లోకాభిరామం

చరిత్ర - నవలలుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పెద్దాయన చాలా పుస్తకాలు సంపాయించాడు. సేకరించాడు అనాలి. అందరు పెద్దలాగే ఆయన కూడా వెళ్లిపోయాడు. ఇక పుస్తకాలన్నీ ఒక మిత్రుని ఆధీనంలోకి వచ్చాయి. నాకు పుస్తకాల మీద ఉన్న ప్రేమ తెలిసిన ఆ మిత్రుడు కొన్ని ఏరిన గ్రంథాలను నాకు అందజేశాడు. ఆ సేకరణ నిజంగా ఒక గని. అందులో రత్నాలున్నాయి. వాటిలో ఒక దాని గురించి ఇవాళటి ఆలోచన. ఆ పుస్తకం ‘ఉమర్ ఖయ్యాం’ అని ఇంగ్లీష్ నవల. చాలా బాగుంది. రచయిత పేరు హెరాల్డ్ రాంబ్. అలవాటు ప్రకారం ఆయన రచనలను గురించి వెతికాను. చాలా దొరికాయి. ఈ లాంబ్ భారతదేశం, ఆసియాలలోని ప్రాచీన రాజవంశాల గురించి నవలలు రాశాడు. చరిత్ర పుస్తకాలు చాలా వున్నాయి. చరిత్రను మరింత ఆసక్తికరంగా నవల రాయడం అప్పట్లో అందరికీ నచ్చిందని అర్థమయింది.
చిన్నప్పుడు ఆర్య చాణక్య అనే నవల చదివాను. అది డిటెక్టివ్ పుస్తకాల సైజులో ఉండేది. శృంగార నైషధం అనే మరో నవలను కూడా దానితోబాటే చదివాను. రెండూ నచ్చాయి. దాచుకున్న మా పుస్తకాలు అన్నింటితోబాటు అవి కూడా పోయినయి. అది వేరే కథ. ఈ మధ్య ఇంగ్లీష్‌లో చాణుక్యుడు (చాణక్యుడు!) గురించి ఒక నవల వచ్చింది. చదివాను. ఆ తరువాత తెలుగులో చాణక్య గురించి తెగ వెదికాను. రచయిత పేరు కూడా గుర్తులేదు. పుస్తకాలు (నైషధం కూడా) దొరకలేదు. ఎవరి దగ్గరయినా ప్రతులు ఉంటే కొంటాను. అంతేకాదు, హక్కుల సంగతులు తేల్చుకుని వాటిని అచ్చు వేయిస్తాము. ఆ తరువాత, వీలయితే ఇంగ్లీషులోకి మారుస్తాను. సహృదయులకు మనవి, సాయం చేయండి!
లాంబ్ నవలలో చంగేజ్‌ఖాన్, అమీర్ తైమూర్‌లతో బాటు నూర్‌మహల్ అని ఒక నవల కనిపించింది. తెనే్నటి సూరి రచన చెంఘిజ్‌ఖాన్ చదివాను. అది అనువాదమా? నాకు చంగేజ్‌ఖాన్ గురించి నవలలు, చరిత్ర పుస్తకాలు ఎన్నో దొరికాయి. అన్నీ చదువుతున్నాను. అయితే నూర్‌మహల్ కొంచెం మరో దారిలోకి మళ్లించింది. నాన్న ఒకటి రెండు రకాల అత్తరులు తెచ్చేవాడు. వాటిలో ఒకటి నూర్‌జహాన్ (జహా తరువాత అరసున్న ఉండాలి; న్ పలకకూడదు) ఆమె ముగల్ (మొఘల్) చక్రవర్తి జహంగీర్ భార్య (గ, ఘ లను గొంతులో గరగరగా పలకాలి!ఉరుదూలో గైన్ అని ఒక అక్షరమే ఉంది ఆ శబ్దానికి!) (జహా తరువాత అరసున్న ఆ తరువాత గీర్ పలకాలి! జావేది మియా దాద్ కూడా అంతే! ఛాదస్తం) నూర్ మహల్, నూర్‌జహీ ఒక బీద తండ్రికి పుట్టిన పర్షియా వనిత. ఆ తండ్రి జహీగీర్‌కు కోశాధికారి అవుతాడు. అతని కూతురు సామ్రాజ్యానికి పట్టమహిషి అవుతుంది. ఈ సంగతులు చెపుతుంటే ఒక మిత్రుడు, నవలను తెలుగులో రాయమని ఆత్రపెట్టాడు. నేను రాశాను. ఈ వ్యాసం అచ్చయే నాటికి పుస్తకం పూర్తి అవుతుంది. నిజంగా నవల ఎంత బాగుందో, నేను వ్యాసుడిని కాదు. కానీ నాకు ఒక వినాయకుడు ఉన్నాడు. అతను కూడా నవలను ఎంతో మెచ్చుకున్నాడు. రెండు భాగాలు సినిమా తీయవచ్చు. ఈ నవలే స్క్రీన్‌ప్లే అవుతుంది అన్నాడు. అసలు ముందు నవల రానీ అన్నాను.
