లోకాభిరామం

అదే తెలుస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వం చాలా పెద్దది. అందులో మనిషి పరిశీలించినది చాలా తక్కువ. ఆ తక్కువ మీదనే ఇప్పుడున్న తెలివి మొత్తం ఆధారపడి ఉన్నది. తెలిసిన ఈ నాలుగు సంగతులు శాశ్వత సత్యాలు, సర్వత్రా సత్యాలు అన్న భావంతో మనిషి ముందుకు పోతున్నాడు. విశ్వానికి మనమే నిర్ణయించిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. పదార్థ నిర్మాణానికి ఆధారమయిన న్యూట్రాన్, ఎలక్ట్రాన్ లాంటివి మొదటి ఉదాహరణ. అవి నిరంతరం కదులుతూ ఉండే నిర్మాణాలు. కానీ, అవే స్థిరత్వానికి ఆధారాలు! కనుకనే, కదలిక లేనిదే ప్రపంచం లేదన్న సిద్ధాంతం వచ్చింది. బలపడింది. కానీ అది ఇంకా అందరికీ అర్థం కాలేదు. నిజంగా ఆలోచించగలిగితే, కదలికే స్థిరత్వం! స్థిరంగా కనిపించేవన్నీ నిజానికి కదులుతున్నాయి. నునుపుగా ఉన్న తలాలన్నీ సూక్ష్మంగా చూస్తే, ఒక క్రమంలో ఉన్న ఎత్తుపల్లాలలని భౌతిక శాస్త్రంలో ఉన్నవారు చెపుతున్నారు.
విశ్వంలోని పదార్థాల మధ్యన ఉన్న పరస్పర ఆకర్షణ, కాంతి కదిలే తీరు మొదలయిన ఉదాహరణలను ఎన్నింటినయినా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవన్నీ కారణం లేకుండానే మనం అనుకున్న పరిధుల్లో అనుభవంలోకి వస్తున్నాయి. కనుకనే, మన అనుభవాలకు, ఆలోచనలకు పరిధులు ఏర్పడుతున్నాయి. విశ్వంలో అన్ని మూలలా ఇదే పద్ధతి ఉందన్న వరకూ పరిస్థితి వెళ్లిపోయింది! ఒక్కసారి ఆలోచిస్తే, నిజానికి భయం పుడుతుంది. ఈ కాంతి తీరు, ఈ గురుత్వాకర్షణ తీరు, ఇంకొంచెం వేరుగా ఉంటే, పరిస్థితి ఏమవుతుంది? జవాబులేని ప్రశ్నలు అడగకూడదంటారు. ఈ ప్రశ్నలకు జవాబు లేవని చెప్పడమే ప్రశ్నల ఉద్దేశం. భూమి సూర్యుని నుంచి సరిగ్గా ఇప్పుడున్న దూరంలో ఉన్నందుకే మనం ఉన్నాము. మన ఉనికికి ఆధారమయిన వాతావరణం, నీళ్లు, గాలి మొదలయినవన్నీ ఉన్నాయి. ఈ దూరం ఏ కొంచెంగా మారినా, ఏమవుతుందో ఆలోచించడం కూడా కష్టం! అసలు గురుత్వాకర్షణ మారితే, విశ్వం నిలబడదేమో! సౌర మండలం ఉండనే ఉండదేమో! మీరు, నేను అన్న మనం మిగలమేమో! ఇక ఆలోచనలకు చోటే లేదేమో. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అది మామూలు పరిస్థితి. ఆలోచనలకు అందనిది జరిగితే అది కొత్త పరిస్థితి. తెలిసిన తెలివి మొత్తం తెలిసిన పద్ధతిలోనే జరగాలని, జరుగుతున్నదని అనుభవం. వాటిలో ఎక్కడో కొంచెంగా తేడా వచ్చినా, ఆశ్చర్యం కాదు, పెద్ద ఆపద ఎదురవుతుంది! అయినా సరే, మనం కొనసాగుతున్నాము, మీరు చదువుతున్నారంటే, మీరు మీరు అనే నేను రాస్తున్నానంటే, ఇదంతా ఆశ్చర్యం, ఆలోచనలు అర్థమవుతున్నాయంటే, అంతకన్నా ఆశ్చర్యం. ఆలోచనలు అనుకున్న మార్గంలో కాక, అటు ఇటుగా జరిగి కొత్త విషయాలను అందించగలిగితే, అద్భుతం! అప్పుడు మరిన్ని విశ్వాల గురించి, మరిన్ని ఆలోచనలు వస్తాయి. ఈ మాటలు కూడా ఆలోచనలే. ఇవి కూడా అనుకున్న దారిలో కాక, మరో రకంగా సాగితే బాగుంటుంది. ఆ రకంగా సాగుతున్నట్టే ఉందా? ప్రశ్నతో ఆలోచనలు సాగుతాయి.
