లోకాభిరామం

చూడగలిగితే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొద్దునే్న లేచి అందరూ తలొక దిక్కు ఎందుకు పోతారు అన్నది ప్రశ్న. అందరూ ఒకే దిక్కుకు కనుక పోతే నేల ఆ దిక్కు కుంగిపోతూ ఉందేమో అన్నది జవాబు. ఈ మాటలో హాస్యము ఉన్నదా లేక ఆలోచించేటందుకు ఏమన్నా ఉన్నదా అన్నది మన ఎదురుగా ఉన్న ప్రశ్న. భూమిని బల్లపరుపుగా అంటే ఒక మంచము వలె, ఒక చాప వలె ఉన్నది అనుకుంటే అప్పుడు అందరూ ఒక దిక్కు పోతే మరి భూమి ఆ దిక్కు వంగిపోయే అవకాశం ఉన్నది. కానీ భూమి అట్ల బల్లపరుపుగా లేదు. గుండ్రంగా ఉంది అని మనకు ఇప్పుడు తెలుసు. కనుక ఈ మాటలు కొంత విచిత్రము మరికొంత హాస్యము అనిపిస్తాయి తప్ప నిజము ఉన్నట్లు తోచదు. చెప్పిన వానిది స్వంత దారి. విన్న వారిది తలకొక దారి. ఎవరి దారి వారిది. చెప్పే వాని గోస వినే వారికి పట్టదు. వారు తాము ఏమి విన తలుచుకుంటారో దానే్న వింటారు. అక్కడనే వున్నది చిక్కు.
దృష్టికోణం అని ఒక మాట ఉన్నది. దాన్ని మరింత కుదించితే దృక్కోణము అవుతుంది. ఇది ఏమీ అన్న మాట ఎంతమంది పట్టించుకుంటున్నారు? ఎవరి దృష్టి కోణం వారికి ఉన్నది. సినిమా హాలులో వందల సీట్లు ఉంటాయి. కనుక అదే సినిమా ఆ వందల మందికి వందల తీరుగా కనిపిస్తుంది అంటే మీరు ఎవరైనా నమ్మగలరా? కనీసం ఆ పరిస్థితిని ఊహించగలరా? సినిమా తీసేటప్పుడు దృశ్యాన్ని కెమెరా ఒక కోణం నుంచి చూస్తుంది. సినిమా చూసేవారు కూడా అదే కోణం నుంచి చూస్తే తీసిన బొమ్మ తీసిన విధంగా కనిపిస్తుంది. కానీ ఇది వీలుకాని సంగతి. హాలులోని వారు తామున్న చోటునుబట్టి సినిమా బొమ్మలను రకరకాలుగా చూస్తారు. ఒకరిద్దరికి మాత్రమే కెమెరా ఉండిన కోణంలో ఉండి కెమెరా తీసిన కోణంలో బొమ్మను చూసే అవకాశం ఉంటుంది. మరి కెమెరా ఇప్పుడు అదే కోణంలో ఉండదు. కనుక ఒక బొమ్మ కనిపించిన వారికి మరొక బొమ్మ అంత బాగా కనిపిస్తుంది అనడానికి లేదు. ఇదంతా నిజంగా గజిబిజి. అసలు చూడడమే గజిబిజి. అందులో దృష్టికోణం అన్నది మరింత గజిబిజి. దృష్టికోణం కేవలం కంటికి మాత్రమే పరిమితం అయితే అక్కడితో కథ ఆగుతుంది. కానీ మనకు శరీరానికి అందిన అన్ని సంకేతాలను ఒకచోట చేర్చేందుకు మెదడు అని ఒక మెషీన్ ఉన్నది. అది స్వంత దృష్టికోణం గలది. కనుక కనిపించిన దానికి తన గత అనుభవాలను లేదా ఆలోచనలను జోడు చేసి, చూడవలసిన దానిని చూడకుండా మరింక దేనినో మనకు చూపిస్తుంది. అక్కడితో కథ మొత్తం తలకిందులు అవుతుంది.
