లోకాభిరామం

హర్ ఫన్ వౌలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

.శీర్షికలోని ఈ మాట బహుశా ఎవరికీ తెలిసి ఉండదు. సంస్కృతంలో చెప్పాలంటే సకల కళావల్లభుడు అంటే అన్ని పనులు చేతనయినవాడు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని ఇంగ్లీషులో ఒక మాట ఉంది. కానీ ఆ మాట వెంటనే మాస్టర్ ఆఫ్ నన్ అనే మాట కూడా వస్తుంది. అన్నింట్లోనూ కలుగజేసుకుంటాడు. కానీ ఏదీ సరిగా రాదు అన్న భావం అక్కడ మిగులుతుంది. చెప్పిన సంస్కృత సమాసంలో కూడా పొగడ్త కన్నా వ్యంగ్యమే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకనే నేను ఒక మధ్యేమార్గం నేర్చుకున్నాను. చాలాకాలంపాటు నేను జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్‌గా బతుకు సాగించాను. ఎదుటివారు ప్రస్తావించిన పని ఆనాటి వరకు నాకు రాకున్నా అప్పుడు తెలుసుకుని చేయడం గొప్పతనంగా భావించాను. కానీ కొంతకాలానికి అది తప్పు అని తెలుసుకున్నాను. చివరకు రాత, కూత అంటే మాట, పాట కాదని మనవి, మాత్రం మిగిలాయి అంటూ ఉంటాను.
ఒకప్పుడు ఒకనాడు నేను గ్యాస్ స్టౌ విప్పదీసి ఒక్కొక్క భాగానే్న విడదీసి శుభ్రం చేసే ప్రయత్నంలో ఉన్నాను. నా చిన్నారి కూతురు వచ్చి నా ముందు నిలబడింది. అప్పటికి ఆమె నిజంగా చిన్నారి పాప. నేను సూదితో స్టౌలో గ్యాస్ వచ్చే రంధ్రాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటే చాలా ఆసక్తిగా చూస్తూ నిలబడింది. ‘నాన్నా, నీకు స్టౌ బాగు చేయడం వచ్చా?’ అని అడిగింది. ‘రాదమ్మా, అయినా సరే చేస్తున్నాను’ లాంటి జవాబు ఏదో చెప్పి ఉంటాను. జ్ఞాపకం లేదు. తెలియని విషయాలు కూడా తెలుసుకుంటే తెలుస్తాయి అన్నది నా వాదం. ఒక పనిని బాగుగా చేయగలిగిన మనిషి మరే పనినయినా మనసు పెట్టి పరిశీలిస్తే బాగుగా కాకున్నా మామూలుగానయినా చేయగలడు అన్నది నా తత్వం.
శ్రీరంగాపురం అవ్వ ఇచ్చిన ఇడ్లీ పాత్ర గురించి బహుశా లోకాభిరామంలో ఇంతకుముందు ఎక్కడయినా చెప్పానేమో. కొన్ని విషయాలకు సందర్భోచితంగా చెపితే పునరుత్తి దోషం ఉండదు. అవ్వ నాకు రహస్యంగా ఇడ్లీ పాత్ర దానం చేసింది. ఆ వివరమంతా చెపితే అది ప్రత్యేకంగా ఒక వ్యాసమవుతుంది. ఆ ఇడ్లీ పాత్ర ఇత్తడి లేదా కంచురకం. అప్పటికి నేను ఇడ్లీల గురించి వినడం, తినడం కూడా జరిగిన దాఖలాలు లేవు. కానీ పాత్రను సార్థకం చేయాలని నేను ఇడ్లీలు వండే ప్రయత్నంలో పడ్డాను. ఇడ్లీకి ప్రత్యేకంగా రవ్వ ఉంటుందని కూడా తెలియదు. అందులో మినపప్పు వేస్తారని తెలియదు. మొత్తానికి ఏదో ఊహించి ఒక పిండి తయారుచేశాను. ఏమనిపించిందో గానీ, అందులో తిరగమాత, తిరగమూత అనే పోపు అనే ఛౌంక్ ముందే వేసేశాను. మా ప్రాంతంలో ఈ తిరగమాత కార్యక్రమాన్ని గంట కలచడమూ అంటారు. దాని గురించి చెప్పినా కొమ్మల దూకుడు అనగా శాఖా చంక్రమణం అవుతుంది. కనుక చెప్పను. అమ్మా నాన్నా ఆశ్చర్యంగా చూస్తూండగా మొత్తానికి ఇడ్లీల వంటి వంటకం తయారయింది. అందరికీ వడ్డించాను. బాగున్నాయి అంటూ అందరూ తిన్నారు. నాన్న కూడా మెచ్చుకున్నాడంటే అవి ఇంచుమించు ఇడ్లీలలాగే వచ్చి ఉంటాయని నాకు ఇవాళటివరకూ అనుమానం. ఆ మధ్యన అంటే అమ్మ మమ్మల్ని వదిలి వెళ్లిపోక ముందు ఒకసారి నేను ఇడ్లీ పాత్ర గురించి అడిగాను. అమ్మ ముఖం చిట్లించింది. ఆమెకు పాత వస్తువులు కంచరి వాళ్లకు ఇచ్చి స్టీలు గినె్నలు తెచ్చుకోవడం కొంతకాలం హాబీగా కొనసాగింది. ఇంట్లోని దీపలక్ష్మి మొదలు ఎనె్నన్నో విగ్రహాలు కూడా ఆ మార్గంలో వెళ్లిపోయి స్టీలు బొచ్చెలుగా తిరిగి వచ్చాయి. కనుక నేను విషయాన్ని ముందుకు సాగించలేదు.
