లోకాభిరామం

చట్టాలు - చుట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి తీరు గురించి మరీ లోతుగా చెపితే అందరూ ఆసక్తిగా చదువుతారా? ఎంత విస్తారంగా చెపితే చదువుతారు! ఈ రచన పుస్తకంగా నేరుగా వేయడం మంచిదా! ఎన్నో ప్రశ్నలు.. వీటన్నిటికీ కారణం ఉంది. మనిషి తనకు తెలిసి కొంత, తెలియకుండా కొంత నియమాలు పెట్టుకుంటాడు. ఆ నియమాల ప్రకారం బతుకులు సాగుతుంటాయి. మానవులు సమాజంగా బతకడం మొదలయిన తరువాత అంతకు ముందటి పద్ధతి కొనసాగదు అని తెలిసింది. అంటే అంతకు ముందు కూడా ఒక పద్ధతి ఉండేదన్నమాట. ఈ పద్ధతి అన్నది కొన్ని నియమాల మీద ఆధారపడి ఉంది. మనిషి మరీ ఒంటరి జీవి కాదు. జంట కట్టడం అన్ని జంతువులలాగే అయినా, అందులో ఒక తీరు ఏర్పడింది. ఆ తరువాత తనకు అంటూ కొన్ని వస్తువులను సేకరించుకోవడం మొదలయింది. తన వారు అంటూ మనుషులను సేకరించుకోవడం మొదలయింది. తనకు, తన వస్తువులకు, తన వారికి రక్షణ ఉండాలన్న భావం బాగా అర్థమయింది. అప్పుడిక బాధ్యతలు తెలిశాయి. వాటిని పంచుకున్నారు. అక్కడ నియమాలు మొదలయ్యాయి.
జంతువులు పిల్లలను కంటాయి. చిత్రంగా ఆ పిల్లలు కొన్ని గంటల కాలంలోనే స్వతంత్రంగా తిరగడం నేర్చుకుంటాయి. తరువాత తలిదండ్రుల జాగ్రత్త కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఏదో ఒక వయసులో పిల్లలను స్వతంత్రంగా బతకడానికి తరమడం కూడా జంతువులలో ఉంది. మనిషి విషయంగా ఈ పద్ధతి పనికిరాదు. ఆడ, మగ జంట కడతారు. సంతానాన్ని కంటారు. పుట్టిన శిశువు చాలాకాలం వరకు తలిదండ్రుల మీద లేదా మరొక వ్యక్తి మీద ఆధారపడడం మనకు తెలిసిందే. శిశువు పుట్టడానికి తాను బాధ్యుడను అని తెలిసిన తండ్రి, ఆ తల్లిని కాపాడే బాధ్యతను తలకు ఎత్తుకున్నాడు. ఆ రకంగా కుటుంబం అన్న భావన ఏర్పడింది. మనిషి బిడ్డ నడక నేర్వడానికే సంవత్సరానికి పైన పడుతుంది. తన తిండి తాను సంపాదించుకోవడానికి కనీస పక్షం ఒక దశాబ్దం, ఆదర్శ పక్షం రెండు దశాబ్దాలు పడతాయి. ఇది నిజంగా విచిత్రమయిన పరిస్థితి. కుటుంబం ఉన్న తరువాత అవసరాల పేరున ఎన్నో వస్తువులు, పదార్థాలను, ఆస్తులను సేకరించుకోవడం మొదలయింది. సమాజ జీవితం కూడా మొదలయింది. వీటన్నిటి పేరు మీద మిగతా జంతువులలో కొంతవరకు మాత్రమే ఉన్న నియంత్రణ అనే లక్షణం మనిషిలో బలంగా మొదలయింది.
మానవ సమాజాలు అన్నింటిలోనూ చట్టాలు ఉండడం, అందరూ అంగీకరించడం అంతటా జరిగింది అని చెప్పడానికి లేదు. కానీ నియమాలు ఉండడం మాత్రం నిజమే. ఈ నియమాలు అన్నది నిజంగా ఆలోచించవలసిన విషయం. చింపాంజీలు కొన్ని నియమాలను పెట్టుకుంటాయి. అవి తమ ప్రాంతాలకు సంబంధించినంత వరకు బలంగా ఉంటాయి. ఇక పెద్దంతరం, చిన్నంతరం నియమాలు కూడా ఏప్‌లలో ఎక్కువగానే ఉన్నాయి. మనుషులలో మాత్రం మాట అన్న శక్తి పరిస్థితిని మార్చింది. మిగతా జంతువులకు లేనంతగా మెదడు బలం, ఆలోచన, ఆవేశకావేశాలు మనిషిలో ఉన్నాయి. కనుక ఎన్నో నియమాలు అవసరమయ్యాయి. చేయకూడని పనులు అంటూ ప్రతిబంధకాలు మొదలయ్యాయి. మర్యాదలు ఏర్పడ్డాయి. అన్నీ కలిపి నడవడి అన్న ఒక పద్ధతి మొదలయింది.