ఆలోచన మార్గం కాదు. అది గమ్యమూ కాదు. అదే మార్గం. అదే గమ్యం! మతం కాని, అభిమతం కాని, లెక్కకానీ, తెలివికాని అవి మార్గాలు. గమ్యాలు అనుకుంటే, అవి అందుబాటులోకి వస్తాయి. సంబరం మొదలవుతుంది. నడక ఆగిపోతుంది. వెనుదిరిగినా సరే, నడక సాగాలి. నడకే గమ్యం. ఆలోచనే గమ్యం. అవే మార్గాలు కూడా!
ఆటలో చుంచు అందకుండా పారిపోయింది. ఓటమి భావం మిగిలింది. చుంచును వదిలించుకోగలిగాము. ఆలోచనను వదిలించుకునే మార్గం లేదు. అది వద్దన్నా వెంటపడుతుంది. అర్థంకాని ఆలోచన మనలో మరో ఆలోచనకు కారణమవుతుంది. చుంచు ముందులాగే ఓడిపోతాము. ఆ సంగతి ఒప్పుకోవడం ఇష్టం లేక ఆలోచనతో చివరి దాకా కుస్తీ పడతాము. అక్కడ కూడా అపజయమే ఎదురయితే, మనకు విషయం అర్థమవుతుంది. అర్థం కాలేదన్నది ఆ విషయం. అసలు విషయం మాత్రం అనుమానానికి గురవుతుంది. బాగుందని ఒక మాట చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవడం ఒక దొంగదారి. అర్థం కాలేదని అంగీకరిస్తే, కనీసం మనలో మనం మరింత బాగా ఆలోచించవచ్చు. ఆలోచనలన్నీ సరయినవి కానవసరం లేదు. అందరికీ అర్థం కానవసరం లేదు. కొన్ని ఆలోచనలు ఎవరూ చెప్పకున్నా, అందరికీ కలుగుతాయి. ఎన్నిసార్లు చెప్పినా, ఒకటే పద్ధతి. ఉన్నదనుకున్నది లేకపోవచ్చు. లేదనుకున్నది ఉండవచ్చు.
నిరూపణ జరగనంత మాత్రాన విషయం లేదనడం తప్పు. లేనిది అవగాహన. మన ఆలోచన పద్ధతి ఎక్కడో పక్కదారి పట్టి ఉండవచ్చు. సైన్స్‌లోని పైపై విషయాలు కూడా అర్థంకాని వారికి ఇదే సమస్య. ప్రపంచంలోని ఆలోచనలన్నీ కలిసి మరో దారి చూపుతుంటే, సైన్స్ మాత్రం అందరి అవగాహనకు రాగలిగే ఒక దారిని చూపుతుంది. అందరి అవగాహనకు రావడానికి అవకాశం మాత్రమే ఉంటుంది. అందరూ ఆ దారిలో ఆలోచిస్తేనే, అవగాహన వస్తుంది. సైన్స్ అన్నది వ్యక్తిగత ఆలోచన కాదు. అది సామూహిక అనుభవం. ఆ సమూహం నడిచిన దారిలో నడవడం చేతకావాలి. కొన్ని విషయాలలో తెలియకుండానే మనం ఆ దారిలో నడుస్తున్నాం. తెలిసి నడిస్తే, మరింత సులభంగా ఉంటుంది. మనం కూడా కొత్త దారిలో ఆలోచించే వీలు కలుగుతుంది. అనుమానం వచ్చిన చోట సాధికారంగా చర్చించే వీలు కలుగుతుంది.
