లోకాభిరామం

ఒక్కసారి వెనక్కి తిరిగి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యాలెండర్ మారింది. అంతకు మించి మరేదీ మారదు. సూర్యుడు నిత్యంలాగే తూర్పున ఉదయిస్తాడు. పడమట అస్తమిస్తాడు. ఆ సూర్యుడి కదలికలను లెక్కించడానికి మనిషి వేసుకున్న పథకం క్యాలెండర్. ఆ సంగతి సూర్యుడికి తెలియదు. కొత్త సంవత్సరం అని అందరూ ఎంత గోల చేస్తున్నా అతను మాత్రం తన దారిలో, తన పాత దారిలో, తన పద్ధతిలో, తన పాత పద్ధతిలో నడిచి వెళ్లిపోతాడు. ఇలా నేను రాస్తూ కొనసాగిస్తే చదువుతున్న వాళ్లలో చాలామందికి కోపం వచ్చే అవకాశం కూడా ఉంది. కోపం తెప్పించడం నాకు కొత్త కాదు. విసుగు పుట్టించడం అంతకన్నా కొత్త కాదు. రెండూ చేయకుండా మరేదో చేయాలి. దాని పేరే మసిపూసి మారేడుకాయ. నేను ఎందుకు చెపుతున్నానో తెలియదు, చదివే వాళ్లు ఎందుకు చదువుతున్నారో తెలియదు. నా రాతలను గురించి ఉత్తరాలు తగ్గిపోయినట్టు నేను గమనించాను. అయినా రాస్తూనే ఉన్నాను. అందుకే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి. దాన్ని సింహావలోకనం అంటారు. సింహానికి మెడ తిరగదు. శాల్తీ మొత్తం తిరిగి వెనకకు చూడాలేమో! ఈ వెనుకకు చూడడం పెద్ద చిక్కు.
వెనుకకు తిరిగి చూడాలంటే ఏమీ కనిపించడం లేదు. కళ్లు పొడుచుకున్నా కొంత దూరం మాత్రమే కనిపిస్తున్నది. గుండెను మండించి చూస్తే మరింత కనిపిస్తుందని ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి మాటలేవో ఒకచోట రాశాను. మంచి గతమున కొంచెమేనోయ్ అన్న మనవాళ్లే గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్నారు. మా తరానికి పాత తప్పిస్తే తెలియదు. తరువాతి వాళ్లకు గతం గురించి పట్టింపు లేదు. అవసరమా అని అడుగుతున్నారు కూడా. నండూరి రామకృష్ణమాచార్యుల వారు నా గురించి పద్యం రాస్తూ, రేపు రూపు చూపి గోపాలవిజ్ఞాని కొత్తతరము వెలుగు నింపుగాక అని ఆశీర్వదించారు. సైన్స్ రాస్తాను కాబట్టి ఆయన అట్లా అని ఉంటారు. లోకాభిరామంలో సైన్స్ రాస్తే అది సైన్స్‌లాగ కనిపించకుండా, వినిపించకుండా రాయవలసి ఉంటుందని అనుభవం మీద తెలుసుకున్నాను. ఇక్కడ గతం గురించి రాయడంలోనే ఒక ప్రయోజనం, ఒక పద్ధతి కొనసాగింది. చాలామంది నన్ను నాష్టాల్జియా రాస్తున్నావు అన్నారు. అంతకు మించిన చాలామంది ఇది చదవడానికి బాగుంది అని కూడా అన్నారు. ఈ రకమయిన సంగతులను చెప్పేవాళ్లు లేరు అని నన్ను చెట్టు ఎక్కించే ప్రయత్నం కూడా చేసినట్టున్నారు. నేను చెట్టు ఎక్కేశాను. కానీ ఆ సంగతి నాకు తెలుసు. నేను తరచూ ఒక మాట చెపుతుంటాను. నేను పిచ్చివాణ్ణి అని. మరొక మాట కూడా చెపుతుంటాను. దురదృష్టం, నేను పిచ్చివాడిని అని నాకు తెలుసు అని కూడా చెపుతుంటాను. అందుకే ఒకసారి వెనుకకు తిరిగి చూడాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది.
