లోకాభిరామం

ఒక మహారాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటూ ఒక మాట ఉంది. ఒకప్పుడు ప్రపంచాన్ని స్పెయిన్ వారు పాలిస్తే, ఆ తరువాత బ్రిటిష్ వారు ఆ స్థానంలోకి వచ్చారు. వాళ్లే మన దేశాన్ని కూడా రెండు వందల సంవత్సరాలపాటు పాలించి, మార్చి మళ్లీ అందించి వెళ్లిపోయారు. మన చరిత్ర మనకు కొత్తగా కనిపిస్తున్నది. ఈ సంగతి చెపితే చాలామంది ముక్కు విరుస్తారు.
ప్రస్తుతం బ్రిటిష్ సామ్రాజ్యానికి అధినేత ఎలిజబెత్ మహారాణి. ఆమె ఒకప్పుడు హైదరాబాద్‌కు వచ్చింది. అప్పట్లో నేను ఉద్యోగంలో ఉన్నాను. రాణిగారు అటుగా వస్తున్నారని తెలిసి అంతా వెళ్లి రోడ్డు పక్కన నిలబడ్డాము. రాణిగారి కార్ల వరుస రానే వచ్చింది. జనం ఎక్కువగా చేరినందుకేమో, వాళ్లు వేగంగా దూసుకువెళ్లలేదు. అందరినీ పలుకరిస్తున్నట్టు రాణిగారు చేతిని కదిలిస్తూ ఉన్నారు. కారులో నుంచి బయటకు తొంగి చూస్తున్నారు. పక్కనే నిలబడ్డ నేను ఆమెను దగ్గర నుంచి చూచాను.
ఈ మధ్యన రాణిగారిని అక్కడక్కడ టి.వి.లో చూచాను. క్లియోపాత్ర చిన్ననాటి పుర్రె, పెద్దయిన తరువాత పుర్రె జోకులాగ నేను రాణిగారిని ఈ మధ్యన రాణిగారు కాకముందు నుంచి మొదలుపెట్టి చూచాను. ఇక్కడ మళ్లీ మా అబ్బాయి రంగం మీదకు వస్తాడు. ఆయన అమెరికాలో ఉన్నాడు. అక్కడ నెట్‌ఫ్లిక్స్ అనే ఒక వెసులుబాటు ఉంది. అది ఈ మధ్యన మన దేశానికి కూడా వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ అనే ఈ ఇంటర్నెట్ సౌకర్యంతో ప్రపంచంలోని చాలా చాలా సినిమాలను, టి.వి. సీరియల్స్‌ను కంప్యూటర్‌లో, స్మార్ట్ టి.వి.లో చూడవచ్చు. మా అబ్బాయి అక్కడ నెట్‌ఫ్లిక్స్‌లో సభ్యత్వం తీసుకున్నాడు. అందులో నాకు కూడా ఇక్కడి నుంచే సినిమాలు, సీరియళ్లు చూసే ఏర్పాటు చేశాడు. కనుక నాకు మంచి సౌకర్యం దొరికింది.
నెట్‌ఫ్లిక్స్ వారు తాము స్వంతంగా సీరియల్స్ తయారుచేస్తారు. అవి బ్రహ్మాండంగా ఉంటాయి. నేను నేర పరిశోధన మీద ఆసక్తి కొద్దీ ఒకటి, రెండు సీరియల్స్‌ను కొంతకాలం చూచాను. కానీ అవి నాకు నచ్చలేదు. ఈలోగా అటు పుస్తకాలలోనూ, ఇటు టి.వి.లోనూ చరిత్ర అంశాలను చూడడం ఒక వ్యసనంగా మారింది. మార్కోపోలో అనే సీరియల్ ఒకటి, చూస్తూ కుబ్లయ్‌ఖాన్ కాలంనాటి అంశాలను చూస్తున్నాను. ఆ సీరియల్స్ తీయడానికి వాళ్లు పడుతున్న కష్టం, పెడుతున్న ఖర్చు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అయితే ఈ మార్కోపోలో సీరియల్ అదేమంత గొప్పది కాదని ఎక్కడో చదివాను. ఆ సందర్భంలోనే ‘ద క్రౌన్’ అనే సీరియల్ నా దృష్టికి వచ్చింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఇంతగా ఖర్చు పెట్టి తీసిన టి.వి. సీరియల్ మరొకటి లేదని కూడా నాకు ఆ తరువాత తెలిసింది.