మానవ సమాజాలు రకరకాల పరిస్థితులలో రకరకాల చోట్ల అభివృద్ధి చెందాయి. ఎవరి అవసరాలకు తగినట్టు ఎక్కడికక్కడ నియమాలు పుట్టుకువచ్చాయి. మొత్తానికి మనం ముందు అనుకున్న మూడు విషయాలలో ఈ నియమాలు క్రమంగా కొనసాగాయి. మానవుని ప్రస్తుత పద్ధతికి ఈ నియమాలు ప్రాతిపదికలుగా నిలిచాయి. సమాజాలను ముందుకు నడిపించాయి. చరిత్రకు కారణమయ్యాయి. సంస్కృతులకు ఆధారాలు అయ్యాయి. వీటిని లోతుగా కాకున్నా ఇక్కడ సూత్రప్రాయంగా పరిచయం చేసుకుందాము.
మొట్టమొదట తన వారు అన్న భావన పుట్టింది. చుట్టాలు ఏర్పడ్డారు. తన వర్గం ఏర్పడింది. ఆస్తులు, సమాజంలో స్థాయి, ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించాయి. ఇంతకూ ఎవరు చుట్టాలు, ఎవరు దగ్గరి చుట్టాలు, ఎవరి విషయంలో బాధ్యతలు ఎక్కువగా వుంటాయి? అన్న నియమాలు, సంప్రదాయాలు పుట్టడానికి చాలా కాలమే పట్టి ఉంటుంది. కానీ ఇది జరగడం ఒక అద్భుతమయిన వ్యవస్థీకరణ అని మనం చెప్పుకోవాలి. మనకు తెలిసి పితృస్వామ్య వ్యవస్థ ఎక్కువ బలంగా ప్రపంచంలో సాగుతున్నది. భారతదేశంలో కూడా మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. ఇప్పటికీ కొన్నిచోట్ల ఉంది. ప్రపంచంలో మరిన్ని చోట్ల ఈ పద్ధతి కొనసాగుతున్నది. మగ ప్రాణికి శారీరకంగా ఉండే ఆధిక్యత పితృస్వామ్యానికి ఆధారం అయి ఉంటుంది. పిల్లలను కనే బాధ్యతగల తల్లి కొంతకాలం పాటు కుటుంబం విషయాలను పక్కన పెట్టవలసిన అవసరం వస్తుంది. కనుక మాతృస్వామ్యంలో కొన్ని కష్టాలు ఉంటాయి. ఇక మరికొన్ని సమాజాలలో ఇరువైపుల బంధువులను సమానంగా స్వీకరించే పద్ధతి కూడా ఉండేది. ప్రస్తుతం ఆ తీరు గురించి పరిశీలన అవసరం. ఇక మానవ సంబంధాలలో స్ర్తి, పురుష సంబంధాలను నిర్వచించే పెళ్లి అనే వ్యవస్థ గురించి చాలా పరిశోధన జరిగింది. కేవలం సైన్స్ దృష్టితో చూస్తున్న ప్రస్తుత కృషిలో దాన్ని మరీ లోతుగా చూడనవసరం లేదని ఈ రచయిత భావిస్తున్నాడు. కుటుంబం కొనసాగుతూ ఉంటుంది. జంటను ఎంచుకోవడం జంతువులలో వలె స్వతంత్రంగా కాక సమాజ నియమాలకు కట్టుబడి ఎంతోమంది అంగీకారం మీద జరగవలసిన పద్ధతి సిద్ధమయింది. పెళ్లి జరుగుతుంది. అందుకు ఎన్నో నియమాలు ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ నిబంధనలు ఉన్నాయి. వీటన్నింటికీ సంబంధించి ఎన్నో నియమాలు ఆయా సమాజాలలో ఈనాటికీ అమలులో ఉన్నాయి. కానీ నిన్నటి వరకు ఎవరో అనుకున్న కుటుంబం పెళ్లి తరువాత వియ్యాలవారి పేరున అందరికన్నా దగ్గరి బంధువులవుతారు. లైంగిక సంబంధాలు ఉండకూడని చుట్టరికాల విషయంగా మనుషులకు ఎన్నో నియమాలు ఉన్నాయి. వీటిని అధిగమించిన పరిస్థితులు కూడా చరిత్రలో కొన్నిచోట్ల కనపడుతాయి. వివరాలలోకి వెళితే ఈ విషయం గురించి ప్రత్యేకంగా చర్చ అవసరం అని అర్థమవుతుంది.
