లోకాభిరామం

చాయోపాఖ్యానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుర్మాసంలో ఒకరోజున ఉదయానే్న గుడిలో పూజలు జరిగాయి. పులిహోర, దధ్యోధనం, చక్కెర పొంగలి ప్రసాదాలు పుష్కలంగా పెట్టారు. అందరూ లేచి బయలుదేరుతున్నారు. ‘ఒక కప్పు టీ కూడా ఇస్తే, ఇంటికెళ్ల నవసరం లేకుండా ఇక్కడి నుంచే పనిలోకి వెళ్లిపోయేవాళ్లం కదా!’ అన్నాడొకాయన. చాయ, మనలను ఛాయలాగ పట్టుకున్నది. మన అలవాట్లలో భాగమయింది. కానీ ఆచారాల్లో భాగం కాలేదు. లేకుంటే గుడిలో తీర్థంతోబాటు ‘టీ’ర్థం కూడా ఇచ్చేవారేమో?
ఇంటికి చుట్టాలు, పక్కాలు వస్తే తినడానికి ఏ పెట్టినా పెట్టకున్నా ఫర్వాలేదు గానీ, ఇన్ని టీ నీళ్లు మొగాన కొట్టకపోతే మాత్రం ఇంటి వారి గౌరవం దక్కదు. మంచినీళ్లు ఉన్నా లేకున్నా సరే టీ నీళ్లు లేని ఇల్లు ఎందుకూ పనికిరాదు. పది కొంపలును లేని పల్లెయందును కూడా రామమందిరమొకటి వరలవలెనని వాల్మీకి చెప్పారట. అదేమీ నిజమయినట్లు లేదు గానీ, ప్రతి పల్లెలోనూ ఒక టీ కొట్టు మాత్రం తప్పకుండా ఉంటుంది. సంతోషం కలిగితే పది మందితో టీ పంచుకోవాలి. అలసటయితే టీ పడాలి. అదే సందర్భమయినా టీ లేనిదే కుదరదు. పెళ్లి వారిని ప్రాణ్‌పహార్‌తో స్వాగతించాలంటాడు టీవీలో ఒక భారీకాయం పెద్దాయన. సరదాకు నేను పేరు మార్చిన గాని ఆయన పాన్ పరాగ్ కావాలంటడు. అది ఇప్పటి సంగతి కాదు. ఒకప్పుడు ఆ ప్రకటన వచ్చేది. ఇప్పుడు ఆ పదార్థము ఉందో లేదో తెలియదు. ఆ పెద్ద మనిషి మాత్రము లేడు. అది అడ్వటయిజ్‌మెంట్ గానీ, నిజానికి పెళ్లి జరుగుతున్నంతసేపూ టీ భట్టీ మరుగుతూనే ఉండాలి. మగపెళ్లి వారికి టీలు సరిగ్గా అందకపోతే మాట వస్తుంది. మొదట్లో చాయ వచ్చినప్పుడు ఉచితంగ పోస్తము అన్నా సరే ఎవర తాగలేదట. ఈ సంగతి గురించి పెద్దలు చెప్పిన కథలు చిత్రంగ ఉండేవి.
మన దేశానికే కాదు, ప్రపంచానికంతా టీని అందించింది చైనా దేశం. అక్కడ ఈ కషాయాన్ని ‘చా’ అంటారని చాప్రియులకు చాలామందికి తెలియకపోవచ్చు. ఒకానొక చైనా చక్రవర్తి ఆరోగ్య సూత్రాలు పాటించాలని నీళ్లను మరగబెడుతున్నాడట. అందులోకి గాలిలో ఎగిరి వచ్చిన ఎండుటాకులేవో పడి మంచి గుబాళింపు వచ్చింది. సైంటిఫిక్ టెంపర్ గల ఆ చక్రవర్తి సంగతేమిటో తెలుసుకోవాలని ఆ నీటిని కొంచెం తాగి చూచాడు. బాగనిపించాయి. ఆ రకంగా ఈ ప్రపంచానికి టీ అదే పానీయం అందింది. టీ గురించి మొట్టమొదటి పుస్తకం క్రీ.శ.800లోనే రాశారు. దాని పేరు ‘చాయ్ చింగ్.’