అమ్మది అమృత హస్తం. ఆమె తవుడుతో పచ్చడి చేసింది. గరికతో కూర వండింది. బజ్జీలు చేయాలంటే పెరట్లో కనిపించిన రెండు మూడు రకాల చెట్ల ఆకులు తెమ్మనేది. నాకు ఆశ్చర్యం కలిగేది. వండిన తరువాత అమ్మ వంటకం బాగులేదు అనిపించిన రోజు నాకు గుర్తులేదు. ఆమె ఏం చేసినా బాగుండేది. బంధువర్గంలోని వారందరూ ఈనాటికీ ఆమె గురించి ఆ మాటే అంటారు. ఇంటికి వచ్చిన వారు మొగమాటం లేకుండా ఆమెను అడిగి ఏదో పెట్టించుకుని తినేవారు. ఏదీ లేకుంటే చివరికి చద్ది అన్నం, మామిడికాయ అవ అనే అవకాయను కలిపి ఆవురావురు అంటూ తిని అమ్మను మెచ్చుకున్న వాళ్లను గురించి నేను ఒక వ్యాసమే రాయగలను. ఏతావతా మాకు రుచిగా తినడం అలవాటు అయింది. వంటలో ప్రయోగాలు చేయడం పద్ధతిగా మారింది. అన్నయ్య, తమ్ముడు, చివర నేను వంట తెలిసిన మగవాళ్ల కింద లెక్క. సంప్రదాయంగల కుటుంబం కనుక అప్పుడప్పుడు ఇంట్లో వంట మగవాళ్ళ బాధ్యత అయ్యేది. ఇడ్లీలు చేసిన నాడు, అలా వంట చేసిన నాడు నాకు అన్నం వండిన గుండిగెను ఎత్తి పొయ్యి మీద పెట్టడానికి కూడా కుదిరేది కాదు అంటే ఆశ్చర్యం లేదు. నిజంగా పిల్లవాడిని. పొయ్యి మీద వంట పెట్టి అడుగడుగునా అమ్మను సలహాలు అడుగుతూ వ్యవహారం ముగించేవాడిని. ఒక సందర్భంలో నా మేనల్లుడు కృష్ణుడు ‘గోపన్న వంట చేస్తే పెండ్లిలాగే ఉంటుంది’ అనడం నాకు ఇంకా గుర్తుంది. ఈ మధ్యన వంట చేయనివ్వడంలేదు. ఫరవాలేదు కానీ, నాకు ఎవరి వంటా అంత సులభంగా నచ్చదు. కనుక సుఖంగా తిననివ్వడం కూడా లేదేమో?
ఈ ప్రయోగాలు ఒక్క వంటలోనే అయితే బాగుండేది. బజారుకు వెళ్లి పంఖా అనే ఫ్యాన్ కొని తెస్తాను. దాన్ని బిగించడానికి ఎలక్ట్రీషియన్ అనే ఒక మహానుభావుడ్ని పిలిపించాలి. అది అవసరమా అనిపిస్తుంది. కావలసిన స్క్రూడ్రైవర్ లాంటివి ఏవో ఇంట్లోనే ఉంటాయి. కనుక ఇక గోడలో రంధ్రం వేసి మీటలు బిగించడం, నానా తంటాలు పడి కొక్కానికి పంఖా బిగించడం, కొంచెంసేపు యజ్ఞంలా కొనసాగుతుంది. పని ముగుస్తుంది. ఇంట్లో ఉన్నవాళ్లు అందరినీ పిలిచి ఇనాగురేషన్ జరగాలి. నచ్చిన మనిషిని స్విచ్ వేయమని అడుగుతాము. పంఖా తిరగడం మొదలవుతుంది. ఇక ముఖంలో విజయగర్వం తొణికిసలాడుతుందంటే అందులో వింత ఏముంది?