నేను అన్నం తినడం మానేశాను. అది జరిగి చాలాకాలం అయింది. సంగీతం వింటూ ఉండేవాడిని. అది కూడా ఈ మధ్యన తగ్గింది. అంటే నా అభిరుచులలో నానా కారణాలుగా మార్పులు వస్తున్నాయి అనుకుంటాను. నాకు సినిమా చూచే ఓపిక లేదు. ఎక్కడో తప్పిసేత నాకు నచ్చిన సందర్భాలూ లేవు. కానీ ఒకటి, రెండు ఎపిసోడ్‌లు చూడగానే ఈ క్రౌన్ అన్న సీరియల్ నన్ను గట్టిగా పట్టేసుకున్నది. ఓపికగా ఒకచోట కూచునే రకం కాదు నేను. అది రాత విషయంగా మాత్రమే వీలవుతుంది. కానీ ఈ సీరియల్ నన్ను పట్టి కూచోబెట్టింది. పుస్తకాల విషయంలో ఇంగ్లీషులో ‘కింద పెట్టనివ్వనిది’ అని అర్థం వచ్చే మాట ఒకటి ఉంది. సీరియల్స్ విషయంలో క్రౌన్‌కు అటువంటి మాట ఏదయినా వెతికి వాడాలి మరి.
రాణి ఎలిజబెత్‌గారు సకాయంగా బతికి ఉన్నారు. రాజ్యం చేస్తున్నారు. ఆమె మనసు ఎంత విశాలమయినదో చెప్పడానికి లేదు. తన చిన్ననాటి సంగతులను మరీ వ్యక్తిగతమయిన వాటితోబాటు సీరియల్‌గా తీసి ప్రపంచం ముందు ఉంచడానికి ఆమెగారు ఒప్పుకున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది.
సీరియల్ కథ గురించి చెప్పడం గొప్ప పని కాదు. జార్జ్ ప్రభువు ఆరోగ్యం చెడుతుంది. ఆయన చనిపోతాడు. అప్పటికి కేవలం 25 సంవత్సరాలు మాత్రమే వయసు ఉన్న ఎలిజబెత్ మహారాణి అవుతుంది. నేను సరిగా మూడు వాక్యాలలో ఈ ముచ్చట చెప్పాను. కానీ సీరియల్‌లో ఈ విషయాలు జరిగేసరికి చూచేవారి దిమ్మ తిరుగుతుంది. మొట్టమొదటి సీనులో రాజుగారు బాత్రూంలో ఉంటారు. ఆయనకు దగ్గు వస్తుంది. ఉమ్ములో ఒక చుక్క రక్తం కనిపిస్తుంది. అనారోగ్యాన్ని అంత అందంగా ప్రవేశపెట్టిన పద్ధతి భలే అనిపిస్తుంది. రాజుగారు రక్తం గురించి డాక్టర్‌ను అడుగుతారు. విషయం ముందుకు సాగుతుంది. ఎపిసోడ్‌లు కూడా ముందుకు సాగుతాయి. సమకాలీన రాజకీయాలు ముందుకు సాగుతాయి. రాజుల బ్రతుకు మీద అసూయ పోయి అయ్యో పాపం అనిపిస్తుంది. రాజు చనిపోతాడు. ఆ మధ్యలో ఆయనకు సేవ చేసిన ఒక అమ్మాయి గురించి చూపించిన తీరు అదిరిపోయే రకంగా ఉంది.
ఇట్లా నన్ను పట్టిపెట్టిన సీరియల్‌ను రోజుకు ఒక ఎపిసోడ్ ప్రకారం అదే పనిగా చూచాను. మొదటి సీజన్‌లో పది ఎపిసోడ్‌లు ఉన్నాయి. రెండవ సీజన్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. అయితే అది మొదటి సీజన్‌లాగ పట్టి ఉంచే రకంగా లేదని ఎక్కడో చదివాను. కనుక మూడు, నాలుగు ఎపిసోడ్‌ల వరకు మాత్రమే చూచి అక్కడ ఒక కామా పెట్టాను. పెట్టింది ఫుల్‌స్టాప్ కాదు. ఎప్పుడో చూస్తాను.
ఎలిజబెత్ మహారాణి అవుతుంది. అప్పటికే ఆమెకు పెళ్లి జరిగింది. ఇద్దరు చక్కని పిల్లలు కూడా ఉన్నారు. భర్త రాణిగారి మొగుడు అనిపించుకోవటానికి ఇష్టంలేని ఆత్మగౌరవం గల మనిషి. భార్యాభర్తల మధ్యన ఈ కారణంగా కొంత సంకటం కూడా ఎదురవుతుంది. భర్తగా నటించిన నటుడు చాలా బాగా నటించాడు. ఈ సీరియల్‌లో అతను ఒక్కడే బాగా నటించాడు అంటే అది పచ్చి అబద్ధం. క్లేర్ ఫాయ్ అనే అమ్మాయి రాణిగారుగా నటిస్తుంది. ఆమె కళ్లతో నటించింది కాదు జీవించింది. అయితే ఇక్కడ ఒక వింత విషయం చెప్పుకోవాలి. కథకు ఆమె నాయకురాలు. కానీ మనది పురుషాహంకార ప్రపంచం. సీరియల్ తీసిన వారు ఆమెకు అందరికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు. అయితే నిజానికి ఇవ్వవలసినన్ని డబ్బులు కూడా ఇవ్వలేదట. ఈ సంగతి సీరియల్‌లో తెలియదు. ఒక విషయం గురించి పట్టించుకుంటే లోతులు తరచి చూడడం నా పద్ధతిగా మారింది కనుక సీరియల్ గురించి ఒక చిన్న పుస్తకం రాసేటంత సమాచారం సేకరించాను.
