్యేకంగా వండి చుట్టుపట్ల వారి అందరినీ పిలిచి ఆర్భాటం చేసి అందరు పంచుకుని తిన్నారు. ఎక్కువ వంట చేయవలసిన చోట శరీర బలం కూడా ఎక్కువ అవసరం. ఈ రెండు లక్షణాలు కలిసి ప్రత్యేకమయిన సందర్భాలలో మగవారు వంట చేసే పద్ధతి.
కలిసి తినడం మరెన్నో రకాలుగా ముందుకు సాగింది. సాంఘిక సంబంధాలను పెంచవలసిన సమయాలలో భోజనాలకు పిలవడం మనిషి చరిత్రలో మొదటి నుంచి ఉన్నట్టు కనపడుతుంది. నక్క కొంగను భోజనానికి పిలిచిందని కథ చెప్పారంటే అందులో మనిషి పోలిక మాత్రమే చూడాలి. జంతువులకు ఈ విందులు అలవాటు ఉన్నట్టు కనిపించదు. మిత్రులు, సహచరులు, ఒక వర్గం వారు కలిసి భోజనాలు చేయడం, అందుకు గాను పెద్ద ఎత్తున వేట, వంట చేయడం లాంటి అంశాలకు ఆధారాలు కనిపించాయి.
ఆవకాయ బాగా వస్తే, నచ్చిన వాళ్లకు ఇచ్చి రావడం మనుషులకు ఇప్పటికీ అలవాటుగా ఉంది. ఈ రకంగా సంబంధ బాంధవ్యాలను పెంచడానికి తిండిని వాడడం మనిషి చరిత్రలో కలకాలంగా కొనసాగుతున్నది. చాకోలెట్లు ఇస్తే అందులోని కొన్ని రసాయనాలు ప్రేమ భావాన్ని పెంచుతాయి. కనుక ఇష్టమయిన వాళ్లకు ఇష్టమయిన సందర్భాలలో చాకోలెట్లు ఇవ్వడం ఇవాళ ఆచారం అయ్యింది. ఇందుకు ఆధారం మొదటి నుంచి ఉంది. నచ్చిన తిండిని నచ్చిన వారికి ఇవ్వడం మనిషి సంప్రదాయాలలో ఒకటి. తిండి విషయంగా అన్ని మానవ సమాజాలలోను ఎక్కడికక్కడ ప్రత్యేకమయిన పద్ధతులు వచ్చేశాయి. చేయకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. మాంసాహారం, శాకాహారం తేడా మనకు తెలుసు. ఆరోగ్యం కారణంగా, సంప్రదాయాల కారణంగా కొన్ని రకాల తిండి తినకపోవడం మనిషి పద్ధతులలో ఒకటిగా మారింది. తిండి విషయంగా తేడాలు మొదలయ్యాయి. ప్రాంతీయంగా దొరికే పదార్థాలను బట్టి వంట పద్ధతులు మొదలయ్యాయి. చివరికి నీ తిండి నిన్ను నిర్వచిస్తుంది అనే దాకా మనిషి తీరు కొనసాగింది.
మృగాలను చూచిన మనిషి తానూ ఒక మృగంగా మారి జంతువులను వేటాడి తిన్నాడు. పచ్చిమాంసం తినేశాడు. అప్పుడు వంట తెలిసింది. సేకరణ పద్ధతిలో పళ్లు, దుంపలు తినడం కూడా తెలిసింది. అయితే అన్ని జంతువులను వేటాడి తినడంలో అర్థంలేదు. కొన్నింటి మాంసం రుచిగా ఉంటుంది. కొన్నింటిని చంపి తినడం కుదరదు. కనుక వేటాడదగిన జంతువులు అనే భావం ఒకటి మొదలయింది.
కనిపించిన పళ్లు అన్నీ కమ్మంగా ఉంటాయన్న నమ్మకంలేదు. కొన్ని పళ్లు నోట్లో పెట్టడానికి ఉండదు. కొన్ని నిజానికి విషాలుగా పని చేస్తాయి. ఈ సంగతులను గమనిస్తే మనిషి తిండిగా కొన్ని పండ్లను ఎంచుకోవడంలో పడ్డ బాధలు మనకు అర్థం అవుతాయి. అరటి మొదట్లో తినడానికి అనువుగా ఉండేది కాదు. అది నిజానికి ఆరోగ్యాన్ని పాడుచేసేది. కానీ నాటి నుంచి నేటి వరకు మనిషి చేసిన ప్రయత్నాల కారణంగా అది మనిషి తినే పండ్లలో అన్నింటికన్నా ముందు ఉండే పరిస్థితి వచ్చింది. అరటిలోని గింజలు మాయమయ్యాయి. అయినా ఈనాటికీ ప్రపంచంలో దొరికే అన్ని పండ్లను మనిషి తినడంలేదు. ఈ మాటలో లోతుగా పరిశీలించవలసిన అవసరం చాలా కనిపిస్తుంది. కొన్ని పండ్లు కడుపు నిండానికి కూడా పనికి వస్తాయి. కొన్నింటిని కేవలం రుచి కొరకు మాత్రమే తింటారు.
వ్యవసాయం అన్న పద్ధతి మొదలు కావడానికి రకరకాల సూచనలు ఉన్నాయి. అదనంగా దొరికిన ధాన్యాన్ని నేలలో దాచితే అది మొలకెత్తి ఉంటుంది. ఆ మొలకలకు అదే ధాన్యం పుట్టడం మనిషి గమనించి ఉంటాడు. పండు తిని పడేసిన విత్తనాలు నేలలో చేరి కొత్త మొక్కలు పెరగడం కూడా మనిషి గమనించి ఉంటాడు. అయితే వాటిలో కొన్నింటిని తాను ప్రయత్నించి పెంచాలన్న ఆలోచన వ్యవసాయానికి ఆధారం. మనిషి మొదటి నుంచి ఎన్నో ధాన్యాలను సేకరించి నలగగొట్టి, పొడి చేసి వండుకుని తిన్నట్టు ఆధారాలు ఉన్నాయి. అయితే ఇవాళటికి పెద్దఎత్తున పండించి తినగలిగే రకాలు అయిదారు మాత్రమే ఉన్నాయి. వరి, గోధుమ వీటిలో అన్నిటికన్నా ముందున్నాయి. బంగాళాదుంప లాంటివి కొన్ని ముఖ్య ఆహారంగా కొనసాగుతున్నాయి. కేవలం కొన్ని ధాన్యాలను మాత్రమే ప్రపంచం మొత్తం మీద మనిషి ఎంపిక చేయడం వెనుక చాలా చరిత్ర ఉంది.
మాంసం, పండ్లు, ధాన్యాలు తినడం కలకాలంగా సాగింది. అయితే తిండికి ఉప్పు చేర్చాలన్న ఆలోచన వంట చరిత్రలో అసలయిన మలుపు. అలాగే వంటలో మరెన్నో పదార్థాలను చేర్చడం కూడా పద్ధతిగా వచ్చింది. అందులో కొన్ని వృక్ష సంబంధమయినవి, మరికొన్ని కేవలం ప్రకృతి సిద్ధంగా దొరికిన పదార్థాలు. మొత్తానికి వంట సంస్కృతిలో ప్రధాన భాగంగా మారిపోయింది. ప్రపంచమంతటా మానవ సమాజాలు గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అనుభవిస్తూ వండుకుంటున్నారు. తింటున్నారు.

-కె.బి.గోపాలం