లోకాభిరామం

మనిషి గురించి మరింత ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి గురించి మాట్లాడుకుంటున్నాము. మరింత ముందుకు వెళ్లాలని కూడా చెప్పాను. సరం, మూరు పోయిన వారం లోకాభిరామమ్ చదవలేదు అనుకుందాము. కొంప మునగదు. ఇవాళటి ముక్క దానికదే అర్థమవుతుంది. వీలుంటే పోయిన వారం వ్యాసం చదవండి. అప్పుడు నా మాటలు మరింత బాగా మనసుకు ఎక్కుతాయి. మనం మనిషి పంటత్కత గురించి మాట్లాడే ప్రయత్నంలో ఉన్నామండీ. మరి ముందుకు సాగితే సంగతి తెలుస్తుంది. పదండి. ఇక మన శరీరం సంగతి. పక్షులకు రెండు కళ్లు తలకు ఇరువైపులా ఉంటాయి. మనకు కళ్లు రెండూ ముందు వైపునకే చూస్తుంటాయి. శరీరంలో మనకు ఉన్న ఈ లక్షణం గుడ్లగూబకు కూడా ఉందని మీరు గమనించారా? ఈ శరీరంలో మెదడు కాక మరే భాగాలు మనిషికి మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాయి? గమనించే ప్రయత్నం చేశారా? చేస్తే మీకు ఏం కనిపించాయి? శరీరంలో పైన చూస్తే కుడి, ఎడమలు రెండూ ఎదురుబదురు భాగాలుగా కనపడతాయి. అవి రెండూ నిజంగా ఒకేలాగ ఉంటే మనం ఎంత విచిత్రంగా కనిపిస్తామో ఊహించారా? కానీ శరీరం లోపల భాగాలు ఇంచుమించు కూడా కుడి ఎడమలలో ఒకే రకంగా ఉండవు తెలుసా? మీకు శరీరం లోపలి భాగాల గురించి కొంత తెలిసినా ఈ ప్రశ్నకు జవాబు తెలిసి ఉంటుంది. మెదడు ఒకటే ఉంది. అది శరీరం మధ్యలో ఉంది. అందులో రెండు భాగాలున్నాయి. ఆ రెండు భాగాలు చేసే పనులు మాత్రం వేరువేరు అంటున్నారు. గుండె ఒకటే ఉందని గుర్తించారా? ఎడమ గుండె, కుడి గుండె లేదు కదా? ఈ లక్షణాలు ఒక్క మానవుని శరీరంలో మాత్రమే ఉన్నవికావు. కానీ మరెన్నో లక్షణాలు మానవులలో మాత్రమే ఉన్నాయి. వాటిని గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి.
మెదడు ప్రసక్తి వచ్చింది. మెదడు ఉన్నందుకు ఆలోచనలు ఉన్నాయి. ఎదుటి వారిని, ప్రపంచాన్ని పరిశీలించే పద్ధతి ఉంది. తెలివిని వాడుకుని ఈ ప్రపంచంలో సౌకర్యంగా బతకడానికి ఈ మెదడు ఎంతో సాయం చేసింది. మనిషి మెదడుకు అంతకన్నా ఎక్కువ ప్రత్యేకతలు ఏమున్నాయి?
మెదడు నాది. మీరు చదువుతున్న పుస్తకం మాత్రం మీది. వ్యాసం రచన చేసింది నేను. ఇందులోని ఆలోచనలు పూర్తిగా నా స్వంతం కాకపోవచ్చు కానీ చెప్పిన తీరు మాత్రం నూరు శాతం నాది. నాకు ఒక ఊరు ఉంది. పేరు ఉంది. భూమి లేదు. కొన్ని చొక్కాలు ఉన్నాయి. పక్కింటి వాళ్లు ఉన్నారు. వాళ్ల ఇల్లు వాళ్లదే. చికాకు పడకండి! ఈ స్వంతదనం అన్న భావం మనుషులకు ఉన్నంతగా మరే ప్రాణికి లేదు. నాది అన్న భావం కలిగిన తరువాతే నగరాలు, నాగరికత మొదలయ్యాయి. మొత్తం మానసిక తత్వంలోనూ, పరిణామ క్రమంలోనూ ఈ స్వంతదనం అన్న భావానికి గట్టి పాత్ర ఉంది. మన వస్తువులు కేవలం వాడుకోవడానికే అయితే బాగుండును. చాలా వస్తువులు ఉన్నాయని మనం మరిచిపోతాము. కానీ ఉన్నాయన్న ఆనందంలో బతుకుతూ ఉంటాము. ఇదొక పెద్ద ప్రత్యేక లక్షణం. ధనం నిలువ వేసుకున్న వాళ్లకు దాన్నంతా అనుభవించడం చేతకాదని తెలుసు. ప్రపంచాన్ని శాసిస్తున్నాను అనుకునే పిచ్చిమారాజు చేతనయినన్ని వస్తువులను మూటగట్టుకుని మోసుకు తిరుగుతుంటాడు. వీళ్లిద్దరి ఆనందంలో తేడా ఉందా? వ్యాపారం అన్న భావన ఈ స్వంతదనానికి పర్యవసానం. ఆ తరువాత ప్రజల మధ్యన సంబంధాలు. ఇదంతా నాగరికతలో భాగంగా మొదలయింది.
