లోకాభిరామం

ఏమి చదివితిమి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడచిన సంవత్సరంలో కొన్న పుస్తకాలను గురించి ఒక సమీక్ష చేశాను. అందులో ముఖ్యంగా నాకు మూడు రకాలు కనిపించాయి. మొదటివి సైన్స్ పుస్తకాలు. రేడియోలో నేను చేసిన ఉద్యోగం కారణంగా, ఆ తరువాత కూడా వరుసబెట్టి అదే పనిగా సైన్స్ రాస్తున్నందుకు నన్ను కొంతమంది సైన్స్ గోపాలం అంటారు. మొత్తానికి నాకు సైన్స్ చీమ గట్టిగానే కుట్టింది. అదేదో నేను తప్పకుండా పట్టించుకోవలసిన అంశం అన్న భావం మెదడులో గట్టిగా మిగిలిపోయింది. కనుక కొన్న పుస్తకాలలో సైన్స్ రకం ఎక్కువగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. రెండవ రకం పుస్తకాలు ప్రపంచ సాహిత్యానికి సంబంధించినవి. ఈ మధ్యన నేను ప్రపంచం నలుమూలల నుంచి కథాసంకలనాలు సేకరించి చదువుతున్నాను. అయితే నేను కొన్న పుస్తకాలలో అపరాధ పరిశోధన నవలలు కూడా ఉండటం కనిపించింది. ప్రపంచ ప్రసిద్ధ రచయిత కానన్ డాయ్‌ల్ పుస్తకాలు అనువదించడం నేను కొంతకాలం క్రితం మొదలుపెట్టాను. రెండు నవలలు, రెండు కథాసంకలనాలు ప్రచురించారు. మరో రెండు కథా సంకలనాలు ఈపాటికి బజార్లోకి వచ్చి ఉంటాయి. షెర్లక్ హోమ్స్ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ క్రమాన్ని కొనసాగించమని చాలామంది ప్రోత్సహిస్తున్నారు కూడా. నేను ఫ్రెంచ్ రచయిత అలెగ్జాండర్ డ్యూమా నవల కూడా ఒకటి అనువదించాను. కానీ అది చాలా మందిని ఆకర్షించలేక పోయింది. అగాథ క్రిస్టీ నవల కూడా ఒకటి నేను తెలుగు చేశాను. అది కూడా ఎవరికీ పట్టలేదు. పెర్రీ మేసన్ నవల తెలుగులో రాయాలన్న అభిప్రాయాన్ని ప్రస్తుతానికి ఆపి ఉంచాను. ప్రపంచం నలుమూలలలోని భాషల నుంచి, ఆంగ్లం ద్వారానే అనుకోండి, ఈ రకం సాహిత్యాన్ని సేకరించి పెట్టాను. పుస్తకాలు కొనడమే గగనమై పోయింది ఈ కాలంలో. ఇక అపరాధ పరిశోధన నవలలకు ఆదరణ ఉంటుందని నేను అనుకోవడం లేదు.
