లోకాభిరామం
వానొచ్చె.. వరదొచ్చె...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంస్కృతంలో నీళ్లకు జీవనం, వనం అని కూడా పేర్లున్నాయి. నీళ్లు లేనిదే జీవనం లేదు. అసలు జీవమే లేదు. కానీ ఈ నీళ్లు అంత సులభంగానూ ప్రాణాలను తీస్తాయి కూడా. ప్రాణమిచ్చిన నీటికి ప్రాణం తీసే శక్తి ఉండడం సహజమే కదా. కేరళలో వరదలు వచ్చాయట. పరిస్థితి మరీ అన్యాయంగా ఉందంటున్నారు. కేరళను ఒకసారి వెళ్లి చూడని వారికి ఈ పరిస్థితి గురిచి ఆలోచించడం కొంచెం కష్టమే అవుతుంది.
నేను బీహార్‌లోని రాంచీ నుంచి బెంగాల్‌లోని కలకత్తా దాకా రోడ్డు మీద ప్రయాణం చేశాను. రైల్లో పడుకుని తెల్లారేసరికి మరొక ఊరిలో మేలుకుంటే దారిలో ఏమున్నదీ తెలియదు. అందుకే కొన్నిచోట్ల రోడ్డు ప్రయాణం ఇష్టపడి చేశాను. కేరళలో కూడా అలాగే బస్సులో ప్రయాణం చేశాను. ఆ మధ్యన తమిళనాడులోని కావేరీ నదీ ప్రాంతంలో కారులో తిరిగే అవకాశం కూడా దొరికింది. ఈ ప్రాంతాలంతా తిరుగుతున్నప్పుడు నాకు మనసులో ఎప్పుడూ ఒకటే ప్రశ్న. నేను పుట్టిన తెలంగాణలో నీళ్లు ఎందుకు లేవు? ఈ కరువు కాటకాల ప్రాంతంలోని నా వంటి వారికి నీళ్ల గురించిన ఆలోచనలు పూర్తిగా వేరుగా ఉంటాయి.
కేరళలో తిరుగుతుంటే విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. పొలం ఉంటుంది. అందులో పెద్దపెద్ద చెట్లు ఉంటాయి. మధ్యన పంటలు ఉంటాయి. ఆ పక్కనే ఒక ఇల్లు ఉంటుంది. అది కొంచెం ఎత్తు ఉన్నచోట కట్టినట్లు కనిపిస్తుంది. ఆ ఇంటి నుంచి బయలుదేరి పక్క ఇంటికి వెళ్లాలి అంటే ఓ చిన్న నావను వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మధ్యన అంతా నీళ్లు ఉంటాయి. ఆ పక్క ఇల్లు అన్నది ఎక్కడో దూరంలో ఉంటుంది. మన దగ్గరలాగా చాలా ఇళ్లు ఒకేచోట ఉన్న పల్లెలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎక్కడికక్కడ పొలాల మధ్యన ఇళ్లు మాత్రమే ఎక్కువగా చూశాను. ఎటు చూసినా నీళ్లు ఉంటాయి. ఇక అందుకు తగిన పంటలు మాత్రమే అక్కడ పండుతుంటాయి. తెలంగాణలో పుట్టిన నావంటి వానికి అది నిజంగానే స్వర్గంలా కనిపిస్తుంది. అటువంటి చోట వద్దంటే వానలు కురిస్తే ఎలాగుంటుందో సులభంగానే ఊహించవచ్చు. జీవం పోయవలసిన నీళ్లు ప్రాణాంతకంగా మారుతుంది.
