లోకాభిరామం

మరోసారి చదువుల గుడికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిషికి జ్ఞాపకశక్తి ఉండడం ఒక రకంగా బాగుంటుంది. ఎక్కువ రకాలుగా కూడా బాగుంటుంది. అక్కడక్కడ మాత్రమే దానివల్ల చిక్కులు వస్తాయి. చదువుకున్నది జ్ఞాపకం రాకుంటే చదువుకు అర్థం లేదు. తెలిసిన విషయాలన్నీ జ్ఞాపకం ఉండి అవసరమయినప్పుడు తిరిగి మననం చేసుకోగలిగితే తెలివి కింద లెక్క. ఇంతవరకు బాగానే ఉంది కానీ, చదువుకున్న బడి గురించి కూడా జ్ఞాపకం చేసుకునే వాళ్లు ఎంతమంది ఉంటారని నా ప్రశ్న.
పల్లెలో చదువుకున్నాను. రోడ్డు పక్కన బడి ఉండేది. అది రెండు గదుల నిర్మాణం. ఎంత ప్రయత్నించినా ఇప్పుడు అది కనిపించడం లేదు. ఆ తరువాత చదువుకున్న రెండు బడులు, కాలేజి ఉండనే ఉన్నాయి. అవి నాలాగా పాతబడినయి కానీ, బాగుపడలేదు. నాలాగే అనాలంటే అనుమానం అడ్డు వస్తున్నది. వాటివల్ల నేను బాగుపడ్డాను. ఆ తరువాత చదువు వరంగల్‌లో జరిగింది. నిజానికి ఎంఎస్‌సి తరువాత కూడా చదువు జరగవలసింది కానీ జరగలేదు. హైదరాబాద్‌కు మారాను. ఇక వరంగల్ వెళ్లవలసిన అవసరం రాలేదు. ఒకటి, రెండు సందర్భాలలో వెళ్లినప్పటికీ, చదువుకున్న చోటును చూడడానికి అవకాశం రాలేదు.
ఈ మధ్యన అనుకోకుండా ఆలపాటి దేవేంద్రనాథుడు అంటే దేవేంద్రనాథ్ అంటే దేవ్ ఫోన్ చేశాడు. నేను వరంగల్‌లో చదువుకునే నాటికి అది ఇంకా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే పిజి సెంటర్ మాత్రమే. మొదటి తరగతి నుంచి నేను చదివిన పుస్తకాలు మారడం గురించి, సిలబస్‌లు, పద్ధతులు మారడం గురించి లోకాభిరామంలో ఒకసారి చెప్పాను. అంటే మార్పును వెనుకతెస్తూ పాత తరానికి చివరి లంకెగా నడిచిన అనుభవం నాకు ఉందన్నమాట. మా తరువాత పిజి సెంటర్ ఒక్కసారిగా కాకతీయ విశ్వవిద్యాలయంగా మారింది. దేవ్ వాళ్ల బ్యాచ్‌కు మొదటి సంవత్సరం మెమోలు ఉస్మానియా పేరుతో, రెండవ సంవత్సరం డిగ్రీలు కాకతీయ పేరుతో ఇచ్చారు. అందరము హాస్టల్‌లో కలిసి ఉండేవాళ్లం కనుక నాకు జూనియర్‌లతో కూడా మంచి నేస్తం ఉండేది. అటువంటి నేస్తాలు కొంతమంది కలిసి వరంగల్ వెళ్లాలని నిర్ణయిచినట్టు దేవ్ మెసేజ్ పంపాడు. నిజానికి వాళ్లు ప్రస్తావించిన ఆ రెండునాళ్లలో నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి. అయినా వరంగల్ వెళ్లే అవకాశం వదలకూడదన్న ఉద్దేశంతో నేనూ వస్తున్నాను అన్నాను.