ఒక చిత్రకారుడు బొమ్మ గీయాలని ప్రయత్నం మొదలు పెట్టినడు. ఆ కాలంలో మనుషులను ప్రకృతిని కాక నిత్యం వాడుకునే వస్తువులను బొమ్మలు గీయడం ఒక ఆచారంగా మొదలైంది. అప్పుడే కుండలు, బొచ్చెలు లాంటి వాటి బొమ్మలు గీయడం కూడా మొదలైంది. ఈ చిత్రకారుడు ఒక కుర్చీ బొమ్మ గీయాలని భావించినడు. కుర్చీని ముందు పెట్టుకొని చాలాసేపు రకరకాల కోణాల నుంచి పరిశీలించినడు. కానీ అతనికి ఆ కుర్చీలో బొమ్మ గీయవలసినంత అందంకాని ఆకర్షణ కానీ కనిపించలేదు. అంటే అతనికి వస్తువుల బొమ్మలు గీయడం అని వచ్చిన పద్ధతి తలకు ఎక్కలేదని అర్థం. కుర్చీ బొమ్మ గీసేందుకు ఒక దృష్టి కోణం అవసరమా? కుర్చీ కొంచెం మామూలుగా లేకుండా ఉంటే చాలు కదా? మామూలుగా ఉండే కూర్చుని కూడా కొంచెం అటు ఇటు చేసి గీసి కొత్త కుర్చీ కింద చూపించవచ్చు కదా? అసలు పాత కుర్చీ మామూలు కుర్చీ బొమ్మ కూడా గీయవచ్చు కదా? ఈ చిత్రకారుడు మరి మనసులో ఏదో పెట్టుకుని ఆ భావనను కుర్చీలో చూచేందుకు ప్రయత్నించినడు. కనుక అది అతనికి కనిపించలేదు. భావం ఎట్లుండునో అట్లే జరుగును అని అర్థం వచ్చే సంస్కృతం మాట ఒకటి ఉన్నది. అదే పద్ధతిలో చిత్రకారుడికి కుర్చీలో బొమ్మ గీయదగిన సంగతి ఏమీ కనిపించలేదు. విసిగిపోయి అతను కుర్చీని ఒక్క తన్ను తన్నినడు. అది బోర్ల పడినది. దాని కాళ్లు నాలుగున్నూ నాలుగు ఎత్తులలో విచిత్రంగా కనిపించినయి. ఇక ఇప్పుడు చిత్రకారుడికి బొమ్మ గీసే దృష్టికోణం దొరికిన భావం కలిగింది. ఇది నేను సృష్టించి చెప్పిన కథ కాదు. జర్మన్ భాషలో ఒక ప్రసిద్ధ రచయిత ఈ అంశం మీద కథ రాసినాడు. ఆ కథ జ్ఞాపకంగా నేను ఇక్కడ దృష్టికోణం గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను.
మరొక కుర్చీ ఉన్నది. ఇది ఇంట్లో లేదు. సర్కస్‌లో ఉన్నది. అక్కడ బఫూన్ అనే ఒకాయన ఆ కుర్చీని తీసుకొని రింగులోకి వచ్చినాడు. అంటే రంగం మీదికి వచ్చిన అని అర్థము. అతను ఆ కుర్చీని చేతబట్టి ఎగిరేసి అందుకోని, ఆలోగా ఎన్నో విన్యాసాలు చేసి మొత్తానికి చాలా కాలంపాటు కుర్చీతో సర్కస్ చేసి చూపించాడు. ఆయన దృష్టిలో ఆ చేరును తాను సరిగానే వాడుకున్నట్లు భావన ఉంటుంది. కానీ పరిశీలకుడు మాత్రం చిత్రంగా ఒక మాట చెబుతాడు. అతను కుర్చీతో వచ్చాడు. దాని మీద కూర్చోవడం తప్ప మిగతా అన్ని పనులు దానితోనే చేశాడు, అంటాడు పరిశీలకుడు. అవును మరి! కుర్చీ అంటే కూర్చోవడానికి పనికివచ్చే విషయం. అంతేగాని దానితో ఆక్రోబాటిక్స్ విన్యాసాలు చేస్తానంటే అది చాల కొత్త విషయం కదా! ఇది ఒక దృష్టికోణం. చూడ దలచుకున్నది ఒకటి ఉంటుంది. కనిపించేది మరొకటి ఉంటుంది. అర్థమయ్యేది మూడవది ఇంకొకటి ఉంటుంది. అసలు వాస్తవం మరెక్కడో ఉంటుంది. ఎక్కడ ఈ తంటా? ఇందుకే కదా ఈ ప్రపంచంలో ఉన్న తంటాలు అన్ని ఇన్ని రకాలుగా మనకు సమస్యలను సమాధానాలను వినోదాన్ని పంచి పెడుతున్నాయి!
