లోకాభిరామం
లోకాభిరామం కాదిది..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కాలం రాయడం అంటే అందులో అన్ని విషయాలు ఉన్నాయి అని ఎంతమంది అనుకుంటారో తెలియదు. రాసేవారికి అది తప్ప ఇంకొక పని తెలియదు. చదివేవారికి హాయిగా చదవడం తప్ప రచయితలు పడే బాధలను గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ నిజంగా పత్రిక అంత అందంగా తయారయి తమ చేతిలోకి వచ్చింది అంటే దాని వెనుక ఎంతమంది కృషి ఉంది అన్న సంగతిని అందరూ గమనిస్తే ఎంత బాగుండును.
విషయాలు నిర్ణయించడం గురించి నేను పడే తాపత్రయాన్ని అందరి ముందు పెట్టలేదు. మిత్రులు నిజాం వెంకటేశంగారు ఒకసారి ఇంటికి వచ్చారు. ఎందుకో నా గదిలోకి కూడా వచ్చారు. అక్కడ గోడ మీద పసుపుపచ్చ కాగితం ముక్కలు చాలా అతికించి ఉన్నాయి. ఆఫీసులో విషయాలను గుర్తుంచుకోవడానికి అటువంటి కాగితాలను రాసి అతికించడం అదొక అలవాటు. ఇప్పుడు కూడా రాయవలసిన రాయదగిన విషయం గుర్తుకు వచ్చిన క్షణాన్ని వదులుకోకుండా వెంటనే దాన్ని ఒక కాగితం మీద రాసి గోడకు అంటిస్తూ ఉంటాను. పడుకున్న వాణ్ణి లేచి దీపం వేసి సరిగ్గా నాలుగు అక్షరాలు రాసి గోడకు అతికించి మళ్లీ పడుకున్న సందర్భాలు ఉన్నాయి. అదొక ఆనందం. ఆలోచన మళ్లీ అటువేపు పోతుందన్న గ్యారంటీ లేదు. వెంకటేశం గారు కాగితాలను గురించి ప్రశ్నించారు. వాటి మీద సంగతులను చదవమన్నాను. అక్కడ బడిలో ఉండే తెల్లబల్ల, నోటీసు బోర్డు పద్ధతిలో మరొక పుచ్చడానికి వీలుండే బల్ల కూడా నా గది గోడల మీద ఉన్నాయి. ఆయన నిజంగా ఆ ఏర్పాట్లను చూచి సంతోషించారు. ఆ మాటను మిగతా వారికి ఎవరికో చెప్పడం కూడా నాకు గుర్తుంది. వెంకటేశం గారు లోకాభిరామం వ్యాసాలను వరుసబెట్టి చదువుతుంటారు. వాటిని గుర్తుంచుకుని అప్పుడప్పుడు ఫోన్ చేసి అభినందిస్తారు కూడా. ఇదంతా నా గురించి చెప్పడానికి కాదు. నాకు కలిగిన అవకాశాన్ని వాడుకోవడానికి నేను పడుతున్న శ్రమను మీ ముందు ఉంచడానికి మాత్రమే ఇన్ని మాటలు.
5 సంవత్సరాల క్రితం లోకాభిరామం మొదలుపెట్టినప్పుడు పత్రిక వారు నాకు ఒక విషయాన్ని సూచించలేదు. అప్పటి సంపాదకులు దయతో ఆ నిర్ణయాధికారాన్ని నాకే వదిలేశారు. చెప్పాను కదా నాకు ఎంత వెసులుబాటు అయిందో, అంత సమస్య కూడా అయింది. అయినా అది ఇష్టమైన సమస్య. కొన్ని కష్టాలు అనుభవించడానికి బాగుంటాయి. కనుకనే అనుభవించాను. రాస్తూ ఇక్కడిదాకా వచ్చాను. ఇంకెంతకాలంఅని ఒకసారి అనిపిస్తుంది. విషయం గురించి ఎవరితో ప్రస్తావించినా సరే, రాయడం మానవద్దు అన్నవారే కానీ, ఇక చాలులే అన్నవారు లేరు. అలాగని నేను రాస్తూనే ఉంటానా? ఏమో, ఈ క్షణాన అందుకు ఇది తగిన సమయం అని కూడా అనిపించింది. మనసులోని నాలుగు మాటలు చెప్పాను. ఇన్నాళ్లు నేను రాసిన సంగతులను భరించినట్టే ఇవ్వాళ కూడా నా మాటలను చదవండి. రచయితకు పాఠకుడు బలం. పాఠకుల మనోగతం చాలాసార్లు రచయిత దాకా రాదు. వచ్చే పద్ధతి ఉన్నప్పటికీ అది నిజానికి జరగవలసిన తీరులో జరగదు. విషయం దారి వదిలిపోతున్నట్టుంది.