అప్పుడు తెలుస్తుంది పొరపాట్లు చేశాను అని. లోకాభిరామం అయిదవ సంవత్సరంలో నడుస్తున్నది. మొదటి మూడు సంవత్సరాల వ్యాసాలను పుస్తకాలుగా అచ్చువేశాను కూడా. ఈ సంగతి ఇక్కడ పాఠక మిత్రులకు ప్రస్తావించి చెప్పే సందర్భం రాలేదు. అది నేను తేకుండా రాదు. అంటే ప్రయత్నించి నేను చెప్పలేదు అని అర్థం. ఇది కూడా ఒక పొరపాటే. రెండు సంపుటాలుగా పుస్తకాలు వచ్చాయి అని సంతోషంగా తెలియజేస్తున్నాను. లోకాభిరామం మొదలయిన కాలంలో ప్రపంచ తెలుగు మహాసభల గురించి ఒక వ్యాసం రాశాను. కేవలం జ్ఞాపకాల మీద ఆధారపడి రాసినందుకు ఆ వ్యాసంలో ఒక పెద్ద తప్పు దొర్లింది. సభల సమయంలో ఒక పెద్ద మనిషి చనిపోయాడు అని రాశాను. సభలు 1975లో జరిగాయి. నేను చెప్పినా పెద్దాయన 1966లో చనిపోయాడు. ఈ సంగతి నా దృష్టికి వచ్చే పుస్తకం ఒకటి ఈ మధ్యన రాయవలసి వచ్చింది. ఆలోగా ఒక మిత్రుడు ఫోన్ చేసి నా తప్పును ఎత్తిచూపించాడు. పుస్తకాలు కూడా అచ్చయినయి. వాటిని ఇప్పటికే చాలామంది కొన్నారు. వెళ్లి అన్ని ప్రతులలో నేను ఆ వాక్యాలను కొట్టివేయడం కుదరదు. రిచర్డ్ ఫేన్‌మన్ అని ఒక భౌతిక శాస్తజ్ఞ్రుడు ఉండేవాడు. నేను అభిమానించిన మానవులలో అతడొకడు. నొబేల్ బహుమతి కూడా గెలిచాడు. అమెరికా నుంచి వచ్చిన పరుచూరి శ్రీనివాస్‌గారు నా అభిమాన సైంటిస్ట్ పేరు ఫైన్‌మన్ అని పలకాలని చెప్పారు. ఇదిగో మరొక పొరపాటు. కనుక ఇప్పుడయినా ఆయనను ఫైన్‌మన్ అందాం. ఆ మహానుభావుడు ఒక గొప్ప విషయం చెప్పాడు. ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే చాలా తప్పులు చేశామని తెలుస్తుంది. కానీ వాటిని దిద్దుకోవడానికి అప్పుడిక అవకాశం లేదని అర్థమవుతుంది అంటాడు ఫైన్‌మన్. అదే పరిస్థితిలో నేను ఉన్నాను. కనీసం తప్పు చేసిన భావన నా మనసులో ఉంటే ఇకమీదయినా జాగ్రత్తగా ఉండడం వీలవుతుంది.
ఈ మధ్యన ఎక్కడో జోకు కాని జోకు ఒకటి విన్నాను. భర్త తలలాంటి వాడు నిజమే. ‘ఇంగిలీషులో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ’ అంటారు కూడా. కానీ అతని భార్య మెడ లాంటిదట. ఆమె తలుచుకుంటే ఈ భర్త ఎటువేపు అయినా తిరగగలుగుతాడు. తనంతకు తాను తిరగడం తలకు కుదరదు, వెనుకకు తిరగడం గురించి మాట్లాడుతున్నాను కనుక ఇది జ్ఞాపకం వచ్చినట్టుంది. ఇక్కడ నేనే వెనుకకు తిరిగి చూచానని, తప్పు తెలుసుకున్నానని, లెంపలు వేసుకుంటున్నానని అని మీరు గుర్తిస్తే సంతోషిస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఎవరయినా వేలు ఎత్తి పొరపాటు చేశావు అని చూపిస్తే, మొట్టమొదట పుట్టెడు అవమానం కలుగుతుంది. తరువాత దుఃఖం కలుగుతుంది. ఆ తరువాత, ఆహా! నా తప్పు తెలిసింది కదా, సరిదిద్దుకునే అవకాశం దొరికింది కదా అని సంతోషం కలుగుతుంది. ప్రస్తుతం నేను అటువంటి స్థితిలో ఉన్నాను.