చిత్రకళా ప్రదర్శన జరుగుతున్నది. అక్కడ అందరూ వచ్చి ప్రదర్శనకు పెట్టిన బొమ్మలను చూచి చాలా సంతోషిస్తున్నారు. చివరకు ఒక చిత్రానికి బహుమతి కూడా ప్రకటించారు. ఆ చిత్రం గీసిన మహానుభావుడిని రమ్మన్నారు. అయన వచ్చాడు. తన బొమ్మ వైపు చూసి, అయ్యో దీన్ని తలకిందులుగా వేలాడదీసి ఏమి అని అడిగినాడు. అదీ సంగతి! నైరూప్య చిత్రకళ అని ఆ మధ్యన వచ్చింది. అందులో ఏముంటుంది అన్నది ఎవరికి వారే ఊహించుకోవాలి. చిత్రకారుడు ఒకటి ఊహించుకుని బొమ్మ వేసెను. దానిని వెంట రాకుండా ప్రదర్శనకు పంపెను. అక్కడ వారు తమకు తోచిన పద్ధతిలో దానిని వేలాడదీసి బహుమతి కూడా ప్రకటించిరి. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో, నా హాస్టల్ రూమ్‌లో రకరకాల అలంకరణలు చేసేవాణ్ణి. ఒకసారి ఒక ముండ్ల చెట్టు దొరికింది. దానికి ఆకులు లేవు. అన్ని రాలిపోయినవి. అంటే చెట్టు ఎండిపోయిందని అర్థం. అది నాకు చాలా అందంగా కనిపించింది. తెచ్చి నేనే తయారుచేసిన ఒక కుండీలో దాన్ని పెట్టి బల్ల మీద పెట్టాను. వచ్చిన వాండ్లంతా దాన్ని చూసి ఆశ్చర్యం పొందిన తీరు చూస్తే నాకు ముందు ఆశ్చర్యం వేసింది. నిజానికి నాకు దొరికిన రంగు రంగు కాగితాలను రకరకాల ఆకారాలలో కత్తిరించి మనసుకు వచ్చిన తీరున ఒక అట్ట మీద అతికించి నా గదిలో ప్రదర్శనకు పెట్టిన. చూడ వచ్చినవారు ఆ చిత్రం గురించి రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ, అందులో నాకు కనిపించని అర్థాలను నాకే చెప్పడం మొదలుపెట్టారు. దృష్టికోణం అంటే అట్ల ఉంటుంది మరి.
ఒకప్పుడు కవితలు అనుకరణ పద్ధతిలో వింతగా పేరడీలు రాయడం అన్నది పద్ధతిగా వచ్చింది. అప్పుడు గులాబీ గురించి ప్రసిద్ధ కవులను కవిత రాయమంటే ఎట్ల రాస్తారు అని ఎవరో ఒక్కరే ఊహించి కవితలు అల్లి ప్రచురించినట్లు గుర్తుంది. పన్‌చాన్ గమ్ అని రాసి అందరిని అదరగొట్టిన పఠాభి అనే పట్ట్భారామరెడ్డిగారు గులాబీల గురించి చెబుతూ కూడా కార్జం, బూర్జువా, గుండెలు లాంటి మాటలు చెబుతారట. ఇదొక్కటే గుర్తున్నది మిగతావన్నీ గుర్తులేవు. కానీ వాటివల్ల కలిగిన చిత్ర భావనలు మాత్రం నేటికీ నా మనసులో తిరుగుతున్నాయి.