మిత్రులకు మన వస్తువులు ఇచ్చినా పరవాలేదు. ఆ దోస్తీ చెడిననాడు ఇచ్చిన వస్తువులు లాక్కురావాలి. అసలు నిజానికి మనకు మిత్రులు అవసరమా? ఆడా, మగా స్నేహం చేస్తే ఆశ్చర్యంగా చూస్తారెందుకు? ఇంటర్నెట్‌లో ఆయనకు ఎవరికో లక్ష మంది మిత్రులు ఉన్నారట. వాళ్ల పేర్లు కాదు గదా, అసలు ఏ వివరమూ ఆ మనిషికి తెలిసి ఉండదు. అంటే రానురాను స్నేహం అన్న మాటకు అర్థం మారుతున్నదా? ఇక బంధుత్వం గురించి కూడా చెప్పుకోవాలి. ఈ బంధుత్వాలు ప్రపంచమంతటా ఒకే రకంగా లేవు. మన దగ్గర కూడా వ్యవస్థ బాగా మారుతున్నది. పెద్ద కుటుంబాలు కనిపించకుండా పోతున్నాయి. పిల్లలు తల్లిదండ్రులతో ఉండడం అరుదయింది. ఈ రకంగా పోతే మానవుల మధ్య సంబంధాలు, వారివారి స్వభావాలు మారి తీరతాయి. భావాలు, బంధాలు, ఆవేశాలు కూడా కొత్త దారులు తొక్కుతాయి.
భయం అనవసరం అని చెప్పడం బాగానే ఉంటుంది. చెప్పిన మనిషికి కూడా భయం ఉండనే ఉంటుంది. వద్దన్నా కోపం వస్తుంది. ఈ కోపం అన్న భావం మరెన్ని జంతువులలో ఉన్నది. కోపాన్ని కూడా వాడుకుని గొప్ప ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. అనుకున్నది జరగకపోతే నిరాశ. తన మీద తనకే ఏవగింపు మొదలయిన భావాలు మనిషికి ప్రత్యేకమా?
ఇలాంటి విషయాలను గురించి ప్రపంచంలో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. మనిషిగా మనిషి తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం వ్యక్తిగతంగా చేస్తే కుదరదు. సమష్టిగా చేయడానికి ఇది సరదా పనికాదు. కనుకనే కొంతమంది మిగతా పనులు మాని పరిశోధకులుగా పని చేస్తున్నారు. వాళ్లు మన గురించి మనం తెలుసుకోవలసిన సంగతులను మెల్లమెల్లగా మన ముందు పెడుతున్నారు. అవి తెలుసుకుంటే మన బతుకులు మారుతాయేమో తెలియదు కానీ, తప్పకుండా ఆనందం మాత్రం కలుగుతుంది. మానవుడు సాధించిన విజయాల వెనుకగల విషయాలు తెలిస్తే అసలు విజయం అంటే ఏమిటో తెలిస్తే అదొక ఆనందం. ఆ విజయాన్ని అర్థం చేసుకోవడం, స్వంతం చేసుకోవడం జీవితానికి ఒక గమ్యాన్ని ఇస్తుంది. నాకు ఏదో అర్థమయింది అనుకుని ఆ సంగతి మిగతా వారికి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ లక్షణం మనిషికి ప్రత్యేకం అని నేను ఇక్కడే చెపితే గొప్పగా కనిపించదు. ఒక్కమాటలో చెపితే మనిషిగా బతకడం అన్నది మహత్తరమయిన విషయం. ఆ విషయాన్ని అర్థం చేసుకుని బ్రతికితే మరింత బాగుంటుంది. అందుకు కొంత ఓపిక కావాలి. కొంత తీరిక కావాలి.
