లోకాభిరామం

దిల్లీ దూర్ నహీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెండ్లికి, తీర్థయాత్రకు తప్పిస్తే మనవాండ్లకు ప్రయాణం చేయాలన్న ఆలోచన పుట్టదు గదా? నాకు భ్రమణకాంక్ష, అంటే తిరిగి దేశం చూడవలెనని ఉన్నది గాని పరిస్థితులు పడనియ్యవు. పరిశోధనలో ఉండంగ కాన్ఫరెన్స్‌ల పేరు మీద కొంచెం తిరిగిన. ఉద్యోగంలో ఉండంగ కూడ కొంత తిరిగిన. అయితే ఆ తీరు వేరుగ ఉంటుంది. కార్యక్రమంలోనే కాలము అంత గడిచిపోతుంది. నగరం విశేషాలు చూచేందుకు సమయం దొరకదు. బెంగుళూరుకు ఒకటికి నాలుగు సార్లు వెళ్లి వచ్చిన. కానీ నగరంలో ఒక్క సంగతి గూడ చూడలేదు. ముఖ్యంగ దిల్లీ గురించి చెప్పాలని ప్రయత్నము. కనుక అక్కడికి వెళ్లిపోదము.
నా మొదటి దిల్లీ ప్రయాణము గురించి చెప్పాలంటే ముందు నిత్యగోపాల్ గురించి చెప్పాలె. అతను మహా తెలివిగలవాడు. పాదరసము వోలె కదులుతడు. నాకంటె చిన్నవాడు. కానీ ఆలోచనలు ఒకటే గనుక దోస్తీ కొంతకాలం నడిచింది. సైన్స్ ప్రచారం అనే పని ఉద్యోగంగ దొరికింది గనుక కలలో కూడ అదే ఆలోచన. నిత్యగోపాల్‌తో కలిసి సెంటర్ ఫర్ ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ అని ఒక సంస్థ ప్రారంభించిన. సర్కారు కొలువు చేసే వాండ్లు ఇటువంటి పనులు చేయగూడదని పెద్దలు చెప్పినందుకు వెనుకకు తగ్గవలసి వచ్చింది. అప్పట్లో పర్యావరణం గురించి ప్రపంచమంత చర్చ సాగుతున్నది. దిల్లీలోని విగ్యాన్ భవన్ (అవును వాండ్లు అట్లనే అంటరు మరి!) ఒక జాతీయ సదస్సు జరుగనున్నది. అందులో పాల్గొనవలెనని ఆశ. ఆ సంగతి ఆఫీసులో అడిగితే, దిల్లీలోనే ఉండే ప్రధాన కార్యాలయం ననుంచి అనుమతి రావాలె అన్నరు. అది అయ్యే పనిగాదు. సమావేశం జరిపే వారికి అప్లికేషన్స్ పంపినము. వాండ్లు అంగీకరించినరు. నాకు రానుపోను ఖర్చులు ఇస్తము అన్నరు. గోపాల్‌కు విడిది వసతి మాత్రం ఇచ్చేరకంగ అంగీకరించినరు. అతనికి పైసలు యివ్వరు. నాకు విడిది యివ్వరు. సరే, బయలుదేరడానికే నిర్ణయించినము.
ఆ కాలంలో దిల్లీకి వెళ్లడానికి రెండే రైళ్లు. ఒకటి 36 గంటలు పయనిస్తుంది. హజ్రత్ నిజాముద్దీన్ అనే స్టేషన్‌కు చేరుస్తుంది. అంటే సికింద్రబాద్ గాక నాంపల్లికి లాగ అన్నమాట. కష్టం మీద టికెట్స్ సంపాయించినము. బాగనే ఉంది గాని, ఎక్కడ ఉండాలె? ప్రశ్నకు సమాధానము పాదరసము నుంచి రానే వచ్చింది. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వారి వసతి గృహంలో గది ఏర్పాటు చేసినడు. గోపాల్‌కు దిల్లీ బాగ తెలుసు. అతను పంజాబ్‌లో చదువుకున్నడు. చాలా పరిచయాలు కలిగిన వాడు. విజ్ఞాన్‌భవన్‌కు వెళ్లినము. పేర్లు నమోదు చేయించుకున్నము. లాంఛనముగ రెండు సెషన్స్‌లో పత్రాలు కూడ బుద్ధిక విన్నము. అయితే మేం వచ్చింది దిల్లీ తిరిగి మా పనులు చూచేందుకాయె! కాన్ఫరెన్స్‌లకు వచ్చే వాండ్లందరు అట్లనే ఉంటరేమో?! మీరు ఏమయినరు? అని ఎవరినీ అడగలేదు. మా తిరగడము మొదలయింది.
ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్ తీరు గురించి ఒక సెమినార్ నిర్వహించాలని అంతకు ముందే నిర్ణయించినము. పెద్దలకు లేఖలు కూడ రాసినము. వాళ్లలో కొందరిని కలవవలసి వుంది. మా పాదరసము ఫోన్ అందుకుని అనుమానం లేకుండ అందరినీ అడగడం చూస్తే నాకు ఆశ్చర్యం మొదలయింది. మేము కొంతమంది ఉన్నతాధికారులను కలిసినము గూడ. మధ్యలో శంకర్స్ మ్యూజియం, ప్రగతి మైదాన్ వంటివి కూడ చూచినట్టు గుర్తు. అంతకన్న బాగ గుర్తుండేది సౌత్ బ్లాక్ సందర్శనం. రాష్టప్రతి నిలయం ఇరుపక్కల రెండు పెద్ద భవనాలు ఉత్తర దక్షిణాలలో ఉంటయి. వాటిలో దక్షిణాన ఉండేది రక్షణ శాఖ వారి కార్యాలయాలు గల సౌత్ బ్లాక్. అందులోకి వెళ్లగలగడం అది ఒక విజయం. అప్పట్లో రక్షణ శాఖకు వి.ఎస్.అరుణాచలం అనే పరిశోధకుడు సలహాదారుగ ఉన్నడు. ఆయన చాల గొప్ప మనిషి. హైదరాబాద్ సంస్థ అధ్యక్షుడు, కార్యదర్శి అనుగానే మాకు సమయం ఇచ్చినడు. మేము ఆనందంగ ఆ భవన సముదాయంలో ప్రవేశించినము. సమయానికి అరుణాచలం గారి గదిలోకి వెళ్లగలిగినము. అయితే, ఆ పని అన్నంత సులభంగ జరగలేదు. ఎనె్నన్ని తనిఖీలు, ఎదురుచూపులు అవసరమయినవో! ఇద్దరు యువకులు ఎదురుగ నిలబడితే పాపం ఆ మహాత్ముడు ఎంతో ఆనందించినడు.
మేము అరుణాచలం గారిని సమావేశానికి ఆహ్వానించినట్లు గుర్తు. అయితే రక్షణ శాఖలో సైన్స్ ప్రచారం పుస్తకాల ప్రచురణ వంటి విషయాలకు గాను నిధులు ఉంటయని తెలిసి ఎంతో ఆనందం కలిగింది. ఆయన మా సమావేశం ఖర్చులకు డబ్బు యివ్వడానికి అంగీకరించినడు. ఇచ్చినడు కూడా!
ఇంతజేస్తే నాకు అనుమానం. పర్యావరణం సమావేశానికి నిత్యం లాంఛనంగ పోయినమే గాని అక్కడ కాలం గడిపింది తక్కువ. గెస్ట్‌హౌస్‌లో మంచి భోజనం కూడ దొరికింది గనుక చింత లేదు. ఇక చివరినాడు మధ్యాహ్నం విగ్యాన్‌భవన్‌లోనే ఉండిపోయి, దారి ఖర్చులు సంపాయించుకునే ప్రయత్నంలో పడినము. ప్దెద పేచీ లేకుండనే నాకు రైల్ టికెట్‌లకు సరిపడే డబ్బులు ఇచ్చినరు. పాదరసం గోపాల్‌కు వాండ్లు విడిది ఇస్తమన్నరు. ఇతను నాతో ఐఎఆర్‌ఐలో ఉన్నడు. టికెట్ పైసలు యిచ్చే ఒప్పందం లేదు గనుక, విడిది వాడలేదు గనుక, గోపాల్‌కు చీవాట్లు మాత్రమే మిగిలినయి. అయినా ఆనందముగ యిద్దరము కరోల్‌బాగ్‌లో షాపింగ్‌కు పోయినట్టు గుర్తు. ఇంతకు దిల్లీ చూచినమా? చూచినము, చూడలేదు. నిజానికి ఆ నగరంలో చూడడానికి భవనాలు తప్ప మరేమీ లేవు!
