లోకాభిరామం

సొమ్మాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకాయన ఆసుపత్రిలో అనారోగ్యంతో పడుకుని ఉన్నాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. ఆ ఆసుపత్రిలో ఆయన చాలా రోజులుగా ఉన్నాడు. ఒకనాడు ఒక వింత విషయం తెలిసింది. కోర్టు కేసు కారణంగానో మరొక రకంగానో ఆయనకు చాలా బోలెడు డబ్బు, ఆస్తి వచ్చాయని తెలిసింది. ఆ సంగతి ఆయనగారికి చెప్పాలి. ముందే అనారోగ్యంగా ఉన్నాడు. ఏమయిపోతాడో అని, ఆయనకు కావలసిన వారంతా మల్లగుల్లాలు పడుతున్నారు. అంతకాలమూ ఆయనకు సేవ చేస్తున్న కుర్ర డాక్టరు అటుగా వచ్చాడు. ఏమిటి సంగతి అని అడిగాడు. వాళ్లు ఉన్న సంగతి దాచకుండా చెప్పారు. ఓస్, దానిదేముంది? డాక్టర్లము గదా? చావు గురించి కూడా చల్లగా చెప్పడం మాకు చాతవును. నేను చెపుతా లెండి’ అన్నాడు. మామూలుగానే పెద్దాయన గదిలోకి వెళ్లాడు. మామూలుగానే మాటలు సాగించాడు. మధ్యలో ఒక మాటగా ‘సర్! అనుకోకుండా మీకు బోలెడు డబ్బులు వచ్చాయనుకోండి! ఏం చేస్తారు?’ అని అడిగాడు. ఆ మనిషి ‘పోనీవయ్యా! అర్థం లేని మాటలు. నాకు డబ్బులు ఎవరిస్తారు? ఎందుకిస్తారు?’ అన్నాడు. ‘నిజంగానే వచ్చాయనుకోండి, ఏం చేస్తారు చెప్పండి’ అని కుర్రడాక్టరు మరీ అడిగాడు. ‘సగం నీకు ఇస్తానయ్యా!’ అన్నాడు పెద్ద మనిషి. కుర్ర డాక్టరు కళ్లు తిరిగి కింద పడిపోయాడు!
ధనమూలం ఇదం జగత్ మొదలు, డబ్బుల గురించి ఎనె్నన్ని మాటలు ఉన్నాయని! నాకెప్పుడూ అనుమానాలు వస్తుంటాయని చెపుతుంటారు గదా! ఆ వరుస కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యన నా పిల్లలతో ‘మనకు డబ్బులు నిర్వహించుకోవడం తెలియదు’ అన్నాను. నాకు అని అనవలసింది. ఒకసారి జరిగితే ప్రమాదం. రెండవసారి జరిగితే కాకతాళీయం. అదే పని మూడవసారి జరిగితే అలవాటు అని ఒక మాట ఉంది. ఈ మాట ప్రకారం చూస్తే, పెద్ద మొత్తం డబ్బు పోగొట్టుకోవడం నాకు అలవాటయినట్టుంది. పెద్ద మొత్తం అంటే ఎంత పెద్ద మొత్తం? నా వంటి బీద ప్రాణికి పెద్ద మొత్తం, మరొకరికి మామూలు మొత్తం అనిపించవచ్చు. ఆ సంగతి నాకు తెలుసు. ఒక పెద్ద మనిషి మాట కొద్దీ, డబ్బు ఒకరికి ఇచ్చాను. అందరికీ నచ్చే, ముఖ్యంగా నాకు నచ్చే మంచి పని చేస్తాను. అంటే యిచ్చాను. ఆ తరువాతి కథ చెప్పను!
