లోకాభిరామం

మందు.. మాకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారు రాలేదు అంటే పంతులుగారు అనబడే టీచర్‌గారు రాలేదు అని అర్థం. బడిలోని ఒక పంతులుగారిని గురించి చెప్పాలంటే ఆయన పేరుతో బాటు సారు అన్న శబ్దాన్ని కూడా కలిపి చెప్పుకోవడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. కానీ మా ఇంట్లో మాత్రం శర్మసారు అని ఒక పేరు మళ్లీమళ్లీ వినవస్తూ ఉండేది. ఈ శర్మగారి పూర్తి పేరు సుబ్రహ్మణ్య శర్మగారు. ఆయన ఆయుర్వేద వైద్యులు. నాన్నకు చాలా దగ్గరి మిత్రులు. పాలమూరులో శర్మగారికి ఒక చిన్న క్లినిక్ లాంటిది ఉండేది. అది పాన్ చౌరస్తాకు దగ్గరలో ఉండేది. సాయంత్రం అయ్యేసరికి నాన్నతో పాటు ఒకరిద్దరు బంధువులైన మిత్రులు మరి ఒకరిద్దరు మామూలు మిత్రులు ఆ క్లినిక్కు చేరుకునేవారు. అక్కడ కొంత లోకాభిరామం వంటి కాలక్షేపం జరిగిన తరువాత అవసరమైన షాపింగ్ కూడా కొంత జరిపి ఎవరి దారిన వారు ఇంటికి చేరుకునేవారు.
ఆ గుంపులోని మహాబలి అనే ఒక వ్యక్తి నాకు గుర్తుకు వస్తున్నారు. ఆయన పేరు నిజానికి మహబూబ్ అలీ. కర్నూల్ ప్రాంతం మనిషి అనుకుంటాను. చక్కని రూపసి. అంతకన్నా మంచి మాటకారితనం గల మనిషి. ఆయనను మహబూబ్ అలీ అనలేక మా వాళ్లు తమతో కలుపుకుని మహాబలి అని పేరు పెట్టేశారు.
ఇక డాక్టర్ గారైన శర్మగారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంటుంది. ఆయన క్లినిక్ చాలా చిన్నది. మరీ ఎక్కువ మంది పేషెంట్లు వచ్చే వాళ్లు కూడా కాదని నాకు అనుమానం. ఆయనేమో బహు కుటుంబి. ఎలా సంసారాన్ని సాగ తీసుకువచ్చేవాడు అన్నది నాకు ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలి ఉంది. ఆయన ఇంట్లో మందులు తయారుచేసేవారు. మాదీఫల రసాయనం వండడం నాకు బాగా గుర్తుంది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. అలాగే ఆయన వద్ద కొన్ని దినుసులను కలువం ఉపయోగించి నూరడం కూడా గుర్తుంది. డాక్టర్ గారి మందులలో అమృతఘటి అనేది అందరికీ అభిమాన పాత్రమైంది. అందులో ఏముందో నాకు గుర్తులేదు. వాటిని మేమంతా సన్న మాత్రలు అని పిలిచేవాళ్లము. జలుబు, జ్వరం వచ్చిందంటే, తాళీసాది చూర్ణంతోబాటు ఈ సన్న మాత్రలు రెండు కలిపి ఆయన ఇచ్చే పొట్లము పూటకు ఒకటిగా ఒకటి రెండు రోజులు వాడితే చాలు చెయ్యితో తీసినట్టు ఆ సమస్య పోయేది. ఆయన మరెన్నో మందులు తయారుచేసి ఉంటాడు. ఆ సంగతులన్నీ నాకు ఇప్పుడు గుర్తు లేవు. మా మాతామహులు కూడా గొప్ప వైద్యులు అని చెప్పడం విన్నాను. ఆయన సహస్ర పుట అభ్రకం కూడా తయారుచేశారని పెద్దలు చెప్పగా విన్నాను.
