లోకాభిరామం
గాలి కబుర్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గాలి కంటికి కనిపించదు. ఒకచోట స్థిరంగా నిలబడదు. కనుక నిలకడ లేని మాటలను గాలి కబుర్లు అంటారు. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది మాత్రం గాలిని గురించిన కబుర్లు. బతుకుకు ఆధారమైన గాలిని గురించిన కబుర్లు. ఇవి అసలు సిసలు సైన్సు మాటలు. చుట్టూ ఉన్న గాలిలో ఏ రసాయనం ఎక్కువ ఉంది అని ప్రశ్న వేసుకున్నాం. జవాబు కొరకు వెతుకుతున్నాం.
బహుశా చాలామంది కార్బన్ డై ఆక్సైడ్ అని చెపుతారేమో? మొదటి అభ్యంతరం అది మూలకం కాదు. పైగా అది వాతావరణంలో 0.001 శాతం మాత్రమే ఉంటుంది. అయినా సరే మనలందర్నీ కష్టపెడుతుందని దానికి బోలెడంత చెడ్డపేరు. ఆ పేరునుబట్టి అది గాలినిండా నిండి మనలను బాధలకు గురి చేస్తున్నదని అనుకుంటాము. అందులో తప్పులేదు. మనకు శరీరంలో ఆ వాయువు అవసరం లేదు కాబట్టి దాన్ని మనం వదిలేస్తాము. మొక్కలు దాన్ని వాడుకుంటాయి. ఈ మొక్కలు చాలా విచిత్రమయినవి. మనకు పనికిరాని చాలా పదార్థాలను గ్రహించుకుని పనికి వచ్చే వాటిని తయారుచేసి మనకు అందిస్తాయి. మళ్ళీ కార్బన్ డై ఆక్సైడ్ వేపు వస్తే అది గాలిలో మూడవ స్థానంలో ఉండే వాయువు కానే కాదు. నీటి ఆవిరికి కూడా ఆ స్థానం అందదు. నీటి ఆవిరి నిజానికి ఏ చోటా ఏ సమయంలోనూ ఒకే రకంగా ఉండదు. అది మారుతూనే ఉంటుంది.
జవాబు హైడ్రోజన్ అని చెప్పే వాళ్లు కూడా పప్పులో అంటే తప్పులో కాలు వేసినట్టే లెక్క. ఈ విశ్వంలో అంతటా హైడ్రోజన్ వ్యాపించి ఉంది. కనుక మన భూమి మీద కూడా ఉంది. ఉండి అది ఏం చేస్తున్నదన్న సంగతి మాత్రం మనకింకా అర్థంకాలేదు. సూర్యునిలోను, శని గ్రహం మీద మరెక్కడో నక్షత్రాలు పుట్టే నెబ్యులాలలోను బోలెడంత హైడ్రోజన్ ఉంది. ఆ తరువాత మరో బోలెడంత హీలియం ఉంది. మన దగ్గర మాత్రం అవి అంత ఎక్కువగా లేవు. మన దగ్గర హైడ్రోజన్ ఉంటేగింటే ఆక్సిజన్‌తో కలిసి నీళ్లుగాను, కార్బన్‌తో కలిసి మీథేన్‌గాను ఉండాలి తప్ప ఒక్క హైడ్రోజన్ ఎందుకూ పనికిరాదు. సూర్యునిలో నుంచి బంతులు విసిరినట్టు ముద్దలుగా ఈ వాయువు బయటపడుతుంది. అది అంతోకొంతో మనదాకా చేరుతుంది. అంతేతప్ప అది ఎక్కువగా లేదు, మనకు అవసరం రాదు.
ఇంతకూ గాలిలోని మూడవ మూలకం ఏమిటో తెలుసా? దాని పేరు ఆర్గాన్. లైబ్ బల్బులలో దీన్ని నింపుతారు. అంటే మనం దాన్ని ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాము. ఏమనకుండా తినే పద్ధతిలో, ఏమనకుండా వాడుకుంటున్నాము.
ఆర్గాన్ వాయువును విలియమ్ రాన్‌సే అనే పరిశోధకుడు కనుగొన్నాడు. ఆయన నియాన్, క్రిప్టాన్, గ్జెనాన్ అనే వాయువులను కూడా కనుగొన్నాడు. పరిశోధనలకు ఫలితంగా నొబేల్ బహుమానం కూడా అందుకున్నాడు. ఆయా వాయువులలో నుంచి విద్యుత్తును పంపిస్తే అవి అందంగా రంగులతో వెలుగుతాయని కూడా ఆయనే వివరించాడు. బజారులో ప్రకటనల పేరున గొట్టాలు అక్షరాలు లేదా బొమ్మలుగా మార్చి వెలిగినట్టు ఏర్పాటు చేసిన చోట ఆ గొట్టాల్లో ఆర్గాన్, నియాన్ లాంటి వాయువులుంటాయి. ఒకప్పుడు నియాన్ సైన్ అనే మాట అందరికీ తెలిసి ఉండేది. ఇప్పటికి కూడా లాస్‌వేగస్ లేదా మరేదో నగరాలను గురించి మాట రాగానే టివిలో నాట్యం చేసే రంగు ప్రకటనలను చూపిస్తుంటారు. ఆ వెలుగుల వెనుక ఉండేది ఈ వాయువులే.
