లోకాభిరామం

మలుపులో.. మనసులో మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న ఒక సాహిత్య సభకు వెళ్లాను. వేదికను అలంకరించవలసిన ఐదారుగురు నిజంగా పెద్ద మనుషులు. వయసులో కూడా పెద్దవాళ్లు. ఒకరు తప్ప మిగతావారంతా ముందే వచ్చి కూర్చున్నారు. ఇక హాలులో ప్రేక్షకులుగా వచ్చినవారిలో సగంమంది వేదికమీదకు వెళ్లి మాట్లాడగలిగిన మనుషులే. ఒకప్పుడు సాహిత్య సభలకు నావంటి మామూలు మనుషులు వెళ్లి ఎవరు లో కూర్చుని చేతనయింది విని కాసింత గోలచేసి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు నేను కూడా అక్కడికక్కడ వేదికనెక్కి మాట్లాడుతున్నాను. అంటే మామూలు ప్రేక్షకుడిని కాదన్నమాట. కానీ మరి వెనుక బెంచి కాకుండా మధ్య మరుసలో ఎక్కడో వెళ్లి కూర్చున్నాను. పెద్దవాళ్ళకు దండం పెట్టడం ఒక పద్ధతి. ముందువరుసలో పొత్తూరి వెంకటేశ్వరరావుగారు కనిపించారు. ఆయన మరి అశీతి అంటే ఎనభై దాటిన మనిషి, బహుశా గుర్తుపట్టకపోవచ్చు. అయినా సరే బాధ్యతగా వెళ్లి నమస్కరించాను. పక్కనే రొద్దం ప్రభాకరరావుగారు కూర్చుని ఉన్నారు. ఆయన గౌరవించే పెద్దమనుషులలో ఒకరు. ఆయనతో నాకు గొప్ప పరిచయం ఉండవలసిన అవసరం లేదు. కానీ ఆయన గొప్పతనం నన్ను పలకరించిన తీరులో కనిపిస్తోంది. వారం వారం మీ శీర్షిక చదువుతుంటాను. మీరు చాలా లైలీగా రాస్తారు అన్నారు ఆయన. ఏం చేయాలో అర్థం కాక వినయంగా ఒక నమస్కారం చేసి వెనుకకు వచ్చాను.
లోకాభిరామం పెద్దవాళ్ళను కూడా ఆకర్షించి చదివిస్తున్నది అంటే అది నాకు నిజంగా గర్వకారణం. రావుగారి వంటి పెద్ద మనుషులు చాలామంది లోకాభిరామం గురించి నాతో ముచ్చటించారు. ఒకాయన ఏకంగా నీవు చేస్తున్నది ఎన్‌సైక్లోపీడియా లాంటి రచన, ఎనె్నన్నో విషయాలు రాస్తున్నావు. అటువంటి వాటిని గురించి మరెవరూ రాయరు. కొంతకాలం తరువాత మీ రచనలు అందరికీ చాలా ఉపకారం చేస్తాయి, అన్నారు. నాకు కళ్ళు తిరిగినంత పనయ్యింది. ఈ మధ్యన నిజంగా పెద్దమనిషి మరొకరు గాథాసప్తశతి లేదా విద్యార్థి కల్పతరువులాంటి ఏదో ఒక పెద్ద పుస్తకం పేరు చెప్పి, నా లోకాభిరామం ఆ స్థాయిలో నిలబడుతుంది అని ఆశీర్వదించారు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. లోకాభిరామంలో ఏం రాయాలన్నది పత్రిక వారు నాకే వదిలేశారు. అది నిజంగా నాకు పెద్ద సమస్యగా మారింది. గొప్ప బాధ్యతగా మారింది. బాగా రాయడం ఒక సామాజిక బాధ్యతగా మారింది. వారం వారం విషయం వెతుక్కోవడానికి ఎంత కష్టపడతాను, నాకు తెలుసు.
ఇక శైలి గురించి. అది అందరినీ చదివింపచేసేదిగా ఉండాలి. ఎక్కడో ఒక కుటుంబం పద్ధతి కార్యక్రమానికి వెళ్ళాను. ఏమాత్రం పరిచయం లేని ఒక ఇల్లాలు చొరవగా నా వద్దకు వచ్చి, మీరు బాగా రాస్తారు అని చెప్పింది. అంతటితో ఆగక ఆమె, అవునుకానీ, ఉన్నట్టుండి తెలంగాణ యాసలోకి జారుకుంటారు ఎందుకు? అని కూడా ఆమె అడిగింది. నాకు తోచిన జవాబు చెప్పాను. అది నిజంగా మనసులో నుంచి వచ్చిన జవాబు. అయితే సరే అంటూ ఆమె వెళ్ళిపోయింది.