పెళ్లి వారు దిగబడగానే ముందు టీ అందించాలని మన దగ్గర సంప్రదాయముంది గానీ, చైనాలో పెళ్లి తంతులో టీకి ఆచారపరంగా ప్రత్యేక స్థానముందని మన వారికి తెలిసినట్లు లేదు. ఆ దేశంలో ఎవరికయినా టీ ఇవ్వడం గౌరవం. అది మర్యాదతో ముగియకుండా ఆచారమయింది కూడా. పెళ్లి కుమారుడు ముహూర్తానికి వచ్చే ముందు, పెళ్లికూతురు తన తల్లిదండ్రులకు లాంఛనంగా టీ అందిస్తుంది. ఎవరి సాయం లేకుండా ఆమె ఒక్కతే తల్లిదండ్రులకు, తనను కనిపెంచినందుకు కృతజ్ఞతగా ఇలా ‘చాయ్’ ఇస్తుంది. పెళ్లి అయిన తర్వాత కూడా దంపతులిద్దరూ కలిసి మన దగ్గర ఫల తాంబూలాలు ఇచ్చినట్లు ఒక్కొక్కరికీ పేరు పేరునా పిలిచి పెద్దలందరికీ టీ ఇస్తారు. వారు గుండ్రని పింగాణీ గినె్నల్లో టీని రెండు చేతుల్లో జాగ్రత్తగా పట్టుకుని మోకరిల్లి గౌరవంగా వంగి చాయ్ అందించడం చూడముచ్చటగా ఉంటుంది.
మన దేశానికి చాయ్ వచ్చింది. అంతేగానీ దానితో కలిసి పద్ధతులు, సంప్రదాయాలు ఒకటి కూడా రాలేదు. మన దేశంలో తాగినట్లు మరగకాచిన టీ ఇంకెక్కడా తాగరు. పాలు కలుపుకుని తాగడం కూడా మన దేశంలోనే. మన దేశంలో మంచి రకం టీ పండుతుంది. అందులోని మంచి ఆకు మరెక్కడికో ఎగుమతి అవుతుంది. మిగిలిన దుమ్ము మాత్రం మనకు అమ్ముతారు. చాలా పొట్లాల మీద ‘టీ డస్ట్’ అని రాసి ఉండేది కూడా. చైనాలో టీ తాగే కప్పులను ముందు వేడి నీరు పోసి వెచ్చజేస్తారు. ఆకులుండే పాత్రలో కూడా అలాగే మరిగే నీరు పోసి, వచ్చిన లేతాకు పచ్చరంగు ద్రవాన్ని పోసుకుని తాగుతారు.
మనకు ఏ విషయంలోనయినా సారాన్ని ఆసాంతం అనుభవించటం అలవాటు. అందుకే టీ దుమ్ము నిస్సారమయిందాకా మరగకాచి, వచ్చిన చిక్కని కషాయంలో పాలు కలిపి, (కొందరు మీగడ కూడా కలిపి) తాగడం అలవాటయింది. టీ పోసే ముందు కప్పును కడిగి చల్లబరచడం మనకు అలవాటు. చల్లని కప్పులో టీ పోస్తే గుబాళింపు తగ్గుతుందని చైనా వారంటారు. ఇక టీలో పాలు కలుపుకోవడం గురించి ఆలోచిస్తే గుండె చెరువవుతుంది. ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్న పాలలో ఎన్ని టీ, కాఫీలలో కలుస్తున్నాయి. ఎన్ని పసిపిల్లలకు, మిగతా అవసరాలకు మిగులుతున్నాయని లెక్కవేసుకుంటే ‘శే్వత విప్లవం’ సంగతి చెప్పనవసరం లేకుండానే తెలిసిపోతుంది. నదులకు సాగరమే గతి అన్నట్లు, పాలుండేది టీలో కలపడానికే. కొన్ని చోట్ల అచ్చం పాలలోనే టీ పొడిచేసి చిక్కటి చాయ్ చేసుకుని తాగడం ఉంది. అలాగయినా కొంచెం బావుండేదేమో కానీ, అటువంటి చాయ్ చాలామందికి నచ్చదు.
జంటనగరాలలో ‘ఇరానీ చాయ్’ అనే ఒక ప్రత్యేక పానీయం ఉంది. ఇందులో తెల్లవారుతున్నప్పుడు వేసిన మొదటి పొడితో సాయంత్రం దాకా అంచెలంచెలుగా పొడి కలుస్తూ మరుగుతూనే ఉంటుందంటారు. అంత అన్యాయం కాకున్నా అది ఇంట్లో, ఇతర హోటళ్లలో తయారయే టీలాగ మాత్రం ఉండదు. ఒకప్పుడు ఇరానీ చాయ్ తయారుచేసే పాత్రలో గసాల కాయలు వేసేవారని దాంతో ఆ చాయ్‌కు మంచి రుచి, వాసనలతోబాటు మత్తుగుణం కూడా ఉండేదని అంటారు. ఇప్పుడు గసాలు లేవు, కాయలు లేవు గానీ, మిగతా గత్తర ఏదో కలుపుతున్నారని మాత్రం అనేవారు కొందరున్నారు. జంటనగరాల చాయ్ గురించి చెప్పుకునే సందర్భంలో, సింగిల్ టీ గురించి వివరించకపోతే అన్యాయమవుతుంది. ఉదయం నుంచి మళ్లీ ఉదయం దాకా అనవరతంగా టీ తాగేవారికి ఒక్కసారిగా ఎక్కువ టీ తాగడం ఇష్టం ఉండదు. అందుకే కప్పు నిండా ఇస్తే ఒక టీ. అందులో సగానికే ఇస్తే సింగిల్ టీ (సింగిల్ అంటే కూడా ఒకటే కదా!) ఈ పద్ధతి ఈ మధ్యన ఉన్నట్లు లేదు. అటువంటి సగం టీ మాత్రమే తాగదలుచుకున్న వారు మరొకరిని వెంటబెట్టుకు వెళితే వన్ బై టూ పద్ధతి మాత్రం ఉంటుంది.