వెలిగే వాయువుల ఆలోచన చాలా సులభం. వాయువులోకి మంచి వోల్టేజి గల కరెంటును పంపిస్తే అణువులు ఉద్రేకానికి గురవుతాయి. ఇది జోకు ఎంత మాత్రం కాదు. వాయువులకు కూడా ఆ ఉద్రేకం ఇష్టం లేదు. తప్పని పరిస్థితుల్లో పైస్థాయికి చేరిన వాయువులు క్షణం లోపల మళ్లీ తమ చోటికి చేరుకుంటాయి. ఆ సమయంలో వాయువులను బట్టి ఒక్కో రకం వెలుగు కణాలు వెదజల్లబడతాయి.
ఇదంతా తెలిసి వంద సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇవాళ రామ్‌సే పేరును నియాన్ లైట్‌లను పట్టించుకోవడం బాగా తగ్గిపోయింది.
ఇంగ్లాండ్‌లోనే జోసెఫ్ ప్రీస్ట్‌లీ అనే మతాచార్యుడు అనుకోకుండా బెంజమిన్ ఫ్రాంక్లిన్‌ను కలిశాడు. ఈ రెండవ మనిషి అనునిత్యం సైన్స్ ఆలోచనలతో కుస్తీ పట్టే రకం. ఆ లక్షణం ప్రీస్ట్‌లీకి అంటువ్యాధిలాగ సంక్రమించింది. ఆయన పరిశోధనలు జరిపి మొట్టమొదట కార్బన్ డై ఆక్సైడ్‌ను కనుగొన్నాడు. అది మంటలు ఆర్పడానికి పనికి వస్తుందని కనుగొన్నాడు. తరువాత వాయువును గాలిలో కలిపితే చక్కని పానీయం పుడుతుందని తెలుసుకున్నాడు. గోళీ సోడా అంటే ఈ పద్ధతితో తయారుచేసిన కార్బొనేటెడ్ వాయువు మాత్రమే. ప్రీస్ట్‌లీ, రామ్‌సే ఇద్దరూ కలిసి లాస్‌వేగస్ వంటి నైట్ క్లబ్బుల ప్రాభవానికి ప్రచారం పెంచారు. ప్రీస్ట్‌లీ నైట్రస్ ఆక్సైడ్ అనే వాయువును కూడా కనుగొన్నాడు. దీన్ని పీల్చిన వారు అనవసరంగానే నవ్వుతారట. అందుకే దానికి నవ్వుల గ్యాస్ అని పేరు.
ఇక 1774లో ప్రీస్ట్‌లీ మరో తెలివిగల ప్రయోగం చేశాడు. ఒక గాజు జాడీలో పెరుగుతున్న ఒక మొక్కను పెట్టి అందులో వెలుగుతున్న కొవ్వొత్ని పెట్టి మూత మూశాడు. మొక్క వేళ్లకు కొంతపాటి నీరు అందుతున్నది. ఇక ఆక్సిజన్ లేక మంట ఆరిపోతుందని వేరుగా చెప్పనవసరం లేదు. కానీ మళ్లీ వెలిగిస్తే అది చప్పున వెలిగింది. అంటే మొక్క నుంచి ఆక్సిజన్ పుట్టిందని అర్థం. ఈ రకంగా ప్రీస్ట్‌లీ కిరణజన్య సంయోగ క్రియను మరొకవేపు ఆక్సిజన్ వాయువును కనుగొన్నాడు. ఆ కాలంలో ఈ రకమయిన కనుగొనడాలు ఎడాపెడా జరుగుతూనే ఉండేవి.
ప్రీస్ట్‌లీ కనుగొన్నందుకు ఆక్సిజన్ కొత్తగా రాలేదు. అది అప్పటికే కావలసినంత ఉంది. ఈ మనిషిని ఇష్టపడని వాళ్లు కొంతమంది నిప్పు పెడితే ఆక్సిజన్ తోడయి ఆయన ఇంటిని నేలమట్టం చేసింది. అతను కుటుంబాన్ని వెంట పెట్టుకుని మరెక్కడికో వలస వెళ్లిపోయాడు. ఆయన మరణించిన 48 సంవత్సరాల తరువాత రామ్‌సే పుట్టాడు.