నాకు పల్లె బతుకు అలవాటు. సంవత్సరమంతా ఆరుబయట గాలిలో, వాన వస్తే వరండాలో పడుకోవడం అలవాటు. సహజమైన గాలి తప్ప కరెంటు సాయంతో వచ్చే గాలి తెలియదు. ఇప్పటికి కూడా అదే పద్ధతిలో బతకాలని నేను ప్రయత్నం చేస్తాను. కిటికీలు తలుపులు తెరిచి ఉంచి హాయిగా నిద్ర పోతాను. నేను ఉండేది ఐదవ అంతస్తులో గనుక ఎవరో వచ్చి దోచుకుపోతారు అన్న భయం కూడా లేదు. అయితే కొంతమందికి కిటికీలు తలుపులు బిగించుకుని గాలి ఆడకుండా నిద్రించే అలవాటు ఉంటుంది. కనుక కిటికీ తెరిచినము అంటే నాకు ఆనందం కలుగుతుంది. గాలి అలవాటు లేని మిగతా వారికి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. గాలి లేకుంటే ఒకరికి ఉక్కిరిబిక్కిరి. గాలి ఉంటే మరొకరికి ఉక్కిరిబిక్కిరి. ఇదేనా దృష్టి కోణం అంటే.
అక్కడెక్కడో ఆకాశంలో మర్డర్ అయిపోయినట్టు ఊహించిన డైలాగు మనకందరికీ తెలిసిందే. ఆకాశం సాయంత్రం అయితే ఎర్రబడుతుంది. సైన్సు వెర్రివాడిని కదా, నాకు అక్కడ సూర్యకిరణాలు, వాటి కోణాలు రంగులు మొదలైనవన్నీ గుర్తుకువస్తాయి. మరొక కవికి పగిలిన గుండెలు గుర్తుకు వస్తాయి. మరొక ఆయనకు మరి ఏదో గుర్తుకు వస్తుంది. చిత్రకారునికి ఆ రంగుల్లో కొత్త ప్రపంచం కనిపిస్తుంది. కానీ అక్కడ హత్య జరిగినట్లు ఊహించగలిగిన వారు నిజంగా భావుకులు. వారివల్ల ఈ లోకానికి మరెక్కడా వీలుకాని ఆలోచనలు అందుతాయి.
మీరు ఈ నాలుగు మాటలు చదువుతున్నారు. కొంతమందికి ఇది సోదిగా కనిపించి ఉండవచ్చు. మరి కొంతమందికి ఇందులో ఆలోచించడానికి విషయం దొరికే ఉండవచ్చు. ఎవరు ఎక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉండి మనసు ఏ రకంగా ఉండి విషయాన్ని గమనించే తీరు కోణాన్ని నిర్ణయిస్తుంది.
ఒకచోట నిలబడిన వారికి కదులుతున్న వారు ముందుకు లేదా వెనుకకు పోతున్న భావన కలుగుతుంది. ఏది ముందుకు ఏది వెనుకకు అన్నది సాపేక్షం. అది నీవు ఉన్నచోటు మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒక రెఫరెన్స్ పాయింట్ లేకుంటే అసలు దూరాలకు కాలాలకు మరే కొలతలకు అర్థాలు ఉండవు. మీరు ఉండి చదువుతున్నందుకు నేను ఉన్నాను. లోకాభిరామం కూడా ఉన్నది. మీరు లేకుంటే నేను లేను. చదివేవారు కొంతమందైనా లేకుంటే ఈ పత్రిక లేదు. ఈ కాలం లేదు. నేను లేను. మీరు లేరు. అంతా సాపేక్షం. అంటే అంతా దృష్టికోణం. ఇక మంచి-చెడు అన్న విషయానికి వస్తే మరెన్నో దృష్టికోణాలు. ఇంకెన్నో ప్రమాణాలు.

-కె.బి.గోపాలం