మనిషి గురించి ఆలోచించడం మొదలుపెడితే పొంతన లేని ఎన్నో విషయాలు ముందుకు వస్తాయి. వాటిని వివరించి చెప్పడానికి మంచి మెళకువ అవసరం. మన దేశంలో కేబుల్ టి.వి. మొదలయినప్పుడు బిబిసితో పాటు కేవలం అయిదు ఛానల్స్ మాత్రమే ఉండేవి. అప్పట్లో బిబిసిలో మనిషి పరిణామం గురించి ఒక చక్కని సీరియల్ చూపించారు. అన్యాయంగా అది ఉదయం పూట వచ్చేది. అప్పట్లో నేను ఉద్యోగం చేసేవాడిని. సీరియల్ చూచిగాని ఆఫీస్‌కు వెళ్లేవాడిని కాదు. ఇవాళ ఇనే్నళ్ల తరువాత ఆ సీరియల్ పుస్తక రూపంలోనూ, సీడీలుగానూ నా దగ్గర ఉంది. ఇందులో ఆశ్చర్యం ఎంత మాత్రం లేదు. జేకబ్ బ్రోనోవ్‌స్కీ అని ఒక శాస్తవ్రేత్త. సీరియల్ తీసేనాటికి కాస్త పెద్ద వయసువాడు. కానీ పొట్టిగా ఉంటాడు. ప్రపంచంలో పుట్టిమాటకు అనుగుణంగానే పొట్టివాడయిన అతను చాలా గట్టివాడు. అనుకోకుండా అప్పటికప్పుడు మనిషి గురించి, పరిణామం గురించి అతను చెపుతూ ఉంటే కథలాగ వినిపిస్తుంది. అవును కదా అనిపిస్తుంది.
పరిణామం గురించి తెలిసిన పరిశోధకులు చాలామంది ఉండవచ్చు. అందులో జేకబ్ కన్నా గొప్పవాళ్లు కూడా ఉండవచ్చు. కానీ చరిత్రను, కళను, మానవ సంస్కృతిని, సాహిత్యాన్ని, మనస్తత్వాన్ని తగిన పాళ్లలో కలబోసి సులభమయిన మాటలతో మెదళ్లలో గుచ్చుకునేలాగ చెప్పడం అందరికీ చేతకాదు. అందుకే బ్రొనోవ్‌స్కీ ముందుకు రాసుకున్న మాటలు కాకుండా అప్పటికప్పుడు చెప్పిన మాటలను ఆ తరువాత పుస్తకంగా వేయాలని అనుకున్నారు. వేశారు కూడా. పుస్తకం సీరియల్‌కన్నా బాగా పోయింది. చిత్రంగా బ్రొనోవ్‌స్కీ మాతృభాష ఇంగ్లీష్ కాదు. అయినా అతను మాట్లాడిన తీరు చాలా గొప్పగా ఉంటుంది. చేయి తిరిగిన చిత్రకారుడు కుంచెతో అలవోకగా రంగులను అద్దుతూ చిత్తర్వుకు రూపం పోసినట్టే బ్రొనోవ్‌స్కీ ఆలోచనలకు రూపం పోశాడు. ఆ ఎపిసోడ్స్ చూచిన వారికి, పుస్తకం చదివిన వారికి మనిషి గురించిన అవగాహన కొంచెం బలంగానే ఉంటుంది.
మనిషి అంటే అంటూ నేను ఒక ప్రయత్నం మొదలుపెట్టాను. జవాబు వెతికే మార్గంలో నాకు దొరికిన సామగ్రి చాలామటుకు పాతది. కొన్ని పుస్తకాలు మాత్రం చాలా సాయం చేశాయి. విషయం అర్థమయినట్లే ఉంది, కానట్టు కూడా ఉంది. అదే మరి మనిషి ప్రత్యేకత.

-కె. బి. గోపాలం