ఈ ప్రపంచంలో కొంతమంది తెలివిగా డబ్బును పెంచుకుంటూ పోతారు. కొంతమంది పంచుకుంటూ పోతారు. ఎందుకు, అన్నది నా అనుమానం. మనిషి అవసరానికి, తగిన డబ్బు అందుతుంది. కావాలనుకున్నంత డబ్బు అందుతుంది. అట్లా అందరికీ అందదు. అందరూ కనీస అవసరాలు కావాలనుకుంటారు. ఆపైన మరేదో కావాలి అనుకుంటారు. మంచివారు, అనుకున్న వారి అవసరాలు తీరవు. భడవలకు బోలెడు డబ్బు వస్తుంది. ఇదంతా గమనించడమే ఆర్థిక శాస్త్రం అట! నేను డబ్బులు అవసరం లేకుండా బతికే పద్ధతి నేర్చుకున్నా అని భారీ ఎత్తున చెప్పేస్తుంటాను. అవును మరి, మా సివంగి తెచ్చి పెడితే బతకడం నేర్చుకున్నాను గదా! ఈగో అనే ఒక లక్షణాన్ని వదులుకుంటే ఏ ఇకనామిక్స్‌తో అవసరం లేదు. చదవడం, రాయడం, కాలక్షేపం చేయడం తప్ప మరోటి చేతగాని మనిషిని నేను. నా కనీస అవసరాలకు మా సివంగిని కూడా అడగనవసరం లేకుండా బతుకుతున్నాను. (శాఖా చంక్రమణం అను కొమ్మలు దూకుడు; సివంగి అంటే ఆడసింహము. అది వేటాడి తెస్తే, మగ సింహం హాయిగా తింటుంది. స్వయంగా వేటాడదు. ఆ రకంగా నేను బద్ధక సింహం. జూలు లేదు గానీ, గడ్డం ఉంది. బట్టతల వస్తున్నది కూడా. ఈ సంగతి మా సివంగికి చెపితే, మీరు కాదు సింహం. మామగారు అసలు సింహం. నరసింహం. అయితే బద్ధక సింహం కానే కాదు, అన్నది. ఇంతకూ నేను ఏమిటి, అంటే టైగర్‌ని అని చెప్పింది. మరెవరో నన్ను టైగర్ అన్నారట కూడా! నయంగాదూ) తిరిగి వెనుకకు!
ఇంతకూ ఇకనామిక్స్ అనే మాటకు అర్థం ఏమిటి అని వెతికాను. ఒయికొనోమియా అనే గ్రీకు మాటకు ఇంటిని నిర్వహించుకోవడం అని అర్థమట. ఆదాయం, ఖర్చులను సమతూకం చూస్తూ, సంసారం సాగుమానం చేయడం అన్న మాట. ఈ పని బీద నుంచి మొదలు, బిలియనేర్ దాకా అందరూ చేస్తూనే ఉన్నారు గదా! నాకు మాత్రం ఈ సంగతులు పట్టకుండానే బతుకు సాగుతున్నది, అదే వేరే సంగతి.
అమెరికాలో ఆర్థిక శాస్త్రం పండితుడు ఒకాయన ఒక చక్కని నిర్వచనం చెప్పాడు. ఈ శాస్త్రంలో మొట్టమొదటి పాఠం కొరత గురించినదట. అంటే లేకపోవడం, లేమి. కావాలి అనుకున్న వారికి అందరకీ సంతృప్తి కలిగించే స్థాయికి ఈ ప్రపంచంలో ఏ వస్తువూ ఉండదట. అయితే రాజకీయంలోనూ ఒక తొలిపాఠం ఉందట. ఇకనామిక్స్ (ఎకనామిక్స్ అనగూడదు. ఈకాస్ అంటే ఇల్లు అని అర్థం!)లోని మొదటి పాఠాన్ని పట్టించుకోకూడదు అంటుంది రాజకీయ ప్రథమ పాఠం. ఏదో చదవడం, బాగుంది, అర్థమయింది అనిపించిన సంగతులు అందరికీ పంచడం నాకు తెలిసిన విద్య. అందులో ఆర్థిక శాస్త్రం లేదు రాజకీయం లేదు. ఆ రెంటినీ చదవగూడదు, అన్న నియమం అంతకన్నా లేదు.
ముల్లా నస్రుద్దీన్ గురించి ఒక కథ ఉంది. కొంతమంది పిల్లలు పళ్ల్లు కొన్ని సంపాయించుకున్నారు. పంపకం గురించి పేచీ వచ్చింది. నస్రుద్దీన్‌ను అడిగితే న్యాయం జరుగుతుందని ఆయన వద్దకు వెళ్లి పళ్లు మాకు పంచి ఇవ్వండి, అని అడిగారు. సమానంగా, అని మాత్రం అడిగినట్టు లేదు. ‘మనిషి పద్ధతిలో పంచనా? దేవుని పద్ధతిలో పంచనా?’ అని ముల్లా పిల్లలను అడిగాడు. పిచ్చి పిల్లలు మనిషికన్నా దేవుడు గొప్ప అనుకుని, దేవుని పద్ధతి ఎంచుకున్నారు. ముల్లా ఒకడికి చారెడు, ఒకడికి దోసెడు, మరొకడికి బోలెడు యిచ్చాడు. ఒకడిని, ‘నీకు లేవు పో’ అన్నాడు. పిల్లలకు ఏమనడానికీ లేకపోయింది. మనిషయితే శాస్ర్తియంగా సాగుతాడు. దేవునికి ఆ నియమం లేదు గదా! ఆ సంగతి అర్థం కావడానికి పిల్లలకు అక్కడ అనుభవం మొదలయింది. అంతే. బతికినంత కాలం ఆ పాఠం అట్లా సాగుతూనే ఉంటుంది మరి.