అలవాటు కొద్దీ కొమ్మలు దూకాను. ఫ్రెంచి భాషలో నుండి ఇంగ్లీష్‌లోకి అనువదింపబడ్డ ఒక నవలల వరుసను నేను ఈ సంవత్సరంలో వరుసబెట్టి చదివాను. షెర్లక్ హోమ్స్‌తో సమానంగా పేరు లేకున్నా ఈ నవలలోని ఇన్‌స్పెక్టర్ మైగ్రేట్ కూడా చాలా ప్రసిద్ధుడు. మై గ్రేట్ సినిమాలు కూడా వచ్చినట్టు ఇంటర్‌నెట్ కారణంగా తెలిసింది. ఫ్రెంచి వారు అన్ని విషయాలలోనూ కొంచెం చిత్రంగా ఉంటారు. అదే పద్ధతిలో ఈ నవలలు కూడా విచిత్రంగా ఉన్నాయి. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కానీ వేరుగా ఉన్నాయి అని మాత్రం చెప్పగలను. మైగ్రేట్ కేవలం ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్. హంగులు అంతగా లేనివాడు. తన పద్ధతిలో అపరాధ పరిశోధన నడిపిస్తూ ఉంటాడు. విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కుంటాడు. అంత విచిత్రంగానూ బయటపడుతూ ఉంటాడు. ఇటీవల చదివిన ఒక నవలలో హత్యలు దొంగతనాలు జరగనే జరగవు. ఇన్‌స్పెక్టర్ తాను పుట్టి పెరిగిన పల్లెకు వెళతాడు. అక్కడ పరిస్థితి బాగా మారిపోయి ఉంటుంది. మన దగ్గర దొరల వంటి కుటుంబం ఒకటి అక్కడ ఉంటుంది. దొరసాని ఒక్కర్తే మిగిలి ఉంటుంది. ఆమె చనిపోతుంది. మరణం చుట్టూ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. అందులోని లోతుపాతులను మై గ్రేట్ చిత్రంగా తవ్వి బయటకు తీస్తాడు. పుస్తకం పట్టుకుంటే చదివేదాకా మనసు ఒప్పదు.
ఇక నేను ఇదే క్రమంలో జో నెస్ బో అనే యూరోపియన్ రచయిత రాసిన కొన్ని పుస్తకాలను కొన్నాను. అందుకు బోలెడు డబ్బులు ఇచ్చాను. పుస్తకాలు లావుగా వున్నాయి. చదవడానికి బాగా సమయం పట్టింది. నాకు నిజానికి రెండవ పుస్తకంలోనే ఆ పద్ధతి, పరిసరాలు ఆసక్తికరంగా లేవు అని అనిపించింది. నిజం చెప్పాలి. అవకాశం చూసుకుని ఆ పుస్తకాలు ఒక మిత్రుడికి అంట కట్టాను.
హ్యూసన్ అనే మరొక యూరప్ రచయిత రాసిన మరొక నవలల వరుస నా చేతికి చిక్కింది. వాటిలో నిక్ కోస్టా అనే ఇన్‌స్పెక్టర్ ఉంటాడు. అతను చాలా తెలివిగలవాడు. పోలీసు పనితోపాటు కళా సాహిత్య రంగాలలో కూడా అభినివేశం కనబరుస్తూ ఉంటాడు. నిజానికి ఒక నవల మొత్తం ప్రాచీన కాలపు కళాఖండాలు అంటే పెయింటింగ్‌ల విషయంగా నడుస్తుంది. ఆ అంశంలో పాత్రల ద్వారా రచయిత చూపించిన నైపుణ్యం ఆశ్చర్యకరంగా ఉంది. నవలలు నాకు మరీ ఎక్కువగా దొరకలేదు. దొరికిన వాటిని మాత్రం చాలా ఆసక్తితో చదివాను.
