లోకాభిరామం

ఏమి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయననె్నవరినో ఒక పెద్ద మనిషి పట్టుకోని, నీకు ఇంత తెలివి ఎక్కడిది, అది అడిగినారంట. అందులో రహస్యం ఏముందీ? తెలియని సంగతులన్నీ ఎవరినో అడిగి తెలుసుకున్నాను, అని తేలిగ్గా కొట్టిపడేసి అమాయికంగ చూసినాడు ఆ పెద్దాయన. నేను కొంతకాలంగ, అంటే కొన్ని సంవత్సరాలుగ ఒక నియమం పెట్టుకుని బతుకుతున్నాను. వీలయినంత వరకు నేను ఎవరినీ ప్రశ్నలు అడగను. ఎవరయినా ఏదయినా చెపితే వింటాను. చెప్పని సంగతులను గురించి పట్టించుకోను. ఈ సంగతి గురించి ఆలోచిస్తుంటే నాకు గతంలో అంటే బడిలో చదువుతున్నప్పుడు చేసిన ఒక పని గుర్తుకు వచ్చింది. నల్లబల్ల మీద వాట్, క్యా, ఏమి, ఉరుదూలో క్యా, ఎన్న, ఏను లాంటి మాటలు వరుసబెట్టి రాసి మధ్యన ఒక పెద్ద ప్రశ్న గుర్తు వేశాను. ఎందుకు, ఏమి సందర్భము అన్నవి గుర్తుకు రావడంలేదు. సంస్కృతం కిం? కూడ రాసే ఉంటాను. అప్పటికి జెర్మన్ తెలియదు. లేకుంటే వాస్ అని రాసి ఉండేవాడిని. నిజం! జెర్మన్‌లో వాస్ అంటే ఏమి అని అర్థం! ఇంగ్లిషులో అయిదు డబ్ల్యూలు ఒక ఎచ్ అంటారు. ఆ ప్రశ్న మాటలు మీకు తెలియనివి ఏమీ కావు.
మాకు బడిలోగానీ, కాలేజీలోగాని ఇంగ్లీషు వ్యాకరణం అంత పట్టింపుగా చెప్పిన గుర్తులేదు. ఇప్పటికయినా ఆ లోతుపాతులు తెలియవు అదే పనిగా చదివినందుకు రూఢికొద్దీ వాక్య నిర్మాణం తెలిసింది, అనుకుంటున్నాను. జెర్మన్ క్లాసులో సత్యనారాయణ మేష్టారు ప్రశ్నల వర్గీకరణ గురించి చెప్పారు. ఒక రకం ప్రశ్నలకు జవాబు ఖాళీలు పూరింపుము పద్ధతిలో ఉంటాయి. ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు అన్నవి ఈ రకం కిందకు వస్తాయి. వీటికి సూటిగా ఒక్కమాటలో జవాబు చెప్పవచ్చు. ఎట్లా అని అడిగితే ఆ పద్ధతిలో ఒక మాట జవాబు కుదరదు వివరణ అవసరం. ఇక ప్రశ్నలకు ప్రశ్న పరమ ప్రశ్న ‘ఎందుకు?’ ఈ ప్రశ్నకు చాలాసార్లు జవాబు అందదేమో కూడా. కూరగాయలు కొనే సందర్భంలో ‘ఎట్ల ఇచ్చినవు?’ అని అడగడం విన్నాను. ఎట్ల ఏమిటి, తూని, తీసి, సంచిలో వేసి, అని అనుకున్నాను. ఇంగ్లీషులో హౌ అని ప్రశ్న ఉంది. దాన్ని కొంచెం పొడిగించి ‘హౌమచ్’ అంటే ‘ఎంత’ అవుతుంది. మనం టైం కూడా ఎంత అయింది అని అడుగుతాము. ఈ మధ్యన రెండు పుస్తకాలు చూచాను అంటే ఇంకా వివరంగా చదవలేదని గదా అర్థం. రెండింటికి పేరు ఒకటే. ‘వాట్ ఇఫ్?’ అని. ఒకవేళ ఇలా జరిగితే అని మనం అర్థం చేసుకోవాలి. మొదటి పుస్తకంలో అర్థం లేనివి అనిపించే ప్రశ్నలకు శాస్తబ్రద్ధమైన జవాబులు ఉన్నాయి. ‘ఒక ఊళ్లో, లేదా దేశంలోని వాళ్లంతా ఎత్తులకు ఎక్కి అందరూ ఒకేసారి దూకితే ఏమి జరుగుతుంది, అని ఆ పుస్తకంలోని ఒక ప్రశ్న! చాంతాడంత జవాబు ఉంది. నాకు మాత్రం, ‘ఏమీ జరగదు’ అని అర్థమయింది. ఇక రెండవ పుస్తకంలో సాంఘిక పరిస్థితుల గురించిన చర్చలు ఉన్నాయి. చదివేవారి మెదడుకు మేత వేసేవిగా ఉన్నాయి.