బడిలో అది కూడా ఏడు, ఎనిమిది చదువుతున్న కాలంలో అన్నయ్య పాలమూరులో ఉండేవాడు. పక్కనే పల్లెలో అమ్మ, నాన్న ఉండేవాళ్లు. నేను నా ఇష్టప్రకారం అక్కడా, ఇక్కడా ఉండేవాడ్ని. అన్నయ్యతోబాటు ఒక చిన్నాయన కూడా ఉండేవాడు. ఆయన నిజానికి నాన్నకు పినతల్లి కొడుకు. చిన్నాయనది కూడా అచ్చంగా ఇదే మనస్తత్వం. అన్ని పనులు చేయడానికి పూనుకునేవాడు. వడ్రంగానికి అవసరమయిన వస్తు సంభారాలను కూడా ఆయన కొన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి చిన్నాయన, అన్నయ్య కలిసి ఇంటికి రంగులు వేయించాలి అని చర్చిస్తున్నారు. చిన్నాయన రెండవ కొడుకు వెంకటన్న. మేమిద్దరం ఆ కాలంలో లవకుశలలాగ కలిసి తిరుగుతామని అనేవారు. ఆ రంగులు వేసే పని ఏదో మేము చేస్తాము అని ప్రతిపాదించాము. మనసు కలిసిన మనుషులు మా మనసు తెలుసుకుని సరేనన్నారు. బజారుకు వెళ్లి అవసరమయిన రంగులు, కుంచెలు కొన్ని తెచ్చాం. పాత చొక్కా, లాగులు వేసుకుని పనిలోకి దిగాము. ఆ కాలంలో ఇంతటి సోకులు లేవు. ఏదో ఆకుపచ్చ రంగు పూసేస్తే అయిపోతుంది. గోడలకు సున్నం లేదా తెల్లని రంగు వేస్తే పోతుంది. సాయంత్రానికల్లా పని ముగిసింది. అంటే ఇల్లు చిన్నది అని అర్థం అయే ఉంటుంది. మా వేషాలు విచిత్రంగా తయారయినయి కనుక శుభ్రంగా స్నానాలు చేశాము. ఆ తరువాత పెద్దల ముందు నిలబడితే వాళ్ల ముఖాలలో కనిపించిన మెప్పికోలు మరెక్కడయినా దొరికేనా? మరి ఆ పనికి కొంత మహావిజా, లేదా ముదర లేదా ఫలితం దక్కాలి కదా? చిన్నాయనకు ఒక పద్ధతి ఉండేది. అన్నయ్య దాన్ని ఆనందంగా అంగీకరించేవాడు. ఆ కాలంలో సినిమా చూడడం అన్నిటికన్నా సరదా. కనుక మా ఇద్దరికీ సినిమాకు సరిపడా డబ్బులు ఇస్తారు. అప్పట్లో టికెట్టు కేవలం పాంచానా అంటే అయిదు అణాలు అంటే ముప్పయి ఒక్క పైసాలు. చిన్నాయన అంతకుమించి ఏ నాలుగు పైసలో ఎక్కువ ఇస్తే వాటితో ఒక షకర్ గోలీ అనే బిల్ల కొని చప్పరించడం బోనస్ కింద లెక్క. చిన్నాయన గురించి నిజానికి ఒక పుస్తకమే రాయవచ్చు. రాయాలి కూడా. ఆయన విద్యా గురువు. బడిలో చదువు సంగతి కాదు.
సాహిత్యంలో, సంస్కృతంలో అరంగుళం మందం ప్రవేశం దొరికిందంటే అందుకు ఆధారం చిన్నాయన. అందరినీ చేర్చి సంస్కృతం చెప్పడం మొదలుపెట్టిన వాడు కొంతకాలానికి మానేశాడు. ఆయన రాసే పరీక్ష కొరకు ఆయన చదవవలసిన పుస్తకాలను చదివి వినిపించినందుకు నాకు సాహిత్యంలో ఆసక్తి మొదలయింది. భవదీయుడు ఇవాళటికీ సంస్కృతం తెలిసిన సాహిత్యవేత్త అనిపించుకుంటున్నాడు అంటే అది కూడా హర్ ఫన్ వౌలా పద్ధతి కిందకే వస్తుంది. యూనివర్సిటీలో ఉండగా అతి సున్నితం అనుకునే ఇలెక్ట్రిక్ బ్యాలెన్స్ అనే మిల్లీగ్రాములను కూడా తూచే తక్కెడను నేను రిపేర్ చేశానంటే మీరు నమ్మక తప్పదు. కొత్త యంత్రం ఏదయినా వస్తే పక్క డిపార్టుమెంట్ వాళ్లు కూడా దాన్ని పని చేయించడానికి నన్ను సాయం అడిగే వాళ్లు. వాళ్ల యంత్రాలు పాడయితే కంపెనీ వాళ్లు వచ్చేలోగా నన్ను వచ్చి చూడమనేవారు. కంపెనీ వారు రానవసరం లేకుండానే నేను వాటిని బాగుచేసేవాడిని.
ఇలా చెపుతూ పోతే నాకు అదేదో సంతృప్తిగా ఉంటుంది. నాలాగే తమ పనులన్నీ చేయాలనుకుని చేసే వాళ్లకు జ్ఞాపకాలు తుమ్మెదల్లాగ చుట్టుముట్టుకుంటాయి. ఈ లోకంలో హర్ ఫన్ వౌలా అంటే నేను ఒక్కడినే కాదు. నాలాంటి వాళ్లు చాలామంది ఉంటారని, ఉన్నారని నాకు తెలుసు. ఆ తేనెతుట్టెలను కదల్చడమే ఈ నాలుగు ముక్కల వెనుక ఆలోచన.

-కె.బి.గోపాలం