ఇక లీ చైల్డ్ అనే రచయిత రాస్తున్న నవలలను గురించి చెప్పుకోవాలి. వీటిని నేను కొన్ని సంవత్సరాలుగా చదువుతున్నాను. సాఫ్ట్ కాపీ చదవడంతో సంతృప్తి లేక కొన్నింటి అచ్చు పుస్తకాలు కూడా కొన్నాను. ఈ మధ్యన నైట్ స్కూల్ అనే పుస్తకం ఒకటి తెప్పించాను. ఈ రచయిత సంవత్సరానికి ఒక్క పుస్తకం మాత్రమే రాస్తాడు అనుకుంటాను. అంతకు ముందు బహుశా ఒకటికి రెండు రాసి ఉండవచ్చు. నేను వాటన్నిటినీ ఇంచుమించు మొత్తంగా చదివాను. ఇటీవలి సంవత్సరాల్లో వచ్చిన పుస్తకాలు మాత్రం దొరకడం లేదు. దొరికినా చాలా ఎక్కువ ధర కనబడుతున్నది. సరదాగా చదివే పుస్తకాల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం నాకు అలవాటు లేని, చేతకాని పనులలో ఒకటి. ఇక్కడికి ఇంట్లో చేరిన పుస్తకాల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం నాకు అలవాటు లేని, చేతకాని పనులలో ఒకటి. ఇక్కడికి ఇంట్లో చేరిన పుస్తకాలను గురించి గొప్ప గోల జరుగుతూ ఉంటుంది. సంగీతం ఆర్కయివింగ్ పేరున సేకరించిన కేసెట్లు, గ్రామఫోన్ రికార్డులు, స్పూల్స్ చాలా భాగం జాగ్రత్త చేయవలసిందిగా మిత్రులకు అప్పుడు చెప్పాను. పుస్తకాల విషయంలోనూ ఆ పరిస్థితి వస్తుంది అనుకుంటున్నాను. లీ చైల్డ్ పుస్తకాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో వచ్చే పాత్ర జాక్ రీచర్ గురించి లోకాభిరామంలో ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించినట్టు జ్ఞాపకం ఉంది. అతను మిలిటరీ పోలీస్ నుంచి పని వదిలేసి వచ్చిన రకం. ఇల్లు ఉండదు. ఆస్తి ఉండదు. కనీసం రెండవ జత బట్టలు ఉండవు. జేబులో ఒక టూత్ బ్రష్ మాత్రం ఉంటుంది. డబ్బులు ఉంటాయి అని వేరుగా చెప్పనవసరం లేదు. అతను కేసులలో దూరి వాటిని విడదీసే తీరు విలక్షణంగా ఉంటుంది. ప్రస్తుతం నేను చదువుతున్న నవల మొదలు పెట్టినప్పుడు అది ఇప్పటికే చదివాను అన్న భావం కలిగింది. రచయిత కావాలనే పాఠకులను ఆ రకంగా తికమక పెట్టినట్టున్నాడు. కథ ముందుకు సాగితే ఆసక్తి మొదలైంది. మామూలుగా ఒక హత్య, ఒక నేరం జరిగి పరిశోధించడం పద్ధతి అయితే లీ చైల్డ్ నవలలో భారీ ఎత్తున జరిగే నేరాలను గురించి చెబుతాడు. దేశాల మధ్య జరిగే కుట్రలు కుతంత్రాలను గురించి వివరిస్తాడు. ప్రస్తుతం చదువుతున్న నవల నైట్ స్కూల్లో ఇంకా నేరం జరగలేదు. పుస్తకం నాలుగింట మూడు వంతులు అయిపోయింది. అయినా నేరం జరగలేదు. జరుగుతుందని తెలుసు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇంత బాగా రచన చేయడం కొంతమంది రచయితలకు మాత్రమే చేతనవుతుంది. కనుక నేను ఆసక్తిగా చదువుతున్నాను. అందర్నీ చదవమని చెప్పడానికి నాకు ధైర్యం లేదు.
స్టీగ్ లార్సన్ అనే మరొక యూరోపియన్ రచయిత రాసిన పుస్తకాలు ఎత్తుకున్నాను. కానీ ఎందుకో చిరాకు కలిగింది. చిన్నప్పుడు ఎప్పుడో విన్న పేరు ఫూ మాంచూ. ఈ కథలను కూడా సంపాదించి చదివాను. ఫాదర్ బ్రౌన్ అనే మరొక క్రమం చదివాను. ఇలా ఎన్ని రకాల అపరాధ పరిశోధక నవలలు చదివాను. కనీసం చదువుతున్నాను ఏ రకంగా చెపుతూ పోతే మీరు చేతిలోని పుస్తకాన్ని పక్కన పెడతారు.