ఊరికే, అంటే ఊరికి కాదు, ఉట్టిగనే, అంటే ఉట్టి గురించి కాదు, ఉత్తుత్తిగనే ప్రశ్న అడిగితేనే కొత్త సంగతులు తెలుస్తయి. లేదా మన తెలివితక్కువతనం బయటపడుతుంది. ఇక ఆలోచించి, ప్రయత్నించి ప్రశ్న అడిగితే ఏమవుతుంది? ఏమో, నేను ప్రశ్నలు అడగను కద! మీరు ఆలోచించి అడిగి చూడండి.
అన్నట్టు సంస్కృతంలో ‘కిం’ అంటే తెలుగులో ‘ఏమి’ అని అర్థం వచ్చే పరిస్థితి గద! ఆ పరిస్థితి ఏదయితే ఉందో, అటువంటి పరిస్థితి వల్ల నాకు ఒక సంగతి అర్థమయింది. ‘ఎన్ని అడిగినా అతను కిమ్మనలేదు!’ అంటారు మనవాళ్లు. ఇనే్నళ్లూ నేను ఏమిటిది అనుకుంటూ, అడగకుండా ఉన్నాను. అతను ‘ఏమి’ అనలేదు అని గదా అర్థం! ఇక్కడ మరొక పరిస్థితి. విషయం తెలియడానికి ప్రశే్న అడగనవసరం లేదు! ఇతి.
సంస్కృతం గాలి వీస్తున్నందుకు నాకు ఒకటి రెండు సంగతులు గుర్తుకు వస్తున్నాయి. అక్కడెక్కడో కేరళలో ఒక ఊళ్లో అందరు సంస్కృతంలో మాట్లాడుకుంరట. వెనకకు పిల్లలు కూడా సంస్కృతంలో మాట్లాడేవారు, అంతేకాదు, మాత్రాఛందంలో కవితాత్మకంగా మాట్లాడేవారు అని చెప్పే వృత్తాంతం ఒకటి గుర్తుకు వచ్చింది. అంటే అప్పట్లో నేను పక్కనే ఉండి, ఆ సంఘటన చూచినట్లు కాదు గాక కాదు. ఎక్కడో విన్నాను. లేదా చదివాను. ఒక చిన్న పాప నడిచిపోతున్నది. ఒక తాతగారు ఎదురొచ్చారు. ‘కావా బాలా?’ (ఎవరివి పాపా) అన్నారు. ‘కాంచన మాలా?’ అన్నది పాప. ‘‘కస్యాః పుత్రీ, అడిగారు తాతగారు. ఎవరి కూతురివి, అవటానీ! పాప మళ్లీ ఛందం కుదిరే తీరులో ‘కనకలవాయా’ అన్నది. ముసలతనికి బుర్ర తిరిగి ఉంటుంది. ‘కాః పఠయది!’ (ఏం చదువుతున్నావు?) అని అడిగాడు. పాప తడుముకోకుండా ‘కాభాగాఘా’ అన్నది. అదండీ సంగతి గుణింత రాదుగా, పాపకు ఛందస్సు అందం తెలుసును.