నేను చూచిన ఈ ఆరు దశకాలు పైబడిన జీవితంలోనే వానల తీరు ఎంతో మారిపోయింది. ఒకప్పుడు వానకాలం వచ్చిందంటే ప్రతి నిత్యం ఎంతో కొంత వాన కురిసి తీరేది. ఇక ఒకప్పుడు పెద్ద వర్షం వచ్చేది. అప్పుడప్పుడు కనీసం సీజన్లో రెండుమూడు సార్లు నాలుగైదు రోజులపాటు ఎడతెరపి లేకుండా మామూలుగా వర్షం కురుస్తూ ఉండేది. ఇక ముసురు అని మరొకటి ఉండేది. రోజులపాటు వర్షం పడుతున్నట్టు, పడలేదు అనడానికి లేకుండా ఒక రకమైన సన్నని తుంపర సాగుతూ ఉండేది. నాన్న దాన్ని తుషారం అనేవాడు. అటువంటి తుంపర మొదలైందంటే అప్పట్లో ఉండే మట్టి ఇండ్లు అన్ని బాగా దెబ్బతినేవి. పైన ఉండేది మంటి మిద్దె. వానకాలం రాకముందే దాని మీద చవిటి మన్ను పరిచేవారు. ఆ మన్ను మొదటి వానలకే కరుగుతుంది. ఒక మెత్తని పేస్టులాగా తయారవుతుంది. అది మిద్దె మీద మొత్తం పరచుకుంటుంది. అంటే పడిన నీరు పడ్డట్టు దాని మీద జారి, గూనలు అనే గొట్టాల గుండా గోడల బయటకు పడిపోతుంది. చవిటి మట్టిలో గడ్డి మిగతా మొక్కలు కూడా అంతగా పెరగవు. అటువంటి మొక్కలు, గడ్డి పెరిగితే వాటి వేళ్ల వెంట నీరు కొంచెం కొంచెంగా పైకప్పులోకి ఇంకుతుంది. వాన దడదడ కురిసి ఆగిపోతే సమస్య లేదు. కానీ ముసురు పట్టుకున్నది అంటే నెమ్మది నెమ్మదిగా మిద్దె బలహీనంగా ఉన్నచోట్లలో అంతా నీరు కిందకి దిగి చుక్క చుక్కగా ఇంట్లోకి కారుతుంది. దాని పేరు పొటుకు. ఎవరైనా అదే పనిగా ఒకే విషయం గురించి వెంటబడి అడుగుతూ విసిగిస్తుంటే పొటుకు పెడుతున్నాడు అనేవారు. ఆ మాట ఇప్పుడు ఎవరికైనా గుర్తుందా? అసలు వానలు అంతగా కురిసినప్పుడు గద పొటుకు. హిందీలో టపక్ తెలుగులో పొటుకు. పొటుకు పెడుతున్న చోట ఇంట్లో గినె్నలు, బొచ్చెలు పెట్టి ఆ సమస్య లేనిచోట పడుకున్న సందర్భాలు నాకు బాగా గుర్తున్నాయి. పొటుకు ఆపాలంటే ఆ వర్షంలోనే మిద్దె మీదకు వెళ్లి పొటుకు ఉండేచోటు గుర్తించి అక్కడ మొక్క ఏదైనా ఉంటే దాన్ని పీకాలి. కాళ్లతో కలియ తొక్కాలి. అప్పుడు పొటుకు ఆగుతుంది. ఇదంతా చెబితే చాలామందికి కథలాగ వినిపించవచ్చు.
