లోకాభిరామం

పల్లీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లెల్లో ఉండే వాండ్లందరు పట్నానికి వచ్చేసినట్లున్నరు. ఒక పల్లెకు పోయి నాలుగు నాళ్లు ఉండే అవకాశం, అవసరం రావడమే లేదు. ఆ మధ్యన అటువంటి అవసరం వచ్చింది. సాధారణంగా ఎక్కడికి పోవాలన్నా కార్లు, వెంట మనుషులు ఉండేది గూడ అలవాటయింది. కానీ, ఈ పల్లెకు ఒంటరిగ బయలుదేర వలసిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నుంచి కొంత దూరం ఆర్‌టీసీ బస్‌లో వెళ్లి చేరుకున్న. అక్కడి నుంచి పల్లెకు పోవడానికి బస్సులు ఉంటయని తెలుసు. సూటిగా ఆ పల్లెకు బస్సు ఉండదు. మరెక్కడికో పోయే బస్సు పల్లె మీదుగా పోతుంది. నాకు వివరం చెప్పడానికి అక్కడ ఎవరూ లేరు. చివరకు తెల్లని (?) దుస్తులు వేసుకున్న ఒక పెద్ద మనిషి కనిపించినడు. అక్కడ అతనే అధికారి అని అర్థమయింది. అతని వద్దకు వెళ్లి, నేను ఫలానా పల్లెకు వెళ్లాలె, ఏ బస్ ఎక్కమంటరు? అని అడిగిన. నాకు ఆశ్చర్యం ఎదురయింది? ‘అటువంటి పల్లె, అంటే ఆ పేరు గల పల్లె ఒకటి ఉన్నదా?’ అన్నాడు ఆ అధికారి. ఆ పల్లె గురించి, మిగతా చుట్టుపక్కల పల్లెల గురించి నాకు తెలుసు గనుక చెప్పిన. ‘అయితే, అదో, ఆ బస్ ఎక్కుపో!’ అన్నాడు. అతను చూపించిన బస్ అప్పటికే కదులుతున్నది. వీలయినంత వేగంగ పరుగుపెట్టి ఎక్కగలిగిన. ఎందుకయిన మంచిదని కండక్టర్‌ను, నేను వెళ్లవలసిన పల్లె గురించి అడిగిన. ‘అయ్యో! ఇది పోదు. ఆ పక్క బస్‌లో ఎక్కుపో’ అన్నడు. మళ్లీ పరుగు. ఆ రెండవ బస్ కదలడం లేదు. అంతట్లో కదిలే ఆలోచన కూడ ఉన్నట్టు లేదు. అందులో ఒక చిన్న అమ్మాయి కండక్టర్‌గ ఉన్నది. ఆమెకు నా గమ్యం గురించి చెప్పిన. ‘లేదు సార్! పోదు!’ అని జవాబు. మళ్ల చుట్టుపక్కల పల్లెల పేర్లు చెప్పిన. అందరు ననే్న చూస్తున్నరు. నా వంటి మనిషి ఆ బస్ ఎక్కడం ఒక విచిత్రమని అర్థమయింది. మొత్తానికి అందరు కలిసి నేను ఒక ఫలానా చోట దిగవచ్చును, అక్కడి నుంచి నా గమ్యం దగ్గర అని తేల్చినరు. నేను బస్సు దిగిన చోటికి ఒక కారు, నా కొరకే వచ్చి పల్లెకు చేర్చింది, అని చెపితే, కథ కుదరదు. కానీ, అది వాస్తవం! ‘తెల్లోని..’ సెల్‌ఫోన్ అని ఒకటి వచ్చింది గద!
ఆ రాత్రి అక్కడే ఉండడం అదొక అరుదయిన అనుభవం. మరునాడు ఉదయం చాలా తొందరగ లేచినట్టున్న. పట్నంలోనయితే, అమెరికా వాని సమయానికి అనువుగ నిద్ర, మేలుకొలుపు. అక్కడ ఆ పద్ధతి లేదు. అందరము, అంటే కొందరము మంచాల మీద, ఆరుబయట కూచుని ఉన్నము. ‘అదో!’ అన్నరు ఎవరో! చూస్తే అంత పొడుగు పాము. ఎవరినీ పట్టించుకునే ప్రసక్తి లేకుండ, తన దారిన తాను జరజర పాకుతూ పోతున్నది. పల్లె అంటే అది. పట్నంలో పాముగాదుగద, ఏ పురుగు కనిపించదు. మనుషులకే చోటు సరిపోదు. ఇక పాములు, తేళ్లు ఎక్కడ ఉంటయి? ఆ పాము అట్ల వెళ్లిపోయింది. అది అంతేలే అన్నట్టు ఎవరి పనిలో వారు ఉన్నారు. నాకు నా చిన్నతనం, పల్లె అన్నీ కళ్ల ముందు తిరిగినయి. ఎన్ని పాములను చూచి ఉంటము?