చట్టాలు, చుట్టాలు వచ్చిన తరువాత రక్షణ బాధ్యత గుర్తుకు వస్తుంది. ఈ రక్షణ విషయంగా ఇప్పటి పరిస్థితి కాకుండా మరీ పాతకాలంలోకి వెళితే ఆశ్చర్యం కలుగుతుంది. యుద్ధాల పేరున మనుషులు మనుషులను చంపుకున్నారు. అది న్యాయసమ్మతం అన్నారు. శౌర్యం పేరున పోటీ తత్వంతో ఇద్దరు వ్యక్తులు పోరాడిన పద్ధతులు మనకు బాగా తెలుసు. ఒకరిని ఒకరు చంపుకొనడం కూడా చట్టం ప్రకారం సమ్మతమే అన్న పరిస్థితులు ఇవాళటికి కూడా ఉన్నాయేమో! అయితే అన్ని సమాజాలు హత్యను నిరసించాయి. మంచి పద్ధతి కాదు అన్నాయి. అందరికీ బతకడానికి అవకాశం ఇవ్వాలి అన్నాయి. కానీ ఈ మాటలు పక్కన పెట్టవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయని సమాజాలే ఒప్పుకున్నాయి. మరొక మనిషిని చంపడం అన్యాయం అని ఇవాళటికీ అందరూ అంటున్నారు. అయితే ఏ పరిస్థితులలో అది అన్యాయం అవుతుంది అన్నది మాత్రం పెద్ద ప్రశ్న. ఆత్మరక్షణ కొరకు చేసిన హత్య విషయంగా మనకు ఎంతో తెలుసు. చాలా సమాజాలలో పరిచయం లేని మనిషి, గుర్తు తెలియని మనిషి సులభంగా హత్యలకు గురి అవుతాడు. తన వారికి హాని చేసిన వారిని చంపడం అన్నది చరిత్ర మొత్తంలోనూ కొనసాగింది. అందులో న్యాయం ఉంది అన్న భావన నేటికీ కొనసాగుతున్నది. ఒక వర్గానికి ఏదో రకంగా కష్టం, నష్టం, అవమానం కలిగించిన వారిని చంపడం ఇవాళటికీ కొనసాగుతున్నది. మొత్తానికి తమకు తాము రక్షణ కల్పించుకోవడం అన్నది ప్రాథమిక నియమం. దానికి సంబంధించి చేయదగినవి, చేయదగనివి, అయిన నియమాలు మరింత ముందుకు సాగుతాయి. ఇవాళటి న్యాయవ్యవస్థ మొత్తం పై నాలుగు మాటలలో నుంచే పుట్టిందంటే అబద్ధం కాదు.
ఆస్తి అన్నది ఆసక్తికరమయిన అంశం. ఆనాటికి సరిపోగా మిగిలిన తిండిని దాచుకోవడంతో నాది అన్న భావన మొదలయింది. వ్యవసాయం వచ్చిన తరువాత ఈ భావం మరింత పెరిగింది. నగరాలు, సమాజాలలో దానికి పూర్తి రూపు ఏర్పడింది. ఎవరికి వారికే ఆస్తులు ఉండగా, అధికారులు, అంటే రాజులు ఆ మాటకు కొత్త అర్థాన్ని ఇచ్చారు. ఇక వరుసబెట్టి రకరకాల నియమాలు వచ్చాయి. నా ఇంటిలో నేను ఉన్నప్పటికీ పన్ను చెల్లించాలి. నా పొలం నేను పండించుకున్నప్పటికీ శిస్తు చెల్లించాలి. ఇది ఒక రకంగా అర్థంకాకున్నా ఆ వ్యవస్థకు వెసులుబాటు కలగడం గురించిన సంగతులు ముందుకు వచ్చినప్పుడు ఆలోచన తీరు మారింది. ఎవరూ పెంచని పంట ముందు చూచిన వారికి దక్కింది. ఈ పద్ధతి ఈనాటికీ కొన్నిచోట్ల సాగుతున్నది. కానీ సమాజం అనే దృష్టితో దానికిగల సామూహిక నియమాల దృష్టితో చూచినపుడు ఈ పద్ధతిని పక్కనపెట్టవలసి వచ్చింది. ఎవరి ఆస్తులు వారికి ఉండగా వారు, వారి ఆస్తి కలిగి మరెవరికో స్వంతం అవుతున్నారు.

-కె.బి.గోపాలం