ముందుగా నా పల్లె బతుకు గురించి రాశాను. నా గురించి రాయలేదు. బతుకు గురించి రాశాను. అక్కడి ఆనందాల గురించి రాశాను. అనుభవాలను గురించి రాశాను. ఇంకా రాయవలసింది ఎంతో ఉంది. ఈలోగా ఒకే సంగతి గురించి వరుసపెట్టి రాస్తే ఎంత బాగా రాసినా సరే అందరికి ఆనందంగా ఉండకపోవచ్చును అన్న అనుమానం కలిగింది. రేడియో అనుభవంతో నేను రాయవలసిన విషయాల పట్టికను ఒకదాన్ని వేసుకున్నాను. దాని ప్రకారం వరుసబెట్టి ఒకే సంగతి చెప్పకుండా మార్చిమార్చి ఎన్నో విషయాలను రాశాను. ఈ సంగతిని ఎంతమంది గమనించారు నాకు తెలియదు. నాకు మాత్రం అది ఒక పెద్ద వెసులుబాటు. నిజానికి అంశాన్ని ఎత్తుకుంటే దాన్ని గురించి వంద పేజీలు అయినా రాయవచ్చు. కానీ రెండు పేజీలలో చెప్పవలసిన దాన్ని కుదించి చెప్పడంలో గొప్పతనముంది. విషయం విస్తరిస్తే విసుగు పుట్టే అవకాశం ఉంది. చెబుతున్న సంగతి ఆసక్తికరంగా ఉండగానే చటుక్కున ఆపేస్తే, దాన్ని గురించే మరొకసారి చెప్పినప్పటికీ పాఠకులు దానికి సిద్ధంగా ఉంటారు.
మొదటి నుంచి చేతనయిన పని రాయడం చదవడం కాబట్టి సాహిత్యం గురించి, పుస్తకాలను గురించి, రచయితలను గురించి రాశాను. నన్ను బాగా ప్రభావానికి గురి చేసిన వారు కొందరైతే, ఏదో రకంగా దగ్గరైన వారు మరికొందరు. మహీధర నళినీమోహన్, పాలగుమ్మి పద్మరాజు, జలాలుద్దీన్ రూమీ, ఎందరో. పద్మరాజుగారి శతజయంతి సందర్భంగా చాలా సభలలో పాల్గొని మాట్లాడాను కూడా కనుక ఆయన గురించి రాయాలనిపించింది. మిత్రులు పైడిమర్రి రామచంద్రరావు గారి సంగతి ప్రపంచానికి తెలియదు. నాలాంటి వాళ్లు మాత్రమే చెప్పాలి. ఆర్.వి.ఆర్. చంద్రశేఖరరావు గారి సంగతి కూడా అంతే. ఇలాగే కొంతమంది గురించి రాస్తే మిత్రులు ధన్యవాదాలు చెప్పారు.
నాకు సినిమాలు చూడడం అంతగా అలవాటు లేదు. కానీ చూచిన ఒకటి రెండు సినిమాలను మాత్రమే చాలా లోతుగా చూడడం అలవాటు అయింది. ఇక నా కొడుకు నేను కలిసి మంచి మంచి సినిమాలు సంపాదించి చూడడం మొదలుపెట్టాము. ఆ క్రమంలోనే దొంగను పట్టండి, ఆగదా క్రిస్టీ రచనలు లాంటి సినిమాలను గురించి రాశాను. ఇక నచ్చిన ఒకటి రెండు హిందీ సినిమాలను గురించి కూడా రాశాను. శశికపూర్ తీసిన ‘జునూన్’ గురించి రాసినప్పుడు సినిమా రంగం మిత్రులు కూడా మెచ్చుకున్నారు. సత్యజిత్ రాయ్ ఎంతో అభిమానించిన వ్యక్తులలో ఒకరు. ఆయన తీసిన షత్రంజ్ కె ఖిలాడి అనే సినిమా నన్ను ఎంతగానో కదిలించింది. ఆ సినిమా గురించి అది సమీక్ష కాదు గాని ఒక పరిచయం లాంటి వ్యాసం రాశాను. తరువాత మిత్రులు ఒకరు కేవలం నా వ్యాసం కారణంగా ఆ సినిమా సంపాదించి చూచానని, అది ఎంతో బాగుందని చెప్పినప్పుడు సంతోషం కలిగింది.