నేను లోకాభిరామంలో నా గురించి తక్కువ నాకు తెలిసిన విషయాలను గురించి ఎక్కువ రాస్తున్నానని నేను అనుకుంటున్నాను. నాకున్న అనుభవాలు ఈ ప్రపంచంలో మరెవరికీ లేవని, నేను అనుకోవడం లేదు. ముందుగా నాకు నాలుగు మాటలు రాయడం చేతనవుతుంది. పైగా రాసిన మాటలను అచ్చు వేయడానికి పత్రిక వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అంతేగాని నిజంగా రాయదలుచుకున్నవారు. వారు ఎవరైనా ఉంటే నాకంటే బాగా రాయగలరు అన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది.
ఈమధ్యన నాకు ఒక కొత్త అనుభవం ఎదురవుతున్నది. ఆ మధ్యన జరిగిన పుస్తక ప్రదర్శనకు వెళ్ళాను. అక్కడ సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరిగారు కనిపించారు. మామూలు పలకరింపులు జరిగాయి. ఆయన వెంట అలాగే నా వెంట కూడా ఒకరిద్దరు మనుషులు ఉన్నారు. యాదగిరిగారు నన్ను మెచ్చుకుంటు, చిన్నపిల్లవాడిలాగా నవ్వుతా వయ్యా, అన్నారు. అంతకంటే కావలసిందేమిటి? ఆ తరువాత ఆయన ఒక చక్కని ప్రశ్న వేశారు. నీవు గడ్డానికి తెల్లరంగు వేసుకుంటావా? ఆమె అడిగారు. పక్కనున్నవారంతా ఆయన వేసిన జోకు విని గొల్లున నవ్వేరు. అయితే నేను ఈ విషయాన్ని లోకాభిరామంలో రాస్తానని అక్కడ ఎవరో ప్రతిపాదన చేశారు. అవును, పుస్తక ప్రదర్శనలో యాదగిరి నా గురించి ఇలాగ అన్నాడు అని మీ కాలంలో రాయి అని యాదగిరిగారు కూడా అన్నారు.
ఈమధ్యన ఒక పల్లెకు వెళ్ళవలసి వచ్చింది. పల్లె జీవితంలో మామూలుగా దొరకని సదుపాయాలు కొన్ని ఎదురవుతాయి. ఒక ఉదయాన కుర్రకారు అందరూ, నిజానికి వారు మరీ కుర్రకారు ఏం కాదు, అంత మధ్య వయసు వాళ్లే, కలిసి బావిలో ఈదడానికి అని బయలుదేరారు. నన్ను కూడా రమ్మన్నారు. నాకు నిజానికి నడిచి ఆ తరువాత ఈతలు కొట్టి రావాలన్న ఉత్సాహం లేదు. కానీ ఉత్సాహం తెచ్చుకున్నాను. వాళ్లతో పాటు నడిచాను. కనీసం రెండు మూడు మైళ్లు నడిచి ఉంటాము. కొంచెం తక్కువ దూరం ఉందేమో? అక్కడ ఒక చెరువు గట్టు మరో పక్కన వ్యవసాయం బావుంది. అక్కడికి వెళ్లాలంటే గట్టు మీద నుంచి కిందకు దిగాలి. అక్కడ అన్ని తుప్పలు, చెట్లు ఉన్నాయి. కొంచెం లాఘవం గలవాళ్లు ఏదోరకంగా దివ్వగలుగుతారు. ఒకరిద్దరు మాత్రం కొంచెం సందేహించాము. కుర్రవాళ్ళు సాయంగా వస్తామన్నారు. అక్కడ అది కూడా వీలు కాదు. ఎవరి బాధ వాళ్లు పడితేనే దిగగలుగుతాము, అని నేనే ప్రకటించాను. నిలబడి దిగడం కుదరదు అని అర్థమైంది. కూలబడి దేకుతూ ముందుకు సాగి గట్టు దిగాము. ఈదడానికి బావిలోకి దిగిన తరువాత ఆ ఆనందం ముందు అంతకుముందు కలిగిన అసౌకర్యం గుర్తుకు కూడా రాలేదు. నీళ్లు మరీ ఎక్కువ లేవు కానీ ఈదడానికి వీలుగానే ఉన్నాయి. చాలాసేపు ఈదుతూ ఉండిపోయాము. ఈ కాలంలో అందరి దగ్గర ఫోన్ ఉంటుంది. అందులో ఒక కెమెరా ఉంటుంది. ఒక పిల్లవాడు ఫొటోలు తీయసాగాడు. వెంటనే మరొక అబ్బాయి, చిన్నాయన ఈ అనుభవం గురించి తప్పకుండా వ్యాసం రాస్తాడు అని ప్రకటన చేశాడు. అప్పుడు నాకు అవును కదా, అనిపించింది. చిన్నతనంలో ఈదడం అంటే నాకు బోలెడు భయం. వేసవిలో చాలా తొందరగా స్నానం చేసి, నేనిక బావికి రాను అని ప్రకటించేవాడిని. కానీ పెద్దలు వదిలే వాళ్ళు కాదు. మునగ బెండు కట్టి బావిలో ఎత్తి పడేశారు. ఈత వచ్చింది. ఆ తరువాత అందులో సంతోషం తెలిసింది. వేసవి వచ్చిందంటే గంటలపాటు బావుల్లో గడిచేది. ఆ సంగతి గురించి వివరంగా చెప్పడానికి ఈ సందర్భం కాదు. కానీ కాదేదీ కవితకు అనర్హం, పద్ధతిలో లోకాభిరామంలు ఏదైనా రాయవచ్చు అన్న భావం గట్టిగా మిగిలింది.