ఎన్నో చెప్పాలని ఉంది. అన్నీ చెప్పడానికి వీలు కుదరదు. ఒకటి, రెండయినా చెప్పాలి. సంతాపంలో ఉన్న ఎలిజబెత్ రాణిగా బాధ్యతలు స్వీకరించాలి. అప్పుడు బాధ్యతగల ఒక పెద్ద అధికారి ఆమె వద్దకు వస్తాడు. మీ పేరు నిర్ణయించాలి అంటాడు. ఆమె గజిబిజి ఎందుకు అని అడుగుతుంది. రాణిగా మీకు ఒక ప్రత్యేకమయిన పేరు ఉండాలి అని ఆమెకు వివరింప చూస్తారు. ఆమె నాకు ఉన్న పేరు బాగానే ఉంది. నా పేరు ఎలిజబెత్ అంటుంది. చికాకుగా లేచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. అధికారి ‘లాంగ్ లివ్ క్వీన్ ఎలిజబెత్’ అంటాడు. ఆ దృశ్యం ఎటువంటి వారినయినా కదిలిస్తుంది. ఆమె కళ్లల్లో ఆ సందర్భంగా కనిపించిన భావాలు మంచి నటనకు ఉదాహరణలు.
చెప్పదలుచుకున్నది ముగించేలోగా బ్రిటిష్ మంత్రి విన్‌స్టన్ చర్చిల్ పాత్ర పోషించిన జాన్ లిత్‌గో గురించి చెప్పకుంటే అన్యాయం అవుతుంది. చర్చిల్ యుద్ధోన్మాది. రాజులను పట్టించుకోకుండా తన మార్గంలో తాను సాగుతాడు. ఎలిజబెత్ రాణిగా వచ్చిన తరువాత అతని పరిస్థితి మరింత ముదురుతుంది. ఎలిజబెత్ రాణి యువ వయసులో ఎలాగుండేదో కనీసం నాకు తెలియదు. చర్చిల్ మాత్రం లిత్‌గో లాగ ఉండేవాడు కాదట. ఆయన నిజానికి ఆరడుగుల లోపు ఎత్తుమనిషి అని సమాచారం ఉంది. సీరియల్‌లో ప్రధానమంత్రిగా నటించిన లిత్‌గో ఆరడుగుల పైన నాలుగు అంగుళాలు ఉంటాడు. అంటే అసలు మనిషికన్నా చాలా ఎత్తు. నటుడుగా కూడా ఆయన అంత ఎత్తులకు ఎదిగాడు. అందుకని అవార్డులు కూడా అందుకున్నాడు. సీరియల్ చూస్తున్నప్పుడు నాకు ఆ భావన పోయి చర్చిల్ మీద కోపం మొదలయింది. అంటే లిత్‌గో అంత బాగా నటించాడు అన్నమాట. అధికారం వదులుకోవడానికి ముందు తన చిత్తర్వు గీయించడానికి ఒప్పుకుంటాడు. ఆ పెయింటింగ్‌కు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం కథలోనే హైలైట్.
మహారాణిగారి భర్త ప్రిన్స్ ఫిలిప్ ఒకవేపు, ఆమె చెల్లెలు మరొకవేపు రాణిగారికి ఎక్కడలేని సమస్యలు తెచ్చి పెడుతుంటారు. సీరియల్ చూస్తుంటే నటులంతా ఆయా పాత్రలను డబ్బులు తీసుకుని పోషిస్తున్నారన్న భావం నాకు కలగలేదు. నసీరుద్దీన్ షా అనే మహానటుడు గాలిబ్ సీరియల్‌లో చూపిన నటన నన్ను కదిలించిది. మళ్లీ ఒకసారి నాకు అటువంటి భావం ద క్రౌన్‌తో కలిగింది.
వీలున్న వాళ్లందరూ ఈ సీరియల్ చూడండి. వివిధ దేశాలను, ఇంగ్లండ్‌ను, అలనాటి చరిత్రను మరొకసారి దర్శించిన ఆనందం కలగకపోతే నాకు చెప్పండి.

-కె.బి.గోపాలం