పెద్ద వాన వచ్చిందంటే అదొక ప్రళయమే. నేను పల్లెలో కాక పాలమూరులో చదువుతున్నప్పుడు ఒకసారి చాలా పెద్ద వర్షం వచ్చింది. సాయంత్రం యూసుఫ్ అనే మిత్రుని పుస్తకాల బడ్డీ కొట్టులో నిలబడి ఉంటే మా అందరి బరువుతోపాటు ఆ అంగడి ఎగిరి పడడం నాకు బాగా గుర్తుంది. వర్షంలోనే ఇల్లు చేరుకున్నట్లు ఉన్నాము. రాత్రి కూడా తెరపి లేకుండా వాన సాగింది. పొద్దునే్న నాన్న నన్ను కూడా వెంటబెట్టుకుని పొలం చూడడానికి బయలుదేరాడు. అటువంటి పరిస్థితులలో నన్ను వెంటబెట్టుకు పోవాలని నాన్నకు ఎందుకు అనిపించింది అని నేను ఇవాళ్టి వరకు ఆలోచిస్తూనే ఉంటాను. పిల్లలకు ప్రపంచ జ్ఞానం కలిగించాలనే ప్రయత్నంలో పెద్దలు చేసిన పద్ధతులు కొన్ని అనుసరణీయాలు. నేను కూడా నా కొడుకును అలాగే వెంట తిప్పాను. పొలానికి వెళ్లాము. నిజానికి వరి కొంత పెరిగి ఉండి ఉండాలి. ఉంది కూడా. కానీ అక్కడ వరి కనిపించలేదు. మొత్తం పొలం నీళ్లు పరిచినట్టు కనిపించింది. అయితే మడికన్నా తరువాతి మడి తక్కువ ఎత్తులో ఉంటుంది కనుక నీళ్లు కూడా అలాగే అంచెలుగా ఉండి పంట మునిగింది అన్న సంగతిని చెబుతున్నయి.
మా పొలానికి వెళ్లే దారిలోచిక్కుడు వాగు అని ఒక వాగు ఉంటుంది. అక్కడ ఆనాడు నీళ్లు వంతెన పైనుంచి ప్రవహిస్తున్నాయి. దారి పక్కన పల్లంగా ఉన్న చోట పెద్దపెద్ద బోదెల వరకు నీళ్లలో మునిగి ఉండి కొమ్మలను మాత్రమే పాతినట్టు వింతగా కనిపిస్తున్నాయి. ఇదంతా కలకాలం గుర్తుండిపోయే వింత అనుభవం. చూచి ఇంటికి వచ్చాము. మళ్లీ మామూలుగా నాన్న స్నానానికి బయలుదేరాడు. నాకు తెలిసి నాన్న ఇంట్లో స్నానం చేయడం ఎన్నడూ ఎరుగను. ఏమైనా సరే బావికి వెళ్లవలసిందే. నేను కూడా నాన్నతో బయలుదేరాను. రైలు కట్ట దాటి కొంత ముందుకు వెళితే సున్నం బావి ఉంటుంది. అక్కడి మట్టిలో ఆ నీటిలో సున్నం పాలు ఎక్కువ ఉందేమో తెలియదు. ఆ బావి పేరు సున్నం బావి. బావి ఎక్కడ ఉందో తెలుసు గనుక అక్కడిదాకా వెళ్లాము. నిజానికి నేలమట్టం వరకు నీళ్లు ఉన్నాయి. మామూలుగా మేము బావిలోకి దిగి బట్టలు ఉతుక్కునే బండలలు చాలా లోతులో మునిగిపోయాయి. అక్కడే ఒక బండను సంపాదించి జాగ్రత్తగా స్నానం చేసి ఇంటికి వచ్చేశాము. నాన్న బావికి వెళ్లి స్నానం చేసి వర్షంలో తడుస్తూ ఇంటికి వచ్చి గుడ్డలు పిండుకొని తన అనుష్ఠానం చేయడం నాకు ఇప్పటి వరకు గుర్తుంది. మా ఇంటి అంగణం చాలా విశాలంగా ఉండేది. అటువైపున రెండు దిక్కుల పశువుల కొట్టాలు ఉండేవి. మా ఆవులు, ఎద్దులు, దున్నపోతులు, బర్రెలు అన్ని అక్కడే ఉండేవి. అయినా సరే బోలెడంత ఖాళీ స్థలం కూడా ఉండేది. ఆగకుండా వర్షాలు కురుస్తూ ఉంటే అటు మా పశువులు ఇటు మేము తిరిగి తిరిగి ఆగటం మొత్తం రొచ్చుగా తయారయ్యేది. ఆ బురద ఆ రొచ్చు చాలాకాలం వరకు కొనసాగేది. మరి అప్పట్లో నీటి కారణంగా వచ్చే జబ్బులు ఎక్కువగా ఉండేవి అంటే ఆశ్చర్యం ఏముంటుంది?