అర్థంకాని విషయాలు మనుషులను ఆశ్చర్యం వేపు నడిపిస్తాయి. అరకొరగా చెప్పిన విషయాలు అడ్డదారిలో నడిపిస్తాయి. సైన్స్ అనుభవం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కనుక, మరొక రకంగా ఉంటుంది. సైంటిఫిక్‌గా సాగిన మిగతా శాస్త్రాలన్నీ ఇంత సులభంగానూ వేరువేరు రంగాలకు సంబంధించిన సంగతులను అవగాహనకు అందిస్తున్నాయి. సైన్స్ అంటే, బడిలో పిల్లలు చదువుకునే భౌతిక, రసాయన శాస్త్రాలు, జీవ శాస్త్రం అనుకుంటే తప్పు. ఈ మూడు రంగాలను కలిపినందుకు మరెన్నో శాస్త్రాలు పుట్టాయి. అవన్నీ, సైన్స్ కిందకే వస్తాయి. మనిషి చేసిన ఆలోచనలన్నీ సైంటిఫిక్‌గా ఉంటే, సైన్స్ కిందకే వస్తాయి. సైన్స్ అన్న మాటకు ఆలోచనలకు లాగే, ఆయా రంగాలకు లాగే, ఒక పరిధి ఏర్పడింది. పొలిటికల్ సైన్స్ అనే రాజకీయ శాస్త్రం కూడా సైన్స్ కాకుండా పోదు. తెలివిగా సాగిన తెలివి మొత్తం విజ్ఞానమే. మళ్లీ మొదటికి వస్తే, ఆ విజ్ఞానంలో ఎంతో వైవిధ్యం, అంతగానూ సామాన్యత ఉండనే ఉంటాయి. అర్థం చేసుకోవడం మన ధర్మం. అప్పుడు మన ఉనికి గురించి మనకు అర్థమవుతుంది. మీ గురించి నాకు, నా గురించి మీకు, మన గురించి మనకు అర్థమవుతుంది. ఆ ప్రయత్నంలోనే ప్రపంచమంతా ముందుకు సాగుతున్నది. మనం కూడా ముందుకు సాగాలి. మనకు అర్థమవుతుంది. ఆ ప్రయత్నంలోనే ప్రపంచమంతా ముందుకు సాగుతున్నది. మనం కూడా ముందుకు సాగాలి. ఆలోచనలకు కొత్త దారులు కూడా వేయాలి. అప్పుడు మన గురించి మనకు మరింత అర్థమయ్యే అవకాశం ఉంటుంది.
సైన్స్ కాని పరిస్థితులు ఎందుకు ముందుకు సాగుతున్నాయి. మనిషి అన్‌సైంటిఫిక్‌గా ఎందుకు సాగుతున్నాడు? గట్టిగా మాట్లాడిన వాడి మాట నిజమవుతుంది! అందరి ఆలోచనలను వాళ్లే నిర్ణయిస్తున్నారు. అది సమస్య. ఆలోచించగలగడం అందరికీ నచ్చదు. ఆలోచించకుండా బతికితే, జంతువులాగ సుఖంగా ఉండవచ్చు. కానీ జంతువు కూడా ఆలోచిస్తున్నది! కనుకనే అది విజయవంతంగా బతుకుతున్నది. ఈ విషయం అర్థంకాక మనిషి మరెవరో చెపితే వినడం నేర్చుకున్నాడు. అక్కడ సమస్య మొదలయింది. ఆలోచన, పరిశోధన అన్న మామూలు పనులను ఎవరో కొందరికి మాత్రమే వదిలేశారు. అన్ని రంగాలలోనూ అట్లాంటివారు ఉన్నారు. వాళ్ల మాటలు మంచి దారులుగానే కనిపించాయి. కనుకనే కొందరు ఆ దారుల వెంట నడిచారు. ఆలోచనలు మరీ పెరిగి, పరస్పర సంబంధాలు కుదరక వలలో రంధ్రాలు పుట్టాయి.
జీవితమన్నది అన్ని రకాల మనమనుకున్న సైన్స్ కనుక, అది బాగానే జరుగుతున్నది. ఒంటికి పడని తిండి ఎవరూ తినరు. ఈ రకంగా బతుకు బాగా సాగాలంటే, సైన్స్‌నే ఆశ్రయిస్తారు. అక్కడక్కడ మాత్రం కొన్ని ఆలోచనలు కొత్తగా లేదా పక్కగా నడుస్తాయి. అది తప్పు మాత్రం కాదు. అనుభవం మీద మళ్లీ మరో దారికి మళ్లకుంటే తప్పు!
నా బాధ నాది. వెళ్లబోసుకున్నాను. నా వంతు పని నేను చేసిన సంతోషం మిగిలింది. పైన మీ దయ.

కె. బి. గోపాలం