ఆ పల్లెకు, పాము గురించిన మరొక అనుభవానికి సంబంధం ఉంది. చాలా చిన్న వాడిని అప్పట్లో. మా పల్లె నుంచి పాలమూరు ఎట్ల వచ్చినమో, గుర్తులేదు గాని, అక్కడి నుంచి ఒక బస్సులో వచ్చి ఈసారి దిగిన చోటికి దగ్గరలోనే ఒక పల్లెలో దిగినము. అక్కడికి మా కొరకు ఎద్దుల బండి వస్తుంది. అది అనుకున్న సమయానికి రాలేదు. చింతచెట్ల కింద నీడలో చేరి కాలక్షేపం చేసినము. బండి వచ్చింది. అందులో ఎక్కి గంటలపాటు పయనించి పల్లెకు చేరుకున్నము. అక్కడ ఒక పెండ్లి జరుగుతున్నది. అమ్మతో గలిసి ఆ పెండ్లికి నేను గూడ బయలుదేరిన. పల్లె గనుక ఆకాశమంత పందిరి ఏసినరు. ఆ కాలంలో పెండ్లికి గూడ మరీ వందలు, వేలు జనం వచ్చేది లేదు. అందరు ఎవరి మానాన వారు, మాటలతో పనులలో మునిగి ఉన్నరు. అప్పుడు గూడ ఎవరో ‘అదో!’ అన్నరు. నాగుపాము వచ్చిందట. నేను చూడలేదు. ‘ఏది? ఏది?’ అంటున్నరు. అంతలోనే వెనుకకు తిరిగి వెళ్లిపోయింది, అన్నరు. అదేమి అని నాకు ఆశ్చర్యము. అక్కడ ఒక అన్నగారు ఉన్నరు. ఆయనకు గరుడ మంత్రము సిద్ధించిందట. ఆయన ఉంటే పాములు అటు రావటం. వచ్చినా ‘ఆగు’ అంటే ఆగుతుందట. పో, అంటే పోతుందట. పాము రావాలె. ఆయన ఆగు అనాలె. అది ఆగితే నేను చూడాలె, అని నాకు మనసులో కోరిక. అప్పటి నుంచే మనది కొంచెం ఎడ్డెం తెడ్డెం పద్ధతి. ఆ అన్న వల్ల వెళ్లిపొయ్యిందా, మరెందుకు పోయిందా, తెలియదు గాని, పాము వెళ్లిపోయింది. మనుషులకు పాము అంటే భయం. పాములకు మనుషులు అంటే అంతకన్న భయం. తప్పని పరిస్థితిలో ఎదురు తిరుగుతాయి, కరుస్తాయి గాని, సహజంగ, అవి వీలయినంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేస్తయి.