ఆంధ్రభూమి ఆదివారంలో లోకాభిరామం మొదలై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నది. నాలుగున్నర సంవత్సరాల వ్యాసాలను మూడు సంపుటాలుగా ప్రచురించారు కూడా. ఐదు సంవత్సరాల పాటు సాగిన లోకాభిరామం కారణంగా నాకు బతుకును, అనుభవాలను మరొకసారి నెమరువేసుకునే అవకాశం దొరికింది. ఇది నిజానికి నా వ్యక్తిగతమయిన కాలమ్. దీన్ని పర్సనల్ కాలమ్ అనవచ్చు. పత్రికవారు నాకు ఇటువంటి అవకాశం ఇచ్చి మరీ భరిస్తున్నారంటే, బహుశ నేను రాస్తున్నది అంగీకారయోగ్యంగానే ఉంటున్నదని అర్థమేమో. ఒకటి రెండుసార్లు నా ఛాదస్తాన్ని తగ్గించి పొడిగా వ్యాసాలు రాశాను. వెంటనే ఒకరిద్దరు మిత్రులు, ఈసారి వ్యాసం బాగుండవచ్చు, కానీ అందులో మీరు లేరు అని హెచ్చరించారు. ఒక పుస్తకం గురించి రాస్తే, ఆ పుస్తకం గురించే ఎందుకు, నేనే ఎందుకు రాయడం అన్న ప్రశ్నలకు జవాబు ఉండాలన్నమాట. లేదంటే ఆ వ్యాసాన్ని ఎవరయినా రాయవచ్చు మరి.
ఇక ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు, మూడు సందర్భాలలో నేను పొరపాట్లు చేశాను. మిత్రులు ఒకరిద్దరు ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాదో ధీమతా మపి, అని పెద్దలమాట. నేను ధీమంతుడు కాదు. అందరిలాగే మామూలు మనిషిని కనుక పొరపాట్లు చేయడానికి అన్ని అవకాశాలు నాకు ఉన్నాయి. చేసిన తప్పును గుర్తుంచుకుని సరిదిద్దుకోగలిగితే అంతకంటే ఆనందం లేదు. పొరపాట్లు ఎత్తి చూపించిన వారిని గురించి ఎక్కువగా ఆలోచించనవసరం లేదు. ఉపకారం చేసినవారు అనుకుంటే చాలు.
లోకాభిరామంలో నేను కొన్నిసార్లు నాకు అనుమానంగా ఉన్న విషయాలను కూడా ప్రస్తావించాను. వౌలానా జలాలుద్దీన్ రూమీ గురించి రాశాను. అనువాదాలు వచ్చాయా అనే ప్రశ్న అడిగాను. పెద్దలు దివంగత మిత్రులు సదాశివగారి అబ్బాయి వెంటనే తండ్రిగారి రచనలను గురించి దృష్టికి తెచ్చాడు. ఒక సందర్భంలో నేను చాణక్యుని గురించి పాత పుస్తకాలను గుర్తు చేసుకున్నాను. నాతో ముఖ పరిచయం కూడా లేని ఒక పుస్తక ప్రియుడు కృష్ణాజిల్లా నుంచి నాకు రెండు పుస్తకాలు నేరుగా పంపించాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన అడిగిన ఒక పుస్తకాన్ని నేను కూడా పంపినట్లు గుర్తు.
కాలమ్ రాయడం అంటే అందులో అన్ని విషయాలు ఉన్నాయి అని ఎంతమంది అనుకుంటారో తెలియదు. రాసేవారికి అది తప్ప ఇంకిక పని తెలియదు. చదివేవారికి హాయిగా చదవడం తప్ప రచయితలు పడే బాధలను గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ నిజంగా పత్రిక అంత అందంగా తయారయి తమ చేతిలోకి వచ్చింది అంటే దాని వెనుక ఎంతమంది కృషి ఉంది అన్న సంగతిని అందరూ గమనిస్తే ఎంతో బాగుండును.

-కె.బి.గోపాలం