వ్యాసం మొదట్లో ఎత్తుకున్న మాటలను గుర్తుకు తెచ్చుకుంటే ఈ కొత్త సంవత్సరం అన్నది ఒక్కసారి వెనుకకు తిరిగి గతాన్ని పరిశీలించుకోవడానికి చక్కని అవకాశం. తప్పులే వెతకనక్కర్లేదు. దిద్దుకోవలసిన తప్పులయితే వెతికినా ఫరవాలేదు. అంతకన్నా మించి గడచిన సంవత్సరంలో ఏం సాధించామో, ఏం చేశామో ఒకసారి గుర్తు చేసుకుంటే ఎంతో బాగుంటుంది.
నాకు సింహావలోకనంలో ఒక విషయం అర్థమయింది. అచ్చు పుస్తకాలు కొంటున్నాను. అంతకన్నా పెద్దఎత్తున ఎలక్ట్రానిక్ పుస్తకాలు సేకరిస్తున్నాను. వాటిని అన్నింటినీ చదవలేక పోతున్నాను. చదవలేనప్పుడు పుస్తకాలు కొనడం ఎందుకు? ఇది నా ఎదుటనున్న ప్రశ్న. అదే పనిగా చదువుతూ ఉంటే, వెతుకుతూ ఉంటే ఏదో ఒక విషయం ముందుకు వస్తుంది. ఇక దానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయా అని వెతకడం, బ్రిటిష్ రాజ్ కాలంలో కొన్ని చిత్రమయిన రచనలు వచ్చాయి. చార్‌ల్స్ అలెన్ అనే ఒకతను కొన్ని పుస్తకాలు రాశాడు. అలనాటి రాజకుమారుల జీవితాలు, బ్రిటిష్ వారి జీవితాలు ఎలాగుంటాయని అతను వర్ణించాడు. రుడ్‌యార్డ్ కిప్లింగ్ గురించి ఇతను ఎన్నో విషయాలు చెప్పాడు. సోల్జర్ సాహిబ్ అని ఒక పుస్తకం రాశాడు. అది సైనికుల గురించి అని చెప్పనవసరం లేదు. హారిస్ రాసిన మూడు పుస్తకాలు తెప్పించాను. ఒకటి మాత్రమే చదివినట్టున్నాను. మిగతావి నన్ను వెక్కిరిస్తున్నాయి.
రాబర్ట్ హారిస్ అని మరొక రచయిత గురించి తెలిసింది. సీజర్‌ల తరువాత లేదా చివరి కాలంలో రోమ్‌లో సిసెరో అనే ఒక తాత్వికుడు, వకీలు, వక్త ఉండేవాడు. అతను చాలా అధికారం సంపాదించాడు. ఆ సిసెరో గురించి హారిస్ మూడు నవలలు రాశాడు. ఆ మూడింటిని తెప్పించాను. వాటిని ఇంకా ముట్టుకోలేదు.
ప్రసిద్ధ బెంగాలీ రచయిత శరచ్చంద్ర ఛటర్జీ నా అభిమాన రచయితలలో ఒకరు. ఆయన నవలలన్నీ విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే వెతికి వెతికి మరీ చదివాను. మళ్లీ కొని మళ్లీ చదివాను. అన్నీ లేవుగానీ, కొన్ని నా దగ్గరే ఇంట్లోనే ఉన్నాయి. వాటిని అప్పుడప్పుడు చదువుతూంటాను. ఆ మధ్యన నాగ్‌పూర్ వెళ్లినప్పుడు హిందీ అనువాదాలు కొన్ని కొని తెచ్చాను. వాటిని ఇంకా చదవలేదు. చేసిన ఈ పొరపాటు చాలదన్నట్టు మొన్నటికి మొన్న శరత్ ఎనిమిది నవలల ఆంగ్లానువాదాలు ఒకేచోట ఉన్న సంపుటం మరొకటి తెప్పించాను. ఈ పుస్తకం రాకముందే ఎలక్ట్రానిక్ రూపంలో శ్రీకాంత చదువుతున్నాను. పుస్తకాలు తెప్పించడం, వాటిని చదవకుండా పక్కన పెట్టడం పెద్ద తప్పు అని నేను భావిస్తున్నాను. ఉన్న వాటిని చదివేదాకా కనీసం కొత్త పుస్తకాలు కొనను. నేను ఎవరికీ మాట ఇవ్వడం లేదు. చాలా త్వరగా సంగతి మరచిపోయి పుస్తకం కొనవలసిన పరిస్థితి వస్తుందేమో!
నాకు మాట మీద నిలబడడం చేతనవుతుందో కాదో నేనే తేల్చి చూడాలి.

కె. బి. గోపాలం