ఇంట్లో వైష్ణవి, వాత విధ్వంసి లాంటి మందులు ఉండేవి. ఆలందభైరవి అని మందు ఉండేదా, లేక అతి మాత్రమేనా. చిన్నచిన్న అనారోగ్యాలకు ఇంట్లోనే వైద్యం జరుగుతూ ఉండేది. నాకు తెలిసి దుప్పి కొమ్ము అన్నది సర్వరోగ నివారిణిగా వాడుక అయ్యింది అని అనుమానం. గొంతు నొప్పి వస్తే దుప్పి కొమ్ము అరగదీసి, కొంచెం నాకాలి. కొంత గొంతుకు పోయాలి. సమస్య తగ్గిపోతుంది. ఆ దుప్పికొమ్ము మరెన్నో సమస్యలకు ఔషధంగా వాడుకున్నట్టు నా అనుమానం. ఇటువంటి చిట్కా వైద్యాలు అప్పట్లో బాగా వాడుకలో ఉండేవి. చివరికి ఆ కాలంలో అనాల్జిన్ వంటి నొప్పి తగ్గించే బిళ్లలు కూడా ఎవరికీ తెలియవు. కాలు బెణికింది. నొప్పి పెడుతున్నది అంటే, సున్నము కొంచెం బెల్లము కలిపి ఒక మలాము తయారుచేసేవారు. దాన్ని నొప్పిగల కాలి మీద పూసేవారు. ఆ లేపనం ఆరి పొరలుగా రాలిపోయే లోగా నొప్పి కూడా తగ్గుతుంది. ఇప్పుడు చెబితే ఆశ్చర్యపోతారు ఏమోగానీ అప్పట్లో కొన్ని సమస్యలకు గోడ మీద నీళ్లు చల్లి, గంధం తీసి దాన్ని పూతగా చికిత్సగా వాడేవారు. దాని పేరు గోడ గంధం. అట్లాగే నేల గంధం కూడా ఉండేది. ఆ కాలంలో అన్ని ఇళ్లల్లోనూ మట్టినేల మాత్రమే ఉండేది. దాని మీద వారానికి కనీసం ఒకటి రెండుసార్లు పెండ, ఎర్రమట్టి కలిపి అలికేవారు. మట్టిలో కొన్ని రకాల ఔషధ లక్షణం ఉన్నట్టు అప్పటివారు గుర్తించినట్టు ఉన్నారు.
ఇండ్లు ఇంచుమించు అన్ని మట్టి గోడలతో కట్టేవారు. నిజానికి ఇంటి లోపలి గోడలకు కూడా సున్నం వేసుకునే అలవాటు అప్పట్లో చాలామందికి లేదు. లోపలి గోడలకు కూడా పేడ, మట్టితో, ఏడాదికి ఒకసారి పూతపూసేవారు. ఆ పూత రాలి వస్తూ ఉండేది. కనీసం దానిలో పగుళ్లు ఉండేవి. ఆ పగుళ్లలో నల్లులు చేరేవి. బల్లి గుడ్లు పెట్టి దాని మీద ఆ పొరను వేసిందా తెలియదు. కానీ తెల్లని ఒక గుండ్రని కాగితం వంటి పొర రూపాయి బిళ్లకన్నా కొంచెం పెద్దదిగా గోడ మీద కనిపించేది. ఆ పొరను ఊడదీసి మా వాళ్లు వైద్యంలో వాడుకోవడం నాకు బాగా గుర్తుంది. ఏ సమస్యకు బల్లిపొరను వాడుకున్నారు అన్న సంగతి మాత్రం గుర్తుకు రావడంలేదు.
ఇక శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, వామ లేదా వాము కలిపి వైద్యం చేయడం ఆయుర్వేదంలోనూ, ఇటు ఇంటి వైద్యంలోనూ సాగుతూనే ఉండేది. కరక్కాయ, ఉసిరికాయ వైద్యం కూడా అందరికీ తెలిసిన విద్య. నాటి నుంచి నేటి వరకు మా ఇళ్లలో ఈ వైద్యం సాగుతనే ఉన్నది.
మరీ గతం నుంచి ఇటీవలి గతంలోకి వచ్చినా కథ మారదు. మా బావగారు శ్రీనివాసాచార్యులుగారికి జ్యోతిష్యంలోనూ, ఇటు ఆయుర్వేదంలోనూ ఆసక్తి ఉండేది. ఆయన నిజానికి సంస్కృత పండితుడు. కాలేజీలో నాకు పాఠం చెప్పిన గోపాల్‌రెడ్డి గారు ఆయుర్వేదం చదవడానికి వెళ్లి భాషా పండితుడయ్యాడు. ఇక భాష కోసం కృషి చేసిన మా బావగారు ఆయుర్వేదంలో ఆసక్తి పెంచుకున్నారు. రకరకాల మందులను గురించి చదివి తెలుసుకుని, తెలిసిన వాళ్లకు ఇచ్చేవారు కూడా. ఆయనకు ఒక వైద్యునితో పరిచయం ఏర్పడింది. అతను ముఖ్యంగా చ్యవనప్రాశ తయారుచేసి కాలేజీలు, సంస్థల చుట్టూ తిరిగి అమ్మేవాడు. బావగారికి కల ఆసక్తి కారణంగా ఆ మనిషిని ఏకంగా