నాకు టీ తాగడం అలవాటు లేదు. ఆ మాట చెప్పిన వెంటనే బంధు మర్యాద పరుతో పాలు తాగుతవా, అని అడుగుతరు. పాలు తాగడం నాకు అంతకన్నా ఇష్టం ఉండదు. డెయిరీ పాలు పెరుగుకు గానీ, తాగడానికి గానీ పనికిరావని నాకు గట్టి నమ్మకం. ఇప్పటికీ మేము పెరుగు కొరకు సైకిల్ మీద వచ్చే రాములు దగ్గర పాలు కొంటము. పల్లెలో కూడ పాలు తాగు అన్నరు. తప్పించుకునే ప్రయత్నం చేసిన. స్నానం చేసేవరకు మంచినీళ్లు ముట్టను, అని అప్పటికి తప్పించుకున్న. వాళ్లు నా మీద కక్ష గట్టినట్టున్నరు. నా స్నానం ముగిసి తరువాతి తతంగం గూడ అయింది, అనిపించిన మరుక్షణం ఒక మూరెడు గ్లాసులో యజమాని ఎదుట ప్రత్యక్షం. ఇక తప్పదు, అని పాలు అందుకున్న. వేడి తాగే అలవాటు లేదు. అయితే, ఆ పాలు అంత వేడిగ లేవు. ఒక గుక్క తాగిన. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. ఎప్పుడో చిన్నతనంలో మరిచిన అసలు సిసలయిన పాలు రుచి, ఇన్ని ఏండ్ల తరువాత మళ్లీ నాలుకకు తగిలింది. ఆ యజమాని నాకంటె చిన్నవాడు. మిత్రుడు. మొహమాటం లేకుండ, అతడిని పిలిచి ‘ఎంతో ఉపకారం చేసినవు. పాలు తాగకుంటే, అన్యాయం అవుతుండె, పాల రుచి తిరిగి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు, అని మనస్ఫూర్తిగ చెప్పిన. మాకు నిత్యం పాలు పోసే రాము దగ్గర, చాలా బర్రెలు ఉంటయి. అన్ని బర్రెల పాలు కలగలుపుతరు. దానితోటి పాలరుచి మారుతుంది. తవుడు తిన్న బర్రెల పాలు అంత రుచిగ ఉండవు. పల్లెలో పచ్చిగడ్డి మాత్రము తిన్న, ఒక్క బర్రె పాలు తాగే అవకాశము వచ్చింది. పాలు అంటే అవిగదా, అనిపించింది. కూరలయినా, పండ్లయినా, అసలయిన తాజాదనం, అసలయిన పంట పద్ధతి అక్కడ వీలు అవుతుంది. అమ్మకానికి కూరగాయలు పెంచేవాండ్లు, ఎరువులు మందులు వాడుతరు. రుచి మారుతుంది.
అక్కడ ఇంట్లో అంగణంలోనే దయ్యమంత చింతచెట్టు ఉన్నది. నాకు చింతచిగురు, చింతకాయలు వాడిన వంటకాలు మహ ఇష్టం. కొంచెం చిగురు, చింతకాయలు తెంపుకోవాలని ఆశ. చెట్టు ఎక్కడం చేతగాదు. అయినా అందులో పురుగు, బూచి ఉంటయి. చెపితే నమ్మరు. ప్రయత్నించినా, చెట్టు ఎక్కి చిగురు, కాయలు కోయగల మనిషి దొరకలేదు. పల్లెల పరిస్థితి అట్లున్నది. అందిన చోటికి మేమే కొన్ని కాయలు తెంపుకోని తెచ్చుకున్నము. ఓపికగల కాలంలో అట్ల చింతకాయలు దొరికితే, ఎర్ర మిరప పండ్లు తెచ్చి, తొక్కు, ఇంట్లోనే తయారుచేసుకున్న సందర్భాలున్నయి. కానీ, ఇప్పుడు అది కూడ కరువయింది. మామిడి కాయ ఆవ, అంటే ఆవకాయ మాత్రం తింటరు. అది ఒంటికి మంచిది కాదు. అయినా తింటరు. తరువాత అసిడిటీకి మందులు కూడ తింటరు. చింతకాయలు తినడమే తగ్గింది. అది బీదల తిండి. నా మనసులో, బీదతనం గూడు కట్టుకోని ఉన్నది గనుక, చింతకాయ తొక్కు మీద ప్రేమ పోలేదు.
బెంగుళూరులో ఒక అన్నగారున్నరు. ఆయనకు అక్కడెక్కడో పల్లెలో వ్యవసాయం ఉన్నట్టుంది. నా మాటలు విని ఆయన బోలెడంత చింత చిగురు తెచ్చి యిచ్చినడు. దాన్ని వాడి, వండి పెట్టే వాండ్లు గూడ ఉండాలె గద! అది కూడ అర్థమయిందేమో, అన్నగారు ఏకముగ చింతచిగురు పొడి తెచ్చినరు. దాన్ని అన్నములో కలుపుకోని తింటే, స్వర్గానికి బెత్తెడు దూరం, అనిపించింది. స్విగీలో ఆర్డర్ చేస్తే అడిగిన తిండి నిమిషాలలో ఇంటికి వస్తుంది. అయితే, అందులో పల్లె పాలు, చింతచిగురు రుచి ఉంటుందా?

కె. బి. గోపాలం