నాకు ఆసక్తి లేని వస్తువులు, విషయాలు ఈ ప్రపంచంలో చాలా తక్కువ. చరిత్ర పట్ల నాకు మక్కువ ఎక్కువ! (బాగుంది కదూ మాట!) చారిత్రక నవలలు రాయాలి అన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. బహుశః ఆదరణ మొదలయినట్టుంది.
చంగేజ్‌ఖాన్ (అందరూ జెంఘిజ్‌ఖాన్ అంటున్నారు. ఖా తరువాత అరసున్న ఉండాలి. అది ఖాన్ కాదు!) గురించి ఈ మధ్యన కొంత కొత్త చరిత్ర బయటపడింది. మంగోలియాలోకి పరిశోధకులు వెళ్లడానికి వీలు కలిగింది. కనుక కొత్త సంగతులు తెలిశాయి. అవన్నీ చదువుతున్నాను. చరిత్ర పుస్తకంగా కన్నా నవలగా పాఠకులకు అందిస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఎప్పటిదో! ఆశ్చర్యంగా నాలుగు ఇంగ్లీషు నవలలు దొరికాయి. కాన్ ఇగుల్‌డన్ (ఖాన్ కాదు) అనే రచయిత యూరపు, ఆసియా రాజ వంశాల గురించి ఎన్నో నవలలు రాశాడు. అయితే రచన ధోరణి హెరాల్డ్ లాంబ్ పద్ధతిలో ఉండదు. నూర్ మహల్ నవల చివరలో లాంబ్ తన సమాచార సేకరణ, రచన గురించి ఒక వ్యాసం జోడించాడు. రచనలో తొంభయి శాతం కన్నా ఎక్కువ భాగం వాస్తవం అన్నాడు. అయినా ఎంతో నాటకీయంగా రాశాడు. ఇక ఇగుల్‌డెన్ నవలలో కాల్పనికత కొంచెం ఎక్కువ అనిపించింది. తేల్చి చెప్పడానికి ఇంకా చాలా చదవాలి.
నెట్‌లో నెట్‌ఫ్లిక్స్ అని ఒక సైట్ ఉంటుంది. అందులో ప్రపంచం సినిమాలన్నీ ఉంటాయి. వారి కోసమే తీసిన సీరియల్స్ ఉంటాయి. మన దేశంలోని ఈ సైట్‌లో మెటీరియల్ మరో రకంగా ఉన్నట్టుంది. మా బాబు అమెరికా అకౌంట్‌లో నేను వీడియోలో చూడగలుగుతున్నాను. అందులో కుబ్లయ్‌ఖాన్ గురించిన ఒక సీరియల్ చూస్తున్నాను. ఎంత ఖర్చు చేసి, ఎంత బాగా తీశారో కాస్త సెక్స్ పాలు ఎక్కువగా ఉన్నట్టుంది గానీ సీరియల్ ఎంతో బాగుంది. నిజానికి సీరియల్ మార్కోపోలో గురించినది. పోలో కొన్ని కారణాల వల్ల కుబ్లాఖాన్ (పేర్లను పలకడంలో ఏకాభిప్రాయం లేదు!) దర్బార్‌లో ఉంటాడు. ఆ వ్యవహారం గురించి చదివి వీలయితే రాయాలనే ప్రయత్నంలో ఉన్నాను.