ఇంటికి పిలిపించారు. ఆ తయారుచేసే చ్యవనప్రాశను మా ఇంట్లోనే తయారుచేయమని అడిగారు. ఆ వైద్యుడు కూడా సులభంగానే అంగీకరించాడు. నేను అనుకోకుండా ఆ సందర్భానికి అక్కడికి వెళ్లాను. నాకు కూడా ఇటువంటి విషయాలలో ఆసక్తి ఉంటుందని తెలిసి బావగారు అక్కడే ఉండి పొమ్మన్నారు. మరునాడు భట్టీ పెట్టి చ్యవనప్రాశ వండబోతున్నారు. శర్మ సార్ కారణంగా నాకు ఆయుర్వేదం గురించి కొంత పరిచయం ఏర్పడింది. చాలా దినుసుల పేర్లు లక్షణాలు ఇప్పటికే నాకు తెలుసు. కనుక అటు వైద్యుడు ఇటు బావగారు చేసే వంట కార్యక్రమంలో నేను కూడా ఆసక్తిగా పాలుపంచుకున్నాను. చ్యవనప్రాశలో నిజానికి వందకు పైగా దినుసులు చేరుతాయి. యష్టిమధు, అతిమధురం, కటుకరోహిణి, సాలాం మిశ్రీ, సఫేద్ మిశ్రీ, అశ్వగంధ, ఇలా ఎనె్నన్నో పేర్లు అతను చెపుతూ ఒక్కొక్క దినుసులు మాకు చూపించి ఆ తరువాత మాత్రమే కల్పంలో వేసి దంపించాడు. నాకు నిజానికి అప్పటికే లేహ్యాల వంటకం గురించి బాగా తెలుసు. ముందు చక్కెర పాకం పడతారు. అందులో నెయ్యి పోస్తారు. ఆ తరువాత, దంచి వస్త్ర గళితం పట్టిన దినుసు పొడులన్నీ అందులో చేరుస్తారు. లేహ్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఉసిరికాయ గుజ్జు చేరుతుంది. నిజానికి అందులో ఎక్కువ శాతంగా ఉండేది ఉసిరిగుజ్జు మాత్రమే. దాని ద్వారా మందులో పెద్ద ఎత్తున విటమిన్-సి చేరుతుంది. గుజ్జు రూపంగా ఫైబర్ కూడా చేరుతుంది. ఇవన్నీ కలిసి ఉడుకుతాయి. పాకం వచ్చిందని తెలియడానికి నైపుణ్యం కావాలి. కర్రతో కొంత లేహ్యాన్ని తీసి నీటిలో వేస్తే అది వ్యాపించకుండా చుక్కలాగ పడిపోవాలి. రెండు వేళ్లతో దాన్ని పట్టుకుని కదిపితే మెత్తగా చేతిలో కదలాలి. అప్పుడు వంట కింద మంట తీసివేస్తారు. కొంతసేపు చల్లబడిన తరువాత ఇక ఇగిరిపోయే లక్షణం గల మిగతా సుగంధ ద్రవ్యాలను, దినుసులను అందులో కలుపుతారు. యాలకులు, లవంగాలు మొదలు పచ్చకర్పూరం దాకా ఎన్నో దినుసులు ఉంటాయి. కాజూ, బాదాం నంటి పలుకులు కూడా ఉంటాయి. ఈ ప్రపంచంలో కనీసం మన భారతదేశంలో టన్నుల కొద్దీ చ్యవనప్రాశ తింటున్నారు. కానీ దాని తయారీ గురించి పట్టించుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. మా బావగారి కారణంగా నాకు ఆ పద్ధతి బాగా తెలిసిపోయింది. దశాబ్దాలు గడిచినా ఆ వైద్యుడు ఇంకా మాకు చ్యవనప్రాశ ఇస్తూనే ఉన్నాడు. నా వల్ల అతను పరిచయాలు పెంచుకుని ఎంతోమందికి కేవలం చ్యవనప్రాశనే కాక మరెన్నో మందులు ఇచ్చాడు. మంచి వైద్యం చేశాడు. పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ ఇంటికి వస్తూ ఉంటాడు.
అన్నిటికన్నా చిత్రమైన విషయం చివరికి చెప్పవలసి ఉంది. మా యజమానురాలు అంటే మాయావిడ పేరున్న గైనకాలజిస్టు. రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రొఫెసర్ పదవిలో విద్యాబోధన కొనసాగిస్తూనే ఉన్నారు ఆవిడ. మా అమ్మాయి ఎంబిబిఎస్ తరువాత వైద్య పరిశోధనలో ఎమ్మెస్ చదివింది. అది కూడా స్వీడన్‌లోని ప్రఖ్యాత ప్రాచీన విశ్వవిద్యాలయం ఉప్పలాలో చదివింది. అయినా ఇంట్లో మాత్రం సంప్రదాయ వైద్యం సాగుతూనే ఉన్నది.

-కె.బి.గోపాలం