వరంగల్‌లో చదువుతున్న కాలంలో అక్కడ చాలామంది హైదరాబాద్ వాళ్లు ఉండేవారు. వాళ్లంతా కలిసి తిరిగేవారు. పాలమూరు నుంచి పట్నం దాటి అక్కడిదాకా వెళ్లే నేను కూడా ఈ పట్నం పోరగాళ్ల గుంపులోనే ఉండేవాణ్ణి. ఇక ఆడిపోరలు కూడా మాతో కొంతమంది నేస్తంగా ఉండేవారు. నిజంగా జీవితంలో ఆనందంగా గడిచిన రెండు సంవత్సరాల కాలం వరంగల్‌లోనే గడిచింది అంటే అతిశయోక్తి కాదు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పేరున మా స్కూల్, కాలేజి చదువులు అంతంత మాత్రంగానే సాగాయి. పరీక్షలకు అంతరాయాలు కూడా వచ్చాయి. మహబూబ్‌నగర్‌లో మాస్ కాపీయింగ్ జరిగింది అని నిర్ణయించి యూనివర్సిటీ వారు అక్కడ ఎవరికీ ఫస్ట్ క్లాస్ ఇవ్వకూడదని నిర్ణయించారట. నేను కాపీయింగ్ చేయకుండా పరీక్ష రాస్తుంటే మేడమ్‌గారు నాతో అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అయినా నాకు ఫస్ట్‌క్లాస్ రాలేదు. వరంగల్‌లో ఎంఎస్‌సికి వెళ్లిన తరువాత చదువులోని రుచి తెలిసింది. అక్కడ హాస్టల్‌లో అందరు గంభీరంగా చదువుకునేవారు. నాలాంటి వాడు గోల చేసినా, మందలించి చదివించేవారు. ఇక ఇల్లు వదిలి పెద్దల అండ లేకుండా బతకడం కూడా అక్కడే తెలిసింది. అందుకనే ఇన్నాళ్ల తరువాత, లెక్కగా చెప్పాలంటే నలభయి ఒక్క సంవత్సరాల తరువాత, ఆ చదువుల గుడికి వెళితే ఎద బరువయింది. కళ్లు చెమర్చాయి. అకడ నేను అనుకోకుండా అన్న ఒకమాట ఆ తరువాత నా మెదడులో సుడులు తిరుగుతూనే ఉంది. ‘దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఎ బాయ్ టర్న్‌డ్ ఇన్‌టు ఎ మ్యాన్ (ఒక కుర్రవాడు మనిషిగా మారిన స్థలం ఇది)’ అన్న మాటలు అనుకోకుండా నా నోటి నుండి అక్కడ వచ్చాయి.
బయలుదేరి వెళ్లిన వాళ్లు ఎక్కువమంది లేకున్నా అక్కడ ఒక చిన్న గుంపు చేరింది. అందులో రకరకాల డిపార్ట్‌మెంట్‌లలో చదువుకున్న వాళ్లం చేరాము. యూనివర్సిటీగా మారిన తరువాత వివిధ శాఖలకు గాను, కొత్త భవనాలను కట్టారు. మా కాలంలో ఒక హాస్టల్ తప్ప మిగతావన్నీ పక్కా భవనాలు కావు. అయినా అక్కడ చదువులు మాత్రం పక్కాకన్నా కొంచెం ఎక్కువగానే జరిగాయి.
కారణాలు ఉన్నాయి కానీ, నాకు అక్కడ ఉన్నంతకాలం హాస్టల్‌లో అడ్మిషన్ దొరకలేదు. మొదటి సంవత్సరం నేను ఉస్మానియాలో తెలుగు ఎం.ఏ. కొంతకాలం చదివి, ఆక్షన్ సీటు పద్ధతిలో ఎంఎస్‌సికి వరంగల్ వెళ్లాను. కనుక హాస్టల్‌లో సీటు దొరకలేదు. రెండవ సంవత్సరంలో వార్డెన్‌గా ఉన్న మా ఒకానొక గురువుగారికి నా పద్ధతి నచ్చక సీటు దొరకలేదు. కానీ రెండు సంవత్సరాలు నేను హాస్టల్‌లోనే బతికాను. నేను ప్రారంభించిన ఆ పద్ధతి చివరికి ఉస్మానియా యూనివర్సిటీ వారికి పెద్ద తలనొప్పిగా మారింది. హాస్టల్‌లో అడ్మిషన్ ఉన్న వాళ్లకన్నా లేనివాళ్లే ఎక్కువగా ఉంటున్నారట! మా కాలంలో ఆ పరిస్థితి లేదు. నేను ఒక్కడినే శాశ్వత అతిథిని. ఒకరిద్దరు అప్పుడప్పుడు వచ్చి చదువుకోవడానికి హాస్టల్‌లో వుండేవారు. అక్కడ తిండి సంగతి ఎలాగున్నా, వాతావరణం నాకు బాగా ఉండేది. సాయంత్రం ఒక టాపిక్ వ్యాసం చేతబట్టుకుని హాయిగా నడుస్తూ కొంత దూరంలో ఉన్న పాడుబడ్డ శివాలయానికి చేరేవాడ్ని. అక్షరాలు కనిపించినంతసేపూ ఆ వ్యాసాన్ని శ్రద్ధగా చదివేవాడ్ని. నిజం చెపుతున్నాను, అట్లా చదివిన విషయాలను మళ్లీ చేతికి ఎత్తుకుంటే అక్షరాలు సినిమాలో సీన్లలాగ అనుకోకుండా కళ్ల ముందు మెదిలేవి. మళ్లీ చదివే అవసరం వచ్చేది కాదు. అందులో కొంత మాత్రమే నా శక్తి అని నేను అనుకున్నాను. మొన్న వెళ్లినప్పుడు ఆ గుడిని వెతుకుతూ వెళ్లాము. గుడి మారిపోయింది. చుట్టుపక్కల బోలెడన్ని ఇళ్లు వచ్చేసాయి. అసలు ఆ ప్రాంతమే మారిపోయింది.