విలియమ్ రామ్‌సే కాలానికి ఇంకా కనుక్కోవలసిన వాయువులు మరీ అంతగా మిగిలి ఉండలేదు. అప్పటికి సాంకేతిక శాస్త్రం బాగా పెరిగింది. స్పెక్రోస్కోప్ అనే సాధనం సాయంతో కొత్త పదార్థాలను నిక్కచ్చిగా తెలుసుకోవడం మొదలయింది. అలాంటిదే ఒక సూచన ఒకానొక పరీక్షలో ఎదురయింది. దగ్గరగా ఉన్న నక్షత్రం ఒకదాని మీద ఒక కొత్త మూలక వాయువు ఉందని తెలిసింది. దానికి హీలియం అని పేరు పెట్టారు. చిత్రంగా ఆ వాయువు భూ వాతావరణంలో మాత్రం లేదు. విశ్వంలో ఎక్కువగా ఉండే రెండవ వాయువు మాత్రం అదే. అది భూమి మీద కూడా కొంత ఉందని రామ్‌సే కనుగొన్నాడు.
రామ్‌సే చాలా విషయాలను కనుగొన్నాడు. ఇవాళటి ప్రపంచంలోకి వచ్చి చూస్తే ఆయన పరిశోధనల ఫలితంగా వచ్చిన కొత్త సంగతులను చూచి ఏమనేవాడో తెలియదు. నియాన్ లైట్లు తగ్గిపోయాయి. కానీ వాటి తీరేవేరు. నిజానికి నారింజ, ఎరుపు రంగు లైట్లలో మాత్రమే నియాన్ వాయువు ఉంటుంది. మిగతా రంగుల గొట్టాలలో ఆర్గాన్ ఉంటుంది. దానికి కొంచెం పాదరసం కూడా కలిసి ఉంటుంది.
ఆర్గాన్ మన నేలలో ఉండదు. మరే గ్రహం మీదా కూడా ఆ వాయువు లేదు. సౌర మండలంలోని నాలుగు పెద్ద గ్రహాలలోను హైడ్రోజన్ సమ్మేళనాలు, కొంతవరకు హీలియం ఉన్నాయి. మన పక్కనే ఉండే శుక్రగ్రహంలో కార్బన్ డై ఆక్సైడ్ నిండి ఉంది. అంగారక గ్రహం మీద ఆ వాయువే పలుచగా ఉంది.
వాయు పురాణం చెపుతూ పోతే ఎన్నో చిత్ర విచిత్రమయిన విశేషాలు అర్థమవుతాయి. మన గ్రహం మీద గాలులు నిండి ఉన్నాయి అనుకున్నాము. దానిపేరే వాతావరణం. అయితే ఈ వాతావరణం పారదర్శకంగా ఉంది. అంటే దూరం నుంచి చూచే వారికి భూగోళం విశేషాలు అడ్డు లేకుండా శుభ్రంగా కనిపిస్తాయని అర్థం. చిత్రంగా నీటి ఆవిరి మబ్బులుగా మారుతుంది. ఆ మబ్బులు అడ్డుగా వస్తాయి. అయితే మబ్బులంటే వాయువులు కాదు. నీటి చుక్కలు ఒకచోట చేరి మేఘాలు పుడతాయి. నిజానికి నీరు పారదర్శకమయినది. కానీ కొన్ని సందర్భాలలో ఆ లక్షణం తగ్గిపోతుంది. పొగ మంచు నిండిన నాడు అంతా మసకబడిపోతుంది. కనుక, ఆ పొగమంచు మిగతా గాలి కంటే దట్టంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. మేఘాలు అంత ఎత్తున తేలడం అప్పుడొక విచిత్రంగా కనిపిస్తుంది. కానీ నిజానికి నీటి ఆవిరి వాతావరణంలోని మిగతా అన్ని వాయువులకన్నా తేలికగా ఉంటుంది. గాలి పొడి అయిన కొద్దీ తేమగాలి కన్నా దట్టంగా ఉంటుంది. అందుకే పొగమంచు నిండిన వాతావరణంలో విమానాలు బయలుదేరడానికి ఎక్కువ వేగం, ఎక్కువ నిడివిగల రన్‌వేలు అవసరమవుతాయి. ఇదంతా బాగా ఆలోచిస్తే గానీ అర్థంకాని పరిస్థితి.
వాతావరణం పారదర్శకంగా ఉన్నందుకే ఆర్గాన్ వాయువు చాలాకాలంపాటు మనిషి ఆలోచనకు కూడా తోచలేదు. మరింత పెంచకుండా మన వాయు పురాణాన్ని ఇక్కడ ఆపేద్దాము.