నేను దిల్లీలో ఏకంగ ఉద్యోగమే వెలగబెట్టిన. ఆ నగరంలో అనుభవాలను గురించి ఒక పుస్తకమే రాయవచ్చు. వరుసబెట్టి వ్యాసాలు రాయాలెనన్న ఆలోచన వచ్చింది కూడ! కానీ రాయలేదు. అదేమి ఖర్మమో గాని, దిల్లీ అనుభవాలు మనసులో తిరిగితె, ఇవన్ని రాస్తిమి గద అన్న భావము కలుగుతున్నది. లోకాభిరామమ్‌లోనే నాలుగు సంవత్సరాల పైన చాల సంగతులు చెప్పిన. కానీ దిల్లీ గురించి చెప్పలేదు. నాకు ఏ విషయాన్ని ఎత్తుకున్నా, ఇదివరకే చెప్పినము గద అనిపిస్తుంది. అది వేరే సంగతి!
జక్కడు జాతరకు పోయినడు అని ఒక మాట ఉన్నది. తిప్పడు తిరుపతి పొయినడు అని గూడ ఉందట. వీండ్లిద్దరు పోనయితే పొయినరు గాని, దేవుని గురించి, తక్కిన సంగతులను గురించి పట్టించుకోకుండ తిరిగి వచ్చినరు. అదే పద్ధతిలో నేను రెండు మార్లు ఆఘమేఘాల మీద దిల్లీకి పోయి వచ్చిన. రెండుసార్లు విమానంలో పోవడము. విమానంలో రావడము. రెండుసార్లు ఉద్యోగము కొరకు ఇంటర్‌వ్యూ. ఒక నౌకరిలో ఉండంగనే సమస్త లాంఛనాలతోటి దిల్లీలోని ఒక సైన్స్ ప్రచార సంస్థలో ఉద్యోగానికి అప్లికేషన్ వేసిన. అప్పట్లో విమానం టికెట్ ధర తక్కువనా? లేక నాకు గవ్వము, తెగిపు ఎక్కువనా? అసలు సంగతి ఏమంటే నాకు ఆ ఉద్యోగం వచ్చిం. కానీ, భార్యను, ఆ తరువాత కుటుంబాన్ని బతికినంత కాలము దిల్లీలోనే ఉంచాలె అంటే నచ్చలేదు. బాగుపడే యోగం లేదు, అది అసలు సంగతి. నేను ఆ ఉద్యోగంలో చేరలేదు. చేరితే జీవితం మరోరకంగ ఉండేది. ఇప్పుడు పశ్చాత్తాపం కూడ లేదు. చేరితే, లోకాభిరామం, నా రాతలు, మీరు చదవడము గూడ వీలయ్యేది గాదు. ఏది జరిగినా మన మంచికే, అని నాయన బోధించిన ఫిలాసఫీ!
రేడియో నౌకరీ వదిలిన తరువాత ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం కొరకు నేను దిల్లీకెళ్లి వచ్చిన. అది గూడ అటు, ఇటు అంటే రాక - పోక విమానంలోనే. అది నిజంగ ఒక వింత అనుభవం. తెల్లవార బయలుదేరి దిల్లీ చేరి నేను వెళ్లవలసిన చోటికి చేరుకున్నా, నన్ను రప్పించిన మనిషి మాత్రం రాలేకపోయాడు. మీరు రావాలి. హోటేల్‌లో దిగాలి, తయారయి మా ఆఫీసుకు చేరాలి! ఆలస్యం అవుతుంది. ఎట్లయినా అనుకున్న అంటడు. మీకు దిల్లీ బాగ తెలిసినట్లుందే? అని ఆశ్చర్యంగ నోరు వెళ్లబెట్టినడు. నిజం చెప్పాలె. ఆనాడు నేను విమానం దిగి బస్‌లో ఒకచోటికి చేరి అక్కడ నుంచి నడిచి వెళ్లవలసిన చోటికి చేరిన. అంటే నాకు దిల్లీ తెలుసు. దిల్లీలో బతకడం తెలుసు అని గదా అర్థం! ఆనాడు జరిగింది ఇంటర్‌వ్యూ కాదు. చర్చ! నౌకరీ ఇచ్చేట్లే ఉన్నారు గానీ, నేను అడిగినంత జీతం యిచ్చే పరిస్థితి లేదు. కనుక మళ్లీ పట్నంలోనే మిగిలిపోయిన.
ఇంకొకసారిగూడ దిల్లీకి ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చిన. అయితే, అది అధికారపరంగ కనుక అందులో చిక్కులు లేవు. ఇంక రాజధాని గురించి చెప్పవలసిన సంగతులు ఇంకోసారి చూతము!

కె. బి. గోపాలం