చా తాగితే మనసు ప్రశాంతమవుతుందని గద అందరు తాగుతరు. మరి ఇంట్లో అందరు తాగుతుండంగ నాకు చా ఎందుకు అలవాటు కాలేదన్నది ఆశ్చర్యం. నాన్న తప్పకుండ ఉదయాన చా తాగేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లో సాయంత్రం కూడ చా భట్టీ మొదలయింది. అందరికి కాచి పోసిన కాని నేను తాగలేదు. అందుకే ప్రశాంతముగ ఉండడము నాకు తెలియదు. సందర్భం అవునో కాదో తెలియదు గానీ, ‘టీ కప్పులో తుఫాను’ అని ఒక మాట గుర్తుకు వస్తున్నది. మనకు తెలుగులో చిలికి చిలికి గాలి వాన అని ఒక అందమయిన మాట ఉండనే ఉన్నది. ప్రపంచాన్ని యావత్తు ప్రభావితం చేసిన ఆంగ్ల భాష పుణ్యమా అని అర్థం లేని మాటలు కొన్ని మన భాషలోకి చేరినయి. చిన్న సంగతి పెద్ద సమస్యగ మారితే, అదే చిలికి చిలికి గాలివాన. మజ్జిగ చిలుకుతుంటే అయ్యే చప్పుడును బాగ పెంచి వింటే గాలివాన వలెనే ఉంటుంది. ఆంగ్లములోని ‘స్టార్మ్ ఇన్ ఎ టీ కప్’ అనే మాటను మనవారు టీ కప్పులో తుఫాను అని మార్చుకున్నరు. అది కూడ మన చిలికిన గాలివాననే. స్టార్మ్ కాక టెంపెస్ట్ కూడ చాకోపులో అంటే టీ కప్పులో వస్తుందట. అంటే టీ కప్పులో పెనుతుఫాను.
చిత్రం ఏమిటంటే టీ తెలియక ముందు నుంచే ఇటువంటి మాట ఒకటి ఉందని అంటున్నారు. రోమ్ చరిత్రలో మార్కస్ టులియస్ సిసెరో అని ఒక తాత్వికుడు, వకీలు, వక్త ఉండేవాడు. సీజన్ల చివరి దశలో ఇతను ఎంతో పేరు సంపాదించాడు. ఇంగ్లీషులో ఇతను గురించి వచ్చిన మూడు నవలలు నా బల్ల మీద ఉన్నయి. ఇంతకు ఈ సిసెరో, ‘గ్రాటిడియస్’ అనేవాడు గరిటెలో పెనుతుఫాను పుట్టించాడుట’ అన్నాడట. అతను క్రీస్తు పూర్వము మనిషి.
చా గురించి సూఫీ సంప్రదాయంలో ఒక కథ ఉన్నది. చా తయారుచేయడము ఒక రహస్యమట. దాన్ని తెలుసుకునే ప్రయత్నాలు, రాడులు దాన్ని కాపాడడమూ, టీ అన్నది సూఫీ తత్వానికి ప్రతీకగ కనిపించే వరకు కథ సాగుతుంది. టీ పెట్టెలో గొప్ప కవితా భాండాగారము, సున్నితమయిన భావనలు ఉన్నాయని కొందరు మనుషులు నాకు చెపుతారు అన్నాడు లాల్‌హేవాల్డో ఎమర్సన్. అంటే అర్థమేమిటో నాకయితే బోధపడలేదు.
టీ గురించి ఒక ఎన్సైక్లొపీడియా ఉన్నది. పుస్తకాలకు లెక్కే లేదు. లా దగ్గరనే నాలుగయిదు ఉన్నయి. చా, చాయ్, టీ గురించి ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడకి చేరితిమో.
ఇతి చాయోపాఖ్యానం.

కె. బి. గోపాలం