ముగిసేలోగా ఒకటి రెండు సంగతులు చెప్పకపోతే అన్యాయం జరుగుతుంది అని కనీసం నా భావన. డే ఆఫ్ ద జాకాల్ అనే సినిమా గురించి కొంతమంది విని ఉండవచ్చు. ఈ నవల రాసిన రచయిత ఫ్రెడరిక్ ఫోర్సిత్ వి చాలా పుస్తకాలు ఉన్నాయి. అవి మరీ ఎక్కువ కాకున్నా మంచి పేరు గలవి. వీటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. దశాబ్దాల నాడే నేను వాటిని చూశాను. ఎంతో ప్రభావితుడయ్యాడు. ఈ మధ్య ఒక మిత్రుడు, అతను ప్రచురణకర్త అన్న అంశం గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలోనే ఏదైనా ఒక నవల తెలుగులో రాయాలి అన్నాడు. ఒకప్పుడు తెలుగులో చిన్న సైజులో జేబులో పట్టేలా రకంగా డిటెక్టివ్ నవలలు అని వచ్చేవి. విశ్వప్రసాద్, కొమ్మూరి సాంబశివరావు, టెంపో రావు లాంటి వారు వాటిని రాశారు. క్రమం చాలాకాలమే నడిచింది. తరువాత మరి కొంతమంది రచయితలు ఈ క్రమాన్ని కొనసాగించారు. నాకు వాటిలో వెనకటి పస కనిపించలేదు. ఇప్పుడు వాటి గిరాకీ లేదని తెలిసిపోయింది. పేరున్న ఒక ప్రచురణ సంస్థ వారు పాతకాలపు నవలలను మామూలు సైజులో మళ్లీ అచ్చువేస అమ్మడానికి ప్రయత్నించారు. ఎంత విజయం సాధించింది నేను చెప్పలేను.
ప్రపంచ కథా సాహిత్యం సంగతి వేరు. గడచిన సంవత్సరాలలో తెలుగులో కూడా కొన్ని అనువాద సంకలనాలు వచ్చాయి. కానీ చిత్రంగా అందరూ మళ్లీ ణామ్, చెజోవ్, మరి కొందరు రచయితలను మాత్రమే పట్టించుకుంటారు. నేను మా తరం ప్రపంచ దేశాలు వీలయినన్నిటి నుంచి సంకలనాలు పోగు చేశాను. వంద దేశాలు, వంద రచయితలు అని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. అసాధ్యమేమీ లేదు. ఆ పద్ధతిలో కాకున్నా నేను ఇప్పటికే చాలామంది రచయితల కథలు అనువదించాను. వాటిని పుస్తకంగా వేయాలి.
ఇక నేను కొన్న పుస్తకాలలో మూడవ రకం ఉరుదూ, తత్సంబంధ సాహిత్యానికి చెందినవి. నాకు బలంగా గల ఆసక్తులలో ఇదొకటి. ఒకప్పుడు మొఘల్ దర్బారు కుట్రలు అని పుస్తకం వస్తే పడిపడి చదివారు. నేను ఎంతో ఉత్సాహంగా నూర్ మహల్ అనే నవల రాశాను. నిజం చెప్పాలి. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఫెమినిజమ్ గురించి మాట్లాడేవారు కూడా దాన్ని గురించి పట్టించుకున్నట్టు కనిపించదు. సైన్స్ పరిశోధకుడుగా ఉమర్ ఖయ్యాం గురించి రాయాలని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ రాసిన నవల నాకిచ్చిన ఫీడ్ బ్యాక్‌తో తలబొప్పి కట్టి కాస్త నెమ్మదించాను.
ఇది వేరొక ప్రపంచం. బహుశా అందరికీ ఇందులో ఆసక్తి లేకపోవచ్చు. ఆసక్తి కలవారు మాత్రమే ఈ రకం పుస్తకాలు నువ్వు అతిగా అభిమానిస్తారు. ఆ రకంలో నేను ఒకడిని.

-కె.బి.గోపాలం