నేను జనాభా జన్యుశాస్త్రం అనే రంగంలో పిఎచ్.డి తీసుకున్నాను. అంటే జన్యువులు జనాభాలలో విస్తరించే తీరు గురించి పరిశోధించానని అర్థం. చేసింది అసలు సిసలయిన వైద్య రసాయన జన్యు పరిశీలనలు. అయితే జనాభా గురించి అర్థం చేసుకోవాలంటే ఆంత్రాపాలజీ అనే మానవ శాస్త్రం అర్థం చేసుకోవాలి. ఆ సందర్భంలో నాకు ఒక చిత్రమయిన విషయం తెలిసింది. ఆంత్రాపాలజీ శాఖ కొన్ని విశ్వవిద్యాలయాలలో సైన్సుగా లెక్కింపబడుతుంది. మరి కొన్ని చోట్ల అది ఆర్థిక, రాజకీయ శాస్త్రాలతోబాటు ఆర్ట్స్, హుమానిటీస్‌లతో కలిసి ఉంటుంది. ఉస్మానియాలో ఈ తరువాతి పద్ధతిలో ఉండేది ఇప్పుడు ఆ శాఖ అసలు లేదు (ఉస్మానియాలో లేదని అర్థం). మరి లెక్కల ప్రకారం ముందుకు సాగే ఇకనామిక్స్ సైన్స్ విభాగాలలో ఒకటిగా ఉండాలె గదా! ఎక్కడా అట్లా లేదని తెలిసింది. 19వ శతాబ్దంలో ఆ రంగంలోని వారు తమను తాము సైంటిస్టులుగా, తమ శాస్త్రాన్ని సైన్సుగా లెక్కించుకున్నారు. ఫిజిక్స్‌లాగే ఇకనామిక్స్ అంటే బాగుంటుంది అనుకున్నారు. మీరు గమనించారో లేదో తెలియదు. రాజకీయ శాస్త్రాన్ని పొలిటికల్ సైన్స్ అంటారు. అందులో సైన్స్ పద్ధతి ఉండవచ్చు గానీ, లెక్కలు, సైన్స్ మాత్రం ఉండవు.
ఆర్థిక, రాజకీయ, ప్రజా నిర్వహణ లాంటి శాస్త్రాలు, వాటంతటవి ఉండి, తరువాత మనిషి అర్థం చేసుకున్నవి కావు. వాటన్నిటినీ మనిషి పుట్టించాడు. సైన్సు తనంత తానుగా ఉంది. మనిషి కేవలం అందులోని అంశాలను అర్థం చేసుకున్నాడు. చిత్రంగానీ, ఈ అర్థం అనే మాటకు డబ్బు అని అర్థం. ఈ చివరి అర్థం వేరు. ఇక అర, సగం అనే అర్థం ఒకటి ఉంది. పొట్టలో చుక్కలేని ధ వత్తు అది. పొట్టలో చుక్కలేదు అంటే, డబ్బు లేదనే గదా అర్థం. అన్నమే లేకపోతే ముక్క, చుక్క ఎక్కడి నుంచి వస్తాయి?
అవసరాలు ఒకవేపు. వాటిని అందుకునే దారులు మనవేపు. ఈ రెంటి మధ్య సంబంధం, అందుకు సంబంధించి మనిషి కనబరిచే ప్రవర్తన ఆర్థిక శాస్త్రం. అవసరాలను అందుకునే దారులు అందరికీ అందవని అర్థమయే ఉంటుంది. ఒకటికి మరొకటి చేరిస్తే రెండు అనడంలో మోసం ఎక్కడా లేదు. ఈ ఆర్థిక శాస్త్రం మాత్రం ఒకటికి ఒకటి చేరిస్తే పదకొండు అంటుంది. అక్కడే చిక్కు, తికమక, గజిబిజి అన్నీ మొదలవుతాయి. ఆర్థిక మంత్రిని ఫినాన్స్ మినిస్టర్ అంటారు. ఇకనామిక్స్ మంత్రి అనరు. గమనించారా?

కె. బి. గోపాలం