పిజి సెంటర్ పెట్టిన ప్రాంతాన్ని పాములగుట్ట అనేవారు. పిజి అన్న అక్షరాలకు అది బాగా కుదిరినట్టు ఉంది. అక్కడ అన్ని రకాల పాములు లెక్కలేకుండా కనిపించేవి. వెంకట్రామయ్యగారు అనే ప్రొఫెసర్ అక్కడ ఉన్నతాధికారిగా ఉన్నప్పుడు వెళ్లి బల్ల సొరుగు తెరిస్తే, ఆయనకు అందులో ఆరు అడుగుల పొడవు నాగదేవుడు ఎదురయ్యాడు. ఆ పాము ఇవాళటికీ జంతుశాస్త్రం విభాగంలో సీసాలో భద్రపరచబడి ఉంది. ఇలాంటి సంగతులు గుర్తు చేసుకుంటూ ఆ ప్రాంతమంతా కలియ తిరిగాము. హాస్టల్ తప్ప మిగతావి అన్నీ మారిపోయాయి. నిజానికి మార్పులు అభివృద్ధి అనడానికి వీలులేకుండా ఉన్నాయి. మాలో ఎవరికీ అక్కడ ఆనందం అందిన భావం కలగలేదు. పాత జ్ఞాపకాలు ముప్పిరిగొన్నందువల్ల మనసులు కలత చెందినట్టు ఉన్నాయి. అయినా ఆ అనుభవం చాలా గొప్పది. అక్కడ కొంతమంది విద్యార్థులు కనిపించారు. మా సంగతి విని ఆశ్చర్యపోయారు. మాతోబాటు ఫొటోలు తీసుకున్నారు. కొంతమంది సిబ్బంది కూడా మాతో సంతోషంగా ముచ్చటించారు. మేము బయలుదేరే సమయంలో ఉద్యోగంలో చేరిన వారు కూడా అక్కడ ఎవరూ ఉండడానికి వీలులేని పరిస్థితి. నలభయి సంవత్సరాలంటే అది చాలా ఎక్కువకాలం.
చదువుల గుడి జ్ఞాపకాలను కూడగట్టుకున్నాము. సరే, మరి వరంగల్, హనుమకొండ తిరిగి చూడాలి కదా! అందుకు మరుసటి రోజు కార్యక్రమం పెట్టుకున్నాము. మిత్రుడు ప్రభాకర్ మాతోబాటే హాస్టల్‌లో వుండేవాడు. కానీ అతను వరంగల్ ప్రాంతం మనిషి. ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. అతని ఆతిథ్యంతో మమ్మల్ని ముంచెత్తాడు. మొదటిరోజు ఇంట్లో భోజనాలు పెట్టాడు. మరునాడు ఒక హోటేల్‌కు తీసుకువెళ్లాడు. వరంగల్, హనుమకొండల్లో కూడా అంతటి హోటేల్స్ వచ్చాయని చూపించడానికి అనుకుంటాను. మేము ఉన్నకాలంలో భోజనం చేయాలంటే చౌరస్తాలోని శంకర్‌విలాస్ ఒకటే దిక్కు. ఇప్పుడు పెద్దపెద్ద హోటేల్స్ వచ్చేశాయి. అక్కడి నుంచి అందరమూ కాకతీయుల కోట చేరుకున్నాము. అక్కడ కూడా పరిస్థితి మారింది. చెల్లాచెదురుగా ఉండే శిల్పాలన్నింటినీ వీలయినంత వరకు వర్గీకరించి నాలుగు శిలాతోరణాల మధ్యన ఉండే విశాల ప్రాంతంలో విభాగాలుగా ఏర్పాటు చేశారు. వీలయిన వాటిని నిర్మాణాలుగా నిలబెట్టారు. పాతకాలపు గుడి, ప్రతాపరుద్రుని సభా భవనం కూడా చూచాము. సభా భవనం మరీ చిన్నది. సినిమాలలో రాజులు, వారి సభలు మరీ పెద్దవిగా ఉన్నట్లు చూపించి మనకు అసలు నిర్మాణాలు గొప్పవిగా కనబడకుండా చేశారన్న భావం కలిగింది. ఆ భవనంలో ఒక మూలన ఫిరంగి గుండ్లు పోసి ఉన్నాయి. ప్రవేశానికి ఎదురుగానే భగవద్రామానుజుల విగ్రహం కనిపించింది. ఈ రెండు అంశాలను అంతకు ముందు చూచిన జ్ఞాపకం నాకు రాలేదు.
భద్రకాళి గుడి, వేయి స్తంభాల గుడి కూడా చూచి భోజనానికి బయలుదేరాము. నా మటుకు నాకు గుడి చూడడం కన్నా పాత అనుభవాలను కలబోసుకోవడం ముఖ్యంగా తోచింది. భద్రకాళి గుడిలో బాలసుబ్రహ్మణ్య శర్మగారి కర్ణాటక సంగీతం కచేరీ వినడం గుర్తుకు వచ్చింది. వేయిస్తంభాల గుడిలో నీటిలో తేలిన ఇటుకలు గుర్తుకు వచ్చాయి. నిజానికి ఈ ప్రయాణం గురించి చెప్పుకోవలసిన సంగతులు మరెన్నో ఉన్నాయి.

-కె.బి.గోపాలం