ఈ మధ్యన ఇంటర్నెట్లో ఎన్నో సినిమాలు, సీరియల్స్ చూడడం అలవాటయింది. నెట్ ఫ్లిక్స్‌లో విక్టోరియా మహారాణి గురించి ‘ద క్రౌన్’ అనే సీరియల్ చూచాను. దాన్ని గురించి రాశాను. పెద్దలు అచ్యుతరావుగారు ఆ వ్యాసం చదివి ఫోన్ చేశారు. ఆనాడు వారు ఎనె్నన్నో సంగతులను నాకు కొత్తగా తెలియజేశారు. లోకాభిరామం వ్యాసాలు పెద్దలను కూడా చదివిస్తున్నాయి అన్న సంతృప్తి కలిగింది.
నేను తెలుగు భాష గురించి అందులో నాకు తోచిన కొన్ని వింత విషయాలను గురించి వచ్చాను. ఒకసారి తెలుగు గురించి నేను రాసిన సంగతులను చదివి మిత్రులు శివరావుగారు ఫోన్ చేసి చాలాసేపు చర్చించారు. తెలంగాణ తెలుగును అనుకోకుండానే నా వ్యాసాలలో వాడుకున్నాను. ఉర్దూ గురించి మరింత రాసి ఉండవచ్చునన్న భావన నాలో ఇంకా ఉంది.
ఇక నేను సైన్స్ రాయడంలో ఆశ్చర్యం లేనేలేదు. నాకు చేతనైన ఒకటి రెండు పనులలో అది ముఖ్యమైనది. అదే చేతికర్రగా మారింది. కానీ లోకాభిరామంలో సైన్సు వ్యాసాలు రాయకూడదు. అయినా అందరి చేత సైన్స్ పద్ధతిలో ఆలోచింపజేసే వ్యాసాలు మాత్రం చాలా రాశాను. ప్రజలలో వైజ్ఞానిక దృక్పథం కలిగించడానికి ఇది ఒక పరోక్ష పద్ధతి.
నేను ప్రయాణాలను గురించి రాశాను. పల్లెకు వెళ్లడం గురించి రాశాను. ఢిల్లీ గురించి కూడా రాశాను. యాత్రలో అనుభవం ఒక ఎత్తు. ఆ ప్రదేశాలలో ఎదురయిన అనుభవాలు మరొక ఎత్తు. నేను యాత్రా చరిత్ర పద్ధతిలో మాత్రం రాయలేదు. కలకత్తా గురించి రాసినప్పుడు వచ్చిన ఫీడ్ బ్యాక్ నాకు ఆశ్చర్య కారణమయింది.
మొత్తానికి నేను రాసిన సంగతులను చాలామంది ఆదరిస్తున్నారు. అందరూ మెచ్చుకుంటున్నారు అన్న అపోహ మాత్రం నాకు లేదు. ఒకసారి గుడిసెలు కట్టడం గురించి రాశాను. ఒక మిత్రుడు ఫోన్ చేసి అందులో మరికొన్ని వివరాలను జోడించి ఉండాలని చాలా చెప్పుకు వచ్చాడు. పత్రికలో వ్యాసం ఆ చిన్న పేజీలో అయిపోవాలి. ఎన్నని రాయగలుగుతాము అన్నది ప్రశ్న.
ఒక అంశం గురించి రాసినందుకు ఆక్షేపణ ఉండవచ్చుగానీ, రాయని సంగతి గురించి అడిగితే కష్టం అవుతుంది. మరొకసారి నాకు తెలిసిన ఆర్థిక శాస్త్ర అంశాలను కొన్నింటిని నాకు అర్థమైన పద్ధతిలో రాశాను. దాన్ని కూడా చాలామంది మెచ్చుకున్నారు. మెచ్చుకున్నవారు, మెచ్చుకోనివారు అందరూ నాకు కావాల్సిన వారే. నూనె ఉన్నంతసేపు పురాణం కొనసాగుతుంది అని ఒక మాట ఉంది. అట్లాగే చదివేవారు ఉన్నంతసేపు మాలాంటి వారు కూడా కొనసాగుతూనే ఉంటారు. అట్లాగని అందరి ఓపిక పరీక్షించడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఆ సంగతి నాకు తెలుసు. కనుక మీరంతా నిశ్చింతగా ఉండవచ్చు అని భరోసా ఇస్తున్నాను.