చెంగిజ్ గురించి తెలుగులో నవల ఉంది. మళ్లీ మరొక నవల(లు) రాస్తే చదువుతారా? ప్రశ్న. తైమూర్ లండ్ (లంగ్ అంటే లంగ్‌డా అంటే కుంటివాడు) గురించి రాయవచ్చు. ఇంగ్లీష్‌లో ఈ మనిషి పేరు తామర్లెన్ అని రాస్తారు. భారతదేశం మీదకు దండెత్తాలన్న ఆలోచన ఇతనిదేనట. బాబర్ అతని తరువాత వచ్చాడు. మొగల్ సామ్రాజ్యం స్థాపించాడు. మొగల్ రాజచరిత్ర తెలుగులో వచ్చింది. రాలేదు. బెంగాలీలో వచ్చిన ‘మొగల్ దర్బార్ కుట్రలు’ అనే నవలల వరుస తెలుగులోకి వచ్చింది. (ఎప్పుడో) చిన్ననాడే నేను చదివాను. కుదించి యువ పత్రిక వారు వేసిన చిన్న పుస్తకం కూడా ప్రస్తుతం కనపడలేదు.
మనకు గతం గురించి పట్టదు. మన తాతలు ఏం చేసిందీ తెలియదు. ఇక ఈ దేశం ఇట్లా ఎందుకు ఉంది అన్న ప్రశ్న ఎవరికీ పట్టదు. మరి పడమటి రచయితలు పట్టుపట్టి పరిశోధనలు చేసి ఇంతగా ఎందుకు రాశారు?
ఫిర్‌దౌసి అన్న పేరు కవి జాషువా పద్యాల కారణంగా తెలుగు వారికి తెలిసింది. అయితే ఆ కవి రచన గురించి ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. షాహనామా అనే అతని సుదీర్ఘ కావ్యం పర్షియా రాజవంశాల వారి చరిత్రను చెపుతుంది. రుస్తుం - సొహ్రాబ్ అని హిందీలో సినిమా వచ్చింది. అది పర్షియా ప్రభువు కథ! ఈ రచన చాలా నిడివి గలది. అది వచనంగా కూడా వచ్చింది. సంపాదించాను. చదివే ప్రయత్నంలో ఉన్నాను. ప్రయత్నం ఎందుకు? అని మిత్రులకు అనుమానం రావచ్చు. ముందు సైన్స్ చదవాలి. ప్రపంచ కథా సాహిత్యం చదవాలి. వాటి ఆధారంగా నా రాతలు సాగాలి. ఆ తరువాత గదా అపరాధ పరిశోధన! జో నెస్‌బో అనే నార్వే రచయిత నవలలు చదువుతున్నాను. ఇన్నింటి మధ్యన చరిత్ర చదవాలి. అందుకే ప్రయత్నించాలి. అప్పుడు కుదురుతుంది.
మంగోల్, పర్షియన్, అరేబియన్‌ల మధ్యన ఓటోమన్ అని మరొక పేరు వినిపిస్తున్నది. అది ఉస్మాన్‌కు పట్టిన గతి. ఎవరీ ఓటోమన్‌లు? చదువుతున్నాను. వారిని గురించి నాలుగు నవలలు కూడా దొరికాయి. దొంగ కథ, పూజారి కథ, ప్రభువు కథ, హంతకుని కథ.. పేర్లే ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక నవలలు ఎట్లాగున్నయో? చదవాలి. మెలకువ ఉన్నంతసేపు చదువుతూనే ఉంటానంటే కుదరడం లేదు. చదివినందుకు ప్రయోజనం ఉండాలి. అది మరొక సమస్య! నాకు ఉర్దూ తెలిసి ఉండడం ఈ ఆసియా చరిత్రలు చదవడంలో సహాయంగా ఉంది. రచయిత కొన్ని మాటలను సరిగా రాయడు. పాదిషా అంటాడు. నిజానికి అది బాద్‌షాహ్. పోనీ పాదుషా అన్నారు తెలుగులో. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఉరుదూలో కూడా లాంబ్ నవలలు చదివే అవకాశం కలిగింది. పేర్ల విషయంలోనే గాక, మరి కొన్ని రకాలుగా కూడా అది సహాయకరంగా ఉంది. చాలా చెప్పాలి, అనుకున్నాను. చైనా, జపాన్, రాజవంశాల గురించిన నవలల వ్యవహారం మరొకసారి ప్రస్తావించుకుందాం! నేను చదువుతాను! మిమ్మల్ని చదివించే ప్రయత్నం చేస్తాను!!

కె. బి. గోపాలం