ఊరు ఊరంతా బురదగానే ఉండేది. మొదలే పారిశుద్ధ్యం తక్కువ. అటువంటి పరిస్థితిలో పెంటలు, చెత్త మొత్తం నీటిలో తడిసి, కుళ్లి ఊరు ఊరంతా గబ్బుగా తయారయ్యేది. బాహ్యానికి వెళ్లాలంటే ఊరికి దూరంగా వెళ్లవలసిందే తప్ప ఇళ్లలో పాయిఖానాలు అప్పటివరకు లేనేలేవు. ఆ వానలో ఆ బురదలో పడి వీలైనంత దూరంగా వెళ్లేసరికి నాకు తలప్రాణం తోకకు వచ్చింది. అయితే నీళ్లు మోసుకు వెళ్లవలసిన అవసరం మాత్రం లేదని ఒక ఊరట. ఎటుచూసినా నీళ్లే ఉంటాయి. కనుక అవి మన అన్ని అవసరాలకు అందుతాయి.
మళ్లీ ఒకసారి ప్రస్తుత పరిస్థితులలోకి వస్తే, అప్పటి వానలు లేవు. అప్పటి నీళ్లు అంతకన్నా లేవు. చిక్కుడు వాగు ఎండిపోయింది. అందులో ఇళ్లు కూడా కట్టుకున్నారు. వంతెన నామమాత్రంగా మిగిలింది. దిగుడుబావులు, వ్యవసాయం బావులు అన్నవి ఎక్కడా కనిపించవు. ఎటుచూసినా గొట్టం బావులు తవ్వారు. పాతకాలపు బావులను పూడ్చి పెట్టారు. ఒకప్పుడు ఇక్కడ బావి ఉండేది. అందులో మేము ఈదే వాళ్లము అని చెబితే ఇప్పటి పిల్లలకు బహుశా కథలాగ వినిపిస్తుందేమో?
ప్రపంచంలో నీరు రావడం పంటలు పండటం, చెరువులు నిండటం, వాగులు పారడం, నదులు మొదలైన మార్గాలగుండా నీళ్లు మళ్లీ సముద్రంలోకి చేరడం అంతా కలిసి జలచక్రం అని ఒకటి ఉండేది. సముద్రం నుండి ఆవిరై వానగా కురిసిన నీరు మన అవసరాలకు పోను మిగిలినది మళ్లీ సముద్రంలోకి చేరేది. వాన నీరు సముద్రంలోకి చేరుతుండడం తప్పు అంటూ ఇప్పటి వాళ్లు మాట్లాడుతున్నారు. వచ్చిన నీటిని ఎక్కడికక్కడ ఆనకట్టలు కట్టి ఆపేయాలి. నీరు మొత్తం మన అవసరాలకే మిగిలిపోవాలి. కోయిల్ సాగర్, సరళ సాగర్ అని కొత్త పద్ధతి ప్రాజెక్టులను పెట్టినప్పుడు అంటే మా చిన్నప్పుడు వింతగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఊహకు అందని స్థాయిలో కృత్రిమంగా నీటిని ఎత్తి అవసరాలకు వాడుకుని పద్ధతులను గురించి ఆశ్చర్యకరంగా చెప్పుకుంటున్నారు. మనిషి ప్రకృతితో పోటీ పడుతున్నాడు. ప్రకృతిని తాను వశం చేసుకోవాలి అనుకుంటున్నాడు. అయితే ప్రతిలోని అన్ని అంశాలు అంత సులభంగా పట్టుబడేవి కాదు. వాన కురిసిన తరువాత నీటిని ఏమైనా చేయవచ్చు. కానీ వాన కురిపించడం మాత్రం మన వల్ల కావడంలేదు. నీళ్లు మనకు జీవాన్ని జీవనాన్ని అందిస్తాయి అనుకున్నాం కదా. ఆ నీళ్లను మనం నియంత్రించాలి అనుకుంటే అది నిజంగా కొత్త పరిస్థితి.