ఒకావిడ తలమీద కుండ పెట్టుకుని పోతున్నది. ‘్భడే జలంవా, తక్రంవా నీరోమోరో వధాంగనా’ అడిగాడు ఆకతాయి. జలం అంటే నీరు, తక్రం అంటే మీరు అంటే మజ్జిగ. ఇవి సంస్కృతంలో ఎట్ల కుదిరినయి. ఆ భడవ, అమ్మాయి నీరోమ, ఊరో ‘వెంట్రుకలు లేని తొడలు గలదానా!’ అన్నాడట. అదండీ సంగతి. పాపము శమించుగాక. కంటకస్యపా ముల్లుస్యాత్ గురించి చెప్పను గాక చెప్పను.
అక్కడికి వెళ్లాను. ఎక్కడికి అని అడగకండి. అక్కడ రెండు కొత్త పుస్తకాలు బల్ల మీద ఉన్నయి. ఏమి పుస్తకాలు అని అడగకండి. ఆ పుస్తకాలు అక్కడ ఎవరికీ పట్టవు అని నాకు తెలుసు. ఎందుకు అనకండి. మొత్తానికి ఆ పుస్తకాలు నాతో వచ్చినవి. అవి రెండూనూ ఉపనిషత్తుల గురించిన వ్యాఖ్యానాలు. పుస్తకం చేతికి అందితే అర్థం అయినా కాకున్నా చదవడం నా పద్ధతి. అందుకే చదవడం మొదలుపెట్టాను. ‘ఈశావాస్యం ఇదం సర్వం. యత్కించ జగత్యాం జగత్’ అంటూ ఒక శ్లోకం. జగత్తు మొత్తంలో అధికారముగల వాడగు ఈశుడు వ్యాపించియున్నాడు. బాగుంది. ‘తేన త్యేక్తేన భుంజీ’ ఈ ప్రపంచంలోని వస్తువులను అన్నింటినీ త్యజించినట్లయితే నీవు రక్షింపబడుదువు. ఇదీ బాగుంది. ‘మా గృధ’. అనవసరంగా దేని కొరకూ అర్రులు చాచవద్దు. ఇది అంతకన్నా బాగుంది. కస్య స్విద్ధనం అనే ప్రశ్నతో శ్లోకం పూర్తి అయింది. ఆ ధనం ఎవరిదని? అని అడుగుతున్నది ఉపనిషత్తు! ఎంత బాగుంది కదూ?
కంచెర్ల గోపన్న అనే భద్రాచల రామదాసుకు జెయిలు బాధలు పడలేక బాగా విసుగు పుట్టింది. కనుక కోపం కూడా పుట్టింది. మీకంతా నగలు చేయించానయ్యా, అని లెక్క చెపుతూ, చివరకు తిక్కరేగి ‘ఎవడబ్బ సొమ్మని, కులుకుచు తిరిగేవు రామచంద్రా? అంటూ ప్రశ్న అడిగాడు. అంతటితో ఆగకుండా ‘మీ అయ్య పంపించాడా, మామ పంపించాడా అంటూ రెట్టించాడు కూడా. తాను తింటే తప్పుగానీ, తెచ్చి దేవునికి పెట్టినా, జెయిల్లో వేసి శిక్షిస్తే కోపం రాదూ? కనుక ఆ ప్రశ్నకు ఎంతో ఔచిత్యం, అర్థం ఉంటుంది. త్యాగరాజస్వామి వారి రచనలను జాగ్రత్తగా పరిశీలిస్తే, అందుట్లో సగానికి సగం ప్రశ్నలతో మొదలవుతాయి. ‘దుడుకుగల నన్ను ఏ దొర కొడుకు బ్రోచురా!’ అంటుంది పంచరత్నాలలో ఒకటి. ‘నను పాలింపగ నడచి వచ్చితివా?’ ‘ఏమానతిచ్చివొ, ఏమెంచినావో, ఎవరురా నిను వినా గతి నాకు, ఏమి చేసితేనేమి’ ‘ఎన్నని చెప్పాలి? అక్కడి నుంచి భావం కొంచెం మారితే ‘ఇంతనుచు వర్ణింపతరమా? ఇలలో ప్రణతార్తిహరుడనుచు పేరెవరిడిరి?’ అనే తీరు మరొక రకంగా ఉంటుంది. త్యాగయ్యకు కూడా కోపం వచ్చింది. ‘ఎవరిచ్చిరిరా శరచాపములు?’ ఎవడ్రా నీకు బాణం, అంబులు ఇచ్చింది?’ అంటూ ‘రా’ అని నిలదీస్తాడు. అంతట్లోనే తగ్గిపోయి ‘ఎందుకో నీ మనసు కరుగదు? రామా, నీవాదుకొందువో? హరి నేనెందు వెదుకుదురా?’ అనే భావంలోకి మెత్తగా జారుకుంటాడు అయ్యవారు. త్యాగరాజస్వామి ప్రశ్న కీర్తనలన్నీ పోగుచేసి వాటిలోని భావం ప్రకారం వర్గీకరించాలి. అప్పుడు వాటిలో వాడిన రాగాలు, స్వర సంయోజనాలను విశే్లషించాలి. ఈ పని ఇప్పటికే పెద్దలు చేసి ఉంటారు. ఆ వివరాలు తెలిస్తే మరింత ఆనందం కలుగుతుందని నాకుగా నాకు తోచింది. ‘ఎన్నాళ్లు ఊరకె ఉందువో చూతాము, ఎవరు అడిగేవారు లేరా? అన్న కృతి శుభపండువరాళిలో ఉంది. అందులో దుఃఖం పలుకుతుంది అంటారు. అందుకే శివపంతువరాళి అంటారు. ‘యోచనా? కమలలోచనా? ననుబ్రోవ?’ ఎంత బాగుందో.
అన్నట్టు మీలో చాలామంది వాట్సాప్ వాడుతుంటారనుకుంటాను. ఆప్ అంటే అప్లికేషన్. అంటే కంప్యూటర్‌ను వాడడానికి ఒక మార్గం. లోకాభిరామం ఆప్ పెట్టి వారం వారం అందిస్తే, మరింత వీలుగా చదువుకుంటారేమో? ఆలోచన వచ్చిందా? ఎందుకు? అంత గోల? వాట్సాప్ ద్వారా అందరూ ‘వైరల్’ చేస్తే పోతుంది గదా! వైరల్ అనే మాటలో ఒక నెగేటివ్ భావం ఉంది కనుక ఆ పద్ధతి వద్దు. ఇంతకూ వాట్సాప్ అంటే ‘ఏం జరుగుతున్నది?’ అని పలకరించినట్లు. అది ముచ్చట.
దూరంగా ఒక పాట వినిపిస్తున్నది. జాగ్రత్తగా వింటే అందులోని మాటలు ఈ రకంగా సాగుతున్నాయి. ‘దునియా బనానెవాలే, క్యా తేరె మన్‌మే సమారుూ? కాహేకో దునియా బనారుూ?’ మళ్లీ ప్రశ్నలు. ఏకంగా దేవునికి ప్రశ్నలు. ‘ప్రపంచాన్ని తయారుచేసే ఆయనా, నీ మనసులో ఏమి తోచింది? ఎందుకని ప్రపంచాన్ని తయారుచేశావు?’ అని అడుగుతున్నాడు. అడుగుతున్నది కవిగారా? గాయకుడా? లేక సినిమాలో పాత్రగాడా? ఎవరయినా ప్రపంచంలో అడిగి ఉన్నారని అర్థం. అందుకే ప్రశ్న!
ప్రసిద్ధ కవి మిర్జాగాలిబ్ కవితతో ప్రశ్నల పరంపర ముగిద్దాము. ‘నీ తీరు మరీ హద్దులు మీరుతున్నది. ప్రియురాలా? ఎప్పటివరకిలా?’ అంటాడు కవి మొదటి పాదంలో. ‘ఎద సొదను నేను వినిపించుచుంటి. కడకు నీవేమో ‘ఏమదీ?’ యనగ వింటి’ ఇది రెండవ పాదానికి తెలుగు రూపం నేనిచ్చినది. అంతా విని ఆమె ‘క్యా?’ అన్నదన్నమాట. అదిగదా ప్రశ్నల తీరు!
ప్రశ్నతో తెలియును పలు విశేషంబులు. ప్రశ్నతోడనే కలుగును ప్రతిభగూడ. ప్రశ్నింపకుండగనే బతికెదనన్నచో.. తరువాతి పాదం ఎవరయినా చెప్పండి ప్లీజ్!

-కె.బి.గోపాలం